సంచలనాల సింధు!
పూసర్ల వెంకట సింధు.. ఈ ఏడాది భారత్ బ్యాడ్మింటన్లో దూసుకుపోయిన తార. సంచలన విజయాలతో ప్రపంచ బ్యాడ్మింటన్లో తనదైన ముద్ర వేసింది ఈ రైజింగ్ స్టార్. నిలకడైన ఆటతీరుతో విజయాలు సాధిస్తూ 2013 సంవత్సరాన్ని ప్రత్యేకంగా మలుచుకుంది ఈ 18 ఏళ్ల తెలుగు తేజం. భారత్లో బ్యాడ్మింటన్కు చిరునామాగా మారిన హైదరాబాద్లోనే పుట్టిన సింధు చిరుప్రాయంలోనే వరల్డ్ టైటిల్స్ నెగ్గి రికార్డు సృష్టించింది.
ఈ ఏడాది సింధు సాధించిన విజయాల్లో ప్రాధానంగా చెప్పుకోదగ్గది ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం. ప్రకాశ్ పదుకొనే తర్వాత వ్యక్తిగత విభాగంలో మెడల్ గెలిచిన భారత క్రీడాకారిణిగా ఆమె ఘనత సాధించింది. దీంతో పాటు గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలలో రెండు స్వర్ణాలు పతకాలు నెగ్గింది. మలేసియా ఓపెన్, మకావు ఓపెన్ టైటిల్స్ గెలిచి సత్తా చాటింది. జాతీయస్థాయి సీనియర్ టైటిల్ రెండోసారి సొంతం చేసుకుని తన హవా కొనసాగింది.
సింధుకు 2103 బాగానే కలిసివచ్చిందని చెప్పాలి. ఈ ఏడాదే కేంద్ర క్రీడాపురస్కారం ‘అర్జున అవార్డు’ పొందింది. ఐపీఎల్ తరహాలో బ్యాడ్మింటన్‌లో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లోనూ తన టీమ్‌ను ఫైనల్ వరకూ తీసుకొచ్చింది. ఈ ఏడాది సైనా నెహ్వాల్ కంటే మెరుగ్గా రాణించిన భారత బ్యాడ్మింటన్ యువతార పి.వి.సింధుతో ఒప్పందం చేసుకునేందుకు విఖ్యాత క్రీడాసామాగ్రి తయారీ సంస్థలు పోటీపడుతున్నాయి. 2014లోనూ ఈ జోరు కొనసాగించాలని సింధు పట్టుదలగా ఉంది.