IPL 2025: నేటి (ఏప్రిల్‌ 18) మ్యాచ్‌కు వర్షం ముప్పు | IPL 2025: Rain May Spoil Sport Todays RCB VS PBKS Match At Bengaluru | Sakshi
Sakshi News home page

IPL 2025: నేటి (ఏప్రిల్‌ 18) మ్యాచ్‌కు వర్షం ముప్పు

Apr 18 2025 6:07 PM | Updated on Apr 18 2025 6:32 PM

IPL 2025: Rain May Spoil Sport Todays RCB VS PBKS Match At Bengaluru

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌ 2025లో ఇవాళ (ఏప్రిల్‌ 18) ఆర్సీబీ, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ హెం గ్రౌండ్‌ చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తుంది. సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం కవర్లతో కప్పి ఉంది. వర్షం పడే సూచనలు ఉన్నప్పుడే ఇలా చేస్తారు. 

స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. మ్యాచ్‌ జరిగే సమయానికి 22 శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ మ్యాచ్‌ పూర్తిగా రద్దయ్యే ప్రమాదమేమీ లేనప్పటికీ పాక్షికంగా బ్రేకులు పడే ఛాన్స్‌ ఉంది.

ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీకి హోం గ్రౌండ్‌లో ఇది మూడో మ్యాచ్‌. ఇక్కడ ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ ఓడింది. ఈ సీజన్‌లో ఆర్సీబీ ప్రత్యర్థి ఇలాకాల్లో ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ గెలిచింది. ఈ సీజన్‌లో ఆర్సీబీ తమ సొంత మైదానంలో గుజరాత్‌, ఢిల్లీ చేతుల్లో ఓడింది. 

ఆర్సీబీ ఈ సీజన్‌లో కేకేఆర్‌, సీఎస్‌కే, ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ను వారి సొంత ఇలాకాల్లో ఓడించింది. ప్రస్తుతం ఆర్సీబీ 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో (+0.672) ఉంది. 

పంజాబ్‌ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుత సీజన్‌లో గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుంది. పంజాబ్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి నాలుగో స్థానంలో (+0.172) ఉంది. పంజాబ్‌ ఈ సీజన్‌లో గుజరాత్‌, లక్నో, సీఎస్‌కే, కేకేఆర్‌పై విజయాలు సాధించి, రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ చేతుల్లో పరాజయంపాలైంది. 

పంజాబ్‌.. కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 111 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్‌ చేసుకుని రికార్డుల్లోకెక్కింది. అంతుకుముందు పంజాబ్‌ సన్‌రైజర్స్‌పై 245 పరుగులు చేసినప్పటికీ ఓటమిపాలైంది.

పంజాబ్‌దే స్వల్ప పైచేయి
పంజాబ్‌, ఆర్సీబీ మధ్య హెడ్‌ టు హెడ్‌ రికార్డులను పరిశీలిస్తే పంజాబ్‌దే స్వల్ప పైచేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 33 మ్యాచ్‌ల్లో తలపడగా.. పంజాబ్‌ 17, ఆర్సీబీ 16 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఇరు జట్లు చివరిగా తలపడిన మూడు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ విజయం సాధించింది.

తుది జట్లు (అంచనా)..

ఆర్సీబీ: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్‌), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్, సుయాష్ శర్మ

పంజాబ్‌: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), నేహాల్ వధేరా, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌కీపర్‌), గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైశాఖ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement