పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగాల్లో భారత స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, లక్ష్య సేన్, హెచ్‌ఎస్ ప్రణయ్ నాకౌట్ దశకు అర్హత సాధించారు. తద్వారా పతకం గెలిచే ఆశలను సజీవంగా నిలబెట్టుకున్నారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్ ‘ఎమ్’ రెండో లీగ్ మ్యాచ్‌లో సింధు 21–5, 21–10తో క్రిస్టిన్ కుబా (ఎస్తోనియా)పై అలవోకగా గెలిచింది.
33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధుకు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన సింధు గ్రూప్ ‘ఎమ్’ విజేతగా అవతరించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హి బింగ్‌జియావో (చైనా)తో సింధు తలపడుతుంది.
పురుషుల సింగిల్స్‌లో భారత రెండో ర్యాంకర్ లక్ష్య సేన్ సంచలనం సృష్టించాడు. ప్రపంచ నాలుగో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)ను బోల్తా కొట్టించి గ్రూప్ ‘ఎల్’ టాపర్‌గా నిలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. 50 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 22వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–18, 21–12తో క్రిస్టీపై గెలిచాడు. రెండో గేమ్‌లో స్కోరు 19–12 వద్ద ఉన్నపుడు ఇద్దరి మధ్య 50 షాట్‌ల ర్యాలీ జరిగింది.
చివరకు క్రిస్టీ కొట్టిన షాట్ బయటకు వెళ్లడంతో పాయింట్ లక్ష్య సేన్‌కు లభించింది. ఆ తర్వాత లక్ష్య సేన్ మరో పాయింట్ నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. గ్రూప్ ‘కె’ టాపర్‌గా భారత నంబర్‌వన్ హెచ్‌ఎస్ ప్రణయ్ నిలిచాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ ప్రణయ్ 16–21, 21–11, 21–12తో ఫట్ లె డక్ (వియత్నాం)పై నెగ్గాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన లక్ష్య సేన్‌తో ప్రణయ్ తలపడతాడు.
నేడు భారత క్రీడాకారుల షెడ్యూల్
ఆర్చరీ
పురుషుల వ్యక్తిగత (1/32 ఎలిమినేషన్ రౌండ్):
ప్రవీణŠ జాధవ్ X వెన్‌చావో (చైనా) (మధ్యాహ్నం గం. 2:31 నుంచి). పురుషుల వ్యక్తిగత (1/16 ఎలిమినేషన్ రౌండ్): (మధ్యాహ్నం గం. 3:10 నుంచి).
షూటింగ్
పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ (ఫైనల్): స్వప్నిల్ కుసాలే (మధ్యాహ్నం గం. 1:00 నుంచి). మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫికేషన్ రౌండ్: సిఫ్ట్ కౌర్ సమ్రా, అంజుమ్ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి).
గోల్ఫ్
పురుషుల వ్యక్తిగత ఫైనల్స్: గగన్‌జీత్ భుల్లర్, శుభాంకర్ శర్మ (మధ్యాహ్నం గం. 12:30 నుంచి).
బాక్సింగ్
మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్: నిఖత్ జరీన్ X యూ వూ (చైనా) (మధ్యాహ్నం గం. 2:30 నుంచి).
సెయిలింగ్
పురుషుల డింగీ తొలి రెండు రేసులు: విష్ణు శరవణన్ (మధ్యాహ్నం గం. 3:45 నుంచి). మహిళల
డింగీ తొలి రెండు రేసులు: నేత్రా కుమానన్ (రాత్రి గం. 7:05 నుంచి)
హాకీ
భారత్ X బెల్జియం
(గ్రూప్ మ్యాచ్) (మధ్యాహ్నం గం. 1:30 నుంచి).
బ్యాడ్మింటన్
పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్స్: (మధ్యాహ్నం గం. 12:00 నుంచి). పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్: సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి X చియా ఆరోన్–సోహ్ వూయి యిక్ (మలేసియా) (సాయంత్రం గం. 4:30 నుంచి). మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్ (సాయంత్రం గం. 4:30 నుంచి).
Comments
Please login to add a commentAdd a comment