
బాలి (ఇండోనేసియా): భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇండో నేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ లో ప్రపంచ చాంపియన్ సింధు కథ సెమీఫైనల్లో ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 26 ఏళ్ల సింధు 21–15, 9–21, 14–21తో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను దక్కించుకున్నా ఆ తర్వాత తడబడి మూల్యం చెల్లించుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెల్చుకున్నాక సింధు ఆడిన నాలుగు టోర్నీల్లో సెమీఫైనల్ దశను దాటి ముందుకెళ్లలేదు.
వరుసగా పదోసారి...
మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట కూడా సెమీఫైనల్లో నిష్క్రమించింది. ప్రపంచ నంబర్‌వన్ జోడీ మార్కస్ గిడియోన్–కెవిన్ సుకముల్జో (ఇండోనేసియా)తో జరిగిన సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ 16–21, 18–21తో ఓటమి పాలైంది. గిడియోన్–కెవిన్ ద్వయం చేతిలో సాత్విక్–చిరాగ్‌లకిది వరుసగా పదో పరాజయం కావడం గమనార్హం.