![PV Sindhu Injured Out Of Badminton Asia Mixed Team Championships](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/pv.jpg.webp?itok=qlXxEDe6)
ఆసియా మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత పతకావకాశాలకు దెబ్బ పడింది. భారత స్టార్ షట్లర్, ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు(PV Sindhu) కండరాల గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి వైదొలిగింది.
క్రితంసారి 2023లో దుబాయ్(Dubai)లో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో సింధు సభ్యురాలిగా ఉన్న భారత జట్టు కాంస్య పతకాన్ని(Bronze Medal) సాధించింది. గువాహటిలో ఈనెల నాలుగో తేదీన మొదలైన జాతీయ శిక్షణ శిబిరం సందర్భంగా సింధు ప్రాక్టీస్ సమయంలో గాయపడింది.
ఎంఆర్‌ఐ స్కాన్ తీయగా సింధు కండరాల గాయం నుంచి కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పడుతుందని తేలింది. దాంతో సింధు ఈ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆసియా మిక్స్‌డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఈనెల 11 నుంచి 15 వరకు చైనాలోని కింగ్‌డావో నగరంలో జరుగుతుంది.
గ్రూప్ ‘డి’లో ఉన్న భారత్ ఈనెల 12న మకావు జట్టుతో, 13న దక్షిణ కొరియా జట్టుతో ఆడుతుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల (పురుషుల, మహిళల సింగిల్స్, పురుషుల, మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్) చొప్పున జరుగుతాయి.
భారత బ్యాడ్మింటన్ జట్టు: లక్ష్య సేన్, ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల, అర్జున్, సతీశ్ కుమార్, మాళవిక బన్సోద్, గాయత్రి గోపీచంద్, ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, ఆద్య.
మ్యాచీ మ్యాచీ
ఇదిలా ఉంటే.. గాయం కారణంగా ఆటకు దూరమైన పీవీ సింధు వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించింది. భర్త వెంకట దత్తసాయితో కలిసి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ చాక్లెట్ కలర్ దుస్తులు ధరించిన ఉన్న ఫొటోను షేర్ చేసిన సింధు.. ‘మ్యాచీ మ్యాచీ’ అంటూ మురిసిపోయింది.
శభాష్ మానస్
న్యూఢిల్లీ: భారత పురుషుల టెన్నిస్ రైజింగ్ స్టార్ మానస్ ధామ్నే తన కెరీర్‌లో తొలి ప్రొఫెషనల్ టైటిల్ సాధించాడు. ట్యూనిషియాలో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఎం15 టోర్నీలో 17 ఏళ్ల మానస్ విజేతగా నిలిచాడు. ఐటీఎఫ్ ర్యాంకింగ్స్‌లో 64వ స్థానంలో ఉన్న ఈ మహారాష్ట్ర కుర్రాడు ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 2–6, 6–0, 6–2తో ఇటలీకి చెందిన లొరెంజో కార్బోనిపై గెలుపొందాడు.
తద్వారా భారత్ నుంచి ఐటీఎఫ్ టైటిల్ నెగ్గిన రెండో అతి పిన్న వయస్కుడిగా మానస్ గుర్తింపు పొందాడు. ఈ రికార్డు యూకీ బాంబ్రీ (16 ఏళ్ల 10 నెలలు; 2009లో న్యూఢిల్లీ ఫ్యూచర్స్ టోర్నీ) పేరిట ఉంది. క్వాలిఫయర్‌గా ట్యూనిషియా ఎం15 టోర్నీలో మెయిన్ ‘డ్రా’లోకి అడుగు పెట్టిన మానస్ వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచి చాంపియన్‌గా అవతరించడం విశేషం. ప్రస్తుత ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ మాజీ కోచ్ రికియార్డో పియాటి వద్ద మానస్ శిక్షణ తీసుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment