
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచకప్ తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో భారత అమ్మాయిల జట్టు 20 పరుగుల తేడాతో వెస్టిండీస్ మహిళల జట్టుపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(40 బంతుల్లో 52; 5 ఫోర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకోగా... యస్తిక భాటియా (24; ఒక ఫోర్, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించింది.
వెస్టిండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ నాలుగు వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. చీనిల్ హెన్రీ (48 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించింది. భారత బౌలర్లలో పూజ వస్త్రకర్ 3, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. రెండో వార్మప్ మ్యాచ్‌లో మంగళవారం దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో భారత జట్టు తలపడనుంది. గురువారం నుంచి మహిళల ప్రపంచకప్ ప్రధాన టోర్నీ ప్రారంభం కానుంది.