Paris 2024 Olympics: పతాకధారిగా సింధు | Paris Olympics 2024: PV Sindhu chosen as India female flag bearer | Sakshi
Sakshi News home page

Paris 2024 Olympics: పతాకధారిగా సింధు

Published Tue, Jul 9 2024 5:06 AM | Last Updated on Tue, Jul 9 2024 5:06 AM

Paris Olympics 2024: PV Sindhu chosen as India female flag bearer

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత బృందాన్ని ముందుండి నడిపించనున్న స్టార్‌ షట్లర్‌

న్యూఢిల్లీ: వరుసగా మూడో ఒలింపిక్స్‌లోనూ పతకంపై గురి పెట్టిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు గొప్ప గౌరవం లభించింది. పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవంలో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సింధు నేతృత్వం వహించనుంది. విశ్వ క్రీడల్లో పతాకధారిగా వ్యవహరించనున్న సింధు భారత బృందాన్ని ముందుండి నడిపించనుంది. 

మరో ఫ్లాగ్‌ బేరర్‌గా తమిళనాడుకు చెందిన దిగ్గజ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) ప్లేయర్‌ ఆచంట శరత్‌ కమల్‌ వ్యవహరిస్తాడు. ఐదోసారి ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న 41 ఏళ్ల శరత్‌ను పతాకధారిగా గత మార్చి నెలలోనే భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) ప్రకటించింది. పారిస్‌ ఒలింపిక్స్‌ జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి.  

విశ్వ క్రీడా వేదికపై లింగ సమానత్వం ఉండాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ 2020 టోక్యో ఒలింపిక్స్‌ నుంచి ప్రారం¿ోత్సవ వేడుకల్లో ఆయా దేశాలు పురుష ఫ్లాగ్‌ బేరర్‌తోపాటు ఒక మహిళా ఫ్లాగ్‌ బేరర్‌కు కూడా అవకాశం ఇవ్వాలనే నిబంధనను అమల్లోకి తెచి్చంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి హాకీ ప్లేయర్‌ మన్‌ప్రీత్‌ సింగ్, మహిళా బాక్సర్‌ మేరీకోమ్‌ పతాకధారులుగా వ్యవహరించారు. 

వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన ఏకైక భారత మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన 29 ఏళ్ల సింధు 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఫ్లాగ్‌ బేరర్‌గా గౌరవం పొందింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన సింధు, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కైవసం చేసుకుంది. పారిస్‌ క్రీడల్లోనూ సింధు పతకం సాధిస్తే ఒలింపిక్స్‌ చరిత్రలో మూడు వ్యక్తిగత పతకాలు నెగ్గిన ఏకైక భారతీయ ప్లేయర్‌గా సింధు రికార్డు సృష్టిస్తుంది. సింధు కంటే ముందు రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌  మాత్రమే ఒలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత పతకాలుసాధించాడు. 

చెఫ్‌ డి మిషన్‌గా గగన్‌ నారంగ్‌ 
మరోవైపు పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి చెఫ్‌ డి మిషన్‌గా తెలంగాణ షూటర్‌ గగన్‌ నారంగ్‌ వ్యవహరిస్తాడు. ముందుగా మేరీకోమ్‌ను చెఫ్‌ డి మిషన్‌గా ప్రకటించినా వ్యక్తిగత కారణాలరీత్యా ఈ బాధ్యతలు తీసుకోలేనని ఆమె ప్రకటించింది. దాంతో గగన్‌ నారంగ్‌కు చెఫ్‌ డి మిషన్‌ బాధ్యతలు అప్పగిస్తున్నామని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష తెలిపింది. చెఫ్‌ డి మిషన్‌ హోదాలో గగన్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే మొత్తం భారత క్రీడాకారుల వ్యవహారాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. 41 ఏళ్ల గగన్‌ నారంగ్‌ 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో పురుషుల షూటింగ్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించాడు. 

4: భారత్‌ తరఫున ఒలింపిక్స్‌ క్రీడల్లో ఫ్లాగ్‌ బేరర్‌గా వ్యవహరించనున్న నాలుగో మహిళా క్రీడాకారిణిగా పీవీ సింధు గుర్తింపు పొందనుంది. గతంలో ఈ ఘనత షైనీ విల్సన్, అంజూ బాబీ జార్జి, మేరీకోమ్‌లకు మాత్రమే దక్కింది. అథ్లెట్‌ షైనీ విల్సన్‌ 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో... లాంగ్‌జంపర్‌ అంజూ బాబీ జార్జి 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో... బాక్సర్‌ మేరీకోమ్‌ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఫ్లాగ్‌ బేరర్స్‌గా ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement