
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తూ, పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తమ బ్యాటింగ్ విభాగాన్ని పటిష్ట పరచుకునే పనిలో పడింది. ఇప్పటికే గాయపడిన కెప్టెన్ రుతురాజ్ స్థానాన్ని ముంబై యువ సంచలనం ఆయుశ్ మాత్రేతో భర్తీ చేసిన సీఎస్‌కే యాజమాన్యం తాజాగా మరో గాయపడిన ఆటగాడికి రీప్లేస్‌మెంట్‌ను ప్రకటించింది.
లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన గుర్జప్నీత్ సింగ్ ఈ సీజన్ ఆరంభ దశలో గాయపడగా.. తాజాగా అతని స్థానాన్ని సౌతాఫ్రికా చిచ్చరపిడుగు, బేబీ ఏబీడీగా పిలువబడే డెవాల్డ్ బ్రెవిస్‌తో భర్తీ చేసింది. బ్రెవిస్ ఈ సీజన్ మెగా వేలంలో 75 లక్షల బేస్ ధర విభాగంలో తన పేరు నమోదు చేసుకున్నప్పటికీ.. సీఎస్‌కే మేనేజ్‌మెంట్ అతనికి బంపరాఫర్ ఇచ్చి ఏకంగా రూ. 2.2 కోట్లకు డీల్ సైన్ చేసుకుంది.
వాస్తవానికి ఈ సీజన్‌లో సీఎస్‌కేకు ఓ ఓవర్సీస్ బెర్త్ ఖాళీగా ఉంది. ఎవరికీ రీప్లేస్‌మెంట్‌గా కాకుండానే బ్రెవిస్‌ను ఎంపిక చేసుకునే అవకాశం ఆ జట్టుకు ఉండింది. అయినా ఎందుకో వేచి చూసే ధోరణిని అవళంభించి గుర్జప్నీత్‌కు ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసుకుంది. విధ్వంసకర వీరుడిగా పేరు తెచ్చుకున్న బ్రెవిస్‌ను ఈ సీజన్ మెగా వేలంలో ఎందుకో ఏ జట్టు ఎంపిక చేసుకోలేదు. బ్రెవిస్ గతంలో ముంబై ఇండియన్స్‌కు ఆడాడు.
సౌతాఫ్రికా టీ20 లీగ్, మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీల్లోనూ అతను ముంబై సిస్టర్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 21 ఏళ్ల బ్రెవిస్ సౌతాఫ్రికా తరఫున కేవలం రెండు మ్యాచ్‌లే ఆడినప్పటికీ.. అతన్ని ఆ దేశ దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌తో పోలుస్తారు. బ్రెవిస్ ఓవరాల్‌గా 81 టీ20లు ఆడి 145 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేశాడు. బ్రెవిస్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. సౌతాఫ్రికా దేశవాలీ సీజన్‌లో ఫార్మాట్లకతీతంగా అదరగొట్టాడు.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ బ్రెవిస్ మంచి ప్రదర్శనలు చేశాడు. బ్రెవిస్ ఫామ్ కష్టాల్లో ఉన్న సీఎస్‌కేను గట్టెక్కిస్తుందేమో చూడాలి. సీఎస్‌కే తమ తదుపరి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టబోతుంది. ఈ మ్యాచ్ వాంఖడే వేదికగా ఏప్రిల్ 20న జరుగనుంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి ఆతర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడింది.
తాజా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే మళ్లీ గెలుపు గుర్రం ఎక్కింది. ఈ సీజన్‌లో సీఎస్‌కే ఏడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు మాత్రమే సాధించి, నాలుగు పాయింట్లతో అట్టడుగు స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో సీఎస్‌కే బ్యాటింగ్ విభాగంలో చాలా బలహీనంగా కనిపిస్తుంది. రుతురాజ్ వైదొలగడంతో ఆ జట్టు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.
ఆయుశ్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్ చేరికతో సీఎస్‌కే బ్యాటింగ్ కష్టాలు తీరుతాయేమో చూడాలి. ఈ సీజన్‌లో సీఎస్‌కే బౌలింగ్‌లో పర్వాలేదనిపిస్తుంది. రుతరాజ్ గైర్హాజరీలో సీఎస్‌కే కెప్టెన్‌గా ధోని వ్యవహరిస్తున్నాడు. లక్నోపై గెలుపులో ధోని కీలకపాత్ర పోషించాడు. సీఎస్‌కే బౌలర్లలో నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా, ఖలీల్ అహ్మద్, పతిరణ అద్భుతంగా రాణిస్తున్నారు.