Pusarla Venkata Sindhu
-
శ్రమతోనే సక్సెస్
పూసర్ల వెంకట సింధు... ఒలింపిక్స్‌లో పతకాలు సాధించింది.కామన్వెల్త్... వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణాలు సొంతం చేసుకుంది.ప్రపంచవేదికల మీద దేశ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది.భారత మాత మెడలో పతకాల హారం వేసి బంగారు సింధు అయింది.ఈ ఏడాది మహిళాదినోత్సవాన్ని శ్రీమతి సింధుగా వేడుక చేసుకుంటోంది.సాధికారత దిశగా పయనిస్తున్న మహిళలకు అభినందనలు చెప్పింది.ఈ తరంలో మహిళలు బిజినెస్, స్పోర్ట్స్‌తోపాటు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. కేవలం తమకు తాము నిలదొక్కుకోవడంతో సరిపెట్టడం లేదు, ఆ రంగంలో నంబర్ వన్‌గా నిలవడానికి శ్రమిస్తున్నారు. నంబర్ వన్ లక్ష్యాన్ని సాధిస్తున్నారు కూడా. ఈ స్ఫూర్తిని, ఇదే పంథాను కొనసాగించాలని అభిలషిస్తున్నాను. సక్సెస్‌కు దారి! ప్రతి ఒక్కరూ తమ కోసం తాము కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటిని చేరుకోవడానికి తగినంత శ్రమించాలి. సక్సెస్ అనే లక్ష్యాన్ని చేరడానికి ఉన్న ఏకైక దారి హార్డ్‌వర్క్. హార్డ్‌వర్క్‌తో మాత్రమే విజయానికి చేరువ కాగలుగుతాం. అది కూడా ఒక నెల శ్రమతోనో ఏడాది శ్రమతోనో శిఖరాన్ని చేరాలని ఆశించకూడదు. కొన్నేళ్ల కఠోరశ్రమ, అంకితభావంతో శ్రమించినప్పుడే సక్సెస్ మనదవుతుంది. అయితే కొందరికి సక్సెస్ కొంత త్వరగా రావచ్చు, మరికొందరికి ఆలస్యం కావచ్చు. మన మీద మనం నమ్మకాన్ని కోల్పోకూడదు. ఆశను వదులుకోకూడదు, నిరాశపడకూడదు. మనం మనవంతుగా శ్రమిస్తూ ఉండాలి. సక్సెస్ వచ్చినప్పటి నుంచి మరింత బాధ్యతగా పని చేయాలి. సక్సెస్ అనే శిఖరాన్ని చేరాం అని రిలాక్స్ కాకూడదు. నంబర్ వన్‌కి చేరడానికి నేనలాగే కష్టపడ్డాను, కష్టపడుతూనే ఉంటాను కూడా. అమ్మానాన్న... భర్త! ఇప్పటి వరకు నన్ను, నా ఆర్థిక వ్యవహారాలను అమ్మానాన్న చూసుకునేవారు. టోర్నమెంట్‌కి తోడుగా నాన్న వచ్చేవారు. ఇప్పుడు మా వారు వస్తున్నారు. నా గురించి అన్నీ వాళ్లే చూసుకుంటారు. నా ఫోకస్ అంతా ఆట మీదనే కేంద్రీకరించడానికి తగిన వెసులుబాటునిస్తున్నారు. పేరెంట్స్ నడిపించాలి! దేశానికి కొత్తతరం క్రీడాకారులు తయారు కావాలి. క్రీడాకారులను తయారు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలకు స్పోర్ట్స్ మీద ఆసక్తి ఉన్నప్పటికీ తల్లిదండ్రుల సహకారం లేకపోతే క్రీడాకారులు తయారుకారు. పిల్లలను క్రీడల దిశగా నడిపించడం పేరెంట్స్ చేతిలోనే ఉంటుంది. ఆటలు, చదువు రెండూ కీలకమే. రెండింటినీ ఎలా బాలెన్స్ చేసుకోవాలో నేర్పించగలిగింది కూడా పేరెంట్సేనని నా అభి్రపాయం. పేరెంట్స్‌కి కోరిక ఉన్నప్పటికీ పిల్లలకు ఆడాలనే ఆసక్తి లేకపోతే ఆ పిల్లలు దీర్ఘకాలం కొనసాగడం కష్టం. అలాగే ఆటల పట్ల ఆసక్తి ఉన్న పిల్లలకు పేరెంట్స్ సహకారం లేకపోతే తొలి అడుగు కూడా పడదు. అందుకే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం.సింధుగానే గుర్తించాలి! సమాజం నన్ను సింధుగానే గుర్తించాలి. ‘పీవీ సింధు’ అనగానే చేతిలో రాకెట్‌తో నా రూపం కళ్ల ముందు మెదులుతుంది. అలా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. దేశం కోసం ఆడగలిగే స్థాయికి చేరాను. దేశం కోసం ఆడాను. దేశానికి ఎన్నో పతకాలను సాధించాను. దేశానికి గౌరవాన్ని పెంచడంలో నా శ్రమ కూడా ఉందని సంతోషపడుతున్నాను. ఈ గుర్తింపు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
‘గత విజయాలే నాకు ప్రేరణ’
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు సాధించిన ఘనతలు, రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో రజత, కాంస్యాలు... వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సహా ఐదు పతకాలు మాత్రమే కాదు... ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలతో తోడు పెద్ద సంఖ్యలో బీడబ్ల్యూఎఫ్ ట్రోఫీలతో ఆమె ఎన్నో అద్భుత విజయాలతో ఆమె తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకుంది. అయితే గత ఏడాది కాలంగా ఆమె కెరీర్ కాస్త ఒడిదుడుకులకు లోనవుతోంది. ఆశించిన స్థాయిలో ఆమె ప్రదర్శన ఉండటం లేదు. దాంతో 29 ఏళ్ల సింధు భవిష్యత్తుపై సందేహాలు వస్తున్నాయి. కానీ సింధు వీటన్నింటిని కొట్టిపారేసింది. ఆటలో మరింత కాలం కొనసాగే సత్తా తనలో ఉండటమే కాదు... విజయాలు సాధించాలనే తపన, ఆకలి కూడా మిగిలి ఉన్నాయని ఆమె స్పష్టం చేసింది. సరిగ్గా చెప్పాలంటే తాను సాధించిన గత విజయాలు తనకు స్ఫూర్తినిస్తాయని ఆమె పేర్కొంది. ‘మున్ముందు కెరీర్లో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని తపన నాలో ఇంకా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. నేను గొప్ప విజయాలు అందుకున్న గత వీడియోలు చూస్తే ఎంతో సంతోషం కలగడమే కాదు అవి ఎంతో స్ఫూర్తినిస్తాయి కూడా. వాటిని చూస్తే చాలు కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. ముఖ్యంగా కొన్ని టైటిల్స్ నేను చాలా చిన్న వయసులోనే గెలుచుకున్నాను. అప్పుడు అంతా బాగా చేయగా లేనిది ఇప్పుడు చేయలేనా అనే ప్రశ్న నాలో మొదలవుతుంది. అక్కడినుంచే మళ్లీ విజయాల వేట మొదలవుతుంది’ అని సింధు వ్యాఖ్యానించింది. కోలుకొని చెలరేగడం కొత్త కాదు... గతంలో తాను వివిధ సందర్భాల్లో వేర్వేరు కారణాలతో వెనుకబడిపోయానని, కానీ ఎప్పుడూ ఆశలు వదులుకోలేదని ఆమె వెల్లడించింది. ‘క్రీడల్లో నేను ఎంతో నేర్చుకున్నాను. గాయాలతో ఆటకు దూరమై అసలు తిరిగొస్తానో లేదో అనే సందేహాల మధ్య కూడా నాపై నేను నమ్మకం ఉంచాను. 2015లో నేను గాయపడినప్పుడు ఇలా జరిగింది. కానీ ఆ తర్వాత కోలుకొని రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచాను. కెరీర్ ఆరంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో విజయాలు, అవార్డులు, రివార్డులు సాధించాను. ఇన్ని గెలిచిన నేను ఎంతో అదృష్టవంతురాలిని. అవన్నీ నాతో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. గెలుపోటములు ఆటలో, జీవితంలో భాగం. కష్టసమయాల్లో ఓపిగ్గా ఉండటం అనేది నేను నేర్చుకున్నాను. సరైన సమయం కోసం ఎదురు చూడటం ఎంతో ముఖ్యం’ అని సింధు విశ్లేషించింది. గడ్డు కాలం అధిగమించాను... 2024లో ఆడిన చివరి టోర్నీ సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్‌లో విజేతగా నిలవడం మినహా గత ఏడాది సింధు చెప్పుకోగ్గ ఫలితాలు సాధించలేకపోయింది. మరో పతకం ఆశలతో బరిలోకి దిగిన పారిస్ ఒలింపిక్స్‌లో కూడా నిరాశపర్చింది. అయితే ఇలాంటి దశను దాటి మున్ముందు మంచి విజయాలు అందుకుంటానని ఆమె ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. ‘మనం అనుకున్న విజయాలు సాధించనప్పుడు, కోర్టులో కష్ట సాగుతున్నప్పుడు సహజంగానే బాధ వేస్తుంది. ఇలాంటప్పుడు మరింత పట్టుదలగా ఉండాలి. నేను ఎన్నో మ్యాచ్‌లలో గెలుపునకు బాగా చేరువగా వచ్చి కూడా ఓడిపోయాను. నాకు ఇలా జరుగుతోందేమిటి అని ఆలోచించిన సందర్భాలు కూడా చాలా వచ్చాయి. అయితే ఈ గడ్డు సమయంలో మన సన్నిహితులు అండగా నిలవడం కీలకం. అప్పుడే మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. నా తల్లిదండ్రులిద్దరూ క్రీడాకారులు కావడం నా అదృష్టం. గెలుపోటముల సమయంలో ఎలా ఉండాలో వారు నాకు నేర్పారు. ఇంకా సాధించాల్సింది, నిరూపించుకోవాల్సింది ఏమీ లేకపోయినా సరే ఓటములు బాధించడం సహజం. నాకు సంబంధించి ఫిట్‌గా ఉంటే నేను ఇంకా చాలా ఆడగలనని, ఎన్నో టోర్నీలు గెలవగలననే నమ్మకం ఉంది’ అని సింధు స్పష్టం చేసింది. ఫిట్నెస్ ప్రధానం... 2025లో తన ప్రణాళిక ప్రకారం ఎంపిక చేసిన టోర్నీల్లో పాల్గొంటూ ఫిట్నెస్ను కాపాడుకుంటానని సింధు వెల్లడించింది. ‘ప్రతీ నెలలో పెద్ద సంఖ్యలో టోర్నమెంట్లు జరుగుతాయి. దాదాపు 15–20 రోజులు బయటే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి టోర్నిలను ఎంపిక చేసుకొని బరిలోకి దిగుతాను. పూర్తి ఫిట్నెస్తో ఉంటేనే వంద శాతం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలం. బీడబ్ల్యూఎఫ్ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఆడాల్సిన టోర్నీలు కాకుండా మిగతా వాటిలో కొన్నింటిని ఆటగాళ్లు ఎంచుకోవడం సహజం. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో మరో పతకం, ఆల్ ఇంగ్లండ్‌లో పతకం గెలవడం నా ప్రణాళికల్లో ఉన్నాయి. ఎన్ని గెలిచినా మైదానంలో దిగగానే ఎవరైనా ఇంకా గెలవాలనే కోరుకుంటారు’ అని ఆమె చెప్పింది. ఇంకా నేర్చుకుంటున్నా... ఇన్నేళ్ల కెరీర్ తర్వాత ఇంకా తాను ఆటలో ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని... ఆటలో వస్తున్న కొత్త మార్పులకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటున్నానని సింధు పేర్కొంది. ‘బ్యాడ్మింటన్‌లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్లేయర్ల డిఫెన్స్ చాలా దుర్బేధ్యంగా మారుతోంది. దానిని బద్దలు కొట్టాలంటే మరింత శ్రమించాలి. ప్రతీసారి అటాక్ చేసే అవకాశం అందరికీ రాదు. ముఖ్యంగా నేను ఎత్తుగా ఉంటాను కాబట్టి నేను ఎక్కువగా అటాక్ చేయకుండా వారు జాగ్రత్తలు తీసుకుంటారు. నా డిఫెన్స్ కూడా మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంది. భారత బ్యాడ్మింటన్‌లో నా తర్వాత ఎంతో మంది యువ తారలు వేగంగా దూసుకొస్తున్నారు. ఉన్నతి, మాళివకల ఆట బాగుంది. వారికి సరైన మార్గనిర్దేశనం లభిస్తే మంచి ఫలితాలు వస్తాయి’ అని సింధు అభిప్రాయపడింది. కొత్త కోచ్ అండగా... సింధు కొత్త సీజన్లో కొత్త కోచ్ శిక్షణలో బరిలోకి దిగనుంది. ఇండోనేసియాకు చెందిన ఇర్వాన్స్యా ఆది ప్రతమ ఆమెకు ఇకపై కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని సింధు ఖరారు చేసింది. గత కొద్ది రోజులుగా బెంగళూరులో ప్రతమ పర్యవేక్షణలో సింధు సాధన చేస్తోంది. నేటి నుంచి జరిగే ఇండియా ఓపెన్ సూపర్–750 టోర్నమెంట్ వీరిద్దరి భాగస్వామ్యంలో తొలి టోర్నీ కానుంది. ‘కోచ్, ప్లేయర్ మధ్య సమన్వయం ఎంతో ముఖ్యం. అది కుదిరేందుకు కొంత సమయం పడుతుంది. మరికొన్ని ప్రాక్టీస్ సెషన్ల తర్వాత ఒకరిపై మరొకరికి స్పష్టమైన అవగాహన రావచ్చు. ప్రతమ గురించి చాలా విన్నాను. నాకు సరైన కోచ్‌గా అనిపించి ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని సింధు వెల్లడించింది. -
రాయల్‌గా రాజస్తానీ టచ్‌తో
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు ఆదివారం వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. పారిశ్రామికవేత్త వెంకట దత్తసాయిని సింధు పెళ్లాడుతున్నారు. రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో ఈ పెళ్లి జరుగు తోంది. ఉదయ్ సాగర్ సరస్సు మధ్యలో ఉన్న ప్రముఖ లగ్జరీ హోటల్ ‘రఫల్స్’ను సింధు పెళ్లి కోసం ప్రత్యేకంగా సిద్ధం చేశారు. రాజసం ఉట్టిప డేలా పెళ్లి వేదికను అలంకరించారు. అతిధులను వేదికకు తీసుకువచ్చే పడవలను కూడా ప్రత్యేక రీతిలో తీర్చిదిద్దారు. డెకరేషన్ అంతా రాజస్తానీ శైలిలో సంప్రదాయం, రాజసాల మేళవింపుగా ఉందని చెబుతున్నారు. విందులోనూ మేవారీ రుచులతో కూడిన రాజస్తానీ వంటకాలను వడ్డించినట్లు తెలిసింది. వధూవరుల కుటుంబ సభ్యు లు, అత్యంత సన్నిహితుల మధ్య మూడు రోజులపాటు సాగే ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా శుక్రవారం ‘హల్దీ’సంబరాలు నిర్వహించగా, శనివారం ‘మెహందీ, సంగీత్’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం సాయంత్రం ‘వరమాల’కార్యక్రమం జరుగుతుంది. రాత్రి 11.30 గంటల ముహూర్త సమయాన సంప్రదాయ రీతిలో పెళ్లి తంతును నిర్వహిస్తామని సింధు తండ్రి పీవీ రమణ వెల్లడించారు. తమ వివాహానికి ప్రధాని సహా దేశవ్యాప్తంగా పలు వురు ప్రముఖులను సింధు కుటుంబం ఆహ్వానించింది. అయితే పెళ్లికి పరిమిత సంఖ్యలో ఆత్మీ యులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది.మంగళవారం నాడు హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరు కానున్నారు. ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడ ల్లో రెండు పతకాలు, వరల్డ్ చాంపియన్‌షిప్ సహా పలు అగ్రశ్రేణి టోర్నీల్లో విజేతగా నిలిచిన సింధు.. భారత బ్యాడ్మింటన్‌లో అతి పెద్ద స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా కాలంగా స్నేహం..సింధు, దత్తసాయి కుటుంబాల మధ్య చాలా కాలంగా స్నేహం ఉంది. ఇటీవలే వీరి పెళ్లిని ఇరు కుటుంబాలు ఖాయం చేశాయి. హైదరా బాద్‌కు చెందిన డేటా మేనేజ్మెంట్ సొల్యూ షన్ సంస్థ ‘పొసి డెక్స్ టెక్నాలజీస్’ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా దత్తసాయి పని చేస్తున్నారు. ఆయన తండ్రి, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ ఎస్)లో ఉన్నతాధికారిగా పని చేసి రిటైర్ అయిన జీటీ వెంకటేశ్వర రావు.. ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. పొసిడెక్స్ టెక్నాలజీస్ ఇటీవలి వరకు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ‘ధరణి’పోర్టల్‌ను నిర్వహించింది. డేటా సైన్స్‌లో మాస్టర్స్ చేసిన దత్తసాయి స్వయంగా క్రీడాభిమాని. జేఎస్ డబ్ల్యూ సంస్థలో పని చేసినప్పుడు ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంబంధించిన ఆపరే షన్స్‌ను దత్తసాయి పర్యవేక్షించాడు. జనవరి నుంచి సింధు వరుసగా వేర్వేరు టోర్నమెంట్లలో పాల్గొనే అవకాశం ఉండటంతో డిసెంబర్లోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు. -
‘కొంత విరామం కావాలి’
పారిస్: భారత్ తరఫున వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలిచే లక్ష్యంతో బరిలోకి దిగిన బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు దురదృష్టవశాత్తూ ఆ ఘనతను అందుకోలేకపోయింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధు పారిస్ ఒలింపిక్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో తన భవిష్యత్తు ఆలోచనల గురించి సింధు వెల్లడించింది. తాజా ఓటమితో చాలా బాధపడుతున్నానన్న ఆమె... మరో చర్చకు తావు లేకుండా ఆటలో కొనసాగుతానని స్పష్టం చేసింది. అయితే శారీరకంగా, మానసికంగా కాస్త విరామం కోరుకుంటున్నానని పేర్కొంది. 29 ఏళ్ల సింధు ఒలింపిక్స్ పరాజయం తర్వాత సోషల్ మీడియా ద్వారా తన స్పందనను తెలియజేసింది. ‘పారిస్ ప్రయాణం చాలా గొప్పగా సాగింది. కానీ ఓటమి బాధించింది. ఈ పరాజయం నా జీవితంలో చాలా కఠినమైంది. దీని నుంచి కోలుకునేందుకు సమయం పడుతుంది. అయితే జీవితం ఆగిపోదు. మళ్లీ కొనసాగాల్సిందే. పారిస్‌కు అర్హత సాధించే క్రమంలో ఎంతో పోరాడాను. గత రెండేళ్లు గాయాలతో ఎక్కువ సమయం ఆటకు దూరమయ్యాను. ఈ సవాళ్లను అధిగమించి నా దేశం తరఫున మూడో ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం రావడం గొప్పగా అనిపించింది. ఈ స్థాయిలో ఆడటం, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవగలగడం నా అదృష్టం. నేను విజయం కోసం శాయశక్తులా ప్రయత్నించాను కాబట్టి ఎలాంటి చింత లేదు. ఇప్పుడు అభిమానుల మెసేజ్‌లు నాకు ఊరటనందిస్తున్నాయి. నా భవిష్యత్తు గురించి స్పష్టత ఇవ్వదల్చుకున్నా. ఆటలో ఇంకా కొనసాగుతా. అయితే కొంత విరామం తీసుకుంటాను. నా శరీరానికి, మనసుకు ఇప్పుడు విశ్రాంతి చాలా అవసరం. రాబోయే రోజుల కోసం సరైన ప్రణాళికలు రూపొందించుకుంటా. ఎందుకంటే నేను అమితంగా ఇష్టపడే ఆటలోనే నాకు ఆనందం దక్కుతుంది’ అని సింధు తన మనసులో భావాన్ని వ్యక్తపర్చింది. -
Malaysia Masters 2024: ఫైనల్లో పీవీ సింధు
కౌలాలంపూర్: భారత టాప్ షట్లర్ పూసర్ల వెంకట సింధు ఈ ఏడాది తన తొలి టైటిల్ సాధించేందుకు అడుగు దూరంలో నిలిచింది. బీడబ్ల్యూఎఫ్ సూపర్–500 టోర్నీ మలేసియా మాస్టర్స్‌లో సింధు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్లో సింధు 13–21, 21–16, 21–12 స్కోరుతో బుసానన్ ఆంగ్బమ్రున్పన్ (థాయిలాండ్)పై విజయం సాధించింది. తన కెరీర్లో ఐదేళ్ల క్రితం ఒకే ఒక సారి బుసానన్ చేతిలో ఓడిన సింధుకు ఇది ఆమెపై 18వ గెలుపు కావడం విశేషం. వరల్డ్ నంబర్ 20 బుసానన్ తొలి గేమ్‌లో ఆధిక్యం ప్రదర్శించి ముందంజ వేసింది. అయితే వెంటనే కోలుకున్న సింధు ర్యాలీలతో చెలరేగి గేమ్‌ను గెలుచుకుంది. మూడో గేమ్‌లో సింధు తన స్థాయిలో సత్తా చాటింది. 8–3తో ఆధిక్యంలోకి వెళ్లిన తర్వాత ఆమెకు తిరుగులేకుండా పోయింది. అదే జోరును కొనసాగిస్తూ 17–10తో దూసుకుపోయిన సింధు వరుస పాయింట్లతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో వరల్డ్ నంబర్ 7 వాంగ్ జి యీ (చైనా)తో సింధు తలపడుతుంది. -
సింధు ఇక డిప్యూటీ కలెక్టర్!
-
సింధు ఇక డిప్యూటీ కలెక్టర్!
సాక్షి, అమరావతి: అంతా అనుకున్నట్లు జరిగితే... బ్యాడ్మింటన్ సంచలనం, తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు భవిష్యత్‌లో ఐఏఎస్ అధికారిణి కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆఫర్ చేసిన డిప్యూటీ కలెక్టర్ (గ్రూప్–1) ఉద్యోగానికి సింధు అంగీకరించడంతో... యూపీఎస్సీ నిబంధనల ప్రకారం ఆమె మరో ఎనిమిది, తొమ్మిదేళ్లలో కన్ ఫర్డ్ ఐఏఎస్ అవుతుంది. రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సింధును ఏపీ సీఏం చంద్రబాబు విజయవాడలో సత్కరించిన సమయంలో రూ. 3 కోట్ల నజరానాతో పాటు ఏపీ కొత్త రాజధాని అమరావతిలో స్థిరపడేందుకు 1000 గజాల స్థలం ఇచ్చారు. ఉన్నత ఉద్యోగాన్ని కూడా అప్పట్లోనే ఆమెకు ఆఫర్ చేశారు. ఇటీవలే అమరావతిలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంట్‌కు హాజరైన సందర్భంగా... ఏపీ ప్రభుత్వ ఆఫర్‌కు తన సమ్మతిని తెలియజేస్తూ సింధు ప్రభుత్వానికి లేఖ ఇచ్చిందని ఆమె తల్లి విజయ వెల్లడించారు. ప్రస్తుతం సింధు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌లో డిప్యూటీ మేనేజర్ (స్పోర్ట్స్)గా వ్యవహరిస్తోంది. రియో నుంచి వచ్చిన ఆమెకు ఏపీ సర్కారు కంటే ముందే తెలంగాణ ప్రభుత్వం అపూర్వ స్వాగతం పలికింది. రూ. 5 కోట్ల నజరానాతో పాటు హైదరాబాద్‌లో 1000 గజాల నివాస స్థలాన్ని ఇచ్చింది. తెలంగాణ సీఏం కేసీఆర్ ఉన్నత ఉద్యోగం ఆఫర్ చేసినప్పటికీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇచ్చే గ్రూప్–1 పోస్ట్‌కు అంగీకారం తెలిపింది. -
సాధించాల్సింది చాలా ఉంది!
‘సాక్షి’కి ప్రత్యేకం ⇒ ఇది ఆరంభం మాత్రమే ⇒ వచ్చే ఏడాది ఇంకా బాగా ఆడతా ⇒ పీవీ సింధు మనోగతం సాక్షి, హైదరాబాద్: పూసర్ల వెంకట సింధు... 19 ఏళ్ల వయసులోనే బ్యాడ్మింటన్ ప్రపంచంలో ఇప్పటికే తనదైన ముద్ర వేసింది. వరుసగా రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యాలు సాధించిన ఆమె ఆటతీరు ప్రతి ఏటా మరింత మెరుగుపడుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మరింత నిలకడగా ఆమె ఫలితాలు సాధించింది. తాజాగా మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ గెలిచిన సింధు, తన కెరీర్ గురించి పలు అంశాలను ‘సాక్షి’తో పంచుకుంది. విశేషాలు ఆమె మాటల్లోనే... మకావు విజయం: టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగాను. మకావులో మళ్లీ విజేతగా నిలవడం సంతోషకరం. గత ఏడాది ఇదే టోర్నీ గెలుచుకోవడానికి, దీనికి పోలిక లేదు. పోటీ, ప్రత్యర్థులు అంతా మారిపోయారు. నా శ్రమకు తగిన ఫలితం లభించింది. దీనికి ముందు కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి. అయితే గెలుపుతో ఏడాది ముగించగలిగాను. 2014లో ప్రదర్శన: కచ్చితంగా గత సంవత్సరంతో పోలిస్తే నా ఆట మెరుగు కావడంతో పాటు, గుర్తుంచుకోదగ్గ విజయాలు దక్కాయి. కామన్వెల్త్, ఆసియా క్రీడలు, ఉబెర్ కప్‌లో పతకాలు...వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యంతో పాటు ఇప్పుడు మకావు గ్రాండ్ ప్రి గోల్డ్ గెలిచాను. కాబట్టి మొత్తంగా చూస్తే ఈ సంవత్సరం ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉంది. మకావుకు ముందు పరాజయాలు: నిజమే, మంచి విజయాలతో పాటు ఈ సారి నేను కొన్ని ఓటములు కూడా ఎదుర్కొన్నాను. అయితే ఆటలో ప్రతీ రోజు ఒకేలా ఉండదు. కొన్ని సార్లు మననుంచి అద్భుతమైన ప్రదర్శన వస్తుంది. మరికొన్ని సార్లు ఏమీ ఆడకుండా చేతులెత్తేస్తాం. కానీ ఒక టోర్నీ గెలవాలంటే ఆ రోజు అత్యుత్తమంగా ఆడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంతకంటే బాగా ఆడితే బాగుండేది అనిపిస్తుంది. అయితే ఇది నిరంతర ప్రక్రియ. కష్టపడటం కొనసాగించాలి. ఫలితాలు వాటంతట అవే వస్తాయి. కోచింగ్‌పై ప్రత్యేక ప్రణాళికలు: ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కోచ్ గోపీచంద్ కారణం. ఆయనకు నా కృతజ్ఞతలు. నేనే కాదు చాలా మంది ఇతర ప్లేయర్లకు కూడా గోపీ సర్ వల్లే గుర్తింపు దక్కింది. చిన్న చిన్న లోపాలు ఏవైనా ఉంటే సరిదిద్దుకోవడం తప్ప ఇప్పటి వరకైతే కోచింగ్ విషయంలో ప్రత్యేక ప్రణాళికలు ఏమీ లేవు. ఆయన నాకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారు. దీనిని కొనసాగిస్తే చాలు. వచ్చే ఏడాది టోర్నీలు: సరిగ్గా ఏయే టోర్నీల్లో బరిలోకి దిగుతానో ఇంకా నిర్ణయించలేదు. దానిని కోచ్ నిర్ణయిస్తారు. నేను నా ప్రాక్టీస్‌పైనే దృష్టి పెట్టాను. అయితే ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఏడాది కూడా కాబట్టి కచ్చితంగా కీలక సంవత్సరంగా చెప్పగలను. రియోలో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నా. మరిన్ని సూపర్ సిరీస్ టోర్నీలలో గెలవాలని కోరుకుంటున్నా. కానీ దాని కోసం ఒత్తిడి పెంచుకోను. నా వయసు ఇంకా 19 ఏళ్లే. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. అయితే కొత్త ఏడాదిలో నా ఆట ఇంకా మెరుగవుతుందని నమ్ముతున్నా. కొత్త పాయింట్ల పద్ధతి: ప్రస్తుతం దీనిని గ్రాండ్ ప్రి ఈవెంట్లలోనే అమలు చేస్తున్నారు. మేం ఇంకా ఆ పద్ధతిలో ఆడలేదు. అయితే ప్రత్యేకంగా ఇదీ కారణం అని చెప్పలేకపోయినా... నా దృష్టిలో 21 పాయింట్ల పద్ధతే బాగుంటుంది. భవిష్యత్తులో స్కోరింగ్ పద్ధతిలో ఇంకా ఏమైనా మార్పులు వస్తాయేమో చూడాలి. -
సంచలనాల సింధు!
పూసర్ల వెంకట సింధు.. ఈ ఏడాది భారత్ బ్యాడ్మింటన్‌లో దూసుకుపోయిన తార. సంచలన విజయాలతో ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తనదైన ముద్ర వేసింది ఈ రైజింగ్ స్టార్. నిలకడైన ఆటతీరుతో విజయాలు సాధిస్తూ 2013 సంవత్సరాన్ని ప్రత్యేకంగా మలుచుకుంది ఈ 18 ఏళ్ల తెలుగు తేజం. భారత్‌లో బ్యాడ్మింటన్‌కు చిరునామాగా మారిన హైదరాబాద్‌లోనే పుట్టిన సింధు చిరుప్రాయంలోనే వరల్డ్ టైటిల్స్ నెగ్గి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది సింధు సాధించిన విజయాల్లో ప్రాధానంగా చెప్పుకోదగ్గది ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం. ప్రకాశ్ పదుకొనే తర్వాత వ్యక్తిగత విభాగంలో మెడల్ గెలిచిన భారత క్రీడాకారిణిగా ఆమె ఘనత సాధించింది. దీంతో పాటు గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలలో రెండు స్వర్ణాలు పతకాలు నెగ్గింది. మలేసియా ఓపెన్, మకావు ఓపెన్ టైటిల్స్ గెలిచి సత్తా చాటింది. జాతీయస్థాయి సీనియర్ టైటిల్ రెండోసారి సొంతం చేసుకుని తన హవా కొనసాగింది. సింధుకు 2103 బాగానే కలిసివచ్చిందని చెప్పాలి. ఈ ఏడాదే కేంద్ర క్రీడాపురస్కారం ‘అర్జున అవార్డు’ పొందింది. ఐపీఎల్ తరహాలో బ్యాడ్మింటన్‌లో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లోనూ తన టీమ్‌ను ఫైనల్ వరకూ తీసుకొచ్చింది. ఈ ఏడాది సైనా నెహ్వాల్ కంటే మెరుగ్గా రాణించిన భారత బ్యాడ్మింటన్ యువతార పి.వి.సింధుతో ఒప్పందం చేసుకునేందుకు విఖ్యాత క్రీడాసామాగ్రి తయారీ సంస్థలు పోటీపడుతున్నాయి. 2014లోనూ ఈ జోరు కొనసాగించాలని సింధు పట్టుదలగా ఉంది. -
నిలకడే కీలకం
-
నిలకడే కీలకం
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం... రెండు గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలలో రెండు స్వర్ణాలు... ఏడు నెలల వ్యవధిలో ఒక వర్ధమాన క్రీడాకారిణి ఎదుగుదలకు ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పూసర్ల వెంకట సింధు సాధించిన ఘనతలివి. చక్కటి ఆటతీరుతో విజయాలు సాధిస్తూ సింధు 2013 సంవత్సరాన్ని ప్రత్యేకంగా మలుచుకుంది. సాక్షి, హైదరాబాద్ అంచనాలు పెట్టుకున్న స్టార్ ప్లేయర్ సైనా నిరాశపరచగా... అందరి అంచనాలను తారుమారు చేస్తూ సింధు ఈ ఏడాది అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకుంది.తాజాగా మకావు ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఈ హైదరాబాద్ అమ్మాయి స్వస్థలం చేరిన అనంతరం ‘సాక్షి’తో ముచ్చటించింది. విశేషాలు ఆమె మాటల్లోనే... ఈ ఏడాది ప్రదర్శన... చాలా బాగుంది. మలేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్‌తో పాటు మకావులో కూడా టైటిల్ సాధించాను. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో కూడా చేరుకోగలిగాను. ఇక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం అయితే మరీ స్పెషల్! ఐబీఎల్లాంటి కొత్త టోర్నీలో ఆడటం కూడా ప్రత్యేక అనుభూతినిచ్చింది. జూనియర్ స్థాయిలో చాలా విజయాలు సాధిస్తూ వచ్చినా సీనియర్ స్థాయి వేరు. వరుస విజయాలతో చాలా సంతోషం కలిగింది. వీటిని కొనసాగించాలని పట్టుదలగా ఉన్నాను. మకావు ఓపెన్ ఫలితం... వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం తర్వాత ఆడిన టోర్నీల్లో సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయాను. ఆ వైఫల్యాలతో కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నా. కానీ మకావులో టాప్‌సీడ్‌గా నా స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చగలిగాను. చైనా ఓపెన్‌కు వెళ్లకుండా గోపీచంద్ సర్ నాతో ప్రాక్టీస్ చేయించారు. అది ఫలితాన్నిచ్చింది. సీజన్ ఆఖరి టోర్నీ కావడంతో కొంత మంది టాప్ ప్లేయర్లు రాకపోయినా పోటీ తక్కువగా ఏమీ లేదు. సెమీస్‌లో చైనా వర్ధమాన క్రీడాకారిణి జిన్‌జింగ్ బాగా ఇబ్బంది పెట్టింది. పోటీలో ఎవరు ఉన్నా లేకపోయినా టైటిల్ గెలవడమనేదే ముఖ్యం. కాబట్టి గెలుపు గెలుపే! ఆటతీరులో నిలకడ... వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10 స్థాయికి చేరుకున్నాక అందరికీ సవాల్ ఎదురవుతుంది. దానిని ఎదుర్కోవడానికి నేను రెడీ. ప్రతి మ్యాచ్, ప్రతి టోర్నీ కోసం భిన్నమైన వ్యూహాలతో సిద్ధం కావాల్సి ఉంటుంది. కొన్నిసార్లు విజయాలు, మరికొన్ని సార్లు పరాజయాలు ఎదురు కావచ్చు. ఈ స్థితిలో ఏదో ఒక గెలుపుతో సరిపెట్టుకోకుండా నిలకడగా ఆడాల్సి ఉంటుంది కూడా. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాను. కోచ్ సూచనలతో ఆటతీరు మెరుగు పర్చుకునే ప్రయత్నంలో ఉన్నాను. మరో ఏడాది, ఏడాదిన్నర సమయాన్ని లక్ష్యంగా పెట్టుకొని గోపీ సర్ నన్ను తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. నేను ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని తెలుసు. ప్రత్యేకంగా ఫలానా అని చెప్పలేకపోయినా... బ్యాడ్మింటన్ ప్రపంచంలో అగ్రశ్రేణి క్రీడాకారిణులందరినీ ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. తదుపరి టోర్నీలపై... ఈ ఏడాది విజయంతో ముగించాను. వచ్చే ఏడాది శుభారంభం చేయాలని భావిస్తున్నా. త్వరలో జరిగే సీనియర్ జాతీయ చాంపియన్‌షిప్‌లో పాల్గొనబోతున్నాను. స్థాయి ఏదైనా నా అత్యుత్తమ ప్రదర్శనను ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. 2014లో కొరియా ఓపెన్‌తో మొదలు పెట్టి ఆ తర్వాత మలేసియా సూపర్ సిరీస్, వివిధ టోర్నీలలో కూడా పాల్గొంటాను. గ్రాండ్ ప్రి గోల్డ్‌లలో విజేతగా నిలిచాను కాబట్టి ఇక సూపర్ సిరీస్‌లలో బాగా ఆడాల్సి ఉంది. సైనాతో పోలిక... ఇది ఊహించిందే. ఆమె నాకు ఆదర్శం. సైనాతో కలిసి అకాడమీలో ఎంతో ప్రాక్టీస్ చేస్తాను. ఎన్నో విషయాలు ఆమె నుంచి నేర్చుకుంటాను కూడా. ఒక గొప్ప ప్లేయర్‌తో నాకు పోలిక తీసుకురావడం వల్ల సమస్య లేదు. భవిష్యత్‌లో ఆమెలాగే మరిన్ని విజయాలు సాధిస్తా. ఈ ఏడాది నాకు ‘ది బెస్ట్’ కాగా... సైనాకు అంతగా కలిసి రాలేదనేది వాస్తవం. అయితే టాప్ ప్లేయర్లు ఇలాంటి దశను దాటి మళ్లీ సత్తా చాటుకోగల సమర్థులు. కాబట్టి వచ్చే సంవత్సరం సైనా మెరుగైన విజయాలు అందుకోవాలని నేనూ కోరుకుంటున్నాను. -
బంగా బీట్స్ బోణి
లక్నో: సింగిల్స్‌లో రాణించడంతో బంగా బీట్స్ (బీబీ) జట్టు ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో బోణీ చేసింది. మరోవైపు అవధ్ వారియర్స్ (ఏడబ్ల్యూ) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పరాజయం చవిచూసింది. భారత రైజింగ్ స్టార్ పి.వి.సింధు, పురుషుల సింగిల్స్‌లో వీ ఫెంగ్ చోంగ్ చేతులెత్తేయడంతో వారియర్లు కోలుకోలేకపోయారు. ఆదివారం లక్నోలో జరిగిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) మ్యాచ్‌లో బంగా బీట్స్ (బీబీ) 4-1తో వారియర్స్‌పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ తొలి పోరులో హూ యున్ (బీబీ) 21-11, 21-20తో వీ ఫెంగ్ చోంగ్ (ఏడబ్ల్యూ)పై గెలిచి బంగా బీట్స్‌కు 1-0 ఆధిక్యాన్నిచ్చాడు. తర్వాత జరిగిన మహిళల సింగిల్స్ బరిలోకి దిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత, అవధ్ స్టార్ ప్లేయర్ సింధు 16-21, 13-21తో ప్రపంచ 19వ ర్యాంకు క్రీడాకారిణి కరోలినా మారిన్ (బీబీ) చేతిలో పరాజయం చవిచూసింది. రెండు గేముల్లోనూ ఏపీ రైజింగ్ స్టార్ చేతులెత్తేసింది. తనకన్నా తక్కువ ర్యాంకు ప్రత్యర్థి దూకుడుకు ఏ దశలోనూ కళ్లెం వేయలేకపోయింది. ఈ టోర్నీలో పదో ర్యాంకర్ సింధుకిది వరుసగా రెండో పరాజయం. దీంతో బీబీ ఆధిక్యం 2-0కు పెరిగింది. అనంతరం జరిగిన పురుషుల డబుల్స్‌లో వారియర్స్ జోడి మథియస్ బోయె-కైడో మార్కిస్ జట్టుకు తొలి విజయాన్ని అందించారు. వీరిద్దరు చక్కని సమన్వయంతో రాణించడంతో 21-14, 21-19తో మోగెన్సన్-అక్షయ్ దివాల్కర్ (బీబీ)పై గెలుపొందారు. దీంతో అవధ్ జట్టు 1-2తో బీబీ ఆధిక్యాన్ని తగ్గించింది. ఆ తర్వాత ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్లు పారుపల్లి కశ్యప్ (బీబీ), శ్రీకాంత్ (ఏడబ్ల్యూ)ల మధ్య పురుషుల సింగిల్స్ రెండో మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. ఇందులో సీనియర్ ఆటగాడు, 14వ ర్యాంకర్ కశ్యప్ 20-21, 21-11, 11-9తో శ్రీకాంత్‌పై చెమటోడ్చి నెగ్గాడు. తొలిగేమ్‌లో శ్రీకాంత్ స్మాష్‌లతో రెచ్చిపోగా... రెండో గేమ్‌లో పుంజుకున్న కశ్యప్ తన రాష్ట్ర సహచరుడికి ఏమాత్రం అవకాశమివ్వకుండా చెలరేగాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ 5-1తో ఆధిక్యంలోకి వెళ్లి విజయంపై ఆశలు రేకెత్తించాడు. అయితే కశ్యప్ తన అనుభవాన్ని రంగరించి పోరాడాడు. వరస పాయింట్లు సాధించి స్కోరును సమం చేయడంతో పాటు చివర్లో మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. ఇక నామమాత్రమైన మిక్స్డ్ డబుల్స్‌లో కైడో మార్కిస్- మనీషా (ఏడబ్ల్యూ) జంట 21-20, 16-21, 8-11తో కార్స్టన్-మారిన్ (బీబీ) ద్వయం చేతిలో ఓడింది.