రెండు పతకావకాశాలకు తెర
నిష్క్రమించిన సింధు, సాత్విక్ –చిరాగ్ జోడీ
క్వార్టర్స్ చేరి ఆశలు నిలిపిన లక్ష్య సేన్
పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో గురువారం భారత్‌కు కలిసి రాలేదు. కచ్చితంగా పతకాలు సాధిస్తారనుకున్న పీవీ సింధు... సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ఓటమి చవిచూసి రిక్తహస్తాలతో రానున్నారు. పురుషుల సింగిల్స్‌లో సహచరుడు ప్రణయ్‌ను ఓడించి లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరి భారత్ ఆశలను నిలబెట్టాడు.
పారిస్: ‘రియో’లో రజత పతకం. ‘టోక్యో’లో కాంస్యం... ‘పారిస్’లో మాత్రం నిరాశ... గత రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి వరుసగా మూడో ఒలింపిక్ పతకం లక్ష్యంగా ‘పారిస్’కు వచ్చిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ప్రస్థానం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది.
గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ సింధు 19–21, 14–21తో ప్రపంచ 9వ ర్యాంకర్ హి బింగ్‌జియావో (చైనా) చేతిలో ఓడిపోయింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో హి బింగ్‌జియావోను ఓడించి కాంస్య పతకాన్ని గెల్చుకున్న సింధు ఈసారి అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది.
పోరాడినా...
పురుషుల డబుల్స్‌లో ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ కూడా ముందంజ వేయలేకపోయింది. స్వర్ణ పతకంతో తిరిగి వస్తారనుకున్న సాత్విక్–చిరాగ్ ద్వయం క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. ప్రపంచ మూడో ర్యాంక్ జోడీ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంక్ ద్వయం సాత్విక్–చిరాగ్ 21–13, 14–21, 16–21తో పరాజయం పాలైంది.
ఆరోన్ చియా–సో వుయ్ యిక్‌లతో తలపడిన గత మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన సాత్విక్–చిరాగ్ ఈసారి పోరాడినా విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ రెండు టైటిల్స్ గెలిచి, నాలుగు టో ర్నీ ల్లో రన్నరప్‌గా నిలిచారు. అంతేకాకుండా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను కూడా అందుకున్నారు. కానీ వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ పతకం గెలవలేకపోయారు.
ప్రణయ్ అవుట్
సింధు, సాత్విక్–చిరాగ్ నిష్క్రమించడంతో భారత పతక ఆశలన్నీ లక్ష్య సేన్‌పై ఉన్నాయి. భారత నంబర్‌వన్, సహచరుడు హెచ్‌ఎస్ ప్రణయ్‌తో జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–12, 21–6తో అలవోకగా గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరాడు.
పారుపల్లి కశ్యప్ (2012 లండన్), కిడాంబి శ్రీకాంత్ (2016 రియో) తర్వాత ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన మూడో భారత ప్లేయర్‌గా లక్ష్య సేన్ నిలిచాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ చో టిన్ చెన్ (చైనీస్ తైపీ)తో లక్ష్య సేన్ తలపడతాడు. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే లక్ష్య సేన్ సెమీఫైనల్ చేరి పతకం రేసులో ఉంటాడు.
Comments
Please login to add a commentAdd a comment