గత మెగా టోర్నీ రన్నరప్ భారత్... ఈ టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ పనిపట్టి శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి నుంచి క్లిష్టమైన లక్ష్యమే ఎదురైనా... కీలకమైన ఈ మ్యాచ్‌కు డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన గాయంతో గైర్హాజరైనా... టాపార్డర్ బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో భారత మహిళలు చక్కని విజయం సాధించారు.
కేప్‌టౌన్: భారత్ మహిళల జట్టు ముందున్న లక్ష్యం 150. కానీ 93 పరుగుల వద్ద 14వ ఓవర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (16; 2 ఫోర్లు) అవుటైంది. 16వ ఓవర్లో రిచా ఘోష్‌ను ఎల్బీగా అంపైర్ ప్రకటించింది. భారత్ రివ్యూకెళ్లింది. స్కోరేమో 109/3. విజయానికి 24 బంతుల్లో 41 పరుగులు కావాలి. ఈ దశలో రివ్యూలో బంతి రిచా గ్లౌజ్‌ను తాకినట్లు తేలడంతో బతికిపోయింది. అక్కడి నుంచి టీమిండియా ఆట మారిపోయింది.
కాస్త కఠినమైన సమీకరణాన్ని జెమీమా–రిచా జోడీ 19వ ఓవర్లోనే ముగించింది. దాంతో టి20 ప్రపంచకప్ టోర్నీ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై గెలిచింది. టాస్ గెలిచిన పాక్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. పాకిస్తాన్ 12.1 ఓవర్లలో 68 పరుగులకే కీలకమైన 4 వికెట్లను కోల్పోయిన దశలో కెప్టెన్ బిస్మా మారూఫ్ (55 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు), అయేషా నసీమ్ (25 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు.
వీరిద్దరు అబేధ్యమైన ఐదో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. అనంతరం భారత్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి గెలిచింది. ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్‌కిదే అత్యధిక ఛేదన కావడం విశేషం. ఓవరాల్‌గా టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌కిది ఐదో విజయం. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (38 బంతుల్లో 53 నాటౌట్; 8 ఫోర్లు), రిచా ఘోష్ (20 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు) గెలిపించారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను ఈనెల 15న వెస్టిండీస్‌తో ఆడుతుంది.
గెలిపించిన జెమీమా
ఓపెనింగ్‌లో షఫాలీ వర్మ (25 బంతుల్లో 33; 3 ఫోర్లు) మెరుగ్గానే ఆడినప్పటికీ... యస్తిక భాటియా (17) తక్కువ స్కోరుకే వెనుదిరిగింది. క్రీజులోకి జెమీమా రాగా భారీ షాట్లపై గురిపెట్టిన షఫాలీ... సిద్రా అమీన్ చక్కని క్యాచ్‌కు పెవిలియన్ చేరింది. రెండు బౌండరీలతో ఊపు మీదున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ను నష్రా సంధు బోల్తా కొట్టించింది. దీంతో రిచా ఘోష్ క్రీజులోకి రాగా... 15వ ఓవర్లో జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. కలిసొచ్చిన రివ్యూతో రిచా, మరోవైపు జెమీమా బౌండరీలతో జట్టు విజయాన్ని సులువు చేశారు. జెమీమా బౌండరీతో భారత విజయాన్ని ఖరారు చేసింది.
స్కోరు వివరాలు
పాకిస్తాన్ ఇన్నింగ్స్: మునీబా (స్టంప్డ్) రిచా (బి) రాధ 12; జవేరియా (సి) హర్మన్‌ప్రీత్ (బి) దీప్తి 8; బిస్మా మారూఫ్ (నాటౌట్) 68; నిదా దార్ (సి) రిచా (బి) పూజ 0; సిద్రా అమీన్ (సి) రిచా (బి) రాధ 11; అయేషా (నాటౌట్) 43; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 149.
వికెట్ల పతనం: 1–10, 2–42, 3–43, 4–68.
బౌలింగ్: రేణుక సింగ్ 3–0–24–0, దీప్తి శర్మ 4–0–39–1, రాజేశ్వరి గైక్వాడ్ 4–0–31–0, రాధా యాదవ్ 4–0–21–2, పూజ 4–0–30–1, షఫాలీ వర్మ 1–0–3–0.
భారత్ ఇన్నింగ్స్: యస్తిక (సి) ఫాతిమా (బి) సాదియా 17; షఫాలీ (సి) సిద్రా (బి) నష్రా సంధు 33; జెమీమా (నాటౌట్) 53; హర్మన్‌ప్రీత్ (సి) బిస్మా (బి) నష్రా సంధు 16; రిచా ఘోష్ (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 151.
వికెట్ల పతనం: 1–38, 2–65, 3–93.
బౌలింగ్: ఫాతిమా 4–0–42–0, సాదియా 4–0–25–1, ఐమన్ 3–0–33–0, నిదా దార్ 4–0–36–0, నష్రా సంధు 4–0–15–2.
Comments
Please login to add a commentAdd a comment