PV Sindhu
-
సింధు శుభారంభం
షెన్జెన్: చైనా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రోజు భారత షట్లర్లు మెరిశారు. బరిలోకి దిగిన వారందరూ విజయాన్ని అందుకున్నారు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ పీవీ సింధు, రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్... పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ... మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం కూడా గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. మళ్లీ సింధుదే పైచేయి... ప్రపంచ 11వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)తో 21వసారి ఆడిన సింధు ఈసారీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 19వ ర్యాంక్‌లో ఉన్న సింధు 21–17, 21–19తో బుసానన్ను ఓడించింది. బుసానన్‌పై సింధుకిది 20వ విజయం కావడం విశేషం. 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధుకు గట్టిపోటీ లభించినా కీలకదశలో ఆమె పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. గతవారం జపాన్ మాస్టర్స్ టోర్నీలోనూ తొలి రౌండ్లో బుసానన్పైనే సింధు గెలిచింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సింగపూర్ ప్లేయర్ యో జియా మిన్తో సింధు ఆడుతుంది. మరోవైపు ప్రపంచ 36వ ర్యాంకర్, భారత రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ సంచలన విజయంతో శుభారంభం చేసింది. ప్రపంచ 21వ ర్యాంకర్ లైన్ హొమార్క్ జార్స్‌ఫెల్డ్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో మాళవిక 20–22, 23–21, 21–16తో విజయాన్ని అందుకుంది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో మాళవిక తొలి గేమ్‌ను కోల్పోయినా ఆందోళన చెందకుడా ఆడి ఆ తర్వాతి రెండు గేముల్లో నెగ్గి ముందంజ వేసింది. ఈ గెలుపుతో ఈ ఏడాది కొరియా ఓపెన్‌లో జార్స్‌ఫెల్డ్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సుపనిద (థాయ్‌లాండ్)తో మాళవిక తలపడుతుంది. ఏడో ర్యాంకర్‌కు షాక్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ లక్ష్య సేన్ సంచలన విజయంతో బోణీ చేశాడు. ప్రపంచ 7వ ర్యాంకర్ లీ జి జియా (మలేసియా)తో జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–14, 13–21, 21–13తో గెలిచాడు. లీ జి జియాపై లక్ష్య సేన్‌కిది ఐదో విజయం కావడం విశేషం. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ ఆటలో నిలకడ లోపించింది. అయితే కీలకదశలో అతడు గాడిలో పడటంతో విజయం దక్కింది. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 15–11 వద్ద లక్ష్య సేన్ వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 20–11తో విజయానికి చేరువయ్యాడు. ఆ తర్వాత అతను రెండు పాయింట్లు కోల్పోయాక మరో పాయింట్ నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. గాయత్రి జోడీ ముందుకు.... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–15, 21–14తో హు లింగ్ ఫాంగ్–జెంగ్ యు చియె (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. ఈ గెలుపుతో భారత జంట సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించే అవకాశాన్ని మెరుగుపర్చుకుంది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 12–21, 21–19, 21–18తో లీ జె హుయె–యాంగ్ పో సువాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత సాతి్వక్–చిరాగ్ ఆడుతున్న తొలి టోర్నీ ఇదే కావడం గమనార్హం. -
సింధు ఐదో‘సారీ’
కుమమోటో: పారిస్ ఒలింపిక్స్ తర్వాత పాల్గొన్న మూడో టోర్నమెంట్లోనూ భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. జపాన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ 20వ ర్యాంకర్ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. ప్రపంచ 23వ ర్యాంకర్, చైనా సంతతికి చెందిన కెనడా ప్లేయర్ మిచెల్లి లీతో జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–17, 16–21, 17–21తో పోరాడి ఓడిపోయింది. మిచెల్లి లీ చేతిలో సింధుకిది ఐదో పరాజయం కావడం గమనార్హం. మిచెల్లిపై 10 సార్లు నెగ్గిన సింధుకు ఈసారి మాత్రం నిరాశ తప్పలేదు. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నా... ఆ తర్వాతి రెండు గేముల్లో కీలకదశలో తడబడి మూల్యం చెల్లించుకుంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో రెండుసార్లు (మిక్స్డ్ టీమ్ మ్యాచ్, సింగిల్స్ సెమీఫైనల్) సింధును ఓడించిన మిచెల్లి ఆ తర్వాత 2023లో థాయ్‌లాండ్ ఓపెన్‌లో మూడోసారి సింధుపై నెగ్గింది. ఈ ఏడాది ఆర్క్టిక్ ఓపెన్‌లో నాలుగోసారి సింధును ఓడించిన మిచెల్లి నెల తిరిగేలోపు జపాన్ ఓపెన్‌లో మరోసారి గెలుపు రుచి చూసింది. -
సింధు శుభారంభం
కుమమోటో: జపాన్ ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుసానన్ ఒంగ్మమ్రుంగ్ఫన్ (థాయ్‌లాండ్)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–12, 21–8తో అలవోకగా గెలిచింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో ఉన్న బుసానన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 20వ ర్యాంకర్ సింధు కేవలం 38 నిమిషాల్లో విజయాన్ని సొంతం చేసుకొని ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఓవరాల్‌గా సింధు, బుసానన్ల మధ్య ఇది 20వ ముఖాముఖి పోరు కావడం విశేషం. సింధు ఏకంగా 19 సార్లు గెలుపొందగా... థాయ్‌లాండ్ ప్లేయర్ ఒక్కసారి మాత్రమే సింధును ఓడించింది. బుసానన్ ఆటతీరుపై స్పష్టమైన అవగాహన ఉన్న సింధుకు తొలి గేమ్ ఆరంభంలో గట్టిపోటీ లభించింది. ఒకదశలో సింధు, బుసానన్ (11–10) మధ్య ఒక్క పాయింటే అంతరంగా నిలిచింది. అయితే నెమ్మదిగా సింధు జోరు పెంచగా... థాయ్‌లాండ్ ప్లేయర్ తడబడింది. స్కోరు 14–12 వద్ద సింధు చెలరేగిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు... వరుసగా ఏడు పాయింట్లతో అదరగొట్టిన సింధు తొలి గేమ్‌ను 21–12తో దక్కించుకుంది. రెండో గేమ్‌లోనూ ఆరంభంలో ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. స్కోరు 5–4 వద్ద సింధు విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 10–4తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత బుసానన్ వరుసగా మూడు పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది. కానీ స్కోరు 10–7 వద్ద సింధు వరుసగా 10 పాయింట్లు సంపాదించి 20–7తో ముందంజ వేసింది. ఆ తర్వాత బుసానన్ ఒక పాయింట్ సాధించిన వెంటనే సింధు కూడా ఒక పాయింట్ నెగ్గడంతో భారత స్టార్ విజయం ఖరారైంది. పోరాడి ఓడిన లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత కథ తొలి రౌండ్లోనే ముగిసింది. భారత స్టార్ లక్ష్య సేన్ 74 నిమిషాల పోరులో కీలకదశలో తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. ప్రపంచ 31వ ర్యాంకర్ జున్ హావో లియోంగ్ (మలేసియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 22–20, 17–21, 16–21తో ఓడిపోయాడు. గతంలో జున్ హావోపై మూడుసార్లు నెగ్గిన లక్ష్య సేన్ ఈసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు. -
శుభారంభంపై సింధు దృష్టి
కుమమొటో: భారత స్టార్ షట్లర్లు పూసర్ల వెంకట (పీవీ) సింధు, లక్ష్యసేన్ వైఫల్యాలను అధిగమించి టైటిళ్ల వేటలో పడాలనే పట్టుదలతో జపాన్ ఓపెన్ టోర్నీ బరిలోకి దిగుతున్నారు. నేటి నుంచి జపాన్ మాస్టర్స్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్ జరగనుంది. ఇద్దరు భారత అగ్రశ్రేణి షట్లర్లు పారిస్ ఒలింపిక్స్ తర్వాత బరిలోకి దిగిన ఏ టోర్నీలోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేయలేకపోయారు. గతంలో ఒక సీజన్లో వరుస టైటిల్స్ సాధించిన వారు ఇప్పుడు కనీసం క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోవడం ఇబ్బందికరంగా మారింది. రెండు ఒలింపిక్ పతకాల విజేత, ఆంధ్రప్రదేశ్ వెటరన్ స్టార్ పీవీ సింధు ఫిన్లాండ్లో జరిగిన ఆర్క్టిక్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే విఫలమైనా... డెన్మార్క్ ఓపెన్‌లో మాత్రం క్వార్టర్ ఫైనల్ చేరింది. కానీ లక్ష్యసేన్ మాత్రం ఈ రెండు టోర్నీల్లో ఆరంభ రౌండ్లలోనే కంగుతిని ఇంటిదారి పట్టాడు. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 29 ఏళ్ల సింధు... థాయ్‌లాండ్‌కు చెందిన ఎనిమిదో సీడ్ బుసానన్‌తో తలపడనుండగా, పురుషుల ఈవెంట్లో 23 ఏళ్ల లక్ష్యసేన్ మలేసియాకు చెందిన లియోంగ్ జున్ హవొను ఎదుర్కొంటాడు. తొలి రౌండ్ అడ్డంకిని అధిగమిస్తే... అతను రెండో రౌండ్లో ఎనిమిదో సీడ్ ఆంథోనీ గిన్టింగ్ (ఇండోనేసియా)తో పోటీపడే అవకాశముంది. ఇక డబుల్స్‌లో ఒకే ఒక్క భారత జోడీ బరిలో ఉంది. పుల్లెల గాయత్రి గోపీచంద్–ట్రెసా జాలీ జంట మహిళల డబుల్స్ మొదటి రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన సూ యిన్ హూ–లిన్ జి యున్ జోడీతో తలపడుతుంది. కొత్త కోచ్‌ల మార్గదర్శనంలో టోర్నీ కోసం సిద్ధమైనట్లు సింధు చెప్పింది. ‘నేనిపుడు బాగా ఆడుతున్నాను. శారీరకంగా, మానసికంగానూ దృఢంగా ఉన్నాను. కొన్ని లోపాలపై కసరత్తు చేశాం. కోర్టులో డిఫెన్స్, స్పీడ్ మెరుగుపర్చుకునేందుకు ఇటీవల బాగా శ్రమించాను. జపాన్‌తో పాటు త్వరలో చైనాలో జరిగే టోరీ్నలోనూ రాణిస్తాను’ అని సింధు ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కొరియన్ దిగ్గజం, కోచ్ లీ స్యూన్, అనూప్ శ్రీధర్‌లతో ఆమె శిక్షణ తీసుకుంటుంది. -
2028 ఒలింపిక్స్‌లో ఆడతా!
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో పతకం అంచనాలతో బరిలోకి దిగినా... ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. ఆ తర్వాత ఆడిన మూడు టోర్నీల్లో కూడా ఆమె విఫలమైంది. ఈ నేపథ్యంలో సింధు భవిష్యత్తుపై చర్చ నడుస్తోంది. అయితే తాను ఆటను ఇంకా ముగించలేదని సింధు స్పష్టం చేసింది. ఫిట్‌గా ఉంటే 2028లో లాస్ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లోనూ పాల్గొంటానని స్పష్టం చేసింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సింధు... 2020 టోక్యో క్రీడల్లో కాంస్యం సాధించింది. వచ్చే ఒలింపిక్స్ సమయానికి సింధుకు 33 ఏళ్లు నిండుతాయి. ‘ఆ సమయానికి నేను ఫిట్‌గా, గాయాలు లేకుండా ఉంటే కచి్చతంగా లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతాను. ఇప్పుడైతే నా ఆలోచన ఇదే. కాబట్టి ప్రస్తుత నా లక్ష్యం పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉండేందుకు ప్రయతి్నంచడం. అప్పుడు సహజంగానే ఆడాలనే ప్రేరణ లభిస్తుంది. సరిగ్గా చెప్పాలంటే నాలో ఇంకా చాలా ఆట మిగిలి ఉంది. ఎంతో సాధించాలనే తపన ఉంది. మరిన్ని టైటిల్స్ గెలిచి పోడియం మీద నిలబడాలని భావిస్తున్నా. నా ఆటతో భవిష్యత్ తరాలను స్ఫూర్తినివ్వాలని భావిస్తున్నా. అందుకోసం నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయతి్నస్తా’ అని సింధు పేర్కొంది. పారిస్‌లో ఓటమితో తానేమీ బాధ పడలేదని, పరాజయంతో ప్రపంచం ఆగిపోదని ఆమె అభిప్రాయ పడింది. ‘నా కెరీర్లో రెండు ఒలింపిక్స్‌లు అద్భుతంగా సాగాయి. అయితే ప్రతీసారి అలా జరగదు. మూడోసారి పతకం గెలవలేకపోయా. నేను బాగానే ఆడానని అనుకుంటున్నా. అక్కడితో అంతా ముగిసిపోలేదు. తప్పుల నుంచి మనం పాఠాలు నేర్చుకుంటాం. కాబట్టి పారిస్ వైఫల్యంపై బాధ లేదు. అక్కడితో ప్రపంచం ఏమీ ఆగిపోదు’ అని సింధు చెప్పింది. తన ఆటతీరు మెరుగుపర్చుకునే క్రమంలో మాజీ ఆటగాళ్లు లీ హ్యూన్, అనూప్ శ్రీధర్ల వద్ద ఆమె శిక్షణ తీసుకుంటోంది. కొన్ని సందర్భాల్లో మార్పు తప్పనిసరి అవుతుందని... అదే కారణంతో గత కోచ్‌ల వద్ద శిక్షణకు గుడ్‌బై చెప్పి కొత్త కోచ్‌లను ఎంచుకున్నట్లు సింధు వివరించింది. త్వరలో జరిగే జపాన్, చైనా ఓపెన్లపై దృష్టి పెట్టానని, మళ్లీ వరుస విజయాలు దక్కుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.‘ఇప్పుడు నేను శారీరకంగా, మానసికంగా మంచి స్థితిలో ఉన్నా. పూర్తి ఫిట్‌గా కూడా మారాను. స్పీడ్, డిఫెన్స్‌కు సంబంధించి కొన్ని లోపాలను సరిదిద్దుకునే పనిలో ఉన్నాను. కోచ్‌ల ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవడం ఎప్పుడూ బాగుంటుంది. వారి పర్యవేక్షణలో రాబోయే జపాన్, చైనా టోర్నీల్లో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నా. అక్కడినుంచే మ్యాజిక్ మొదలవుతుంది. చూస్తూ ఉండండి’ అని సింధు వ్యాఖ్యానించింది. విశాఖపట్నంలో తన బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణం పనులు ప్రారంభం అయ్యాయని... ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రాబోయే ఏడాదిన్నర కాలంలో అది సిద్ధమవుతుందని సింధు వెల్లడించింది. -
టీడీపీ కబ్జాలకు చెక్ పెట్టిన పీవీ సింధు
-
శుభవార్త చెప్పిన పీవీ సింధు.. చిరకాల ఆశయానికి ముందడుగు(ఫొటోలు)
-
గుడ్‌న్యూస్ చెప్పిన పీవీ సింధు.. పునాది పడింది!
భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు అభిమానులకు శుభవార్త చెప్పింది. తన చిరకాల ఆశయం దిశగా తొలి అడుగు వేసినట్లు తెలిపింది. విశాఖపట్నంలో తన కలల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు గురువారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.సింధు భావోద్వేగంఈ మేరకు.. ‘‘విశాఖపట్నంలో పీవీ సింధు సెంటర్ ఫర్ బ్యాడ్మింటన్ అండ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్‌కు పునాది పడింది. ఇది కేవలం క్రీడాకారులకు ఓ సౌకర్యం మాత్రమే కాదు. భవిష్యత్ తరాల చాంపియన్లను తీర్చిదిద్దేందుకు, భారత క్రీడారంగాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకున్న సాహసోపేత నిర్ణయం.ఇందులో నా భాగస్వాములు, నా టీమ్ అందించిన సహకారం మరువలేనిది. భారత భవిష్య క్రీడాకారులకు స్ఫూర్తిని పంచుతూ.. వారి భవిష్యత్‌కు మార్గం వేసే ఈ గొప్ప అడుగు వేసినందుకు సంతోషంగా ఉంది’’ అని సింధు ఉద్వేగపూరిత పోస్టు పెట్టింది.ఈ క్రమంలో సింధుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రియో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్‌లో రజతం, టోక్యో విశ్వక్రీడల్లో కాంస్యం సాధించిన సింధు.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. రెండుసార్లు వరుసగా ఒలింపిక్ మెడల్స్ గెలిచిన సింధుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖపట్నంలో అకాడమీ కోసం స్థలం కేటాయించింది. ఇప్పుడు అక్కడే ఆమె తన బ్యాడ్మింటన్ సెంటర్‌కు పునాది వేసింది.వైఎస్ జగన్ ప్రభుత్వం స్థలం కేటాయించింది: సింధుఈ క్రమంలో తోటగరువులో తనకు కేటాయించిన భూమిలో అకాడమీ నిర్మాణానికి పీవీ సింధు, ఆమె కుటుంబ సభ్యులు తాజాగా పూజ చేశారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ఏడాదిలోపు అకాడమీ పనులు పూర్తయ్యేలా సన్నాహకాలు చేస్తున్నా మని తెలిపింది. గత ప్రభుత్వం తమకు అన్ని అనుమతులతో స్థలం కేటాయించిందని.. మెరికల్లాలాంటి బ్యాడ్మింటన్ ప్లేయర్లను తయారు చేసేందుకు, ఓ మంచి అకాడమీ ఏర్పాటు చేస్తామని పేర్కొంది.చదవండి: IPL 2025 Mega Auction: కోట్లాభిషేకమే! భారత క్రికెటర్లకు జాక్‌పాట్ తగలనుందా? View this post on Instagram A post shared by PV Sindhu (@pvsindhu1) -
పీవీ సింధు అకాడమీ కబ్జా.. ?
-
సింధు పరాజయం
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత కథ ముగిసింది. బరిలో మిగిలిన స్టార్ ప్లేయర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ సింధు 13–21, 21–16, 9–21తో ప్రపంచ 8వ ర్యాంకర్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయింది. 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను కోల్పోయినా వెంటనే తేరుకొని రెండో గేమ్‌ను దక్కించుకుంది.అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో గ్రెగోరియా ధాటికి సింధు చేతులెత్తేసింది. గతంలో గ్రెగోరియాపై 10 సార్లు గెలిచిన సింధు మూడుసార్లు ఓటమిని మూటగట్టుకుంది. క్వార్టర్ ఫైనల్లో ఓడిన సింధుకు 4,675 డాలర్ల (రూ. 3 లక్షల 92 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 6,050 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
పీవీ సింధు శుభారంభం.. లక్ష్య సేన్ విఫలం
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఊరట విజయం దక్కింది. ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆడుతున్న రెండో టోర్నమెంట్లో ఆమె జయకేతనం ఎగురవేసింది. విశ్వక్రీడల తర్వాత ఫిన్లాండ్లో జరిగిన ఆర్క్టిక్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఓడిన సింధు... మంగళవారం మొదలైన డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో శుభారంభం అందుకుంది.మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో చైనీస్ తైపీ క్రీడాకారిణి పాయ్ యు పోతో జరిగిన మ్యాచ్‌లో సింధు 21–8, 13–7తో విజయం సాధించింది. అయితే, తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన సింధు రెండో గేమ్‌లో ఆరు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నపుడు ఆమె ప్రత్యర్థి గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగింది. ఈ క్రమంలో సింధు విజేతగా నిలిచి ప్రిక్టార్టర్స్కు అర్హత సాధించింది.ఇక నాలుగో సీడ్ హాన్ యువె (చైనా), పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్) మధ్య తొలి రౌండ్ మ్యాచ్ విజేతతో గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు తలపడుతుంది. మరోవైపు.. భారత్‌కే చెందిన రైజింగ్ స్టార్స్ మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మాళవిక 13–21, 12–21తో థుయ్ లిన్ ఎన్గుయెన్ (వియత్నాం) చేతిలో, ఆకర్షి కూడా 13–21, 12–21తో సుపనిద కటెథోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయారు. నేడు జరిగే తొలి రౌండ్ మ్యాచ్‌లో లౌరెన్ లామ్ (అమెరికా)తో ఉన్నతి హుడా పోటీపడుతుంది.ఇదిలా ఉంటే.. పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ లక్ష్య సేన్ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. ప్రపంచ 18వ ర్యాంకర్ లు గ్వాంగ్ జు (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–12, 19–21, 14–21తో పోరాడి ఓడిపోయాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రుతూపర్ణ–శ్వేతాపర్ణ (భారత్) ద్వయం 18–21, 22–24తో చాంగ్ చింగ్ హుయ్–యాంగ్ చింగ్ టున్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓటమి పాలైంది. సోనమ్ గురికి రజతంన్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత జట్టు రజత పతకంతో బోణీ చేసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో సోనమ్ మస్కర్ రజత పతకాన్ని సాధించింది. 22 ఏళ్ల సోనమ్ ఫైనల్లో 252.9 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని దక్కించుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్లు అర్జున్ (188.3 పాయింట్లు) ఐదో స్థానంలో, దివ్యాంశ్ (124 పాయింట్లు) ఎనిమిదో స్థానంలో నిలిచారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అర్జున్ సింగ్ (109.9 పాయింట్లు) చివరిదైన ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకోగా... మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్లు రిథమ్ (197.2 పాయింట్లు) నాలుగో స్థానంలో, సురభి (176.6 పాయింట్లు) 5వస్థానంలో నిలిచారు. -
Denmark Open 2024: కళ్లన్నీ వాళ్లిద్దరిపైనే..
ఒడెన్స్ (డెన్మార్క్): ఈ సీజన్లో ఫామ్‌లోకి వచ్చేందుకు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పట్టుదలగా ఉంది. గత వారం ఫిన్లాండ్లో జరిగిన ఆర్క్టిక్ ఓపెన్ వైఫల్యాన్ని అధిగమించి డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో శుభారంభం చేయాలనే లక్ష్యంతో సింధు సన్నద్ధమైంది.ఆ అడ్డంకిని దాటితేనేరెండు ఒలింపిక్ పతకాలు సాధించిన సింధుకు గత ఈవెంట్లో అనూహ్యంగా తొలి రౌండ్లోనే కెనడా ప్లేయర్ మిచెల్లీ లీ చేతిలో ఓటమి ఎదురైంది. గతంలో మిచెల్లీపై పదిసార్లు విజయం సాధించిన భారత షట్లర్‌కు ఫిన్లాండ్లో మాత్రం నిరాశ ఎదురైంది. తాజా డెన్మార్క్ ఓపెన్ తొలి రౌండ్లో ఆమె చైనీస్ తైపీకి చెందిన పాయ్ యు పొతో తలపడుతుంది. ఈ అడ్డంకిని దాటితే సింధుకు రెండో రౌండ్లో చైనా షట్లర్ హాన్ యువె ఎదురవనుంది. మహిళల సింగిల్స్‌లో ఆమెతో పాటు మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్, ఉన్నతి హుడాలు కూడా ఈ టోరీ్నలో శుభారంభంపై దృష్టి సారించారు. లక్ష్య సేన్ గాడిన పడతాడా?పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ లక్ష్య సేన్ కూడా మెరుగైన ఆటతీరుతో ఈ సీజన్లో గాడిన పడేందుకు శ్రమిస్తున్నాడు. ఈ టోర్నీలో 23 ఏళ్ల లక్ష్య సేన్ తొలిరౌండ్లో లూ గ్వాంగ్ జు (చైనా)తో పోటీపడతాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే రెండో రౌండ్లో కిష్టమైన ప్రత్యర్థి ఎదురవనున్నాడు. ఇండోనేసియాకు షట్లర్ జొనాథన్ క్రిస్టీతో లక్ష్య సేన్ తలపడే అవకాశముంది.డబుల్స్లోఇక మహిళల డబుల్స్‌లో గాయత్రి–ట్రెసా జాలీ జంట తొలి రౌండ్లో ఐదో సీడ్ పియర్లీ తన్–తినా మురళీధరన్ (మలేసియా) జోడీతో ఆడుతుంది. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–సుమిత్ రెడ్డి ద్వయానికి తొలి రౌండ్లో కెవిన్లీ– ఎలియాన జంగ్ (కెనడా) జంట ఎదురవుతుంది. గతంలో భారత క్రీడాకారులకు డెన్మార్క్ ఓపెన్ కలిసొచ్చింది. సింగిల్స్‌లో ప్రకాశ్ పదుకొనే (1980లో), శ్రీకాంత్ (2017లో), సైనా నెహా్వల్ (2012లో) విజేతలుగా నిలిచారు. -
తొలిరౌండ్లో సింధు ఓటమి
పారిస్ ఒలింపిక్స్ తర్వాత పాల్గొన్న తొలి టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తొలి రౌండ్లోనే పరాజయం ఎదురైంది. ఫిన్లాండ్లో మంగళవారం మొదలైన ఆర్క్టిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో సింధు ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోలేకపోయింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 16వ ర్యాంకర్ సింధు 16–21, 10–21తో ప్రపంచ 32వ ర్యాంకర్ మిచెల్లి లీ (కెనడా) చేతిలో ఓడిపోయింది. గతంలో మిచెల్లి లీపై 10 సార్లు గెలిచిన సింధు నాలుగోసారి ఆమె చేతిలో ఓటమి చవిచూసింది. ఇదే టోర్నీలో ఆడుతున్న భారత రైజింగ్ స్టార్స్ మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రపంచ 23వ ర్యాంకర్ సుంగ్ షువో యున్ (దక్షిణ కొరియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 37వ ర్యాంకర్ మాళవిక 21–19, 24–22తో నెగ్గగా... ప్రపంచ 39వ ర్యాంకర్ వైవోన్ లీ (జర్మనీ)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 41వ ర్యాంకర్ ఆకర్షి 21–19, 21–14తో విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ కిరణ్ జార్జి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో కిరణ్ జార్జి 21–16, 13–21, 21–19తో లుకాస్ క్లియర్»ౌట్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. -
Arctic Open 2024: సింధు పునరాగమనం
వాంటా (ఫిన్లాండ్): పారిస్ ఒలింపిక్స్ వైఫల్యం మరిచి తదుపరి టోరీ్నలో టైటిల్స్ లక్ష్యంగా భారత షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ తమ రాకెట్లకు పదును పెడుతున్నారు. ఆర్కిటిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను తాజాగా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. పారిస్ మెగా ఈవెంట్ తర్వాత వీళ్లిద్దరు బరిలోకి దిగుతున్న తొలి టోర్నీ ఇదే కాగా... మహిళల సింగిల్స్‌లో సింధుకు ఆరో సీడింగ్ కేటాయించగా, పురుషుల ఈవెంట్లో లక్ష్య సేన్ అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. తొలి రౌండ్లో ప్రపంచ 14వ ర్యాంకర్ సింధు కెనడాకు చెంది మిచెల్లి లీతో తలపడుతుంది. ఇందులో శుభారంభం చేస్తే తదుపరి రౌండ్లో భారత టాప్ స్టార్‌కు 2022 జూనియర్ ప్రపంచ చాంపియన్, జపాన్ టీనేజ్ సంచలనం తొమకొ మియజాకి ఎదురవనుంది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో లక్ష్య సేన్... డెన్మార్క్‌కు చెందిన రస్ముస్ గెమ్కేతో తలపడతాడు. గతేడాది ఇండియా ఓపెన్‌లో రస్మస్తో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం లక్ష్య సేన్‌కు ఆరంభరౌండ్లోనే లభించింది. ఈ అడ్డంకిని అధిగమిస్తే భారత ఆటగాడు చైనీస్ తైపీకి చెందిన ఏడో సీడ్ చౌ తియెన్ చెన్‌తో పోటీపడే అవకాశముంటుంది. -
‘స్పెక్టాక్యులర్ సౌదీ’ ఈవెంట్లో మెరిసిన తారలు (ఫొటోలు)
-
సింధు కన్సల్టింగ్ కోచ్‌గా లీ హ్యూన్
పారిస్ ఒలింపిక్స్ తర్వాత మరో టోర్నీ ఆడని భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు మళ్లీ కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. వచ్చేనెలలో జరిగే ఫిన్లాండ్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్లతో పాటు ఆ తర్వాత యూరోప్ సర్క్యూట్లో వివిధ టోరీ్నల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా మాజీ ఆటగాడు లీ హ్యూన్ ఇల్‌ను కన్సలి్టంగ్ కోచ్‌గా సింధు ఎంచుకుంది. ఇప్పటికే భారత మాజీ ఆటగాడు అనూప్ శ్రీధర్ సింధు తాత్కాలిక కోచ్‌గా పని చేస్తున్నాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధు ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం పతకం సాధించడంలో విఫలమైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లోనే చైనా ప్లేయర్ బింగ్జియావో చేతిలో ఆమె ఓటమి పాలైంది. అంతకు కొంత కాలం ముందునుంచి కూడా సింధు చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేదు. 2022లో సింగపూర్ ఓపెన్ గెలిచిన తర్వాత మరే టైటిల్ నెగ్గని సింధు... గత రెండేళ్ల వ్యవధిలో రెండు టోర్నీల్లో రన్నరప్‌గా మాత్రమే నిలవగలిగింది. రియో ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన సమయంలో సింధు కోచ్‌గా ఉన్న పార్క్ సంగ్ కాంట్రాక్ ముగిసి 2023 ఆరంభంలోనే వెళ్లిపోగా... తాత్కాలికంగా ‘సాయ్’ కోచ్ విధి చౌదరితో కలిసి ఆమె పని చేసింది. దిగ్గజ ఆటగాడు హాఫిజ్ హషీమ్‌ను కోచ్‌గా తీసుకున్నా అదీ కొద్ది రోజులకే ముగిసింది.దాంతో బెంగళూరుకు వెళ్లి సింధు... ప్రకాశ్ పడుకోన్ వద్ద పారిస్ ఒలింపిక్స్‌కు సన్నద్ధమైంది. ప్రస్తుత సీజన్ ఇంకా పూర్తి కాకపోగా... కోచ్‌గా పని చేసిన ఆగస్ సాంటోసో కాంట్రాక్ట్ ఒలింపిక్స్‌తోనే ముగిసింది. దాంతో ఈ సీజన్ చివరి వరకు సింధుకు కొత్త కోచ్ అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అటు శ్రీధర్‌తో పాటు ఇటు లీ హ్యూన్తో కలిసి పని చేసేందుకు ఆమె సిద్ధమైంది. వీరిద్దరు డిసెంబర్ 2024 వరకు సింధుకు శిక్షణనిస్తారు. ‘నా కెరీర్ కీలక దశలో అనూప్, లీ హ్యూన్లు కోచ్‌గా రావడం పట్ల సంతోషంగా ఉన్నా. భారత బ్యాడ్మింటన్‌పై అనూప్‌కు ఉన్న అవగాహన, ఆయన వ్యూహాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. లీ హ్యూన్‌కు అపార అనుభవం ఉండటం నాకు కలిసొచ్చే అంశం. ఆటకు సంబంధించి ప్రతీ విషయంలో ఆయన సూక్ష్మ పరిశీలన నాకు మేలు చేస్తుంది. రాబోయే కొన్ని వారాల పాటు వీరిద్దరితో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’ అని సింధు వ్యాఖ్యానించింది. మాజీ వరల్డ్ నంబర్‌వన్ లీ హ్యూన్ అంతర్జాతీయ ఆటగాడిగా మంచి రికార్డు ఉంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన అతను సుదిర్మన్ కప్‌లో స్వర్ణం, 3 కాంస్యాలు గెలిచిన... థామస్ కప్‌లో 2 రజతాలు, 2 కాంస్యాలు గెలిచిన కొరియా జట్లలో సభ్యుడు. ఆసియా క్రీడల్లో లీ హ్యూన్ 2 స్వర్ణాలు, 3 రజతాలు, కాంస్యం గెలవడంతో పాటు ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ కాంస్యం అందుకున్నాడు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) లో సింధు జట్టులో సభ్యుడిగా కలిసి ఆడాడు. ఐదేళ్ల క్రితం ఆటకు రిటైర్మెంట్ పలికిన అనంతరం అతను కోచింగ్ వైపు మారాడు. -
మళ్లీ విజయాలు అందించడమే లక్ష్యం
న్యూఢిల్లీ: భారత మాజీ ఆటగాడు అనూప్ శ్రీధర్‌ను తాత్కాలిక కోచ్‌గా ఎంచుకున్న సింధు దాదాపు గత మూడు వారాలుగా అతనితో కలిసి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది. ఆమె ఆటలో చాలా మెరుగుదల కనిపిస్తోందని, తన షెడ్యూల్ ప్రకారం శిక్షణ కొనసాగుతోందని శ్రీధర్ వెల్లడించాడు. ‘సింధు ఆటలో కొన్ని చిన్న చిన్న లోపాలను సరిదిద్దడంతో పాటు కొన్ని కొత్త విషయాలు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నా. ఇప్పటి వరకు మేం ఒక్క షెడ్యూల్ కూడా తప్పకుండా పక్కా ప్రణాళికతో సాధన చేస్తున్నాం. ఈ మూడు వారాల్లో ఆమె ఆటలో చాలా మార్పు వచ్చింది. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సింధులో మరిన్ని విజయాలు సాధించాలనే తపన ఉంది. గతంలోకంటే ఇంకా ఎక్కువగా కష్టపడుతోంది. ఈ సాధనతో వచ్చే టోరీ్నల్లో ప్రత్యర్థితో సంబంధం లేకుండా ఆరంభ రౌండ్లలో బాగా ఆడితే ఆ తర్వాత టైటిల్స్ సాధించడం లాంఛనమే అవుతుంది. ఆమె ఆటలో నిలకడ తీసుకొచ్చి మరిన్ని విజయాలు వచ్చేలా చేయడమే నా లక్ష్యం’ అని అనూప్ శ్రీధర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను తాత్కాలిక కోచ్‌గానే వచ్చాను కాబట్టి ఒక్కో వారం చొప్పున సమీక్ష చేస్తూ కోచింగ్ కొనసాగిస్తున్నానన్న శ్రీధర్... ఇదే కారణంతో సుదీర్ఘ కాలపు ప్రణాళికలు వేయడం లేదని స్పష్టం చేశాడు. సింధు కన్సల్టింగ్ కోచ్‌గా లీ హ్యూన్పారిస్ ఒలింపిక్స్ తర్వాత మరో టోర్నీ ఆడని భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు మళ్లీ కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. వచ్చేనెలలో జరిగే ఫిన్లాండ్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్లతో పాటు ఆ తర్వాత యూరోప్ సర్క్యూట్లో వివిధ టోరీ్నల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా మాజీ ఆటగాడు లీ హ్యూన్ ఇల్‌ను కన్సల్టింగ్ కోచ్‌గా సింధు ఎంచుకుంది. ఇప్పటికే భారత మాజీ ఆటగాడు అనూప్ శ్రీధర్ సింధు తాత్కాలిక కోచ్‌గా పని చేస్తున్నాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధు ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం పతకం సాధించడంలో విఫలమైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లోనే చైనా ప్లేయర్ బింగ్జియావో చేతిలో ఆమె ఓటమి పాలైంది. అంతకు కొంత కాలం ముందునుంచి కూడా సింధు చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేదు. 2022లో సింగపూర్ ఓపెన్ గెలిచిన తర్వాత మరే టైటిల్ నెగ్గని సింధు... గత రెండేళ్ల వ్యవధిలో రెండు టోర్నీల్లో రన్నరప్‌గా మాత్రమే నిలవగలిగింది. రియో ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన సమయంలో సింధు కోచ్‌గా ఉన్న పార్క్ సంగ్ కాంట్రాక్ ముగిసి 2023 ఆరంభంలోనే వెళ్లిపోగా... తాత్కాలికంగా ‘సాయ్’ కోచ్ విధి చౌదరితో కలిసి ఆమె పని చేసింది. దిగ్గజ ఆటగాడు హాఫిజ్ హషీమ్‌ను కోచ్‌గా తీసుకున్నా అదీ కొద్ది రోజులకే ముగిసింది. దాంతో బెంగళూరుకు వెళ్లి సింధు... ప్రకాశ్ పడుకోన్ వద్ద పారిస్ ఒలింపిక్స్‌కు సన్నద్ధమైంది. ప్రస్తుత సీజన్ ఇంకా పూర్తి కాకపోగా... కోచ్‌గా పని చేసిన ఆగస్ సాంటోసో కాంట్రాక్ట్ ఒలింపిక్స్‌తోనే ముగిసింది. దాంతో ఈ సీజన్ చివరి వరకు సింధుకు కొత్త కోచ్ అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అటు శ్రీధర్‌తో పాటు ఇటు లీ హ్యూన్తో కలిసి పని చేసేందుకు ఆమె సిద్ధమైంది. వీరిద్దరు డిసెంబర్ 2024 వరకు సింధుకు శిక్షణనిస్తారు. ‘నా కెరీర్ కీలక దశలో అనూప్, లీ హ్యూన్లు కోచ్‌గా రావడం పట్ల సంతోషంగా ఉన్నా. భారత బ్యాడ్మింటన్‌పై అనూప్‌కు ఉన్న అవగాహన, ఆయన వ్యూహాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. లీ హ్యూన్‌కు అపార అనుభవం ఉండటం నాకు కలిసొచ్చే అంశం. ఆటకు సంబంధించి ప్రతీ విషయంలో ఆయన సూక్ష్మ పరిశీలన నాకు మేలు చేస్తుంది. రాబోయే కొన్ని వారాల పాటు వీరిద్దరితో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’ అని సింధు వ్యాఖ్యానించింది. మాజీ వరల్డ్ నంబర్‌వన్ లీ హ్యూన్ అంతర్జాతీయ ఆటగాడిగా మంచి రికార్డు ఉంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన అతను సుదిర్మన్ కప్‌లో స్వర్ణం, 3 కాంస్యాలు గెలిచిన... థామస్ కప్‌లో 2 రజతాలు, 2 కాంస్యాలు గెలిచిన కొరియా జట్లలో సభ్యుడు. ఆసియా క్రీడల్లో లీ హ్యూన్ 2 స్వర్ణాలు, 3 రజతాలు, కాంస్యం గెలవడంతో పాటు ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ కాంస్యం అందుకున్నాడు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) లో సింధు జట్టులో సభ్యుడిగా కలిసి ఆడాడు. ఐదేళ్ల క్రితం ఆటకు రిటైర్మెంట్ పలికిన అనంతరం అతను కోచింగ్ వైపు మారాడు. -
రూ. 1.5 కోట్లా?.. భారత బ్యాడ్మింటన్ స్టార్ ఫైర్
నిరాధార వార్తలు రాస్తే సహించే ప్రసక్తే లేదని భారత బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024కు సన్నద్దమయ్యే క్రమంలో ప్రభుత్వం తనకు రూ. 1.5 కోట్లు కేటాయించినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. విశ్వ క్రీడలకు సిద్దమయ్యేందుకు కేంద్ర క్రీడా శాఖ టార్గెట్ ఒలింపిక్ పోడియం ఫినిష్ స్కీమ్(TOPS) పేరిట టాప్ అథ్లెట్ల శిక్షణకై నిధులు కేటాయించింది.అయితే, అంచనాలకు అనుగుణంగా భారత క్రీడాకారులు రాణించలేకపోయారు. ప్యారిస్‌లో కేవలం ఆరు పతకాలు మాత్రమే గెలిచి స్వదేశానికి తిరిగి వచ్చారు. భారత్‌కు ఈ సారి షూటింగ్లో మూడు, హాకీ పురుషుల జట్టు, రెజ్లింగ్‌లో ఒక్కో కాంస్యం, జావెలిన్ త్రోలో రజతం మాత్రమే వచ్చాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్లు పూర్తిగా నిరాశపరిచారు.పీవీ సింధు, లక్ష్య సేన్, హెచ్ ఎస్ ప్రణయ్ తదితరులు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఈ క్రమంలో భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె సైతం భారత షట్లర్ల తీరును విమర్శస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగానూ ఓటములకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చురకలు అంటించారు.కోట్ల రూపాయల నిధులుఈ నేపథ్యంలో వార్తా సంస్థ పీటీఐ.. భారత షట్లర్లకు TOPS కేటగిరీలో కేంద్రం కేటాయించిన నిధులకు సంబంధించి ఓ కథనం వెలువరించింది. ఆ వివరాల ప్రకారం.. ‘‘2023 వరల్డ్ చాంపియన్‌షిప్స్, ఆసియా క్రీడల కాంస్య పతక విజేత హెచ్ఎస్ ప్రణయ్ ఒలింపిక్స్‌కు సిద్దమయ్యేందుకు.. క్రీడా శాఖ 1.8 కోట్ల రూపాయలు కేటాయించింది.అయితే, చికున్‌గున్యా బారిన పడ్డ ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన లక్ష్యసేన్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టాడు. ఇక పీవీ సింధు జర్మనీ ట్రెయినింగ్ కోసం రూ. 26.60 లక్షలు, లక్ష్యసేన్‌కు ఫ్రాన్స్‌లో శిక్షణ కోసం రూ. 9.33 లక్షల నిధులు విడుదల చేసింది. ఇక ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన సింధు ప్రిపరేషన్ కోసం ఓవరాల్‌గా 3.13 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. అయితే, ఆమె కూడా ప్రిక్వార్టర్స్‌లో వెనుదిరిగింది.ఇక మహిళల డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్ప, తానిషాలకు ఒక్కొక్కరికి 1.5 కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేసింది. అయితే, వారు గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అయిపోయారు. మరోవైపు.. పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి కోసం ఏకంగా భారీ మొత్తంలో రూ. 5.62 కోట్ల నిధులు కేటాయించింది. ఈ జోడీ క్వార్టర్ ఫైనల్ కూడా దాటలేకపోయింది. ఓవరాల్‌గా బ్యాడ్మింటన్ బృందానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) రూ. 72.03 కోట్లు ఖర్చుపెట్టింది’’.ఒక్కొక్కరికి రూ. 1.5 కోట్లా? ఈ మేర వివరాలను ఉటంకిస్తూ పీటీఐ ఇచ్చిన ఆర్టికల్‌పై అశ్విని పొన్నప్ప ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి ఆర్టికల్స్ ఎలా రాస్తారు? ఈ అబద్దాన్ని ఎందుకు రాశారు? ఒక్కొక్కరికి రూ. 1.5 కోట్లా? ఎవరి నుంచి? ఎవరికి? ఎందుకు? నేను ఎవరి నుంచి ఎలాంటి డబ్బు తీసుకోలేదే! అసలు TOPS ఫండింగ్‌లో నా పేరు కూడా లేదు’’ అని ఎక్స్ వేదికగా అశ్విని పొన్నప్ప తనపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది.చదవండి: నీరజ్ చోప్రాతో మనూ పెళ్లి?.. స్పందించిన షూటర్ తండ్రి -
శారీరక, మానసిక ఆరోగ్యం కోసం బ్రేక్ తీసుకోవడమే మంచిదా..?
మన దేశం గర్వించదగ్గ క్రీడాకారిణి పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్‌లో (Paris Olympics 2024) పతకం లక్ష్యంగా బరిలోకి దిగి ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తన ఓటమికి గల కారణాలను వివరిస్తూ..తన మనసు శరీరం విరామం కోరుకుంటుందంటూ భావోద్వేగంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టంది. మానసిక శారీరం ఆరోగ్యం కోసం కాస్త విరామం తీసుకుని బ్యాడ్మింటన్‌లో కొనసాగుతానని చెప్పుకొచ్చింది. ఇక్కడ పీవీ సింధు తీసుకున్న నిర్ణయాన్ని ఆరోగ్య నిపుణులు స్వాగతించడమే గాక ప్రశంసించారు. నిజానికి శారీరక మానసిక ఆరోగ్యం కోసం కాస్త విరామం తీసుకోవడమే మంచిదా..? నిపుణులే ఏమంటున్నారంటే..ఏ వృత్తి లేదా క్రీడల్లో ఒత్తిడి అనేది సహజం. ప్రతిసారి మనదే పైచేయి అవుతుందని చెప్పలేం. అలాగే మనపై మన వాళ్లు పెట్టుకునే భారీ అంచనాలు ఒక్కోసారి తలకిందులై విమర్శలపాలవ్వుతాం. అలాంటప్పుడు చాలా సంయమనంగా వ్యవహరించాలి. అన్నికంటే ముఖ్యంగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాల్సిన క్లిష్టమైన సమయం అని అంటున్నారు నిపుణులు. ఇక్కడ పీవీ సింధుపై భారీ అంచానలు ఉన్నాయి. ఈసారి ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలుచుకుంటుందనుకున్నారు. అలాగే ఆమె కూడా విజయం తనదే అని గట్టిగా విశ్వసించింది. అందుకోసం జరిగిన ప్రిపరేషన్లో గాయాలు, ఒత్తిడి మాములుగా ఉండవు. తీరా బరిలోకి దిగాక ప్రత్యర్థి ఎత్తు, దూకుడు ఊహకందని విషయం అనేది తెలిసిందే. అనుకోని రీతీలో పరాజయం పాలైతే ఎంత పెద్ద స్టార్ ఆటగాడికైన జీర్ణించుకోలేని బాధ, ఆవేదన ఉంటాయి. అయినా ఆటలో గెలుపోటములు సహజం అని తెలిసినా..ఒక్కోసారి ఇంత కష్టం వృధా అయ్యిందన్న బాధ నిలువనియ్యదు. అలాంటప్పడే ఏ మనిషి అయినా సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అమూల్యమైన సమయం. ఇక్కడ కోపం, బాధను పక్కన పెట్టి మానసికంగా దృఢంగా ఉండేందుకు యత్నించాలి. అంటే ఆరోగ్యంపై పూర్తి దృష్టిసారించగలిగితేనా ఏదైనా చేయడం సాధ్యం అవుతుందనేది గుర్తించాలి. అదే పని సింధు చేసింది ఇక్కడ. అలుపెరగని ప్రాక్టీస్, ఒత్తిడులతో అలసిపోయానని చెప్పడమే గాక తన మనుస్సు, శరీరం విశ్రాంతి కోరుకుంటుందనే సంకేతాల్ని గుర్తించి ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇచ్చింది సింధు. అన్ని సంపదల్లోకెల్లా "ఆరోగ్యమే మహాభాగ్యం" అన్న నానుడిని స్పురణకు తీసుకొచ్చింది. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని చెప్పకనే చెప్పింది అని నిపుణులు అంటున్నారు. ఆటలోనే కాదు జీవనశైలిలోనూ స్ఫూర్తిగా నిలిచిందంటూ సింధు నిర్ణయాన్ని కొనియాడుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎప్పుడైనా శరీరం, మనసు తాను బాగాలేను, సిద్ధంగా లేను అని చెబుతున్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. కాస్త విశ్రాంతి తీసుకుని నూతన ఉత్సాహంతో మళ్లీ కార్యరంగంలోకి దిగి మంచి మంచి విజయాలను అందుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అప్పుడే కెరీర్ పరంగానూ, వ్యక్తిగతంగానూ బాగుంటాం అని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: వర్షాకాలంలో పచ్చి బాదంపప్పులే ఎందుకు తినాలంటే..?) -
Olympics 2024: హార్ట్ బ్రేక్.. మనూ చేజారిన పతకం
Paris Olympics 2024: భారత యువ షూటర్ మనూ భాకర్ చరిత్రకు అడుగుదూరంలో నిలిచిపోయింది. ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా మూడు వ్యక్తిగత పతకాలు గెలిచిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా ఈ హర్యానా అమ్మాయి నిలుస్తుందని భావించగా.. నిరాశే మిగిలింది.కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో తొలుత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం గెలిచిన 22 ఏళ్ల మనూ... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో సరబ్జోత్ సింగ్‌తో కలిసి మరో కాంస్యం కైవసం చేసుకుంది. తాజాగా.. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలోనూ పతక రేసులో మనూ నిలిచింది. అయితే, ఆదిలో కాస్త వెనుకబడ్డా.. తర్వాత తిరిగి పుంజుకున్న మనూ.. కాంస్య పతకానికి చేరువగా వచ్చింది. అయితే, మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన ఎలిమినేషన్ ప్లే ఆఫ్‌లో దురదృష్టవశాత్తూ మనూ ఓడిపోయింది. ఏదేమైనా అద్భుత ప్రదర్శనతో ఇప్పటికే రెండు మెడల్స్ గెలిచిన మనూ భారతీయలు మనసులు గెలుచుకుంది. మనూ ప్రయాణం సాగిందిలా..👉మొత్తం 3 సిరీస్‌లు- 5 షాట్ల చొప్పున మొత్తం 15 షాట్లు👉తొలి సిరీస్👉శుభారంభం అందుకోలేకపోయిన మనూ.. 👉ఐదింటిలో రెండు సఫలం👉ఆరు పాయింట్లతో రేసులోకి వచ్చిన మనూ.. 8 పాయింట్లతో టాప్‌లో సౌత్ కొరియా షూటర్👉రెండో సిరీస్👉ఐదింటిలో 4 సఫలం.. రెండోస్థానానికి చేరిన మనూ👉తొలి ఎలిమినేషన్- యూఎస్ఏ షూటర్ కేటలిన్ మోర్గాన్ రేసు నుంచి అవుట్👉ఆరోస్థానానికి పడిపోయిన మనూ భాకర్👉మూడో సిరీస్👉ఐదింటిలో ఐదూ సఫలం.. మూడో స్థానంలోకి మనూ భాకర్👉ఇరానియన్ షూటర్ రోస్తమియాన్ అవుట్..రెండో స్థానంలో మనూ👉ఐదింట నాలుగు సఫలం- రెండో స్థానంలోనే మనూ👉చైనా షూటర్ నాన్ జావో ఎలిమినేట్👉మూడో స్థానానికి పడిపోయిన మనూ👉మూడో స్థానం కోసం జరిగిన షూట్ ఆఫ్‌లో మనూ ఓటమి👉నాలుగోస్థానంలో సరిపెట్టుకున్న మనూ👉కాంస్య పతక రేసు నుంచి కూడా మనూ అవుట్నాలుగో స్థానంలోసౌత్ కొరియా షూటర్ జిన్ యాంగ్‌కు స్వర్ణంఫ్రాన్స్ షూటర్ కమిలె జెద్రెజెజ్వ్స్కికి రజతంహంగేరీ షూటర్ వెరోనికాకు కాంస్యంనాలుగో స్థానంతో సరిపెట్టుకున్న మనూ భాకర్భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత ఒలింపిక్ పతకాలు గెలిచిన క్రీడాకారులు వీరే👉మనూ భాకర్- షూటింగ్- రెండు కాంస్యాలు- ప్యారిస్ ఒలింపిక్స్-2024👉నార్మన్ ప్రిచర్డ్(బ్రిటిష్- ఇండియన్)- అథ్లెటిక్స్- రెండు రజతాలు- ప్యారిస్ ఒలింపిక్స్- 1900 పారిస్👉సుశీల్ కుమార్- రెజ్లింగ్- ఒక కాంస్యం, ఒక రజతం- బీజింగ్ ఒలింపిక్స్- 2008, లండన్ ఒలింపిక్స్- 2012 👉పీవీ సింధు- బ్యాడ్మింటన్- ఒక రజతం, ఒక కాంస్యం- రియో ఒలింపిక్స్- 2016, టోక్యో ఒలింపిక్స్- 2020 -
భారత్ కు మరో పథకం..
-
అందమైన ప్రయాణం.. జీర్ణించుకోలేని ఓటమి.. ఇకపై: పీవీ సింధు
‘‘ప్యారిస్‌లో అందమైన ప్రయాణం.. కానీ... జీర్ణించుకోలేని ఓటమి. నా కెరీర్లో అత్యంత కఠినమైన సమయం. జరిగినదాన్ని నా మనసు అంగీకరించేందుకు ఎంతకాలం పడుతుందో తెలియదు. ఏదేమైనా గతాన్ని మరిచి ముందుకు సాగాల్సిందే.ఈ ప్రయాణంలో ఓ యుద్ధమే చేయాల్సి వచ్చింది. రెండేళ్ల పాటు గాయాలతో సతమతమయ్యాను. సుదీర్ఘకాలం పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ సవాళ్లన్నంటినీ అధిగమించి.. ఇక్కడి దాకా వచ్చి.. విశ్వ క్రీడల్లో మూడోసారి నా అందమైన, అద్భుతమైన దేశానికి ప్రాతినిథ్యం వహించడం నిజంగా నాకు దక్కిన గొప్ప అదృష్టం.ఓ తరానికి స్ఫూర్తిగా నిలిచానంటూ మీరు పంపే సందేశాలు.. ఇలాంటి కష్టకాలంలో నాకెంతో ఊరట కలిగిస్తున్నాయి. ప్యారిస్ 2024లో నేను, నా జట్టు అత్యుత్తమంగా రాణించేందుకు శాయశక్తులా కృషి చేశాం. ఎలాంటి పశ్చాత్తాపమూ లేదు.ఇక.. నా భవిష్యత్ ప్రణాళికల విషయానికొస్తే... ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నేను కచ్చితంగా ఆటలో కొనసాగుతా. అయితే, కొంతకాలం బ్రేక్ తీసుకుంటా. ఇది కేవలం చిన్న విరామం మాత్రమే.నా శరీరం.. ముఖ్యంగా నా మనసుకు ఇది చాలా అవసరం. ఇకపై మరింత జాగ్రత్తగా ఉంటాను. నా కెరీర్ ప్లానింగ్ విషయంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వను. నాకెంతగానో ఇష్టమైన క్రీడను మరింతగా ఆస్వాదిస్తూ ముందుకు సాగుతాను’’ అని భారత బ్యాడ్మింటన్ పూసర్ల వెంకట సింధు ఉద్వేగపూరిత నోట్ షేర్ చేసింది.రెండుసార్లు ఒలింపిక్ పతకాలు గెలిచిప్యారిస్ ఒలింపిక్స్‌లో తన ప్రయాణం అర్ధంతరంగా ముగిసిపోవడం పట్ల సింధు విచారం వ్యక్తం చేసింది. అయితే, ఓటమి తనను కుంగదీయలేదని.. వేగంగా తిరిగి వస్తానని.. ఆటను కొనసాగిస్తానని స్పష్టం చేసింది. కాగా తెలుగు తేజం పీవీ సింధు ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్ పతకాలు గెలిచిన విషయం తెలిసిందే.పసిడి పతకం గెలుస్తానని ధీమారియో ఒలింపిక్స్-2016లో రజతం గెలిచిన ఈ స్టార్ షట్లర్.. టోక్యో ఒలింపిక్స్- 2020లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈ క్రమంలో భారీ అంచనాల నడుమ ప్యారిస్ ఒలింపిక్స్ బరిలో దిగింది పీవీ సింధు. ఆమె గత రికార్డుల దృష్ట్యా మహిళల సింగిల్స్ విభాగంలో పతకం ఖాయమని విశ్లేషకులు భావించారు. సింధు సైతం ఈసారి పసిడి పతకం గెలుస్తానని ధీమా వ్యక్తం చేసింది.చేదు అనుభవంఅయితే, రౌండ్ ఆఫ్ 16లోనే ఆమె పోరాటం ముగిసిపోయింది. గురువారం నాటి ప్రిక్వార్టర్స్‌లో అనూహ్య రీతిలో 29 ఏళ్ల పీవీ సింధు ఓటమిపాలైంది. వరల్డ్ నంబర్ 13 ర్యాంకర్ అయిన సింధు.. రౌండ్ ఆఫ్ 16లో ప్రపంచ 9వ ర్యాంకర్ హి బింగ్జియావో (చైనా)తో తలపడింది. ప్రత్యర్థి చేతిలో 19–21, 14–21తో ఓడిపోయింది. కాగా 2020 టోక్యో ఒలింపిక్స్ సెమీస్‌లో హి బింగ్జియావోతోనే పోటీపడిన సింధు.. ఆమెను ఓడించి కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి మాత్రం బింగ్జియావో సింధుపై పైచేయి సాధించింది.Paris 2024: A Beautiful Journey but a Difficult Loss ❤️This loss is one of the hardest of my career. It will take time to accept, but as life moves forward, I know I will come to terms with it.The journey to Paris 2024 was a battle, marked by two years of injuries and long… pic.twitter.com/IKAKu0dOk5— Pvsindhu (@Pvsindhu1) August 2, 2024 -
భారత్‌కు ‘బ్యాడ్’మింటన్
పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో గురువారం భారత్‌కు కలిసి రాలేదు. కచ్చితంగా పతకాలు సాధిస్తారనుకున్న పీవీ సింధు... సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ఓటమి చవిచూసి రిక్తహస్తాలతో రానున్నారు. పురుషుల సింగిల్స్‌లో సహచరుడు ప్రణయ్‌ను ఓడించి లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరి భారత్ ఆశలను నిలబెట్టాడు. పారిస్: ‘రియో’లో రజత పతకం. ‘టోక్యో’లో కాంస్యం... ‘పారిస్’లో మాత్రం నిరాశ... గత రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి వరుసగా మూడో ఒలింపిక్ పతకం లక్ష్యంగా ‘పారిస్’కు వచ్చిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 19–21, 14–21తో ప్రపంచ 9వ ర్యాంకర్ హి బింగ్జియావో (చైనా) చేతిలో ఓడిపోయింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో హి బింగ్జియావోను ఓడించి కాంస్య పతకాన్ని గెల్చుకున్న సింధు ఈసారి అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. పోరాడినా... పురుషుల డబుల్స్‌లో ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ కూడా ముందంజ వేయలేకపోయింది. స్వర్ణ పతకంతో తిరిగి వస్తారనుకున్న సాత్విక్–చిరాగ్ ద్వయం క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. ప్రపంచ మూడో ర్యాంక్ జోడీ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంక్ ద్వయం సాత్విక్–చిరాగ్ 21–13, 14–21, 16–21తో పరాజయం పాలైంది. ఆరోన్ చియా–సో వుయ్ యిక్‌లతో తలపడిన గత మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన సాత్విక్–చిరాగ్ ఈసారి పోరాడినా విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ రెండు టైటిల్స్ గెలిచి, నాలుగు టో ర్నీ ల్లో రన్నరప్‌గా నిలిచారు. అంతేకాకుండా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను కూడా అందుకున్నారు. కానీ వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ పతకం గెలవలేకపోయారు. ప్రణయ్ అవుట్ సింధు, సాత్విక్–చిరాగ్ నిష్క్రమించడంతో భారత పతక ఆశలన్నీ లక్ష్య సేన్‌పై ఉన్నాయి. భారత నంబర్‌వన్, సహచరుడు హెచ్ఎస్ ప్రణయ్‌తో జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–12, 21–6తో అలవోకగా గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరాడు. పారుపల్లి కశ్యప్ (2012 లండన్), కిడాంబి శ్రీకాంత్ (2016 రియో) తర్వాత ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన మూడో భారత ప్లేయర్‌గా లక్ష్య సేన్ నిలిచాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ చో టిన్ చెన్ (చైనీస్ తైపీ)తో లక్ష్య సేన్ తలపడతాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే లక్ష్య సేన్ సెమీఫైనల్ చేరి పతకం రేసులో ఉంటాడు. -
నాకౌట్ దశకు సింధు, లక్ష్య సేన్, ప్రణయ్
పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగాల్లో భారత స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ నాకౌట్ దశకు అర్హత సాధించారు. తద్వారా పతకం గెలిచే ఆశలను సజీవంగా నిలబెట్టుకున్నారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఎమ్’ రెండో లీగ్ మ్యాచ్‌లో సింధు 21–5, 21–10తో క్రిస్టిన్ కుబా (ఎస్తోనియా)పై అలవోకగా గెలిచింది.33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధుకు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన సింధు గ్రూప్ ‘ఎమ్’ విజేతగా అవతరించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హి బింగ్జియావో (చైనా)తో సింధు తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో భారత రెండో ర్యాంకర్ లక్ష్య సేన్ సంచలనం సృష్టించాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)ను బోల్తా కొట్టించి గ్రూప్ ‘ఎల్’ టాపర్‌గా నిలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. 50 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 22వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–18, 21–12తో క్రిస్టీపై గెలిచాడు. రెండో గేమ్‌లో స్కోరు 19–12 వద్ద ఉన్నపుడు ఇద్దరి మధ్య 50 షాట్ల ర్యాలీ జరిగింది. చివరకు క్రిస్టీ కొట్టిన షాట్ బయటకు వెళ్లడంతో పాయింట్ లక్ష్య సేన్‌కు లభించింది. ఆ తర్వాత లక్ష్య సేన్ మరో పాయింట్ నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. గ్రూప్ ‘కె’ టాపర్‌గా భారత నంబర్‌వన్ హెచ్ఎస్ ప్రణయ్ నిలిచాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ ప్రణయ్ 16–21, 21–11, 21–12తో ఫట్ లె డక్ (వియత్నాం)పై నెగ్గాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌తో ప్రణయ్ తలపడతాడు. నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్ఆర్చరీ పురుషుల వ్యక్తిగత (1/32 ఎలిమినేషన్ రౌండ్): ప్రవీణŠ జాధవ్ X వెన్‌చావో (చైనా) (మధ్యాహ్నం గం. 2:31 నుంచి). పురుషుల వ్యక్తిగత (1/16 ఎలిమినేషన్ రౌండ్): (మధ్యాహ్నం గం. 3:10 నుంచి).షూటింగ్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ (ఫైనల్): స్వప్నిల్ కుసాలే (మధ్యాహ్నం గం. 1:00 నుంచి). మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫికేషన్ రౌండ్: సిఫ్ట్ కౌర్ సమ్రా, అంజుమ్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి).గోల్ఫ్ పురుషుల వ్యక్తిగత ఫైనల్స్: గగన్‌జీత్ భుల్లర్, శుభాంకర్ శర్మ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి).బాక్సింగ్ మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్: నిఖత్ జరీన్ X యూ వూ (చైనా) (మధ్యాహ్నం గం. 2:30 నుంచి).సెయిలింగ్పురుషుల డింగీ తొలి రెండు రేసులు: విష్ణు శరవణన్ (మధ్యాహ్నం గం. 3:45 నుంచి). మహిళల డింగీ తొలి రెండు రేసులు: నేత్రా కుమానన్ (రాత్రి గం. 7:05 నుంచి)హాకీభారత్ X బెల్జియం (గ్రూప్ మ్యాచ్) (మధ్యాహ్నం గం. 1:30 నుంచి).బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్స్: (మధ్యాహ్నం గం. 12:00 నుంచి). పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్: సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి X చియా ఆరోన్–సోహ్ వూయి యిక్ (మలేసియా) (సాయంత్రం గం. 4:30 నుంచి). మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్ (సాయంత్రం గం. 4:30 నుంచి). -
ప్యారిస్ ఒలింపిక్స్-2024లో ప్రి క్వార్టర్స్ చేరిన పీవీ సింధు (ఫొటోలు)