మున్ముందు సాధించాల్సింది చాలా ఉంది
ఈ ఏడాది ఎంపిక చేసిన టోర్నీల్లోనే ఆడతా
కొత్త సీజన్ బరిలో పీవీ సింధు
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు సాధించిన ఘనతలు, రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో రజత, కాంస్యాలు... వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సహా ఐదు పతకాలు మాత్రమే కాదు... ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలతో తోడు పెద్ద సంఖ్యలో బీడబ్ల్యూఎఫ్ ట్రోఫీలతో ఆమె ఎన్నో అద్భుత విజయాలతో ఆమె తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకుంది. అయితే గత ఏడాది కాలంగా ఆమె కెరీర్ కాస్త ఒడిదుడుకులకు లోనవుతోంది.
ఆశించిన స్థాయిలో ఆమె ప్రదర్శన ఉండటం లేదు. దాంతో 29 ఏళ్ల సింధు భవిష్యత్తుపై సందేహాలు వస్తున్నాయి. కానీ సింధు వీటన్నింటిని కొట్టిపారేసింది. ఆటలో మరింత కాలం కొనసాగే సత్తా తనలో ఉండటమే కాదు... విజయాలు సాధించాలనే తపన, ఆకలి కూడా మిగిలి ఉన్నాయని ఆమె స్పష్టం చేసింది. సరిగ్గా చెప్పాలంటే తాను సాధించిన గత విజయాలు తనకు స్ఫూర్తినిస్తాయని ఆమె పేర్కొంది.
‘మున్ముందు కెరీర్‌లో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని తపన నాలో ఇంకా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. నేను గొప్ప విజయాలు అందుకున్న గత వీడియోలు చూస్తే ఎంతో సంతోషం కలగడమే కాదు అవి ఎంతో స్ఫూర్తినిస్తాయి కూడా. వాటిని చూస్తే చాలు కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. ముఖ్యంగా కొన్ని టైటిల్స్ నేను చాలా చిన్న వయసులోనే గెలుచుకున్నాను. అప్పుడు అంతా బాగా చేయగా లేనిది ఇప్పుడు చేయలేనా అనే ప్రశ్న నాలో మొదలవుతుంది. అక్కడినుంచే మళ్లీ విజయాల వేట మొదలవుతుంది’ అని సింధు వ్యాఖ్యానించింది.
కోలుకొని చెలరేగడం కొత్త కాదు...
గతంలో తాను వివిధ సందర్భాల్లో వేర్వేరు కారణాలతో వెనుకబడిపోయానని, కానీ ఎప్పుడూ ఆశలు వదులుకోలేదని ఆమె వెల్లడించింది. ‘క్రీడల్లో నేను ఎంతో నేర్చుకున్నాను. గాయాలతో ఆటకు దూరమై అసలు తిరిగొస్తానో లేదో అనే సందేహాల మధ్య కూడా నాపై నేను నమ్మకం ఉంచాను. 2015లో నేను గాయపడినప్పుడు ఇలా జరిగింది. కానీ ఆ తర్వాత కోలుకొని రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచాను. కెరీర్ ఆరంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో విజయాలు, అవార్డులు, రివార్డులు సాధించాను. ఇన్ని గెలిచిన నేను ఎంతో అదృష్టవంతురాలిని. అవన్నీ నాతో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. గెలుపోటములు ఆటలో, జీవితంలో భాగం. కష్టసమయాల్లో ఓపిగ్గా ఉండటం అనేది నేను నేర్చుకున్నాను. సరైన సమయం కోసం ఎదురు చూడటం ఎంతో ముఖ్యం’ అని సింధు విశ్లేషించింది.
గడ్డు కాలం అధిగమించాను...
2024లో ఆడిన చివరి టోర్నీ సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్‌లో విజేతగా నిలవడం మినహా గత ఏడాది సింధు చెప్పుకోగ్గ ఫలితాలు సాధించలేకపోయింది. మరో పతకం ఆశలతో బరిలోకి దిగిన పారిస్ ఒలింపిక్స్‌లో కూడా నిరాశపర్చింది. అయితే ఇలాంటి దశను దాటి మున్ముందు మంచి విజయాలు అందుకుంటానని ఆమె ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. ‘మనం అనుకున్న విజయాలు సాధించనప్పుడు, కోర్టులో కష్ట సాగుతున్నప్పుడు సహజంగానే బాధ వేస్తుంది.
ఇలాంటప్పుడు మరింత పట్టుదలగా ఉండాలి. నేను ఎన్నో మ్యాచ్‌లలో గెలుపునకు బాగా చేరువగా వచ్చి కూడా ఓడిపోయాను. నాకు ఇలా జరుగుతోందేమిటి అని ఆలోచించిన సందర్భాలు కూడా చాలా వచ్చాయి. అయితే ఈ గడ్డు సమయంలో మన సన్నిహితులు అండగా నిలవడం కీలకం. అప్పుడే మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. నా తల్లిదండ్రులిద్దరూ క్రీడాకారులు కావడం నా అదృష్టం. గెలుపోటముల సమయంలో ఎలా ఉండాలో వారు నాకు నేర్పారు. ఇంకా సాధించాల్సింది, నిరూపించుకోవాల్సింది ఏమీ లేకపోయినా సరే ఓటములు బాధించడం సహజం. నాకు సంబంధించి ఫిట్‌గా ఉంటే నేను ఇంకా చాలా ఆడగలనని, ఎన్నో టోర్నీలు గెలవగలననే నమ్మకం ఉంది’ అని సింధు స్పష్టం చేసింది.
ఫిట్‌నెస్ ప్రధానం...
2025లో తన ప్రణాళిక ప్రకారం ఎంపిక చేసిన టోర్నీల్లో పాల్గొంటూ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటానని సింధు వెల్లడించింది. ‘ప్రతీ నెలలో పెద్ద సంఖ్యలో టోర్నమెంట్‌లు జరుగుతాయి. దాదాపు 15–20 రోజులు బయటే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి టోర్నిలను ఎంపిక చేసుకొని బరిలోకి దిగుతాను. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటేనే వంద శాతం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలం. బీడబ్ల్యూఎఫ్ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఆడాల్సిన టోర్నీలు కాకుండా మిగతా వాటిలో కొన్నింటిని ఆటగాళ్లు ఎంచుకోవడం సహజం. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మరో పతకం, ఆల్ ఇంగ్లండ్‌లో పతకం గెలవడం నా ప్రణాళికల్లో ఉన్నాయి. ఎన్ని గెలిచినా మైదానంలో దిగగానే ఎవరైనా ఇంకా గెలవాలనే కోరుకుంటారు’ అని ఆమె చెప్పింది.
ఇంకా నేర్చుకుంటున్నా...
ఇన్నేళ్ల కెరీర్ తర్వాత ఇంకా తాను ఆటలో ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని... ఆటలో వస్తున్న కొత్త మార్పులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటున్నానని సింధు పేర్కొంది. ‘బ్యాడ్మింటన్‌లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్లేయర్ల డిఫెన్స్ చాలా దుర్బేధ్యంగా మారుతోంది. దానిని బద్దలు కొట్టాలంటే మరింత శ్రమించాలి. ప్రతీసారి అటాక్ చేసే అవకాశం అందరికీ రాదు. ముఖ్యంగా నేను ఎత్తుగా ఉంటాను కాబట్టి నేను ఎక్కువగా అటాక్ చేయకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటారు. నా డిఫెన్స్ కూడా మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంది. భారత బ్యాడ్మింటన్‌లో నా తర్వాత ఎంతో మంది యువ తారలు వేగంగా దూసుకొస్తున్నారు. ఉన్నతి, మాళివకల ఆట బాగుంది. వారికి సరైన మార్గనిర్దేశనం లభిస్తే మంచి ఫలితాలు వస్తాయి’ అని సింధు అభిప్రాయపడింది.
కొత్త కోచ్ అండగా...
సింధు కొత్త సీజన్‌లో కొత్త కోచ్ శిక్షణలో బరిలోకి దిగనుంది. ఇండోనేసియాకు చెందిన ఇర్‌వాన్‌స్యా ఆది ప్రతమ ఆమెకు ఇకపై కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని సింధు ఖరారు చేసింది. గత కొద్ది రోజులుగా బెంగళూరులో ప్రతమ పర్యవేక్షణలో సింధు సాధన చేస్తోంది. నేటి నుంచి జరిగే ఇండియా ఓపెన్ సూపర్–750 టోర్నమెంట్ వీరిద్దరి భాగస్వామ్యంలో తొలి టోర్నీ కానుంది. ‘కోచ్, ప్లేయర్ మధ్య సమన్వయం ఎంతో ముఖ్యం. అది కుదిరేందుకు కొంత సమయం పడుతుంది. మరికొన్ని ప్రాక్టీస్ సెషన్ల తర్వాత ఒకరిపై మరొకరికి స్పష్టమైన అవగాహన రావచ్చు. ప్రతమ గురించి చాలా విన్నాను. నాకు సరైన కోచ్‌గా అనిపించి ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని సింధు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment