ప్రిక్వార్టర్స్‌లో ఓడిన సింధు, ప్రణయ్, అశ్విని–తనీషా జోడీ
నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు... పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్... మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ద్వయం ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. ఆరో సీడ్ హాన్ యువె (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో సింధు 18–21, 21–13, 17–21తో ఓటమి చవిచూసింది. ఏడో సీడ్ ప్రణయ్ 18–21, 11–21తో లిన్ చున్ యి (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యాడు.
అశ్విని –తనీషా జోడీ 17– 21, 12–21తో మూడో సీడ్ నామి మత్సుయామ–చిహారు షిదా (జపాన్) జంట చేతిలో ఓడింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అశ్విని–తనీషా ఓటమి పాలైనా పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఈనెల 30న విడుదలయ్యే ర్యాంకింగ్స్‌లో టాప్– 16లో ఉన్న డబుల్స్ జోడీలకు పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌లు ఖరారవుతాయి.
అశ్విని–తనీషా ద్వయం 20వ ర్యాంక్‌లో ఉన్నప్పటికీ... ఒక దేశం నుంచి గరిష్టంగా రెండు జోడీలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ర్యాంకింగ్స్‌లో అశ్విని ద్వయం 12వ స్థానంలో ఉండటం... ఇదే చివరి అర్హత టోర్నీ కానుండటంతో భారత జోడీ ర్యాంకింగ్స్‌లో ఎలాంటి మార్పు ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment