వియత్నాం ప్లేయర్ నుయెన్ సంచలన విజయం
తొలి గేమ్‌లో వరుసగా 8 పాయింట్లు కోల్పోయిన భారత స్టార్
జకార్తా: ఈ ఏడాది బరిలోకి దిగిన రెండో టోర్నమెంట్‌లోనూ భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఇండియా ఓపెన్–750 టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన సింధు... ఇండోనేసియా మాస్టర్స్ –500 టోర్నమెంట్‌లో తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 32వ ర్యాంకర్ థుయి లిన్ నుయెన్ (వియత్నాం) 22–20, 21–12తో సింధుపై సంచలన విజయం సాధించింది.
గతంలో సింధుతో ఆడిన రెండుసార్లూ (2022 సింగపూర్ ఓపెన్, 2023 ఆర్క్‌టిక్ ఓపెన్) ఓడిపోయిన నుయెన్ మూడో ప్రయత్నంలో గెలుపు రుచి చూసింది. 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో స్కోరు 14–20 వద్ద నుయెన్ ఒక్కసారిగా చెలరేగిపోయింది. వరుసగా 8 పాయింట్లు గెలిచి గేమ్‌ను సొంతం చేసుకుంది. చేజేతులా తొలి గేమ్‌ను చేజార్చుకున్న సింధు రెండో గేమ్‌లో తడబడింది.
ఆరంభంలోనే 1–6తో వెనుకబడిన సింధు ఆ తర్వాత కోలుకోలేకపోయింది. మహిళల సింగిల్స్‌లో పోటీపడ్డ ఇతర భారత క్రీడాకారిణులు ఆకర్షి కశ్యప్, అనుపమ ఉపాధ్యాయ్, రక్షిత శ్రీ, తాన్యా హేమంత్ కూడా తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు.
ఆకర్షి 10–21, 13–21తో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో, అనుపమ 12–21, 5–21తో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్ (ఇండోనేసియా) చేతిలో, తాన్యా 14–21, 11–21తో ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో, రక్షిత శ్రీ 17–21, 19–21తో టొమోక మియకాజి (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు.
మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 21–6, 21–14తో ఒర్నిచా–సుకిత్త (థాయ్‌లాండ్) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది.
మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీ 9–21, 13–21తో గ్రెగొరీ మేర్స్–జెన్నీ మేర్స్ (ఇంగ్లండ్) జంట చేతిలో ఓడిపోగా... ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో (భారత్) ద్వయం 21–18, 21–14తో అద్నాన్ మౌలానా–ఇందా చాయసారి (ఇండోనేసియా) జోడీపై గెలిచింది.
లక్ష్య సేన్ ముందంజ
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్‌లో లక్ష్య సేన్ 21–9, 21–14తో ఒబయాషి (జపాన్)పై నెగ్గాడు.
ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కిరణ్ జార్జి (భారత్) 12–21, 10–21తో హైక్ జిన్ జియోన్ (కొరియా) చేతిలో, ఆయుశ్ శెట్టి (భారత్) 19–21, 19–21తో షి యుకి (చైనా), ప్రియాన్షు (భారత్) 14–21, 21–13, 18–21తో కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment