ఆటలో కొనసాగుతానని సింధు స్పష్టీకరణ
పారిస్: భారత్ తరఫున వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలిచే లక్ష్యంతో బరిలోకి దిగిన బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు దురదృష్టవశాత్తూ ఆ ఘనతను అందుకోలేకపోయింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధు పారిస్ ఒలింపిక్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో తన భవిష్యత్తు ఆలోచనల గురించి సింధు వెల్లడించింది. తాజా ఓటమితో చాలా బాధపడుతున్నానన్న ఆమె... మరో చర్చకు తావు లేకుండా ఆటలో కొనసాగుతానని స్పష్టం చేసింది.
అయితే శారీరకంగా, మానసికంగా కాస్త విరామం కోరుకుంటున్నానని పేర్కొంది. 29 ఏళ్ల సింధు ఒలింపిక్స్ పరాజయం తర్వాత సోషల్ మీడియా ద్వారా తన స్పందనను తెలియజేసింది. ‘పారిస్ ప్రయాణం చాలా గొప్పగా సాగింది. కానీ ఓటమి బాధించింది. ఈ పరాజయం నా జీవితంలో చాలా కఠినమైంది. దీని నుంచి కోలుకునేందుకు సమయం పడుతుంది. అయితే జీవితం ఆగిపోదు. మళ్లీ కొనసాగాల్సిందే. పారిస్‌కు అర్హత సాధించే క్రమంలో ఎంతో పోరాడాను.
గత రెండేళ్లు గాయాలతో ఎక్కువ సమయం ఆటకు దూరమయ్యాను. ఈ సవాళ్లను అధిగమించి నా దేశం తరఫున మూడో ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం రావడం గొప్పగా అనిపించింది. ఈ స్థాయిలో ఆడటం, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవగలగడం నా అదృష్టం. నేను విజయం కోసం శాయశక్తులా ప్రయత్నించాను కాబట్టి ఎలాంటి చింత లేదు. ఇప్పుడు అభిమానుల మెసేజ్‌లు నాకు ఊరటనందిస్తున్నాయి. నా భవిష్యత్తు గురించి స్పష్టత ఇవ్వదల్చుకున్నా.
ఆటలో ఇంకా కొనసాగుతా. అయితే కొంత విరామం తీసుకుంటాను. నా శరీరానికి, మనసుకు ఇప్పుడు విశ్రాంతి చాలా అవసరం. రాబోయే రోజుల కోసం సరైన ప్రణాళికలు రూపొందించుకుంటా. ఎందుకంటే నేను అమితంగా ఇష్టపడే ఆటలోనే నాకు ఆనందం దక్కుతుంది’ అని సింధు తన మనసులో భావాన్ని వ్యక్తపర్చింది.
Comments
Please login to add a commentAdd a comment