ఢాకాలో విజయ ఢంకా | India beat Malaysia 2-1, lift first Hockey Asia Cup title in 10 years | Sakshi
Sakshi News home page

ఢాకాలో విజయ ఢంకా

Published Mon, Oct 23 2017 3:57 AM | Last Updated on Mon, Oct 23 2017 4:19 AM

India beat Malaysia 2-1, lift first Hockey Asia Cup title in 10 years

చాలా రోజుల తర్వాత భారత హాకీ జట్టు అదరగొట్టే ప్రదర్శన చేసింది. ఆద్యంతం తమ ప్రత్యర్థులపై ఆధిపత్యం చలాయించింది. ఆరంభం నుంచి అంతిమ సమరందాకా తమ జోరును కొనసాగించింది. పదేళ్ల తర్వాత మళ్లీ ఆసియా చాంపియన్‌గా అవతరించింది. కొత్త కోచ్‌ మరీన్‌ జోర్డ్‌ ఆధ్వర్యంలో ఒక్క ఓటమి కూడా లేకుండా ఈ టోర్నీని అజేయంగా ముగించింది. తొలిసారి ఫైనల్‌కు చేరిన మలేసియాను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా ఆడిన భారత్‌ అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ముచ్చటగా మూడోసారి ఆసియా కప్‌ను   ముద్దాడింది.

ఢాకా: టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్‌ తమపై పెట్టుకున్న అంచనాలను నిజం చేసింది. ఆద్యంతం అద్భుత ఆటతీరును కనబరిచిన టీమిండియా మూడోసారి ఆసియా చాంపియన్‌గా నిలిచింది. సీనియర్‌ పురుషుల హాకీ ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో మన్‌ప్రీత్‌ సింగ్‌ నాయకత్వంలోని భారత్‌ 2–1 గోల్స్‌ తేడాతో మలేసియాను ఓడించింది. దశాబ్దకాల ఎదురుచూపులకు తెర దించింది. టోర్నీలో అజేయంగా నిలిచి సగర్వంగా ట్రోఫీని హస్తగతం చేసుకుంది.

ఎనిమిదోసారి ఆసియా కప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్‌ 2003, 2007, 2017లలో విజేతగా నిలిచి... 1982, 1985, 1989, 1994, 2013లలో రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో భారత్‌ తరఫున రమణ్‌దీప్‌ సింగ్‌ (3వ నిమిషంలో), లలిత్‌ ఉపాధ్యాయ్‌ (29వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేయగా... మలేసియా జట్టుకు షాహ్రిల్‌ సాబా (50వ నిమిషంలో) ఏకైక గోల్‌ను అందించాడు. మరోవైపు కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ జట్టు 6–3 తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది.

ఆది నుంచి దూకుడు...
గత జూన్‌లో వరల్డ్‌ హాకీ లీగ్‌ సెమీఫైనల్స్‌ టోర్నీలో మలేసియా చేతిలో అనూహ్య ఓటమితో సెమీఫైనల్‌ దశకు అర్హత పొందలేకపోయిన భారత్‌... ఈ టోర్నీలో మాత్రం ఆ జట్టును తేలిగ్గా తీసుకోలేదు. సూపర్‌–4 దశలో 6–2తో మలేసియాను చిత్తు చేసిన టీమిండియా ఫైనల్లోనూ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. మూడో నిమిషంలో ఎస్‌వీ సునీల్‌ నుంచి క్రాస్‌ షాట్‌ను అందుకున్న రమణ్‌దీప్‌ కొట్టిన షాట్‌ పోల్‌ను తాకి వెనక్కి వచ్చినా.. వెంటనే అందుకుని నెట్‌లోకి పంపడంతో భారత్‌ ఖాతా తెరిచింది.

ఆ వెంటనే చిన్‌గ్లెన్‌సనా సింగ్‌ రివర్స్‌ షాట్‌ అతి సమీపం నుంచి వైడ్‌గా వెళ్లడంతో మరో గోల్‌ మిస్‌ అయ్యింది. 13వ నిమిషంలో మలేసియాకు పెనాల్టీ కార్నర్‌ దక్కినా భారత రక్షణశ్రేణి వమ్ము చేసింది. రెండో క్వార్టర్‌ మరో నిమిషంలో ముగుస్తుందనగా లలిత్‌ ఉపాధ్యాయ్‌ జట్టు ఖాతాలో రెండో గోల్‌ను చేర్చాడు. సుమిత్‌ ఎడమ వైపు నుంచి ఇచ్చిన చక్కటి రివర్స్‌ షాట్‌ను అందుకున్న లలిత్‌ ఎలాంటి తప్పిదం లేకుండా గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. నాలుగో క్వార్టర్‌లో మలేసియా ఒక్కసారిగా చెలరేగింది.

గోల్‌ కోసం తీవ్రంగా చేసిన ప్రయత్నాలు 50వ నిమిషంలో ఫలించాయి. అప్పటికే వారి రెండో పీసీ కూడా వృథా కాగా... అతి సమీపం నుంచి సాబా జట్టుకు గోల్‌ అందించి ఆధిక్యాన్ని తగ్గించాడు. ఇక చివరి 10 నిమిషాల్లో స్కోరును సమం చేసేందుకు మలేసియా చేసిన ఎదురుదాడికి భారత్‌ ఆందోళనలో పడింది. ఇదే సమయంలో మలేసియాకు మూడో పీసీ లభించడంతో ఉత్కంఠ పెరిగింది. మ్యాచ్‌ షూటౌట్‌కు దారి తీస్తుందా అని భావించినా భారత డిఫెన్స్‌ వారి ఆటలను సాగనీయలేదు. దీంతో భారత్‌ 2–1 తేడాతో విజయాన్ని ఖాయం చేసుకొని చాంపియన్‌గా నిలిచింది.    

టోర్నీ అవార్డులు
► మ్యాన్‌ ఆఫ్‌ ద ఫైనల్‌: ఆకాశ్‌దీప్‌ సింగ్‌ (భారత్‌)
► గోల్‌ ఆఫ్‌ ద ఫైనల్‌: లలిత్‌ ఉపాధ్యాయ్‌ (భారత్‌)
► టోర్నీ బెస్ట్‌ గోల్‌: హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (భారత్‌)
► ప్రామిసింగ్‌ ప్లేయర్‌: అర్షద్‌ హుస్సేన్‌ (బంగ్లాదేశ్‌)
►  బెస్ట్‌ గోల్‌కీపర్‌: ఆకాశ్‌ చిక్టే (భారత్‌)
► టాప్‌ స్కోరర్స్‌: హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (భారత్‌–7 గోల్స్‌), ఫైజల్‌ సారి (మలేసియా–7 గోల్స్‌)
► బెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ: ఫైజల్‌ సారి (మలేసియా)


తాజా విజయంతో భారత్‌ ఆసియా హాకీలో జరిగే నాలుగు టోర్నీ టైటిల్స్‌ను తమ ఖాతాలో జమచేసుకుంది. ప్రస్తుతం ఆసియా క్రీడలు (2014), జూనియర్‌ ఆసియా కప్‌ (2015) ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ (2016), ఆసియా కప్‌ (2017) టైటిల్స్‌ భారత్‌ వద్దే ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement