
విజయ్ దేవరకొండ సినిమాలపై భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. విజయ్ నటించిన సినిమాల్లో కొన్ని తనకు నచ్చలేదని చెప్పింది. అయితే నచ్చని సినిమాలు ఏంటనేది మాత్రం రివీల్ చేయలేదు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సింధు ఈ వ్యాఖ్యలు చేసింది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తనకు క్రష్ అని మరోసారి వెల్లడించింది. అతని సినిమాలన్నీ చూశానని.. డైరెక్టగా కలిసే అవకాశం మాత్రం రాలేదని చెప్పింది.
‘బ్యాడ్మింటన్ వల్ల ఎదురయ్యే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి సినిమాలు చూస్తాను. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల యాక్టింగ్ నాకు చాలా ఇష్టం.విజయ్ దేవరకొండ సినిమాలు చూశాను కానీ కొన్ని నాకు అంతగా నచ్చలేదు. ఆ పేర్లు చెబితే కాంట్రవర్సీ అవుతుంది. నాకు నచ్చని సినిమాలు వేరే వాళ్లకు నచ్చొచ్చు. ఒక్కొక్కరి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఏ హీరో అయినా సక్సెస్ అవుతుందనే నమ్మకంతోనే సినిమా చేస్తారు. వాళ్లపై కూడా ఒత్తిడి ఉంటుంది. సినిమా హిట్ అవుతుందో..ఫ్లాఫ్ అవుతుందో తెలియదు.కానీ నెలల తరబడి షూటింగ్ చేస్తారు. వాళ్ల కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు’అని సింధు చెప్పుకొచ్చింది.
ఇకపోతే గతంలో సింధు సినిమాల్లోకి వస్తుందనే ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదని సింధు కొట్టిపారేసింది. నటించాలనే ఆలోచన తనకు లేదని.. ప్రస్తుతం తన ఫోకస్ అంతా ఆటపైనే ఉందని చెప్పింది. భవిష్యత్తులో సినిమాల విషయంలో తన నిర్ణయం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేనని వెల్లడించింది. తన బయోపిక్ తీస్తే.. అందులో బ్యాడ్మింటన్ తెలిసిన దీపికా పడుకొణె లాంటి హీరోయిన్ నటిస్తే బాగుంటందని సింధు అభిప్రాయపడింది.