Asia Championship
-
Ind vs Pak: పాకిస్తాన్‌ను ఓడించిన భారత్
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత్.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. టోర్నీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో దాయాదిని 2-1తో ఓడించింది. తద్వారా లీగ్ దశలో ఓటమన్నదే లేకుండా.. సెమీస్ వరకు అజేయంగా నిలిచింది. కాగా ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్- పాకిస్తాన్ ఇప్పటికే సెమీ ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే.చిరకాల ప్రత్యర్థిపై మరోసారి పైచేయిటీమిండియా పన్నెండు పాయింట్లతో.. పాక్ ఎనిమిది పాయింట్లతో టాప్-4 బెర్తులను ఖరారు చేసుకున్నాయి. అయితే, లీగ్ దశలో నామమాత్రపు పోరులో దాయాదులు పోటీపడటం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఈ నేపథ్యంలో ఆది నుంచి వరుస విజయాలతో జోరు మీదున్న హర్మన్‌ప్రీత్ సింగ్ సేన.. నామమాత్రపు మ్యాచ్‌లోనూ దుమ్ములేపింది. చిరకాల ప్రత్యర్థిపై 2-1తో పైచేయి సాధించి జయభేరి మోగించింది. ఆదిలో పాక్‌కు ఆధిక్యంచైనాలోని మోకీ వేదికగా శనివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో.. తొలి గోల్ పాక్ కొట్టింది. ఆట ఎనిమిదవ నిమిషంలో అహ్మద్ నదీం తమ జట్టుకు తొలి పాయింట్ అందించాడు. అయితే, భారత జట్టు కెప్టెన్, ఉత్తమ డ్రాగ్ఫికర్లలో ఒకడైన హర్మన్‌ప్రీత్ సింగ్ దాయాదిని పైచేయి సాధించనివ్వలేదు. హర్మన్ చేసెను అద్భుతం మ్యాచ్ తొలి అర్ధభాగంలోనే పెనాల్టీ కార్నర్ ద్వారా రెండు గోల్స్ కొట్టి భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు. మిగిలిన ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించి.. మ్యాచ్ ముగిసే వరకు పాక్‌కు మరో గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా 2-1తో భారత్ గెలుపొందింది.ఇక ఈ టోర్నీలో భారత్ అంతకుముందు చైనాను 3–0తో, జపాన్ను 5–1తో, మలేషియాను 8–1, కొరియాను 3–1తో ఓడించింది. ఇక భారత్‌తో పాటు పాకిస్తాన్, సౌత్ కొరియా సెమీ ఫైనల్ బెర్తులను ఇప్పటికే ఖరారు చేసుకున్నాయి. మలేషియా, చైనాలలో ఏదో ఒక జట్టు వీటితో పాటు సెమీస్‌లో నిలిచే అవకాశం ఉంది.చదవండి: టెన్నిస్ టోర్నమెంట్.. హెలికాప్టర్లలో స్టేడియానికిCaptain Harmanpreet gets us 🔙 in the game 🔥Harmanpreet led the Indian attack from the front with 2️⃣ beautiful penalty corner conversions which gave the #MenInBlue a well-deserved lead 💪Watch the intense clash LIVE on #SonyLIV 📲 pic.twitter.com/VINOMUPqbR— Sony LIV (@SonyLIV) September 14, 2024 -
భారత జట్టు ప్రకటన.. చైనాతో తొలి మ్యాచ్
ప్యారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన తర్వాత భారత పురుషుల హాకీ జట్టు మరో టోర్నీకి సిద్ధమైంది. సెప్టెంబరు 8 నుంచి 17 వరకు చైనాలో జరిగే ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో పాల్గొనే 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వం వహిస్తాడు. వివేక్ సాగర్ ప్రసాద్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.కృషన్ బహదూర్ పాఠక్‌కు అవకాశంఇక దిగ్గజ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో... చాలా కాలం నుంచి భారత జట్టుకు స్టాండ్‌బై గోల్‌కీపర్‌గా వ్యవహరిస్తున్న కృషన్ బహదూర్ పాఠక్ ఇప్పుడు ప్రధాన గోల్‌కీపర్‌గా జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. మరో గోల్‌కీపర్ సూరజ్ కర్కేరా రిజర్వ్‌గా ఉంటాడు. 2018 నుంచి సీనియర్ జట్టులో గోల్‌కీపర్‌గా ఉన్న కృషన్ ఇప్పటి వరకు 125 మ్యాచ్‌లు ఆడాడు.డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్‌కాగా 2016లో జూనియర్ ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన భారత జట్టుకు గోల్‌కీపర్‌గా ఉన్న కృషన్... రెండుసార్లు ఆసియా క్రీడల్లో, రెండుసార్లు ప్రపంచకప్‌లో, రెండుసార్లు ఆసియా క్రీడల్లో పాల్గొన్నాడు. ఇక డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత్ పోటీపడనుండగా... దక్షిణ కొరియా, మలేసియా, పాకిస్తాన్, జపాన్, చైనా జట్లు కూడా టైటిల్ కోసం తలపడతాయి.ప్యారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో సభ్యులుగా ఉన్న హార్దిక్ సింగ్, మన్దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, షంషేర్ సింగ్, గుర్జంత్ సింగ్‌లకు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ నుంచి విశ్రాంతి ఇచ్చారు. భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబరు 8న చైనాతో ఆడుతుంది. ఆ తర్వాత 9న జపాన్‌తో... 11న మలేసియాతో... 12న దక్షిణ కొరియాతో తలపడుతుంది. ఒకరోజు విశ్రాంతి తర్వాత సెపె్టంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ ఆడుతుంది. సెమీఫైనల్స్ 16న, ఫైనల్ 17న నిర్వహిస్తారు.భారత పురుషుల హాకీ జట్టు: కృషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కేరా (గోల్‌కీపర్లు), హర్మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), వివేక్ సాగర్ ప్రసాద్ (కెప్టెన్), జర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, జుగ్రాజ్ సింగ్, సంజయ్, సుమిత్, రాజ్‌కుమార్ పాల్, నీలకంఠ శర్మ, మన్‌ప్రీత్ సింగ్, మొహమ్మద్ రాహీల్ మౌసీన్, అభిషేక్, సుఖ్జీత్ సింగ్, అరిజిత్ సింగ్, ఉత్తమ్‌సింగ్, గుర్జోత్ సింగ్. -
చరిత్ర సృష్టించిన భారత్
భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌ను తొలిసారి కైవసం చేసుకుంది. మలేసియా వేదికగా ఇవాళ (ఫిబ్రవరి 18) జరిగిన ఫైనల్లో (సింగిల్స్) పీవీ సింధు, అన్మోల్ ఖర్బ్ అద్భుత ప్రదర్శనతో భారత్ 3-2తో థాయ్‌లాండ్‌ను ఓడించింది. ఈ కాంటినెంటల్ టోర్నీలో భారత్ టైటిల్ గెలవడం ఇదే తొలిసారి. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌ల్లో (బెస్ట్ ఆఫ్ 5) సింధు, అన్మోల్తో పాటు గాయత్రి గోపీచంద్-జాలీ ట్రీసా జోడీ (డబుల్స్) విజయాలు సాధించారు. గాయం నుంచి కోలుకున్న అనంతరం తన మొదటి టోర్నీలో పాల్గొన్న సింధు.. ఫైనల్లో థాయ్ షట్లర్ సుపనిందా కతేథాంగ్‌ను కేవలం 39 నిమిషాల్లో 21-12, 21-12 తేడాతో ఓడించి భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. ఆతర్వాత మూడు గేమ్‌ల పోరులో (21-16, 18-21, 21-16) గాయత్రి గోపీచంద్, జాలీ ట్రీసా జోడీ.. జోంగ్‌కోల్‌ఫామ్ కిటితారాకుల్, రవ్వింద ప్రజోంగ్‌జల్‌లను ఓడించడంతో భారత్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం మూడు (అస్మిత చాలిహ), నాలుగు మ్యాచ్‌ల్లో (డబుల్స్) ఓటమి చవిచూసిన భారత్.. నిర్ణయాత్మకమైన మ్యాచ్‌లో గెలుపొంది, టైటిల్‌ను కైవసం చేసుకుంది. రసవత్తరంగా సాగిన ఆఖరి మ్యాచ్‌లో 16 ఏళ్ల అన్మోల్ (472వ ర్యాంకర్).. ప్రపంచ 45వ ర్యాంకర్ పోర్న్‌పిచా చోయికీవాంగ్‌పై వరుస గేమ్‌లలో విజయం సాధించి, భారత జట్టు చారిత్రక గెలుపు భాగమైంది. -
క్వార్టర్ ఫైనల్లో సింధు
దుబాయ్: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మూడో పతకానికి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు విజయం దూరంలో నిలిచింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–12, 21–15తో తొమ్మిదో ర్యాంకర్ హాన్ యువె (చైనా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. హాన్ యువెపై సింధుకిది నాలుగో విజయం కావడం విశేషం. 2014, 2022లలో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు నెగ్గిన సింధు నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా)తో ఆడుతుంది. గతంలో ఆన్ సె యంగ్‌తో ఆడిన ఐదుసార్లూ సింధు ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 21–16, 5–21, 21–18తో చికో ఔరా ద్వి వర్దాయో (ఇండోనేసియా)పై నెగ్గగా... కిడాంబి శ్రీకాంత్ 14–21, 22–20, 9–21తో కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్‌లో సియో సెయుంగ్ జే–చె యు జంగ్ (దక్షిణ కొరియా) జోడీ నుంచి సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జంటకు వాకోవర్ లభించడంతో క్వార్టర్ ఫైనల్ చేరింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–13, 21–11తో జిన్ యోంగ్–నా సంగ్ సెంగ్ (కొరియా) జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట గాయం కారణంగా బరిలోకి దిగకుండా ప్రత్యర్థి జోడీకి వాకోవర్ ఇచ్చింది. చదవండి: IPL 2023: అందుకే ఆ పని పనిచేశా.. అతడు మాకు దొరికిన విలువైన ఆస్తి: శాంసన్ -
భారత పురుషుల స్క్వాష్ టీమ్ కొత్త చరిత్ర
భారత పురుషుల స్క్వాష్ టీమ్ చరిత్ర సృష్టించింది. ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో తొలిసారి పసిడి పతకం సాధించింది. కువైట్‌తో జరిగిన ఫైనల్లో భారత ఆటగాళ్లు రమిత్ తాండన్, సౌరవ్ ఘోషల్ దుమ్మురేపారు. తొలి మ్యాచ్‌లో అలీ అర్మామెజితో తలపడిన రమిత్ తాండన్ 11-5, 11-7, 11-4 తేడాతో విజయం సాధించి భారత్‌కు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో సౌరవ్ ఘోషల్ అమ్మర్ అల్టమిమిపై 11-9, 11-2, 11-3తో గెలిచాడు. మిత్, సౌరవ్ ఇద్దరూ రెండు మ్యాచుల్లో గెలవడంతో...భారత్ విజయం ఖాయమైంది. దీంతో అభయ్ సింగ్ ఫలా మహమ్మద్ తో తలపడాల్సి మ్యాచ్‌ను నిర్వాహకులు రద్దు చేశారు. అప్పటికే రెండు వరుస విజయాలు నమోదు చేసిన భారత పురుషుల జట్టు 2-0 తేడాతో కువైట్‌ను మట్టికరిపించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. కాగా గతంలో ఈ టోర్నీలో భారత్ రెండుసార్లు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైన గోల్డ్ మెడల్‌ను సాధించాలని మెన్స్ టీమ్ కసితో బరిలోకి దిగింది. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో విజయమే టార్గెట్ బరిలోకి దిగి గెలుపొందింది. తొలుత ఖతర్, పాకిస్తాన్, కువైట్, సౌత్ కొరియా, చైనీస్ తైపీ జట్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచులన్నింట్లో 3-0తో విజయం సాధించి పూల్-ఏ అగ్రస్థానంలో నిలిచింది. సెమీస్ లో మలేషియాపై 2-1తో గెలిచి ఫైనల్ చేరింది. కాగా ఇదే చాంపియన్‌షిప్ భారత మహిళల స్క్వాష్ బృందం క్యాంస్యం పతకం గెలుచుకుంది. -
ఇక ఉబెర్ కప్ టోర్నీపై దృష్టి: పీవీ సింధు
ఆసియా చాంపియన్‌షిప్ సెమీఫైనల్లో పెనాల్టీ పాయింట్ వివాదం కూడా తన ఓటమికి ఒక కారణమని భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అభిప్రాయపడింది. ఇక తన దృష్టంతా ఈనెల 8 నుంచి జరిగే ఉబెర్ కప్ టోర్నీపై ఉందని తెలిపింది. సమయానికి విమానం అందుకోవాలనే కారణంతో సింధు పతకాల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేదని.. అంతే తప్ప సెమీఫైనల్ ఉదంతంపై నిరసన వ్యక్తం చేయడానికి కాదని సింధు తండ్రి పీవీ రమణ తెలిపారు. ఈ విషయమై నిర్వాహకులకు సింధు సమాచారం ఇచ్చిందని ఆయన అన్నారు. చదవండి: PV Sindhu: 'ఇది చాలా అన్యాయం'.. అంపైర్‌పై పీవీ సింధు ఆగ్రహం -
పంకజ్ అద్వానీ ఖాతాలో ఎనిమిదో ఆసియా టైటిల్
దోహా: భారత మేటి క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) ప్లేయర్ పంకజ్ అద్వానీ ఎనిమిదోసారి ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌గా నిలిచాడు. శనివారం జరిగిన ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ ఫైనల్లో 36 ఏళ్ల పంకజ్ 6–2 (101–66, 100–0, 101–29, 44–100, 104–90, 101–21, 88–100, 101–78) ఫ్రేమ్‌ల తేడాతో భారత్‌కే చెందిన ధ్రువ్ సిత్వాలాపై గెలుపొందాడు. 2005, 2008, 2009, 2010, 2012, 2017, 2018లలో కూడా పంకజ్ ఆసియా బిలియర్డ్స్ టైటిల్‌ను సాధించాడు. -
జమ్మికుంట క్రీడాకారుడికి బంగారు పతకం
Asia Youth Sports CHampionship 2021: Jammikunta Prashanth Wins Gold: జమ్మికుంట పట్టణంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన పాతకాల ప్రశాంత్ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. హైదరాబాద్ నాంపల్లి పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ నేపాల్‌లోని పోక్రాలో నవంబర్ 22 నుంచి 25 వరకు నిర్వహించిన ఆసియా యూత్ స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ 2021లో పాల్గొన్నాడు. 3000 మీటర్ల రన్నింగ్‌లో సీనియర్ కేటగిరిలో బంగారు పతకం సాధించాడు. జాతీయ స్థాయిలో కరీంనగర్ జిల్లా, జమ్మికుంట పట్టణానికి ఖ్యాతి తీ సుకువచ్చాడని ప్రశాంత్‌ను జమ్మికుంట పోలీసులు, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, కేశవపూర్ గ్రామస్తులు అభినందించారు. చదవండి: Krunal Pandya: కృనాల్ పాండ్యా కీలక నిర్ణయం... తప్పుకొంటున్నా.. అయితే.. -
మనిక బాత్రాకు షాకిచ్చిన టీటీఎఫ్ఐ
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) స్టార్ ప్లేయర్ మనిక బాత్రాకు ఊహించని షాకిచ్చింది. భారత జట్టు నుంచి తప్పించింది. దోహాలో ఈ నెల 28 నుంచి జరగాల్సిన ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ కోసం ప్రకటించిన భారత జట్టులో అమెను ఎంపిక చేయలేదు. సోనెపట్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన జాతీయ శిక్షణ శిబిరానికి గైర్హాజరు కావడం వల్లే ఆమెపై వేటు వేసినట్లు టీటీఎఫ్ఐ వర్గాలు తెలిపాయి. 56వ ప్రపంచ ర్యాంకర్ మనికను తప్పించడంతో 97వ ర్యాంకర్ సుతీర్థ ముఖర్జీ మహిళల జట్టును నడిపించనుంది. ఈ జట్టులో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ, ఐహిక ముఖర్జీ (131వ ర్యాంకు), అర్చన కామత్ (132వ ర్యాంకు) ఉన్నారు. పురుషుల జట్టులో వెటరన్ శరత్ కమల్ (33వ రాం్యకర్), సత్యన్ (38), హరీ్మత్ దేశాయ్ (72), మానవ్ ఠక్కర్ (134), సానిల్ శెట్టి (247) ఎంపికయ్యారు. -
ఇషాకు 2 స్వర్ణాలు
దోహా: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. జూనియర్ విభాగంలో ఇషా సింగ్, వివాన్ కపూర్లు చెరో రెండు పసిడి పతకాలతో చెలరేగారు. గురువారం జరిగిన జూనియర్ పురుషుల ట్రాప్ ఈవెంట్లో 45 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచిన వివాన్ బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. 42 పాయింట్లతో బోవ్నీశ్ మెన్దిరట్ట రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించాడు. జూనియర్ పురుషుల ట్రాప్ ఈవెంట్ టీం విభాగంలో బరిలో దిగిన వివాన్, బోవ్నీశ్, మానవాదిత్య సింగ్‌లతో కూడిన భారత జట్టు తొలి స్థానంలో నిలిచి స్వర్ణాన్ని గెలిచారు. జూనియర్ మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ విభాగంలో బరిలో దిగిన ఇషా సింగ్ 242.2 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది. భారత్‌కే చెందిన ప్రియా రాఘవ 217.6 పాయింట్లతో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. ఇక టీమ్ విభాగంలో బరిలో దిగిన ఈశా, ప్రియా, యువిక తోమర్ 1721 పాయింట్లతో ప్రపంచ జూనియర్ రికార్డు, ఆసియా రికార్డు నెలకొల్పి పసిడి పతకాన్ని భారత్ ఖాతాలో వేశారు. -
ప్రియమైన భారత్... ఇది నా జట్టు...
న్యూఢిల్లీ: ‘ఫిఫా’ 2022 ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ టోర్నీ రెండో రౌండ్ మ్యాచ్‌లో ఖతర్‌ను నిలువరించడం పట్ల భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. దోహాలో మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ 0–0తో డ్రాగా ముగిసింది. భారత్‌కు ఒక పాయింట్ లభించింది. జ్వరం కారణంగా ఛెత్రి ఈ మ్యాచ్ ఆడకున్నా మన జట్టు స్ఫూర్తిదాయక ప్రదర్శనతో మెరుగైన, ఆసియా చాంపియన్ ఖతర్‌ను నిలువరించింది. దీనిపై ఛెత్రి స్పందిస్తూ... ‘ప్రియమైన భారత్, ఇది నా జట్టు, వీళ్లు నా కుర్రాళ్లు. గర్వకారణ ఈ క్షణాలను మాటల్లో వరి్ణంచలేను. పాయింట్ల పట్టిక ప్రకారం ఇది పెద్ద ఫలితం కాకపోవచ్చు. పోరాటంలో దేనికీ తీసిపోదు. జట్టు, కోచింగ్ సిబ్బందిదే ఈ ఘనతంతా’ అని ట్వీట్ చేశాడు. ఖతర్‌తో మ్యాచ్‌లో భారత్‌కు గోల్ కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధు సారథ్యం వహించాడు. ప్రత్యర్థి గోల్ ప్రయత్నాలను అతడు సమర్థంగా అడ్డుకున్నాడు. కోచ్ ఇగర్ స్టిమాక్ సైతం ఈ ఫలితంతో పట్టరాని సంతోషంతో ఉన్నాడు. తదుపరి మ్యాచ్‌ల్లోనూ ఇలాగే ఆడాలని కుర్రాళ్లకు సూచించాడు. -
ఆసియా చెస్ బ్లిట్జ్ చాంపియన్ నిహాల్
జింగ్‌తాయ్ (చైనా): భారత యువ గ్రాండ్‌మాస్టర్ నిహాల్ సరీన్ ఆసియా చెస్ చాంపియన్‌షిప్‌లో బ్లిట్జ్ విభాగంలో టైటిల్ సాధించాడు. శనివారం ముగిసిన ఈ టోర్నమెంట్లో నిహాల్ ఎనిమిది పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 14 ఏళ్ల నిహాల్ ఏడు గేముల్లో గెలిచి, రెండింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. భారత్‌కే చెందిన ఎస్.ఎల్.నారాయణన్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకోగా... తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ 6.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. మరోవైపు క్లాసిక్ విభాగం ఓపెన్ కేటగిరీలో భారత గ్రాండ్‌మాస్టర్స్ కార్తికేయ మురళి, సేతురామన్ వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. కార్తికేయ, సేతురామన్తోపాటు నారాయణన్ కూడా వరల్డ్ కప్ చెస్ టోర్నమెంట్‌కు అర్హత పొందారు. -
53 ఏళ్ల తర్వాత స్వర్ణ పతకం
జకార్తా: ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత యువ సంచలనం లక్ష్య సేన్ విజేతగా అవతరించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో లక్ష్యసేన్ 21-19, 21-18 తేడాతో టాప్‌సీడ్ కున్లవుత్ వితిద్సరన్ (థాయ్‌లాండ్)పైవిజయం సాధించి చాంపియన్‌గా నిలిచాడు. ఏకపక్షంగా సాగిన పోరులో లక్ష్యసేన్ కడవరకూ పోరాడి గెలిచాడు. 46 నిమిషాల పాటు జరిగిన పోరులో లక్ష్యసేన్.. కున్‌లవుత్‌ను మట్టికరిపించి ఐదు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో భారత జట్టు చివరిసారి 1965లో పసిడి పతకాన్ని గెలిచింది. 53 ఏళ్ల క్రితం గౌతమ్ థక్కర్ ఈ కేటగిరీలో స్వర్ణాన్ని గెలవగా, సుదీర్ఘ కాలం తర్వాత లక్ష్య సేన్ ఆ ఘనతను సాధించి రికార్డు పుస్తకాల్లోకికెక్కాడు. కాగా, ఓవరాల్‌గా ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పసిడి గెలిచిన మూడో భారత్ ప్లేయర్‌గా లక్ష్య సేన్ నిలిచాడు. 2012లో జరిగిన చాంపియన్‌షిప్ పీవీ సింధు స్వర్ణ పతకాన్ని గెలిచింది. -
టైటిల్ పోరుకు లక్ష్య సేన్
జకార్తా: ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత యువ సంచలనం లక్ష్య సేన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో శనివారం జరిగిన సెమీఫైనల్లో ఆరోసీడ్ లక్ష్య సేన్ 21–7, 21–14తో రెండో సీడ్ లియోనార్డో ఇమాన్యూయేల్ రామ్బే (ఇండోనేసియా)పై వరుస సెట్లలో గెలిచి తుదిపోరుకు అర్హత సాధించాడు. 40 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో దూకుడైన ఆటతీరుతో రెచ్చిపోయిన లక్ష్య సేన్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తొలి గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేసిన రామ్బే రెండో గేమ్‌లో పోరాట పటిమ కనబర్చినా లక్ష్య సేన్ దాడుల ముందు అది నిలువలేదు. నేడు జరుగనున్న ఫైనల్లో టాప్‌సీడ్ కున్లవుత్ వితిద్సరన్ (ఇండోనేసియా)తో లక్ష్య సేన్ తలపడనున్నాడు. మరో సెమీస్‌లో కున్లవుత్ 21–14, 21–12తో యూపెంగ్ బై (చైనా)పై గెలిచి తుదిపోరుకు చేరాడు. ‘ఫైనల్ చేరడం సంతోషంగా ఉంది. నా ఆటతీరుతో సంతృప్తిగా ఉన్నా. ఫైనల్లో ఇదే జోరు కొనసాగిస్తా. టాప్‌సీడ్‌తో ఆడే సమయంలో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేందుకు కృషిచేస్తా’ అని సెమీస్ మ్యాచ్ అనంతరం లక్ష్య సేన్ అన్నాడు. -
‘పసిడి’ పోరుకు మేరీకోమ్, సోనియా
హో చి మిన్ సిటీ (వియత్నాం): గతంలో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన భారత మేటి మహిళా బాక్సర్ మేరీకోమ్ ఇదే ఘనతను ఆసియా స్థాయిలోనూ పునరావృతం చేసేందుకు విజయం దూరంలో నిలిచింది. ఇక్కడ జరుగుతున్న ఆసియా సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మేరీకోమ్ (48 కేజీలు)తోపాటు సోనియా లాథెర్ (57 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లారు. అయితే సరితా దేవి (64 కేజీలు), ప్రియాంక (60 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), సీమా పునియా (ప్లస్ 81 కేజీలు), శిక్ష (54 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. ఒలింపిక్స్ కోసమని గతంలో 51 కేజీల విభాగానికి మారిన మేరీకోమ్ ఇటీవలే తన పాత వెయిట్ కేటగిరీ 48 కేజీలకు మారింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో 34 ఏళ్ల మేరీకోమ్ 5–0తో సుబాసా కొమురా (జపాన్)పై ఏకపక్ష విజయాన్ని సాధించింది. బుధవారం జరిగే ఫైనల్లో కిమ్ హ్యాంగ్ మి (ఉత్తర కొరియా)తో మేరీకోమ్ తలపడుతుంది. ఆరోసారి ఆసియా చాంపియన్‌షిప్ ఫైనల్లోకి ప్రవేశించిన మేరీకోమ్ నాలుగుసార్లు స్వర్ణ పతకాలు సాధించి, మరోసారి రజతం గెలిచింది. మరో సెమీఫైనల్లో యోగ్దోరాయ్ మిర్జయెవా (ఉజ్బెకిస్తాన్)పై సోనియా గెలిచి యిన్ జున్హువా (చైనా)తో బుధవారం జరిగే ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఇతర సెమీఫైనల్స్‌లో డూ డాన్ (చైనా) చేతిలో సరితా దేవి; లిన్ యు టింగ్ (చైనీస్ తైపీ) చేతిలో శిక్ష; యోన్జీ (కొరియా) చేతిలో ప్రియాంక; ఖల్జోవా (కజకిస్తాన్) చేతిలో లవ్లీనా; ఇస్మతోవా (కజకిస్తాన్) చేతిలో సీమా పునియా ఓడారు. -
ఢాకాలో విజయ ఢంకా
చాలా రోజుల తర్వాత భారత హాకీ జట్టు అదరగొట్టే ప్రదర్శన చేసింది. ఆద్యంతం తమ ప్రత్యర్థులపై ఆధిపత్యం చలాయించింది. ఆరంభం నుంచి అంతిమ సమరందాకా తమ జోరును కొనసాగించింది. పదేళ్ల తర్వాత మళ్లీ ఆసియా చాంపియన్‌గా అవతరించింది. కొత్త కోచ్ మరీన్ జోర్డ్ ఆధ్వర్యంలో ఒక్క ఓటమి కూడా లేకుండా ఈ టోర్నీని అజేయంగా ముగించింది. తొలిసారి ఫైనల్‌కు చేరిన మలేసియాను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా ఆడిన భారత్ అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ముచ్చటగా మూడోసారి ఆసియా కప్‌ను ముద్దాడింది. ఢాకా: టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్ తమపై పెట్టుకున్న అంచనాలను నిజం చేసింది. ఆద్యంతం అద్భుత ఆటతీరును కనబరిచిన టీమిండియా మూడోసారి ఆసియా చాంపియన్‌గా నిలిచింది. సీనియర్ పురుషుల హాకీ ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత్ 2–1 గోల్స్ తేడాతో మలేసియాను ఓడించింది. దశాబ్దకాల ఎదురుచూపులకు తెర దించింది. టోర్నీలో అజేయంగా నిలిచి సగర్వంగా ట్రోఫీని హస్తగతం చేసుకుంది. ఎనిమిదోసారి ఆసియా కప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్ 2003, 2007, 2017లలో విజేతగా నిలిచి... 1982, 1985, 1989, 1994, 2013లలో రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో భారత్ తరఫున రమణ్‌దీప్ సింగ్ (3వ నిమిషంలో), లలిత్ ఉపాధ్యాయ్ (29వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... మలేసియా జట్టుకు షాహ్రిల్ సాబా (50వ నిమిషంలో) ఏకైక గోల్‌ను అందించాడు. మరోవైపు కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు 6–3 తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. ఆది నుంచి దూకుడు... గత జూన్‌లో వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో మలేసియా చేతిలో అనూహ్య ఓటమితో సెమీఫైనల్ దశకు అర్హత పొందలేకపోయిన భారత్... ఈ టోర్నీలో మాత్రం ఆ జట్టును తేలిగ్గా తీసుకోలేదు. సూపర్–4 దశలో 6–2తో మలేసియాను చిత్తు చేసిన టీమిండియా ఫైనల్లోనూ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. మూడో నిమిషంలో ఎస్వీ సునీల్ నుంచి క్రాస్ షాట్‌ను అందుకున్న రమణ్‌దీప్ కొట్టిన షాట్ పోల్‌ను తాకి వెనక్కి వచ్చినా.. వెంటనే అందుకుని నెట్లోకి పంపడంతో భారత్ ఖాతా తెరిచింది. ఆ వెంటనే చిన్‌గ్లెన్‌సనా సింగ్ రివర్స్ షాట్ అతి సమీపం నుంచి వైడ్‌గా వెళ్లడంతో మరో గోల్ మిస్ అయ్యింది. 13వ నిమిషంలో మలేసియాకు పెనాల్టీ కార్నర్ దక్కినా భారత రక్షణశ్రేణి వమ్ము చేసింది. రెండో క్వార్టర్ మరో నిమిషంలో ముగుస్తుందనగా లలిత్ ఉపాధ్యాయ్ జట్టు ఖాతాలో రెండో గోల్‌ను చేర్చాడు. సుమిత్ ఎడమ వైపు నుంచి ఇచ్చిన చక్కటి రివర్స్ షాట్‌ను అందుకున్న లలిత్ ఎలాంటి తప్పిదం లేకుండా గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. నాలుగో క్వార్టర్లో మలేసియా ఒక్కసారిగా చెలరేగింది. గోల్ కోసం తీవ్రంగా చేసిన ప్రయత్నాలు 50వ నిమిషంలో ఫలించాయి. అప్పటికే వారి రెండో పీసీ కూడా వృథా కాగా... అతి సమీపం నుంచి సాబా జట్టుకు గోల్ అందించి ఆధిక్యాన్ని తగ్గించాడు. ఇక చివరి 10 నిమిషాల్లో స్కోరును సమం చేసేందుకు మలేసియా చేసిన ఎదురుదాడికి భారత్ ఆందోళనలో పడింది. ఇదే సమయంలో మలేసియాకు మూడో పీసీ లభించడంతో ఉత్కంఠ పెరిగింది. మ్యాచ్ షూటౌట్‌కు దారి తీస్తుందా అని భావించినా భారత డిఫెన్స్ వారి ఆటలను సాగనీయలేదు. దీంతో భారత్ 2–1 తేడాతో విజయాన్ని ఖాయం చేసుకొని చాంపియన్‌గా నిలిచింది. టోర్నీ అవార్డులు ► మ్యాన్ ఆఫ్ ద ఫైనల్: ఆకాశ్‌దీప్ సింగ్ (భారత్) ► గోల్ ఆఫ్ ద ఫైనల్: లలిత్ ఉపాధ్యాయ్ (భారత్) ► టోర్నీ బెస్ట్ గోల్: హర్మన్‌ప్రీత్ సింగ్ (భారత్) ► ప్రామిసింగ్ ప్లేయర్: అర్షద్ హుస్సేన్ (బంగ్లాదేశ్) ► బెస్ట్ గోల్‌కీపర్: ఆకాశ్ చిక్టే (భారత్) ► టాప్ స్కోరర్స్: హర్మన్‌ప్రీత్ సింగ్ (భారత్–7 గోల్స్), ఫైజల్ సారి (మలేసియా–7 గోల్స్) ► బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ: ఫైజల్ సారి (మలేసియా) తాజా విజయంతో భారత్ ఆసియా హాకీలో జరిగే నాలుగు టోర్నీ టైటిల్స్‌ను తమ ఖాతాలో జమచేసుకుంది. ప్రస్తుతం ఆసియా క్రీడలు (2014), జూనియర్ ఆసియా కప్ (2015) ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (2016), ఆసియా కప్ (2017) టైటిల్స్ భారత్ వద్దే ఉన్నాయి. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌కు హర్మీత్ దేశాయ్
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో అద్భుతంగా రాణించిన భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు హర్మీత్ దేశాయ్ తొలిసారి తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను చేరుకున్నాడు. బుధవారం అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 5 స్థానాలు మెరుగుపరుచుకొని 95వ స్థానంలో నిలిచాడు. మరోవైపు భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు శరత్ కమల్ 54వ స్థానంలో కొనసాగుతుండగా... సౌమ్యజిత్ ఘోష్ ఒక స్థానానికి ఎగబాకి 83వ ర్యాంకుకు చేరుకున్నాడు. దీంతో తొలిసారి భారత్ నుంచి ముగ్గురు క్రీడాకారులు టాప్–100లో చోటు దక్కించుకున్నట్లయింది. మహిళల విభాగంలో మనికా బాత్రా 10 స్థానాలు దిగజారి 103 ర్యాంకుకి పడిపోయింది. యూత్ బాలుర విభాగంలో అర్జున్ ఘోష్ 98వ స్థానంలో ఉన్నాడు. బాలికల విభాగంలో ఐహిక ముఖర్జీ 2 స్థానాలు ఎగబాకి 35వ స్థానాన్ని, అర్చన కామత్ 3 ర్యాంకులు కోల్పోయి 59వ స్థానాన్ని దక్కించుకున్నారు.