India Win
-
తిలక్ తడాఖా.. చెపాక్ టీ20లో భారత్ విజయం
భారత్ ముందున్న లక్ష్యం 166. స్కోరేమో 15 ఓవర్లలో 126/7. అంటే ఈ పాటికే అర్థమై ఉంటుంది. మిగిలిందల్లా టెయిలెండర్లే అని! గెలుపు కష్టమని!! కానీ వారితో పాటు ఒకడు మిగిలాడు. అతడే తెలుగు తేజం నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ. 30 బంతుల్లో 40 పరుగులు... ఇది గెలుపు సమీకరణం. సరిజోడు లేకపోయినా, బ్యాటింగ్ చేయగలిగే ఆటగాడు కరువైనా... వెన్నుచూపలేదు. ఇంగ్లండ్ బౌలింగ్‌కు తమ సహచరుల్లా తలొంచలేదు. ఆర్చర్ 16వ ఓవర్లో 0, 6, 6, 1, 4, 2లతో 19 పరుగులొచ్చాయి. ఇందులో 2 సిక్స్‌లు, 1 పరుగు తిలకే చేశాడు.ఇక 24 బంతుల్లో 21 పరుగులు కావాలి. ఇది భారత్‌ను ఊరించింది. కానీ ఆదిల్ రషీద్ 17వ ఓవర్లో 1 పరుగిచ్చి అర్ష్‌దీప్‌ను అవుట్ చేయడంతో మళ్లీ టెన్షన్... టెన్షన్... అప్పుడు రవి బిష్ణోయ్ (5 బంతుల్లో 9 నాటౌట్; 2 ఫోర్లు) ఆపద్భాంధవుడిలా వచ్చాడు. అతనిది సింగిల్ డిజిట్ స్కోరే కావొచ్చు. కానీ తిలక్‌తో అమూల్యమైన, అబేధ్యమైన విజయానికి ఆ పరుగులు, ఆ భాగస్వామ్యమే (తొమ్మిదో వికెట్‌కు 20 పరుగులు) టీమిండియాను గెలిపించింది. సిరీస్‌లో 2–0తో పైచేయి సాధించేలా చేసింది. చెన్నై: ఓపెనర్ల దూకుడు లేదు. సూర్యకుమార్ యాదవ్ జోరు కనిపించలేదు. హార్దిక్ పాండ్యా అనుభవం కలిసిరాలేదు. కానీ... ఇన్ని ప్రతికూలతల మధ్య భారత్ రెండో టి20లో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో నిలిచింది. కారణం ఒకేఒక్కడు తిలక్ వర్మ. అసలు ఆశలే లేని చోట... స్పెషలిస్టు బ్యాటర్లే కరువైన వేళ... పరుగుల వేటలో గెలుపుబాట పరిచాడు. 20వ ఓవర్ రెండో బంతికి బౌండరీతో విన్నింగ్షాట్ కొట్టేదాకా క్రీజులో కడదాకా నిలిచి భారత్‌ను గట్టెక్కించాడు. ఆఖరిదాకా విజయం కోసం పట్టుబిగించిన ఇంగ్లండ్ చివరకు 2 వికెట్ల తేడాతో భారత్ చేతిలో పరాజయం పాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కెపె్టన్ జోస్ బట్లర్ (30 బంతుల్లో 45; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), బ్రైడన్ కార్స్ (17 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించారు. అక్షర్, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 19.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తిలక్ వర్మ (55 బంతుల్లో 72 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. వాషింగ్టన్ సుందర్ (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. మెరిపించిన బట్లర్, కార్స్ ఆరంభంలోనే ఓపెనింగ్ జోడీ సాల్ట్ (4)ను అర్ష్‌దీప్, డకెట్ (3)ను సుందర్ పెవిలియన్ చేర్చారు. సొంత ప్రేక్షకుల మధ్య తొలి ఓవర్ (ఇన్నింగ్స్ 4వ) వేసేందుకు దిగిన సుందర్ తొలి బంతికే డకెట్‌ను బోల్తాకొట్టించాడు. హ్యారీ బ్రూక్ (13), లివింగ్‌స్టోన్ (13)లను వరుణ్, అక్షర్ కుదురుకోనివ్వలేదు. చెప్పుకోదగిన భాగస్వామ్యం లేకపోయినా... ధాటైన ఇన్నింగ్స్ ఏ ఒక్కరు ఆడలేకపోయినా... ఇంగ్లండ్ ఆఖరుకొచ్చే సరికి పుంజుకుంది. కెపె్టన్ బట్లర్ మెరుపులతో స్కోరు మోస్తరుగా సాగిపోగా... అరంగేట్రం హీరో జేమీ స్మిత్ (12 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కార్స్‌ల వేగంతో స్కోరు వేగం పెరిగింది. అర్ష్‌దీప్, పాండ్యా, సుందర్, అభిషేక్‌లకు తలా ఒక వికెట్ దక్కింది. తిలక్... అంతా తానై... ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లాగే మనకూ మంచి ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు అభిషేక్ (12)కు మార్క్ వుడ్, సామ్సన్ (5)కు ఆర్చర్ చెక్ పెట్టారు. తిలక్ వర్మ అడపాదడపా మెరుపులతో భారత్ స్కోరు 50 దాటింది. కానీ ఈ దశలో కెపె్టన్ సూర్యకుమార్ (12), ధ్రువ్ జురేల్ (4), హార్దిక్ పాండ్యా (7)లు స్వల్పవ్యవధిలో అదికూడా 10 ఓవర్లలోపే అవుటవడం భారత్ ఇన్నింగ్స్‌కు పెద్దకుదుపు... 9.1 ఓవర్లు 78/5 స్కోరు! గెలుపు చాలా దూరంలో ఉంటే మిగిలిన స్పెషలిస్టు బ్యాటర్ తిలక్ వర్మ ఒక్కడే! సుందర్, అక్షర్ పటేల్ (2) బ్యాటింగ్ చేయగలరు కానీ గెలిపించేదాకా నిలుస్తారా అన్న సందేహాలు భారత శిబిరాన్ని, స్టేడియంలోని ప్రేక్షకుల్ని కలవరపెట్టాయి. ఊహించినట్లే వారిద్దరు కలవరపెట్టే నిష్క్రమించారు. ఈ దశలో తిలక్‌వర్మ గెలిచేదాకా బాధ్యతను భుజానవేసుకొని విజయమాల భారత జట్టు మెడలో వేశాడు.స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) సుందర్ (బి) అర్ష్‌దీప్ 4; డకెట్ (సి) జురేల్ (బి) సుందర్ 3; బట్లర్ (సి) తిలక్ వర్మ (బి) అక్షర్ 45; బ్రూక్ (బి) వరుణ్ 13; లివింగ్‌స్టోన్ (సి) సబ్–హర్షిత్ (బి) అక్షర్ 13; స్మిత్ (సి) తిలక్ వర్మ (బి) అభిõÙక్ 22; ఓవర్టన్ (బి) వరుణ్ 5; కార్స్ (రనౌట్) 31; ఆర్చర్ (నాటౌట్) 12; రషీద్ (సి) సామ్సన్ (బి) పాండ్యా 10; మార్క్ వుడ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–6, 2–26, 3–59, 4–77, 5–90, 6–104, 7–136, 8–137, 9–157. బౌలింగ్: అర్ష్‌దీప్ 4–0–40–1, హార్దిక్ పాండ్యా 2–0–6–1, వాషింగ్టన్ సుందర్ 1–0–9–1, అక్షర్ 4–0–32–2, రవి బిష్ణోయ్ 4–0–27–0, వరుణ్ 4–0–38–2, అభిషేక్ 1–0–12–1. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) కార్స్ (బి) ఆర్చర్ 5; అభిõÙక్ (ఎల్బీ) (బి) వుడ్ 12; తిలక్ వర్మ (నాటౌట్) 72; సూర్యకుమార్ (బి) కార్స్ 12; జురేల్ (సి) సబ్–రేహన్ (బి) కార్స్ 4; పాండ్యా (సి) సాల్ట్ (బి) ఓవర్టన్ 7; సుందర్ (బి) కార్స్ 26; అక్షర్ (సి) డకెట్ (బి) లివింగ్‌స్టోన్ 2; అర్ష్‌దీప్ (సి) ఆర్చర్ (బి) రషీద్ 6; బిష్ణోయ్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–15, 2–19, 3–58, 4–66, 5–78, 6–116, 7–126, 8–146. బౌలింగ్: జోఫ్రా ఆర్చర్ 4–0–60–1, మార్క్ వుడ్ 3–0–28–1, కార్స్ 4–0–29–3, ఆదిల్ రషీద్ 4–0–14–1, ఓవర్టన్ 2.2–0–20–1, లివింగ్‌స్టోన్ 2–0–14–1. -
మహిళల టి20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచకప్ తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో భారత అమ్మాయిల జట్టు 20 పరుగుల తేడాతో వెస్టిండీస్ మహిళల జట్టుపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(40 బంతుల్లో 52; 5 ఫోర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకోగా... యస్తిక భాటియా (24; ఒక ఫోర్, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించింది. వెస్టిండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ నాలుగు వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. చీనిల్ హెన్రీ (48 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించింది. భారత బౌలర్లలో పూజ వస్త్రకర్ 3, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. రెండో వార్మప్ మ్యాచ్‌లో మంగళవారం దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో భారత జట్టు తలపడనుంది. గురువారం నుంచి మహిళల ప్రపంచకప్ ప్రధాన టోర్నీ ప్రారంభం కానుంది. -
వైజాగ్ టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్ సమం
భారీ లక్ష్య ఛేదనలో ‘బజ్‌బాల్’ మంత్రం పని చేయలేదు...దూకుడైన ఆటతో చెలరేగి విజయతీరం చేరాలనుకున్న ఇంగ్లండ్ ఆటలు సాగలేదు...భారత బౌలింగ్ సామర్థ్యం ముందు బ్యాటర్లు తలవంచారు...మన బౌలర్ల ప్రతిభకు తోడు స్వీయతప్పిదాలు పర్యాటక జట్టును దెబ్బ తీశాయి...కీలక సమయాల్లో వికెట్లు తీసిన టీమిండియా నాలుగో రోజే ఇంగ్లండ్‌ను పడగొట్టింది...హైదరాబాద్‌లో ఎదురైన ఓటమికి విశాఖపట్నంలో ప్రతీకారం తీర్చుకుంది. తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సిరీస్‌ను 1–1తో సమం చేసి రాబోయే టెస్టులపై ఆసక్తిని పెంచింది. తొలి ఇన్నింగ్స్‌కంటే మరింత పదునైన బంతులతో చెలరేగిన బుమ్రా ఇంగ్లండ్‌ను ఉక్కిరిబిక్కిరి చేయగా, అశ్విన్ అండగా నిలిచాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉన్నా...పెద్దగా స్పిన్ టర్న్ లేకపోయినా క్రాలీ మినహా ఎవరూ నిలవలేకపోయారు. అద్భుత ఫీల్డింగ్ భారత బలాన్ని రెట్టింపు చేసి విజయానికి బాటలు వేసింది. స్టోక్స్ సేన తాము ఆశించినట్లుగా గెలుపు పక్షాన నిలవలేకపోయినా...నాలుగో ఇన్నింగ్స్‌లో మూడు వందల పరుగులకు చేరువగా వచ్చి గట్టి పోటీనివ్వగలిగామనే సంతృప్తితో ముగించింది. విశాఖ స్పోర్ట్స్: భారత గడ్డపై ఒక విదేశీ జట్టు నాలుగో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకున్న సందర్భాల్లో ఆ టీమ్ సాధించిన అత్యధిక స్కోరు 276 పరుగులు...ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అంతకంటే ఎక్కువ పరుగులే చేసింది. కానీ చివరకు ఆ పోరాటం సరిపోక వందకు పైగా పరుగుల భారీ తేడాతో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. సోమవారం నాలుగో రోజే ముగిసిన రెండో టెస్టులో భారత్ 106 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 67/1తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 69.2 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. జాక్ క్రాలీ (132 బంతుల్లో 73; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలవగా...టామ్ హార్ట్లీ (47 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్), బెన్ ఫోక్స్ (69 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్) చివర్లో ప్రతిఘటించారు. ఈ ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (9/91) మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లతో టెస్టు ఫలితాన్ని శాసించగా, అశ్విన్ 3 వికెట్లు తీశాడు. తాజా ఫలితం తర్వాత ఐదు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. కొంత విరామం తర్వాత ఈ నెల 15నుంచి రాజ్‌కోట్‌లో మూడో టెస్టు జరుగుతుంది. రూట్, స్టోక్స్ విఫలం... ఓపెనర్ క్రాలీతో పాటు నైట్‌వాచ్‌మన్ రేహన్ అహ్మద్ (27 బంతుల్లో 28; 6 ఫోర్లు) కూడా సోమవారం ఉదయం కొద్ది సేపు భారత బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. ఎట్టకేలకు బుమ్రా ఈ జోడీని విడదీసినా ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన ఒలీ పోప్ (23) ఒక్క అక్షర్ బౌలింగ్‌లోనే ఐదు ఫోర్లు బాదాడు. స్లిప్‌లో రోహిత్ సూపర్ క్యాచ్‌కు పోప్ వెనుదిరిగాడు. అయితే చెత్త షాట్‌తో రూట్ భారత్‌కు కీలక వికెట్ ఇచ్చేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ వైపు గుడ్డిగా ఆడబోయిన రూట్ బ్యాక్వర్డ్ పాయింట్లో క్యాచ్ ఇచ్చాడు. దాంతో ఇంగ్లండ్ జోరుకు కళ్లెం పడింది. ఆపై లంచ్ విరామానికి ముందు రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టిన టీమిండియా విజయానికి బాటలు వేసుకుంది. కుల్దీప్ బౌలింగ్‌లో క్రాలీ వికెట్ల ముందు దొరికిపోగా, డీఆర్ఎస్ ఫలితం కాస్త చర్చకు దారి తీసింది. బుమ్రా బంతికి బెయిర్‌స్టో వద్ద జవాబు లేకపోయింది. స్టోక్స్ ఉన్నంత వరకు కాస్త ఆశలు ఉన్నా...అతని రనౌట్‌తో జట్టు ఓటమి దాదాపుగా ఖాయమైంది. సింగిల్ తీసే క్రమంలో స్టోక్స్ బద్ధకంగా కదలగా...అయ్యర్ మెరుపు త్రో అతని ఆటను ముగించింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 396; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 253; భారత్ రెండో ఇన్నింగ్స్ 255; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలీ (ఎల్బీ) (బి) కుల్దీప్ 73; డకెట్ (సి) భరత్ (బి) అశ్విన్ 28; రేహన్ (ఎల్బీ) (బి) అక్షర్ 23; పోప్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 23; రూట్ (సి) అక్షర్ (బి) అశ్విన్ 16; బెయిర్‌స్టో (ఎల్బీ) (బి) బుమ్రా 26; స్టోక్స్ (రనౌట్) 11; ఫోక్స్ (సి) అండ్ (బి) బుమ్రా 36; హార్ట్లీ (బి) బుమ్రా 36; బషీర్ (సి) భరత్ (బి) ముకేశ్ 0; అండర్సన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (69.2 ఓవర్లలో ఆలౌట్) 292. వికెట్ల పతనం: 1–50, 2–95, 3–132, 4–154, 5–194, 6–194, 7–220, 8–275, 9–281, 10–292. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పా యింట్ల పట్టికలో భారత్ ముందుకు దూసుకుపోయింది. ఇప్పటి వరకు ఐదో స్థానంలో ఉన్న భారత్ ఈ గెలుపుతో మూడు స్థానాలు మెరుగుపర్చుకొని రెండో స్థానానికి (52.77 పాయింట్ల శాతం) చేరుకుంది. ఆ్రస్టేలియా అగ్రస్థానంలో (55 పాయింట్ల శాతం) కొనసాగుతోంది. -
IND vs AFG 3rd T20I: రోహిత్ సూపర్... భారత్ ‘డబుల్ సూపర్’...
ఏమా ఉత్కంఠ... ఏమిటా మలుపులు... ఒక టి20 సమరం అభిమానులందరినీ కట్టిపడేసింది. ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో, అదీ అఫ్గానిస్తాన్‌తో పోరు ఏకపక్షం అనుకుంటే నరాలు తెగే పరిస్థితి వచి్చంది. 212 పరుగులు చేశాక భారత్ గెలుపు ఖాయమనిపించి నిశి్చంతగా ఉండగా... అఫ్గానిస్తాన్ మేమేమీ తక్కువ కాదన్నట్లుగా స్కోరు సమం చేసేసింది. ‘సూపర్ ఓవర్’లో ఫలితం తేలుతుందనుకుంటే అక్కడా ఇరు జట్లూ సమమే. చివరకు అంతా రెండో సూపర్‌ను ఆశ్రయించాల్సి వచి్చంది... ఇక్కడ చివరకు పైచేయి సాధించిన టీమిండియా గట్టెక్కింది. తుది ఫలితంతో గెలుపు భారత్‌దే అయినా ఆఖరి వరకు అఫ్గాన్ చూపిన పోరాటపటిమ అసమానం. బెంగళూరు: టి20 ప్రపంచకప్‌కు ముందు తాము ఆడిన ఆఖరి సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల పోరును టీమిండియా 3–0తో సొంతం చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన చివరి టి20లో భారత్ రెండో ‘సూపర్ ఓవర్’లో విజయం సాధించింది. తొలి సూపర్ ఓవర్ ఓవర్లో ఇరు జట్లు 16 పరుగులతో సమంగా నిలిచాయి. రెండో సూపర్ ఓవర్లో ముందుగా భారత్ 11 పరుగులు చేయగా... అఫ్గాన్ 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది. నిబంధనల ప్రకారం ‘సూపర్ ఓవర్’లో రెండు వికెట్లు పడితే ఇన్నింగ్స్ ముగిసినట్టే కావడంతో భారత విజయం ఖరారైంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (69 బంతుల్లో 121 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు) అంతర్జాతీయ టి20ల్లో ఐదో సెంచరీతో చెలరేగగా... రింకూ సింగ్ (39 బంతుల్లో 69 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) మరో మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 95 బంతుల్లోనే అభేద్యంగా 190 పరుగులు జోడించారు. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులు సాధించింది. గుల్బదిన్ (23 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), గుర్బాజ్ (32 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇబ్రహీమ్ జద్రాన్ (41 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. శతక భాగస్వామ్యం... ఫరీద్ వేసిన మూడో బంతిని భారీ షాట్ ఆడబోయి వెనుదిరిగిన యశస్వి... కోహ్లి తొలి బంతికి డకౌట్... అంతా నిశ్శబ్దం... ఫామ్‌లో ఉన్న శివమ్ దూబే కూడా కీపర్‌కు క్యాచ్ ఇవ్వగా, తర్వాతి ఓవర్లో తన తొలి బంతికే సామ్సన్ కూడా సున్నాకే అవుట్! ఐదో ఓవర్ మూడో బంతి ముగిసేసరికి టీమిండియా స్కోరు 21/4... అయితే రోహిత్, రింకూ భాగస్వామ్యం జట్టుకు భారీ స్కోరు అందించింది. 15 ఓవర్లు ముగిసేసరికి 109/4తో స్కోరు మరీ గొప్పగా ఏమీ లేదు. అయితే చివరి ఐదు ఓవర్లలో 22, 13, 10, 22, 36 స్కోర్లతో భారత్ ఏకంగా 103 పరుగులు సాధించింది. 6 ఫోర్లు, 5 సిక్సర్లతో రోహిత్ వీర విధ్వంసం ప్రదర్శించగా... 1 సిక్స్, 4 ఫోర్లతో రింకూ చెలరేగిపోయాడు. 64 బంతుల్లోనే శతకం అందుకొని అంతర్జాతీయ టి20ల్లో ఐదో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రోహిత్ నిలవగా... రింకూ ఖాతాలో రెండో అర్ధ సెంచరీ చేరింది. వీరిద్దరి దెబ్బకు అఫ్గాన్ కుదేలైంది. రోహిత్ తన శైలికి భిన్నంగా ఈసారి కొన్ని వైవిధ్యమైన షాట్లతో అలరించడం విశేషం. కరీమ్ వేసిన చివరి ఓవర్లో తొలి మూడు బంతుల్లో రోహిత్ 4, 6 (నోబాల్), 6 కొట్టగా... చివరి మూడు బంతుల్లో రింకూ 6, 6, 6 బాదాడు. అనంతరం అఫ్గాన్ ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీమ్ 66 బంతుల్లోనే 93 పరుగులు జోడించి తమ జట్టుకు శుభారంభం అందించారు. వీరు వెనుదిరగడంతో పరిస్థితి మారిపోయింది. ఆ తర్వాత గుల్బదిన్, నబీ (16 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కలిసి జట్టుకు విజయానికి చేరువగా తెచ్చారు. విజయం కోసం చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా, అఫ్గాన్ 18 పరుగులు చేయడంతో స్కోరు సమమైంది. రిలీఫ్..! ‘ఏంటి వీరూ... లెగ్‌బై ఇచ్చావా, బ్యాట్‌కు అంత బలంగా బంతి తగిలింది... అసలే ఇక్కడ రెండు సున్నాలు ఉన్నాయి’... తను ఆడిన తొలి బంతి లెగ్‌సైడ్ దిశగా ఆడి బౌండరీని తాకగా, అంపైర్ లెగ్‌బై ఇవ్వడంతో అంపైర్ వీరేందర్ శర్మతో రోహిత్ అన్న మాట ఇది! అతని దృష్టిలో ఆ పరుగులు ఎంత విలువైనవో ఇది చెబుతుంది. నిజంగానే టి20ల్లో చాలా కాలంగా రోహిత్ ఫామ్ బాగా లేదు. వన్డేల్లో అద్భుతంగా ఆడుతున్నా 2022 నుంచి అంతర్జాతీయ టి20ల్లో ఈ మ్యాచ్‌కు ముందు 31 ఇన్నింగ్స్‌లలో అతను 3 అర్ధ సెంచరీలే చేశాడు. ఐపీఎల్లో కూడా అంతంతమాత్రంగానే ఆడాడు. ఇటీవలి పరిణామాలు సహజంగానే అతడిని ఇబ్బంది పెట్టాయి. ముంబై ఇండియన్స్ కెపె్టన్సీ పోవడంతో పాటు టీమిండియా కెపె్టన్సీపై కూడా సందేహాలు వచ్చాయి. అసలు వచ్చే టి20 వరల్డ్ కప్‌లో అతను ఆడతాడా అన్నట్లుగా కూడా చర్చ సాగింది. దానికి తోడు తొలి రెండు మ్యాచ్‌లలో డకౌట్. ఇలాంటి స్థితిలో ఈ ఇన్నింగ్స్ అతని స్థాయిని చూపించింది. అఫ్గాన్ మరీ బలమైన ప్రత్యర్థి కాకపోయినా... ఇక్కడా విఫలమైతే పరిస్థితి ఇంకా జఠిలంగా మారేంది. ఈ నేపథ్యంలో సరైన లెక్కలతో చేసిన సెంచరీ రోహిత్‌కు ఊరటనిచి్చందనడంలో సందేహం లేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) నబీ (బి) ఫరీద్ 4; రోహిత్ (నాటౌట్) 121; కోహ్లి (సి) ఇబ్రహీమ్ (బి) ఫరీద్ 0; దూబే (సి) గుర్బాజ్ (బి) అజ్మతుల్లా 1; సామ్సన్ (సి) నబీ (బి) ఫరీద్ 0; రింకూ (నాటౌట్) 69; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–18, 2–18, 3–21, 4–22. బౌలింగ్: ఫరీద్ 4–0–20–3, అజ్మతుల్లా 4–0–33–1, ఖైస్ 4–0–28–0, సలీమ్ 3–0–43–0, షరాఫుద్దీన్ 2–0–25–0, కరీమ్ 3–0–54–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) సుందర్ (బి) కుల్దీప్ 50; ఇబ్రహీమ్ (స్టంప్డ్) సామ్సన్ (బి) సుందర్ 50; గుల్బదిన్ (నాటౌట్) 55; అజ్మతుల్లా (సి) రవి బిష్ణోయ్ (బి) సుందర్ 0; నబీ (సి) అవేశ్ (బి) సుందర్ 34; కరీమ్ (రనౌట్) 2; నజీబుల్లా (సి) కోహ్లి (బి) అవేశ్ 5; షరాఫుద్దీన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 212. వికెట్ల పతనం: 1–93, 2–107, 3–107, 4–163, 5–167, 6–182. బౌలింగ్: ముకేశ్ 4–0–44–0, అవేశ్ 4–0–55–1, బిష్ణోయ్ 4–0–38–0, సుందర్ 3–0–18–3, దూబే 2–0–25–0, కుల్దీప్ 3–0–31–1. సూపర్ ఓవర్లలో ఇలా... ముకేశ్ వేసిన తొలి సూపర్ ఓవర్లో అఫ్గానిస్తాన్ 1 సిక్స్, 1 ఫోర్‌తో 16 పరుగులు చేసింది. ఛేదన లో రోహిత్ 2 సిక్స్‌లు కొట్టినా చివరకు భారత్ కూడా 16 పరుగులకే పరిమితమైంది. అవసరమైతే చివరి బంతికి వేగంగా పరుగు తీయాల్సి వస్తుందనే ఆలోచనతో రోహిత్ ఐదో బంతి తర్వాత రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగి రింకూను పంపించాడు. అయితే ఆఖరి బంతికి యశస్వి 2 పరుగులు రాబట్టలేకపోయాడు. ఫరీద్ వేసిన రెండో సూపర్ ఓవర్లో రోహిత్ 4, 6తో భారత్ 11 పరుగులు చేసింది. అయితే బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్ తొలి 3 బంతుల్లోనే అఫ్గాన్ 2 వికెట్లు కోల్పోవడంతో భారత్ గెలుపు ఖాయమైంది. -
ODI World Cup 2023: 'అష్ట' దిగ్భంధనం
వన్డే వరల్డ్ కప్‌లో లెక్క మారలేదు. 31 ఏళ్లుగా పాకిస్తాన్‌పై వేర్వేరు వేదికల్లో కనిపించిన ఆధిపత్యం అహ్మదాబాద్‌లోనూ కొనసాగింది. ఫేవరెట్‌గా భావించిన భారత జట్టు అన్ని రంగాల్లో చెలరేగి పాక్‌ను ఊపిరాడనీయకుండా చేసింది. ఒకవైపు భారత బౌలర్లంతా సమష్టిగా చెలరేగుతుంటే... మరోవైపు లక్ష మంది జనం ‘భారత్ మాతాకీ జై’ అంటూ హోరెత్తిస్తుంటే... మైదానంలో దాయాది జట్టు బెంబేలెత్తిపోయింది... బ్యాటింగ్‌లో కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేక... కనీసం 200 పరుగులు కూడా చేయలేక కుప్పకూలింది... ఆపై మొదటి బంతి నుంచే ఇండియా జోరు మొదలైంది... సిక్సర్లతో చెలరేగిపోతున్న రోహిత్ శర్మను నిలువరించలేక పాక్ బౌలర్లు చేతులెత్తేయగా మరో అలవోక విజయం మన ఖాతాలో చేరింది. ఏకంగా 19.3 ఓవర్లు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించిన టీమిండియా వరల్డ్ కప్‌లో చిరకాల ప్రత్యరి్థపై తన అజేయ రికార్డును ఘనంగా నిలబెట్టుకుంది. 8–0తో సంపూర్ణ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అహ్మదాబాద్: ప్రపంచకప్‌లో తిరుగులేకుండా దూసుకుపోతున్న భారత జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. పటిష్టమైన టీమిండియా అంచనాలకు అనుగుణంగా చెలరేగి పాకిస్తాన్‌పై ఏకపక్ష విజయాన్ని అందుకుంది. శనివారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఎలాంటి హోరాహోరీ, పోటాపోటీ లేకుండా సాగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్న్ బాబర్ ఆజమ్ (58 బంతుల్లో 50; 7 ఫోర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (69 బంతుల్లో 49; 7 ఫోర్లు) మినహా ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఒకదశలో 155/2తో మెరుగైన స్థితిలో కనిపించిన పాక్ 36 పరుగుల తేడాలో 8 వికెట్లు కోల్పోయింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జస్ప్రీత్ బుమ్రా (2/19) రెండు కీలక వికెట్లు తీయగా... పాండ్యా, కుల్దీప్, జడేజా, సిరాజ్ కూడా తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్న్ రోహిత్ శర్మ (63 బంతుల్లో 86; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్‌తో భారత్ గెలుపును సులువుగా మార్చగా... శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను గురువారం పుణేలో బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. ఆ భాగస్వామ్యం మినహా... పాకిస్తాన్ తమ ఇన్నింగ్స్‌ను సానుకూలంగానే ప్రారంభించింది. ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్ (38 బంతుల్లో 36; 6 ఫోర్లు), అబ్దుల్లా షఫీక్ (20) ఒత్తిడికి లోనుకాకుండా చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. అయితే షఫీక్‌ను సిరాజ్ ఎల్బీగా అవుట్ చేయడంతో పాక్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే ఇమామ్‌ను పాండ్యా వెనక్కి పంపించాడు. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యత సీనియర్లు బాబర్, రిజ్వాన్‌లపై పడింది. జడేజా తన తొలి ఓవర్లోనే రిజ్వాన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నా... బ్యాటర్ రివ్యూలో అది నాటౌట్‌గా తేలింది. ఇద్దరు బ్యాటర్లు జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిరి్మంచే ప్రయత్నం చేశారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 57 బంతుల్లో బాబర్ అర్ధసెంచరీ పూర్తయింది. అయితే సిరాజ్ వేసిన చక్కటి బంతి స్టంప్స్ పైభాగాన్ని తాకడంతో బాబర్ అదే స్కోరు వద్ద నిరాశగా ని్రష్కమించాడు. అంతే... ఆ వికెట్ తర్వాత పాక్ పతనం వేగంగా సాగింది. కుల్దీప్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి దెబ్బ కొట్టగా, బుమ్రా ఆఫ్కటర్కు రిజ్వాన్ బౌల్డ్ కావడంతో భారీ స్కోరుపై పాక్ ఆశలు వదులుకుంది. మిగిలిన నాలుగు వికెట్ల లాంఛనాన్ని పూర్తి చేయడానికి భారత్‌కు ఎంతో సమయం పట్టలేదు. పాకిస్తాన్‌పై 2011 వరల్డ్ కప్ సెమీఫైనల్ (మొహాలిలో) తరహాలోనే భారత్ తరఫున ఐదుగురు బౌలర్లు తలా 2 వికెట్లు పంచుకోవడం విశేషం. మెరుపు బ్యాటింగ్... డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్‌లెగ్, వైడ్ లాంగాన్, మిడాన్, కవర్స్, స్క్వేర్ లెగ్, డీప్ మిడ్ వికెట్... రోహిత్ శర్మ అలవోకగా వేర్వేరు దిశల్లో బాదిన ఆరు సిక్సర్లు ఇవి! స్వల్ప లక్ష్యాన్ని భారత్ ఛేదించేందుకు సిద్ధమైన తరుణంలో స్టేడియంలోని అభిమానులకు ఇదే తరహా రోహిత్ ఆట వినోదం పంచింది. ఇన్నింగ్స్ తొలి బంతిని ఫోర్‌తో మొదలు పెట్టిన రోహిత్ ఎప్పుడెప్పుడు మ్యాచ్‌ను ముగిద్దామా అన్నట్లుగా వేగంగా దూసుకుపోయాడు. మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్ (11 బంతుల్లో 16; 4 ఫోర్లు), కోహ్లి (18 బంతుల్లో 16; 3 ఫోర్లు) మాత్రం విఫలమయ్యారు. షాదాబ్ చక్కటి క్యాచ్‌కు గిల్ వెనుదిరగ్గా, పేలవ షాట్ ఆడి కోహ్లి ని్రష్కమించాడు. అయితే రోహిత్ జోరును మాత్రం పాక్ అడ్డుకోలేకపోయింది. 36 బంతుల్లోనే అతను 3 ఫోర్లు, 4 సిక్సర్లతో రోహిత్ అర్ధసెంచరీ పూర్తయింది. ఆ తర్వాతా పాక్ బౌలర్లను వదలకుండా మరో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదిన రోహిత్ జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లాడు. కానీ విజయానికి మరో 36 పరుగులు చేయాల్సిన స్థితిలో అవుటై రోహిత్ వరల్డ్ కప్ చరిత్రలో ఎనిమిదో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అనంతరం అయ్యర్, కేఎల్ రాహుల్ (29 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్‌ను ముగించారు. నవాజ్ వేసిన 31వ ఓవర్ మూడో బంతిని నేరుగా శ్రేయస్ బౌండరీకి తరలించగా అతని అర్ధసెంచరీతో పాటు భారత్ విజయం పూర్తయింది. మా బౌలర్లే ఈ రోజు మ్యాచ్ ఫలితాన్ని శాసించారు. పాక్ కనీసం 290 వరకు వెళుతుందనుకుంటే 191 పరుగులకే కట్టడి చేయడం అద్భుతం. బౌలర్లంతా సమష్టిగా సత్తా చాటారు. అందరూ అన్ని రోజుల్లో బాగా ఆడలేరు. మనదైన రోజును మరో అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోవాలి. నేను అదే పని చేశాను. కెప్టెన్న్గా కూడా నాపై అదనపు బాధ్యత ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా పాక్‌ను మేం మరో ప్రత్యర్థిగానే చూశాం తప్ప ఎలాంటి ప్రత్యేకత లేదు. మేం గత రికార్డును పట్టించుకోలేదు. ప్రపంచకప్‌లోకి అడుగు పెట్టక ముందే జట్టులో అందరికీ తమ బాధ్యతలపై స్పష్టత ఉంది. అందుకే అందరూ తమదైన పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ విజయంతో మేమేమీ అతిగా ఉప్పొంగిపోవడం లేదు. టోరీ్నలో ఇంకా చాలా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్న్ స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (ఎల్బీ) (బి) సిరాజ్ 20; ఇమామ్ (సి) రాహుల్ (బి) పాండ్యా 36; బాబర్ ఆజమ్ (బి) సిరాజ్ 50; రిజ్వాన్ (బి) బుమ్రా 49; షకీల్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 6; ఇఫ్తికార్ (బి) కుల్దీప్ 4; షాదాబ్ (బి) బుమ్రా 2; నవాజ్ (సి) బుమ్రా (బి) పాండ్యా 4; హసన్ (సి) గిల్ (బి) జడేజా 12; షాహిన్ అఫ్రిది (నాటౌట్) 2; రవూఫ్ (ఎల్బీ) (బి) జడేజా 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (42.5 ఓవర్లలో ఆలౌట్) 191. వికెట్ల పతనం: 1–41, 2–73, 3–155, 4–162, 5–166, 6–168, 7–171, 8–187, 9–187, 10–191. బౌలింగ్: బుమ్రా 7–1–19–2, సిరాజ్ 8–0–50–2, పాండ్యా 6–0–34–2, కుల్దీప్ 10–0–35–2, జడేజా 9.5–0–38–2, శార్దుల్ 2–0–12–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) ఇఫ్తికార్ (బి) షాహిన్ 86; గిల్ (సి) షాదాబ్ (బి) షాహిన్ 16; కోహ్లి (సి) నవాజ్ (బి) హసన్ అలీ 16; అయ్యర్ (నాటౌట్) 53; కేఎల్ రాహుల్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (30.3 ఓవర్లలో 3 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–23, 2–79, 3–156. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 6–0–36–2, హసన్ అలీ 6–0–34–1, నవాజ్ 8.3–0–47–0, రవూఫ్ 6–0–43–0, షాదాబ్ 4–0–31–0. -
Asian Games 2023: బోణీలోనే బంగారం
హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో గతంలో రెండుసార్లు (2010, 2014) మాత్రమే క్రికెట్ క్రీడాంశంగా ఉంది. అయితే ఆ రెండుసార్లూ భారత క్రికెట్ జట్లు బరిలోకి దిగలేదు. దాంతో మహిళల విభాగంలో పాకిస్తాన్ రెండుసార్లు స్వర్ణం సాధించగా... పురుషుల విభాగంలో బంగ్లాదేశ్ (2010), శ్రీలంక (2014) ఒక్కోసారి బంగారు పతకం గెల్చుకున్నాయి. మూడోసారి మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మనసు మార్చుకొని ఆసియా క్రీడల్లో భారత జట్లను పంపించాలని నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ నిర్ణయం సరైందేనని నిరూపిస్తూ భారత మహిళల జట్టు బరిలోకి దిగిన తొలిసారే బంగారు పతకాన్ని తమ ఖాతాలో జమ చేసుకుంది. టి20 ఫార్మాట్లో జరిగిన ఈ పోటీల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు చాంపియన్‌గా అవతరించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శ్రీలంకతో సోమవారం జరిగిన ఫైనల్లో భారత్ 19 పరుగుల తేడాతో గెలిచింది. రెండు మ్యాచ్‌ల నిషేధం ముగియడంతో ఫైనల్లో రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సారథ్యంలో భారత్ పోటీపడింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించింది. స్వర్ణ పతకం నెగ్గిన భారత జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బారెడ్డి అనూష సభ్యురాలిగా ఉంది. అయితే ఆమెకు మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. టిటాస్ సాధు కట్టడి... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు సాధించింది. స్మృతి మంధాన (45 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (40 బంతుల్లో 42; 5 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. భారత టీనేజ్ పేస్ బౌలర్ టిటాస్ సాధు 4 ఓవర్లలో 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి శ్రీలంకను దెబ్బ తీసింది. మరోవైపు బంగ్లాదేశ్ జట్టుకు కాంస్య పతకం లభించింది. కాంస్య పతక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి) ప్రబోధని (బి) రణవీర 46; షఫాలీ వర్మ (స్టంప్డ్) సంజీవని (బి) సుగంధిక 9; జెమీమా (సి) విష్మీ (బి) ప్రబోధని 42; రిచా ఘోష్ (సి) సంజీవని (బి) రణవీర 9; హర్మన్‌ప్రీత్ కౌర్ (సి) సంజీవని (బి) ప్రబోధని 2; పూజ వస్త్రకర్ (సి) విష్మీ (బి) సుగంధిక 2; దీప్తి శర్మ (నాటౌట్) 1; అమన్‌జోత్ కౌర్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 116. వికెట్ల పతనం: 1–16, 2–89, 3–102, 4–105, 5–108, 6–114, 7–116. బౌలింగ్: ఒషాది 2–0–11–0, ఉదేశిక ప్రబోధని 3–0–16–2, ఇనోషి 3–1–11–0, సుగంధిక 4–0–30–2, చమరి ఆటపట్టు 2.5–0–19–0, కవిశ 1.1–0–7–0, ఇనోక రణవీర 4–0–21–2. శ్రీలంక ఇన్నింగ్స్: చమరి ఆటపట్టు (సి) దీప్తి (బి) టిటాస్ సాధు 12; అనుష్క సంజీవని (సి) హర్మన్ (బి) టిటాస్ సాధు 1; విష్మీ (బి) టిటాస్ సాధు 0; హాసిని పెరీరా (సి) పూజ (బి) రాజేశ్వరి 25; నీలాక్షి (బి) పూజ 23; ఒషాది (సి) టిటాస్ సాధు (బి) దీప్తి 19; కవిశ (సి) రిచా (బి) దేవిక 5; సుగంధిక (స్టంప్డ్) రిచా (బి) రాజేశ్వరి 5; ఇనోషి (నాటౌట్) 1; ఉదేశిక ప్రబోధని (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 97. వికెట్ల పతనం: 1–13, 2–13, 3–14, 4–50, 5–78, 6–86, 7–92, 8–96. బౌలింగ్: దీప్తి శర్మ 4–0–25–1, పూజ 4–1–20–1, టిటాస్ సాధు 4–1–6–3, రాజేశ్వరి 3–0–20–2, అమన్‌జోత్ కౌర్ 1–0–6–0, దేవిక వైద్య 4–0–15–1. ఆసియా క్రీడల్లో సోమవారం భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జాతీయ గీతం రెండుసార్లు మోగింది. షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో... మహిళల క్రికెట్లో టీమిండియా స్వర్ణ పతకాలతో సత్తా చాటుకుంది. భారత్‌కు షూటింగ్‌లోనే రెండు కాంస్యాలు, రోయింగ్‌లో మరో రెండు కాంస్యాలు లభించాయి. ఓవరాల్‌గా రెండోరోజు భారత్ ఖాతాలో ఆరు పతకాలు చేరాయి. ఈ మూడు క్రీడాంశాల్లో మినహా ఇతర ఈవెంట్స్‌లో భారత క్రీడాకారులు నిరాశపరిచారు. -
Asia Cup 2023: నేపాల్ చిత్తు.. సూపర్-4కు భారత్
తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్... కాస్త నిరాశపర్చింది. రెండో మ్యాచ్‌లో బౌలింగ్ ప్రాక్టీస్... ఇది అంతంత మాత్రమే! నేపాల్ లాంటి జట్టును కుప్పకూల్చలేకపోయిన టీమిండియా బౌలింగ్ వైఫల్యం కనిపించింది... మధ్యలో వాన... అయితే ఎట్టకేలకు సాధికారిక బ్యాటింగ్‌తో ఉత్కంఠ లేకుండా భారత్ మ్యాచ్ ముగించింది. కుదించిన పోరులో అలవోక విజయంతో ‘సూపర్–4’ దశకు ముందంజ వేసింది. పల్లెకెలె: ఆసియా కప్ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ పోరులో భారత్ 10 వికెట్ల తేడాతో నేపాల్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. ఆసిఫ్ షేక్ (97 బంతుల్లో 58; 8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. సోంపాల్ కామి (48; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కుశాల్ భుర్తేల్ (38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం వాన కారణంగా భారత్ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులుగా నిర్దేశించారు. భారత్ 20.1 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 147 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ శర్మ (59 బంతుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (62 బంతుల్లో 67 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) కలిసి అజేయంగా జట్టును గెలిపించారు. ఈ విజయంతో భారత్ ‘సూపర్–4’ దశకు చేరగా, నేపాల్ టోర్నీ నుంచి ని్రష్కమించింది. కీలక భాగస్వామ్యాలు... భారత ఫీల్డింగ్ వైఫల్యాలను సొమ్ము చేసుకుంటూ నేపాల్‌కు ఓపెనర్లు భుర్తేల్, ఆసిఫ్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 65 పరుగులు భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు పదో ఓవర్లో శార్దుల్ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత జడేజా తన బౌలింగ్‌లో 11 పరుగుల వ్యవధిలోనే తర్వాతి 3 వికెట్లు పడగొట్టి నేపాల్‌ను దెబ్బ కొట్టాడు. మరో ఎండ్‌లో ఆసిఫ్ 88 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కొద్ది సేపటికే ఆసిఫ్‌తో పాటు గుల్షన్ (23)ను సిరాజ్ పెవిలియన్ పంపించడంతో నేపాల్ 144/6 వద్ద నిలిచింది. ఈ దశలో సోంపాల్, దీపేంద్ర సింగ్ (29; 3 ఫోర్లు) ఆరో వికెట్‌కు 50 పరుగులు జత చేయడంతో పరిస్థితి మెరుగైంది. హార్దిక్ ఈ పార్ట్నర్íÙప్ను విడగొట్టినా... చివర్లో చెలరేగి ఆడిన సోంపాల్ నేపాల్ స్కోరును 200 దాటించాడు. ఛేదనలో టీమిండియాకు ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. ఓపెనర్లు రోహిత్, గిల్ తమదైన శైలిలో స్వేచ్ఛగా, అలవోకగా షాట్లు ఆడి జట్టును గెలుపు దిశగా నడిపించారు. వాన అడ్డు పడుతూ... మ్యాచ్‌లో నాలుగుసార్లు వర్షం ఆటకు అంత రాయం కలిగించింది. నేపాల్ ఇన్నింగ్స్ సమయంలో 30 ఓవర్ల తర్వాత, 34 ఓవర్ల తర్వాత వాన కురిసింది. అయితే ఈ రెండు సందర్భాల్లో పెద్దగా ఇబ్బంది రాలేదు కానీ 37.5 ఓవర్ల తర్వాత కురిసిన వానతో సరిగ్గా గంటసేపు ఆట ఆగిపోయింది. అయినా సరే ఓవర్ల కోత లేకుండా నేపాల్ ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం భారత ఇన్నింగ్స్‌లో 2.1 ఓవర్ల తర్వాత వాన పడింది. సుమారు రెండు గంటలు అంతరాయం కలగడంతో చివరకు భారత్ ఇన్నింగ్స్‌ను కుదించి లక్ష్యాన్ని సవరించారు. ఇదేమి ఫీల్డింగ్? సునాయాస క్యాచ్‌లు వదిలేయడం, మిస్‌ఫీల్డింగ్, రనౌట్ అవకాశాలు చేజార్చడం, ఓవర్‌త్రోలు... ఇవన్నీ సోమవారం భారత ఫీల్డింగ్‌లో కనిపించాయి. మైదానంలో మన ఆటగాళ్లు ఇంత పేలవంగా కనిపించడం ఆశ్చర్యపర్చింది. తొలి 4.2 ఓవర్లు ముగిసేసరికి భారత ఆటగాళ్లు మూడు క్యాచ్‌లు వదిలేశారు. షమీ బౌలింగ్‌లో భుర్తేల్ ఇచ్చిన క్యాచ్‌లను శ్రేయస్, కిషన్ వదిలేయగా, సిరాజ్ బౌలింగ్‌లో ఆసిఫ్ క్యాచ్‌ను కోహ్లి వదిలేశాడు. చివర్లో సోంపాల్ క్యాచ్‌నూ కిషన్ అందుకోలేకపోయాడు. స్కోరు వివరాలు నేపాల్ ఇన్నింగ్స్: కుశాల్ భుర్తేల్ (సి) కిషన్ (బి) శార్దుల్ 38; ఆసిఫ్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 58; భీమ్ (బి) జడేజా 7; పౌడేల్ (సి) రోహిత్ (బి) జడేజా 5; కుశాల్ మల్లా (సి) సిరాజ్ (బి) జడేజా 2; గుల్షన్ (సి) కిషన్ (బి) సిరాజ్ 23; దీపేంద్ర సింగ్ (ఎల్బీ) (బి) పాండ్యా 29; సోంపాల్ (సి) కిషన్ (బి) షమీ 48; లమిచానే (రనౌట్) 9; కరణ్ (నాటౌట్) 2; రాజ్‌భన్సీ (బి) సిరాజ్ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (48.2 ఓవర్లలో ఆలౌట్) 230. వికెట్ల పతనం: 1–65, 2–77, 3–93, 4–101, 5–132, 6–144, 7–194, 8–228, 9–229, 10–230. బౌలింగ్: షమీ 7–0–29–1, సిరాజ్ 9.2–1–61–3, పాండ్యా 8–3–34–1, శార్దుల్ 4–0–26–1, జడేజా 10–0–40–3, కుల్దీప్ 10–2–34–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (నాటౌట్) 74; గిల్ (నాటౌట్) 67; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 147. బౌలింగ్: కరణ్ 4–0–26–0, సోంపాల్ 2–0–23–0, రాజ్‌భన్సీ 4–0–24–0, సందీప్ లమిచానే 4–0–39–0, దీపేంద్ర సింగ్ ఐరీ 2–0–12–0, కుశాల్ మల్లా 3–0–11–0, గుల్షన్ 1.1–0–11–0. -
India vs Australia 1st ODI: రాహుల్, జడేజా గెలిపించగా...
తొలి వన్డేలో భారత్ విజయలక్ష్యం 189 పరుగులే...దీనిని చూస్తే ఛేదన చాలా సులువనిపించింది. కానీ ఒక దశలో స్కోరు 16/3 కాగా, ఆపై 39/4కు మారింది...ప్రతికూలంగా ఉన్న పిచ్‌పై భారత బ్యాటర్లు శ్రమించాల్సి వచ్చింది. చివరకు రాహుల్, జడేజా శతక భాగస్వామ్యం జట్టును విజయం దిశగా నడిపించింది. ఎనిమిది నెలల తర్వాత ఆడిన తొలి వన్డేలో జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శన నమోదు చేయగా, టెస్టుల్లో బ్యాటింగ్‌పై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ వన్డేల్లో తానేంటో చూపించాడు. అంతకు ముందు భారత బౌలర్లు ఆసీస్‌ను కట్టి పడేశారు. మిచెల్ మార్‡్ష మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన జట్టు భారీ స్కోరు చేసేందుకు సరిపోలేదు. ముంబై: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఆసీస్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ మార్‡్ష (65 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం భారత్ 39.5 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (91 బంతుల్లో 75 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (69 బంతుల్లో 45 నాటౌట్; 5 ఫోర్లు) ఆరో వికెట్‌కు అభేద్యంగా 108 పరుగులు జత చేశారు. 2 వికెట్లు, 1 కీలక క్యాచ్‌తో పాటు బ్యాటింగ్‌లో రాణించిన జడేజా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలవగా... ఈ నెల 19న వైజాగ్‌లో రెండో వన్డే జరుగుతుంది. మార్‡్ష మినహా... తన తొలి ఓవర్లోనే ట్రవిస్ హెడ్ (5)ను సిరాజ్ బౌల్డ్ చేయడంతో ఆస్ట్రేలియాకు సరైన ఆరంభం లభించలేదు. అయితే మార్‡్ష దూకుడుగా ఆడి జట్టును నడిపించాడు. సిరాజ్ తర్వాతి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన మార్‡్ష, సిరాజ్ మరో ఓవర్లోనే రెండు ఫోర్లు బాదాడు. 10 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు 59 పరుగులకు చేరింది. మార్‡్షకు సహకరించిన స్టీవ్ స్మిత్ (22)ను కీపర్ రాహుల్ చక్కటి క్యాచ్‌తో వెనక్కి పంపడంతో 72 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. మార్‡్ష 51 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కుల్దీప్ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టి అతను తన జోరును కొనసాగించాడు. అయితే జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన మార్‡్ష షార్ట్ థర్డ్‌మాన్ వద్ద సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చాడు. మార్‡్ష, లబుషేన్ (15) మూడో వికెట్‌కు 52 పరుగులు జత చేశారు. అంతే...ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. 20వ ఓవర్లో 129/2తో మెరుగైన స్థితిలో నిలిచిన ఆ జట్టు 36వ ఓవర్ కూడా ముగియక ముందే ముగిసింది. 59 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 8 వికెట్లు కోల్పోయింది. తన చివరి 14 బంతుల్లో షమీ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు పడగొట్టగా...సిరాజ్ తన చివరి 10 బంతుల్లో ఒక్క పరుగూ ఇవ్వకుండా 2 వికెట్లు తీశాడు. శతక భాగస్వామ్యం... స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఆరంభంలో భారత్ తడబడింది. ఇషాన్ కిషన్ (3) తనకు లభించిన అరుదైన అవకాశాన్ని వృథా చేసుకోగా... స్టార్క్ వరుస బంతుల్లో కోహ్లి (4), సూర్యకుమార్ (0)లను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి భారత శిబిరంలో ఆందోళన పెంచాడు. వ్యక్తిగత స్కోర్ల 2, 7 వద్ద ఇన్‌గ్లిస్, స్మిత్ క్యాచ్‌లు వదిలేయడంతో బతికిపోయిన శుబ్‌మన్ గిల్ (20) దానిని ఉపయోగించుకోలేకపోయాడు. ఈ దశలో రాహుల్, హార్దిక్ పాండ్యా (25) కలిసి జట్టును ఆదుకున్నారు. అయితే స్టొయినిస్ బౌన్సర్‌తో పాండ్యాను అవుట్ చేయడంతో 44 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. విజయానికి మరో 106 పరుగులు చేయాల్సిన ఇలాంటి స్థితిలో ఆస్ట్రేలియాదే పైచేయిగా మారినట్లు అనిపించింది. కానీ రాహుల్, జడేజా జోడి ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వలేదు. చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేస్తూ వీరిద్దరు పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో 73 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ఈ జోడీని విడదీసేందుకు ఆసీస్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. స్కోరు వివరాలు: ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హెడ్ (బి) సిరాజ్ 5; మార్‡్ష (సి) సిరాజ్ (బి) జడేజా 81; స్మిత్ (సి) రాహుల్ (బి) పాండ్యా 22; లబుషేన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 15; ఇన్‌గ్లిస్ (బి) షమీ 26; గ్రీన్ (బి) షమీ 12; మ్యాక్స్‌వెల్ (సి) పాండ్యా (బి) జడేజా 8; స్టొయినిస్ (సి) గిల్ (బి) షమీ 5; అబాట్ (సి) గిల్ (బి) సిరాజ్ 0; స్టార్క్ (నాటౌట్) 4; జంపా (సి) రాహుల్ (బి) సిరాజ్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (35.4 ఓవర్లలో ఆలౌట్) 188. వికెట్ల పతనం: 1–5, 2–77, 3–129, 4–139, 5–169, 6–174, 7–184, 8–184, 9–188, 10–188. బౌలింగ్: షమీ 6–2–17–3, సిరాజ్ 5.4–1–29–3, పాండ్యా 5–0–29–1, శార్దుల్ 2–0–12–0, జడేజా 9–0–46–2, కుల్దీప్ 8–1–48–1. భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (ఎల్బీ) (బి) స్టొయినిస్ 3; గిల్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 20; కోహ్లి (ఎల్బీ) (బి) స్టార్క్ 4; సూర్యకుమార్ (ఎల్బీ) (బి) స్టార్క్ 0; రాహుల్ (నాటౌట్) 75; పాండ్యా (సి) గ్రీన్ (బి) స్టొయినిస్ 25; జడేజా (నాటౌట్) 45; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (39.5 ఓవర్లలో 5 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–5, 2–16, 3–16, 4–39, 5–83. బౌలింగ్: స్టార్క్ 9.5–0– 49–3, స్టొయినిస్ 7–1–27–2, అబాట్ 9–0–31–0, గ్రీన్ 6–0–35–0, జంపా 6–0–37–0, మ్యాక్స్‌వెల్ 2–0–7–0. -
మహిళల టి20 ప్రపంచకప్ : పాక్‌పై టీమ్ఇండియా ఘనవిజయం (ఫోటోలు)
-
Womens T20 World Cup 2023: మన అమ్మాయిలు... అదరగొట్టారు
గత మెగా టోర్నీ రన్నరప్ భారత్... ఈ టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ పనిపట్టి శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి నుంచి క్లిష్టమైన లక్ష్యమే ఎదురైనా... కీలకమైన ఈ మ్యాచ్‌కు డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన గాయంతో గైర్హాజరైనా... టాపార్డర్ బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో భారత మహిళలు చక్కని విజయం సాధించారు. కేప్‌టౌన్: భారత్ మహిళల జట్టు ముందున్న లక్ష్యం 150. కానీ 93 పరుగుల వద్ద 14వ ఓవర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (16; 2 ఫోర్లు) అవుటైంది. 16వ ఓవర్లో రిచా ఘోష్‌ను ఎల్బీగా అంపైర్ ప్రకటించింది. భారత్ రివ్యూకెళ్లింది. స్కోరేమో 109/3. విజయానికి 24 బంతుల్లో 41 పరుగులు కావాలి. ఈ దశలో రివ్యూలో బంతి రిచా గ్లౌజ్‌ను తాకినట్లు తేలడంతో బతికిపోయింది. అక్కడి నుంచి టీమిండియా ఆట మారిపోయింది. కాస్త కఠినమైన సమీకరణాన్ని జెమీమా–రిచా జోడీ 19వ ఓవర్లోనే ముగించింది. దాంతో టి20 ప్రపంచకప్ టోర్నీ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై గెలిచింది. టాస్ గెలిచిన పాక్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. పాకిస్తాన్ 12.1 ఓవర్లలో 68 పరుగులకే కీలకమైన 4 వికెట్లను కోల్పోయిన దశలో కెప్టెన్ బిస్మా మారూఫ్ (55 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు), అయేషా నసీమ్ (25 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు అబేధ్యమైన ఐదో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. అనంతరం భారత్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి గెలిచింది. ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్‌కిదే అత్యధిక ఛేదన కావడం విశేషం. ఓవరాల్‌గా టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌కిది ఐదో విజయం. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (38 బంతుల్లో 53 నాటౌట్; 8 ఫోర్లు), రిచా ఘోష్ (20 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు) గెలిపించారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను ఈనెల 15న వెస్టిండీస్‌తో ఆడుతుంది. గెలిపించిన జెమీమా ఓపెనింగ్‌లో షఫాలీ వర్మ (25 బంతుల్లో 33; 3 ఫోర్లు) మెరుగ్గానే ఆడినప్పటికీ... యస్తిక భాటియా (17) తక్కువ స్కోరుకే వెనుదిరిగింది. క్రీజులోకి జెమీమా రాగా భారీ షాట్లపై గురిపెట్టిన షఫాలీ... సిద్రా అమీన్ చక్కని క్యాచ్‌కు పెవిలియన్ చేరింది. రెండు బౌండరీలతో ఊపు మీదున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ను నష్రా సంధు బోల్తా కొట్టించింది. దీంతో రిచా ఘోష్ క్రీజులోకి రాగా... 15వ ఓవర్లో జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. కలిసొచ్చిన రివ్యూతో రిచా, మరోవైపు జెమీమా బౌండరీలతో జట్టు విజయాన్ని సులువు చేశారు. జెమీమా బౌండరీతో భారత విజయాన్ని ఖరారు చేసింది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: మునీబా (స్టంప్డ్) రిచా (బి) రాధ 12; జవేరియా (సి) హర్మన్‌ప్రీత్ (బి) దీప్తి 8; బిస్మా మారూఫ్ (నాటౌట్) 68; నిదా దార్ (సి) రిచా (బి) పూజ 0; సిద్రా అమీన్ (సి) రిచా (బి) రాధ 11; అయేషా (నాటౌట్) 43; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–10, 2–42, 3–43, 4–68. బౌలింగ్: రేణుక సింగ్ 3–0–24–0, దీప్తి శర్మ 4–0–39–1, రాజేశ్వరి గైక్వాడ్ 4–0–31–0, రాధా యాదవ్ 4–0–21–2, పూజ 4–0–30–1, షఫాలీ వర్మ 1–0–3–0. భారత్ ఇన్నింగ్స్: యస్తిక (సి) ఫాతిమా (బి) సాదియా 17; షఫాలీ (సి) సిద్రా (బి) నష్రా సంధు 33; జెమీమా (నాటౌట్) 53; హర్మన్‌ప్రీత్ (సి) బిస్మా (బి) నష్రా సంధు 16; రిచా ఘోష్ (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1–38, 2–65, 3–93. బౌలింగ్: ఫాతిమా 4–0–42–0, సాదియా 4–0–25–1, ఐమన్ 3–0–33–0, నిదా దార్ 4–0–36–0, నష్రా సంధు 4–0–15–2. -
Hockey World Cup 2023: భారత్ 9వ స్థానంతో ముగింపు
భువనేశ్వర్: సొంతగడ్డపై జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రపంచకప్ హాకీలో క్వార్టర్ ఫైనల్ కూడా చేరలేక నిరాశపరిచిన భారత జట్టు చివరకు విజయంతో మెగా టోర్నీని ముగించింది. శనివారం 9 నుంచి 12వ స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 5–2తో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. అయితే మరో మ్యాచ్‌లో అర్జెంటీనా 6–0 స్కోరు తేడాతో వేల్స్‌ను చిత్తు చేయడంతో భారత్, అర్జెంటీనాలు సంయుక్తంగా 9వ స్థానంలో నిలిచాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున అభిషేక్ (4వ ని.), హర్మన్‌ప్రీత్ సింగ్ (11వ ని.), షంషేర్ సింగ్ (44వ ని.), ఆకాశ్‌దీప్ సింగ్ (48వ ని.), సుఖ్జీత్ సింగ్ (58వ ని.) తలా ఒక గోల్ చేశారు. సఫారీ జట్టులో సంకెలొ ఎంవింబి (48వ ని.), ముస్తఫా కాసిమ్ (59వ ని.) చెరో గోల్ చేశారు. ఆట ఆరంభమైన నాలుగో నిమిషంలోనే అభిషేక్ ఫీల్డ్‌గోల్‌తో భారత్‌కు శుభారంభమిచ్చాడు. ఈ క్వార్టర్‌లోనే హర్మన్‌ప్రీత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి 2–0తో ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. ఇదే స్కోరుతో తొలి అర్ధభాగాన్ని (రెండు క్వార్టర్లు) ముగించిన భారత్ ఆఖరి క్వార్టర్లో మరో రెండు ఫీల్డ్ గోల్స్‌ను ఆకాశ్‌దీప్, సుఖ్జీత్ సాధించడంతో విజయం సులువైంది. ► నేడు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల ఫైనల్ ► జొకోవిచ్ ( సెర్బియా) X సిట్సిపాస్ ( గ్రీస్) ► మ.గం. 2 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం -
Under-19 Women cricket: సిరీస్ భారత మహిళల సొంతం
ప్రిటోరియా: దక్షిణాఫ్రికా మహిళల (అండర్–19)తో జరిగిన టి20 సిరీస్‌లో భారత మహిళలు (అండర్–19) పైచేయి సాధించారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకున్నారు. సోమవారం జరిగిన నాలుగో టి20 మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సఫారీ టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 86 పరుగులే చేయగలిగింది. కేలే రెనెకే (18) టాప్ స్కోరర్‌గా నిలవగా...భారత బౌలర్లలో నజీలా సీఎంసీ (3/4), ఫలక్ నాజ్ (2/11) ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. అనంతరం భారత్ 15 ఓవర్లలో 6 వికెట్లకు 87 పరుగులు సాధించింది. కెప్టెన్ షఫాలీ వర్మ (27 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించింది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ గెలవగా, తర్వాతి రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. సిరీస్‌లో చివరి మ్యాచ్ రేపు జరుగుతుంది. -
T20 World Cup 2022: 'కోహ్లి'నూర్ విజయం
అద్భుతం... అసాధారణం... అనిర్వచనీయం... ఆదివారం మెల్బోర్న్ వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ను ఏ తీరుగా ప్రశంసించినా తక్కువే. టి20 క్రికెట్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయేలా దాయాదుల మధ్య సమరం జరిగింది. ఒకదశలో పాకిస్తాన్ గెలవడం ఖాయమనిపించింది. కానీ భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అసమాన పోరాటం చేశాడు. చిరకాలం అభిమానుల మదిలో మెదిలేలా కళ్లు చెదిరే షాట్లు ఆడాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి భారత్‌ను మ్యాచ్‌లో నిలబెట్టాడు. కోట్లాది మంది అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు. దీపావళి పండగకు దేశానికి విజయకానుక ఇచ్చాడు. మెల్బోర్న్: భారత్ ఏ టోర్నీలో ఓడిందో... అక్కడే బదులు తీర్చుకుంది. ఎవరిని (షాహిన్ అఫ్రిది) చితకబాదాలనుకుందో అతన్నే బాగా ఎదుర్కొంది. భారత బ్యాటర్లు, హిట్టర్లు నిరాశపరిచినా... అడుగడుగునా సవాళ్లు ఎదురైనా... ఒక్కో పరుగు బంగారమైనా... మోస్తరు లక్ష్యం కాస్తా కొండంత అయినా ... కోహ్లి ఆఖరిదాకా నిలిచి కరిగించాడు. ఇప్పటి కోహ్లికి అంత సీన్ ఉందా అనుకున్నవాళ్ల నోళ్లు మూయించి మునుపటి కోహ్లిలా పాక్‌పై శివమెత్తాడు. తన కెరీర్లోనే చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (53 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. దీంతో భారత్ 4 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై విజయం సాధించింది. ఆకాశం తాకే ఉత్కంఠభరిత పోరులో భారత్ ఆఖరిబంతికి గెలిచింది. గతేడాది దుబాయ్‌లో ఎదురైనా పరాజయానికి మెల్బోర్న్లో ప్రతీకారం తీర్చుకుంది. టి20 ప్రపంచకప్ ‘సూపర్ 12’ దశ గ్రూప్–2 లీగ్ మ్యాచ్‌లో మొదట పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. షాన్ మసూద్ (42 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు), ఇఫ్తికార్ అహ్మద్ (34 బంతుల్లో 51; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. మిగతా వారిని అర్‡్షదీప్ (3/32), హార్దిక్ పాండ్యా (3/30) కట్టడి చేశారు. తర్వాత భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసి గెలిచింది. కోహ్లి అజేయ పోరాటం చేయగా, పాండ్యా (37 బంతుల్లో 40; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అండగా నిలిచాడు. హారిస్ రవూఫ్ (2/36), నవాజ్ (2/42) భారత్‌ను ఇబ్బంది పెట్టారు. గెలిచేదాకా క్రీజులోనే... లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు రాహుల్ (4), రోహిత్ (4) నిరాశపరిచారు. 2 ఫోర్లు కొట్టిన సూర్యకుమార్ (10 బంతుల్లో 15) జోరుకు రవూఫ్ తెరదించాడు. అక్షర్ పటేల్ (2)ను ముందుకు పంపితే రనౌటయ్యాడు. భారత్ స్కోరు 31/4. లక్ష్యం కష్టమైన ఈ దశలో కోహ్లి, పాండ్యా ఆదుకున్నారు. 25వ బంతిదాకా కోహ్లి ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. దీంతో సగం ఓవర్లు ముగిసేసరికి 45/4 స్కోరు చేసిన భారత్‌కు 60 బంతుల్లో 115 పరుగుల లక్ష్యం కష్టమైంది. నవాజ్ 12వ ఓవర్లో ఎట్టకేలకు 25వ బంతిని ఎదుర్కొన్న కోహ్లి సిక్సర్ కొట్టాడు. ఆ ఓవర్లో హార్దిక్ కూడా 2 సిక్స్‌లు కొట్టడంతో 20 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లలో వంద పరుగులు చేసిన భారత్‌కు 30 బంతుల్లో 60 పరుగుల సమీకరణం క్లిష్టంగా ఉంది. 18వ ఓవర్ నుంచి కోహ్లి ఆట మారిపోయింది. తొలి బంతిని బౌండరీకి తరలించిన అతను 43 బంతుల్లో (4 ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీ సాధించాడు. షాహిన్ అఫ్రిది వేసిన ఆ ఓవర్లో మొత్తం 3 బౌండరీలు బాదాడు. ఆఖరి ఓవర్లో పాండ్యా, దినేశ్ కార్తీక్ నిష్క్రమించినా తన అనుభవాన్నంతా ఉపయోగించి జట్టును గెలిపించడంతో కోహ్లి సఫలమయ్యాడు. తొలి 20 బంతుల్లో 11 పరుగులే చేసిన కోహ్లి ఆఖరి 33 బంతుల్లో 71 పరుగులు చేయడం విశేషం. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను ఈనెల 27న నెదర్లా్లండ్స్తో ఆడుతుంది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: రిజ్వాన్ (సి) భువనేశ్వర్ (బి) అర్‡్షదీప్ 4; బాబర్ ఆజమ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్‡్షదీప్ 0; షాన్ మసూద్ (నాటౌట్) 52; ఇఫ్తికార్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 51; షాదాబ్ ఖాన్ (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ పాండ్యా 5; హైదర్ అలీ (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ పాండ్యా 2; నవాజ్ (సి) దినేశ్ కార్తీక్ (బి) హార్దిక్ పాండ్యా 9; ఆసిఫ్ అలీ (సి) దినేశ్ కార్తీక్ (బి) అర్‡్షదీప్ 2; షాహిన్ అఫ్రిది (సి అండ్ బి) భువనేశ్వర్ 16; హారిస్ రవూఫ్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–1, 2–15, 3–91, 4–96, 5–98, 6–115, 7–120, 8–151. బౌలింగ్: భువనేశ్వర్ 4–0– 22–1; అర్‡్షదీప్ 4–0–32–3; షమీ 4–0– 25–1; హార్దిక్ పాండ్యా 4–0–30–3; అశ్విన్ 3–0–23–0; అక్షర్ పటేల్ 1–0–21–0. భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) నసీమ్ షా 4; రోహిత్ శర్మ (సి) ఇఫ్తికార్ (బి) హారిస్ రవూఫ్ 4; కోహ్లి (నాటౌట్) 82; సూర్యకుమార్ (సి) రిజ్వాన్ (బి) 15; అక్షర్ పటేల్ (రనౌట్) 2; హార్దిక్ (సి) బాబర్ ఆజమ్ (బి) నవాజ్ 40; దినేశ్ కార్తీక్ (స్టంప్డ్) రిజ్వాన్ (బి) నవాజ్ 1; అశ్విన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–7, 2–10, 3–26, 4–31, 5–144, 6–158. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 4–0–34–0; నసీమ్ షా 4–0–23–1; హారిస్ రవూఫ్ 4–0–36–2; షాదాబ్ ఖాన్ 4–0–21–0; నవాజ్ 4–0–42–2. ఆ రెండు సిక్స్‌లతో... మ్యాచ్ ఆరంభం నుంచి బ్యాటర్లకు కఠిన సవాళ్లు విసురుతున్న ఎంసీజీ పిచ్‌పై కోహ్లి కోహినూర్ వజ్రంలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లు నిప్పులు చెరుగుతున్న వేళ... భారత విజయ సమీకరణం 12 బంతుల్లో 31 పరుగులుగా మారిన వేళ... కోహ్లి ఆడిన షాట్లు ఇంకెవరికీ సాధ్యం కావు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో హారిస్ రవూఫ్ తొలి 4 బంతుల్లో 3 పరుగులిచ్చాడు. దాంతో భారత్ గెలవాలంటే 8 బంతుల్లో 28 పరుగులు చేయాలి. ఈ దశలో రవూఫ్ వేసిన ఐదో బంతిని అతని తలమీదుగా సిక్సర్ బాదాడు కోహ్లి. ఈ షాట్ మ్యాచ్‌లోనే హైలైట్. ఇక ఆరో బంతిని కోహ్లి ఫైన్‌లెగ్‌లో ఫ్లిక్ షాట్‌తో సిక్స్‌గా మలిచాడు. భారత విజయసమీకరణాన్ని 6 బంతుల్లో 16గా మార్చేశాడు. బంతి బంతికీ ఉత్కంఠ... గెలవడానికి భారత్ చివరి ఓవర్లో 16 పరుగులు చేయాలి. క్రీజులో ‘హార్డ్ హిట్టర్’ హార్దిక్ పాండ్యా, కోహ్లి ఉన్నారు. హార్దిక్ జోరు చూస్తుంటే మూడు షాట్లలో మ్యాచ్‌ను ముగించేస్తాడనిపించింది. కానీ ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ►19.1 నవాజ్ వేసిన తొలి బంతికి భారీ షాట్ ఆడిన పాండ్యా అవుటయ్యాడు. ►19.2క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ 1 పరుగు తీసి కోహ్లికి స్ట్రయిక్ ఇచ్చాడు. ►19.3 కోహ్లి 2 పరుగులు తీశాడు. భారత విజయ సమీకరణం 3 బంతుల్లో 13 పరుగులు. ►19.4 నవాజ్ వేసిన ఫుల్‌టాస్‌ను కోహ్లి డీప్ స్క్వేర్‌లో సిక్సర్‌గా మలిచాడు. అంపైర్ దీనిని ‘హైట్ నోబాల్‌గా’ ప్రకటించాడు. దీంతో భారత్ ఖాతాలో 1 బంతికి 7 పరుగులు చేరాయి. భారత్‌కు ‘ఫ్రీ హిట్’ అవకాశం కూడా వచ్చింది. విజయ సమీకరణం 3 బంతుల్లో 6 పరుగులుగా మారింది. ►19.4 ఈసారి నవాజ్ వైడ్ వేశాడు. ఫ్రీ హిట్ సజీవంగా నిలిచింది. ►19.4 ఫ్రీ హిట్ బంతికి కోహ్లి బౌల్డ్ అయ్యాడు. ‘ఫ్రీ హిట్’పై కేవలం రనౌట్ అయితేనే అవుట్‌గా పరిగణిస్తారు. వికెట్లకు తగిలిన బంతి థర్డ్ మ్యాన్ దిశగా వెళ్లింది. కోహ్లి, కార్తీక్ 3 ‘బై’ పరుగులు తీశారు! విజయ సమీకరణం 2 బంతుల్లో 2 పరుగులుగా మారింది. ►19.5 దినేశ్ కార్తీక్ స్వీప్ షాట్ ఆడగా బంతి అతని ప్యాడ్‌కు తగిలి వెనక్కి వెళ్లింది. కార్తీక్ క్రీజులోకి వచ్చేలోపు పాక్ కీపర్ రిజ్వాన్ స్టంపౌట్ చేశాడు. విజయ సమీకరణం 1 బంతికి 2 పరుగులుగా మారింది. ►19.5 తీవ్ర ఒత్తిడిలో ఉన్న నవాజ్ లెగ్ సైడ్‌లో బంతి వేశాడు. అంపైర్ దానిని వైడ్‌గా ప్రకటించాడు. దాంతో భారత విజయ సమీకరణం 1 బంతికి 1 పరుగుగా మారింది. ►19.6 ఈసారి నవాజ్ వేసిన బంతిని అశ్విన్ మిడాఫ్‌లో ఫీల్డర్ మీదుగా షాట్ ఆడాడు. పరుగు తీశాడు. భారత్ విజయం ఖరారైంది. -
India vs Australia Warm-Up Match: షమీ అద్భుతం
బ్రిస్బేన్: ఇది ప్రాక్టీస్ మ్యాచే! గెలిస్తే పాయింట్లేమీ రావు. ఓడినా నష్టం లేదు! కానీ అద్భుతమైన ముగింపుతో క్రికెట్ ప్రేక్షకుల్ని మురిపించింది. ఫీల్డింగ్‌లో కోహ్లి మెరుపులు... షమీ ఆఖరి ఓవర్ నిప్పులతో భారత్ అనూహ్యంగా గెలిచింది. చేతిలో 4 వికెట్లున్న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 6 బంతుల్లో 11 పరుగులు చేయలేక ఆలౌటైంది. మొత్తానికి టీమిండియా తొలి వార్మప్ మ్యాచ్ అదిరింది. భారత్ 6 పరుగుల తేడాతో గెలిచింది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ (33 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) దంచేశారు. కేన్ రిచర్డ్సన్ 4 వికెట్లు పడగొట్టాడు. తర్వాత ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 180 పరుగులు చేసి ఆలౌటైంది. కెప్టెన్ ఫించ్ (54 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) గెలుపు తీరాలకు తెచ్చినా... ఇన్నింగ్స్ మొత్తంలో ఒకే ఒక్క ఓవర్ వేసిన షమీ పేస్ (1–0–4–3)కు ఆసీస్ ఓడిపోయింది. ఆసీస్ చివరి ఆరు వికెట్లను తొమ్మిది పరుగుల తేడాతో కోల్పోయింది. భారత్ తమ రెండో వార్మప్ మ్యాచ్‌ను బుధవారం న్యూజిలాండ్‌తో ఆడుతుంది. రాహుల్ ధనాధన్ ఓపెనర్ రాహుల్ తొలి ఓవర్ నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. స్టార్క్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన అతను కమిన్స్ వేసిన నాలుగో ఓవర్‌ను దంచి కొట్టాడు. 6 బంతుల్ని రాహులే ఎదుర్కొని 4, 0, 6, 4, 2, 4లతో 20 పరుగులు చేశాడు. 4 ఓవర్లయినా కెప్టెన్ రోహిత్ (2 బంతులే ఆడాడు) ఖాతా తెరువలేదు. జట్టు స్కోరేమో 47/0. ఇందులో రాహుల్‌వే 43 పరుగులు! 27 బంతుల్లో (6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే అతను అవుట్‌కాగా, 6, 4తో టచ్‌లోకి వచ్చిన రోహిత్ (15; 1 ఫోర్, 1 సిక్స్) కూడా నిష్క్రమించాడు. 10 ఓవర్లలో భారత్ 89/2 స్కోరు చేసింది. వేగంగా ఆడే ప్రయత్నంలో కోహ్లి (13 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్), చెత్త షాట్‌తో హార్దిక్ పాండ్యా (2) అవుటయ్యారు. కాసేపటికే దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) జోరుకు బ్రేక్ పడగా, కమిన్స్, స్టార్క్‌లను అవలీలగా ఎదుర్కొన్న సూర్య ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో 32 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశాడు. ఫించ్ పోరాటం భారత్ నిర్దేశించిన లక్ష్యఛేదనకు దీటుగానే ఆసీస్ పరుగుల వేట సాగింది. ఓపెనర్లు మార్‡్ష (18 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఫించ్ ధాటిగా ఆడారు. 5.3 ఓవర్లలో ఓపెనింగ్ వికెట్‌కు 64 పరుగులు జోడించారు. కానీ తర్వాతి బంతికి మార్‡్షను భువనేశ్వర్ బౌల్డ్ చేశాడు. అయితే ఫించ్ జోరు మాత్రం కొనసాగింది. స్మిత్ (11), మ్యాక్స్‌వెల్ (16 బంతుల్లో 23; 4 ఫోర్లు), స్టొయినిస్ (7)లతో కలిసి ఫించ్ జట్టును 19వ ఓవర్‌దాకా గెలుపు వైపు మళ్లించాడు. ఆ ఓవర్ తొలి బంతికి హర్షల్ అతన్ని క్లీన్‌బౌ ల్డ్ చేయగా, మరుసటి బంతికి టిమ్ డేవిడ్ (5)ను కోహ్లి మెరుపు వేగంతో డైరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు. 19 ఓవర్ల దాకా విశ్రాంతినిచ్చిన షమీకి ఆఖరి ఓవర్ అప్పగించారు. అదే అతని తొలి ఓవర్ కాగా తొలి 2 బంతులకు 4 పరుగులిచ్చాడు. తర్వాత నాలుగు బంతుల్లో వికెట్లు రాలాయి. కమిన్స్ (7) షాట్‌కు లాంగాన్‌లో సిక్సర్‌గా వెళ్లే బంతిని కోహ్లి ఒంటిచేత్తో గాల్లో అందుకోవడం మ్యాచ్‌కే హైలైట్. అగర్ (0) రనౌట్ కాగా, షమీ యార్కర్లతో ఇంగ్లిస్ (1), రిచర్డ్సన్ (0)లను బౌల్డ్ చేశాడు. -
రెండో వన్డేలో సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం
-
IND vs SA 2nd ODI: సెంచరీతో చెలరేగిన శ్రేయస్.. దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం
రాంచీ: శ్రేయస్ అయ్యర్ (111 బంతుల్లో 113 నాటౌట్; 15 ఫోర్లు) అజేయ శతకం... ‘ఇషాన్’దార్ (84 బంతుల్లో 93; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) ఇన్నింగ్స్ భారత్‌ను సిరీస్‌లో నిలబెట్టాయి. రెండో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై టీమిండియా గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. సిరీస్ నిర్ణాయక మూడో వన్డే మంగళవారం ఢిల్లీలో జరుగుతుంది. రెండో వన్డేలో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. మార్క్రమ్ (89 బంతుల్లో 79; 7 ఫోర్లు, 1 సిక్స్), రీజా హెండ్రిక్స్ (76 బంతుల్లో 74; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. భారత బౌలర్లలో సిరాజ్ (10–1– 38–3) ఆకట్టుకున్నాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 45.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసి గెలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున షహబాజ్ అహ్మద్ అరంగేట్రం చేశాడు. సఫారీ జట్టులో ఫామ్‌లో లేని కెప్టెన్ బవుమా, స్పిన్నర్ షమ్సీల స్థానాల్లో ఫోర్టున్, హెండ్రిక్స్ బరిలోకి దిగారు. దీంతో కేశవ్ మహరాజ్ సారథ్యం చేపట్టాడు. రాణించిన హెండ్రిక్స్, మార్క్రమ్ డాషింగ్ ఓపెనర్ డికాక్ (5)ను క్లీన్‌బౌల్డ్ చేసిన సిరాజ్ సఫారీని గట్టిదెబ్బే తీశాడు. కాసేపటికి మలాన్ (31 బంతుల్లో 25; 4 ఫోర్లు)ను షహబాజ్ అహ్మద్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 40 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన సఫారీని హెండ్రిక్స్, మార్క్రమ్ ఆదుకున్నారు. హెండ్రిక్స్ 58 బంతుల్లో, మార్క్రమ్ 64 బంతుల్లో ఫిఫ్టీలను పూర్తి చేసుకున్నారు. చాలాసేపు భారత శిబిరాన్ని ఇబ్బంది పెట్టిన ఈ జోడీని ఎట్టకేలకు సిరాజే విడగొట్టాడు. దీంతో 129 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత వచ్చిన క్లాసెన్ (26 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిల్లర్ (34 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు) వేగంగా ఆడారు. ఆఖరి 10 ఓవర్లను భారత బౌలర్లు కట్టడి చేయడంతో 57 పరుగులే వచ్చాయి. కిషన్ సిక్సర్లు కెప్టెన్ ధావన్ (13), గిల్ (26 బంతుల్లో 28; 5 ఫోర్లు) మళ్లీ నిరాశపరిచారు. దాంతో భారత్ 48 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. గత మ్యాచ్ ఫలితం, సిరీస్ చేజార్చుకోవడం తప్పదనిపించింది. ఈ దశలో ఇషాన్, శ్రేయస్ ‘లెఫ్ట్–రైట్’ కాంబినేషన్ తో అదరగొట్టారు. మొదట ఆచి తూచి ఆడిన ఈ జోడీ మ్యాచ్ సాగేకొద్దీ దంచేసే పనిలో పడింది. 20.3 ఓవర్లో భారత్ వంద స్కోరు దాటింది. కేశవ్ వేసిన 21వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన ఇషాన్ తర్వాత నోర్జేనూ చితకబాదాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ చక్కని ప్లేసింగ్‌తో చూడముచ్చటైన బౌండరీలతో అలరించాడు. ముందుగా ఇషాన్ 60 బంతుల్లో (2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆ తర్వాత అయ్యర్ 48 బంతుల్లో (7 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించారు. కెప్టెన్ కేశవ్ మహరాజ్ మార్చిమార్చి బౌలర్లను ప్రయోగించినా ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టలేకపోయాడు. భారత బ్యాటర్లు చెలరేగడంతో 33.3 ఓవర్లో స్కోరు 200 పరుగులు దాటింది. కేవలం 16.3 ఓవర్లలో 79 పరుగుల విజయ సమీకరణం సులువైపోయింది. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న ఇషాన్‌ను ఫోర్టున్ అవుట్ చేశాడు. దీంతో 161 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత సామ్సన్ (30 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి అయ్యర్ అజేయంగా లక్ష్యాన్ని పూర్తిచేశాడు. ఈ క్రమంలో శ్రేయస్ 103 బంతుల్లో (14 ఫోర్లు) వన్డేల్లో తన రెండో శతకాన్ని సాధించాడు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (బి) సిరాజ్ 5; మలాన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షహబాజ్ 25; హెండ్రిక్స్ (సి) షహబాజ్ (బి) సిరాజ్ 74; మార్క్రమ్ (సి) ధావన్ (బి) సుందర్ 79; క్లాసెన్ (సి) సిరాజ్ (బి) కుల్దీప్ 30; మిల్లర్ (నాటౌట్) 35; పార్నెల్ (సి) శ్రేయస్ (బి) శార్దుల్ 16; కేశవ్ (బి) సిరాజ్ 5; ఫోర్టున్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 278. వికెట్ల పతనం: 1–7, 2–40, 3–169, 4–215, 5–215, 6–256, 7–277. బౌలింగ్: సిరాజ్ 10–1–38–3, వాషింగ్టన్ సుందర్ 9–0–60–1, షహబాజ్ అహ్మద్ 10–0– 54–1, అవేశ్ ఖాన్ 7–0–35–0, కుల్దీప్ యాదవ్ 9–0–49–1, శార్దుల్ ఠాకూర్ 5–0–36–1. భారత్ ఇన్నింగ్స్: ధావన్ (బి) పార్నెల్ 13; గిల్ (సి అండ్ బి) రబడ 28; ఇషాన్ కిషన్ (సి) హెండ్రిక్స్ (బి) ఫోర్టున్ 93; శ్రేయస్ (నాటౌట్) 113; సామ్సన్ (నాటౌట్) 30; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (45.5 ఓవర్లలో 3 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–28, 2–48, 3–209. బౌలింగ్: ఫోర్టున్ 9–1– 52–1, వేన్ పార్నెల్ 8–0–44–1, రబడ 10–1– 59–1, నోర్జే 8.5–0–60–0, కేశవ్ మహరాజ్ 7–0–45–0, మార్క్రమ్ 3–0–22–0. -
IND vs SA 2nd T20: పరుగుల వర్షంలో తేడా పదహారే!
గువహటి: మ్యాచ్ ఆరంభానికి కొద్దిసేపు ముందు వరకు కూడా వాన ఆటకు అంతరాయం కలిగించేలా కనిపించింది. అయితే ఆపై అసలు వర్షమైతే రాలేదు కానీ ‘బర్సపారా’ మైదానంలో పరుగుల వర్షం కురిసింది. ముందుగా భారత్ మెరుపు బ్యాటింగ్‌తో భారీ స్కోరు నమోదు చేయగా... అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా చివరి వరకు పోరాడింది. చివరకు 16 పరుగుల తేడాతో గెలిచిన భారత్ స్వదేశంలో దక్షిణాఫ్రికాపై 2–0తో తొలిసారి ద్వైపాక్షిక సిరీస్ సొంతం చేసుకుంది. సిరీస్‌లో చివరిదైన మూడో టి20 మంగళవారం ఇండోర్‌లో జరుగుతుంది. ఆదివారం జరిగిన రెండో టి20లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. టి20ల్లో ఇది భారత్‌కు నాలుగో అత్యధిక స్కోరు. సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 61; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేఎల్ రాహుల్ (28 బంతుల్లో 57; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీలు సాధించగా, కోహ్లి (28 బంతుల్లో 49 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ శర్మ (37 బంతుల్లో 43; 7 ఫోర్లు, 1 సిక్స్) అదే స్థాయిలో చెలరేగారు. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 221 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (47 బంతుల్లో 106 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు), డి కాక్ (48 బంతుల్లో 69 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) నాలుగో వికెట్‌కు 84 బంతుల్లోనే అభేద్యంగా 174 పరుగులు జోడించినా జట్టును గెలిపించలేకపోయారు. ఒకరితో పోటీ పడి మరొకరు... గత మ్యాచ్‌లో డకౌటైన రోహిత్ ఈసారి కొన్ని చక్కటి షాట్లతో శుభారంభం చేయగా, మరో ఎండ్ లో రాహుల్ మొదటినుంచే దూకుడు ప్రదర్శించాడు. పార్నెల్ ఓవర్లో అతను వరుసగా 6, 4 కొట్టగా రోహిత్ మరో ఫోర్ సాధించాడు. పవర్‌ప్లేలో భారత్ 57 పరుగులు చేసింది. ఆ తర్వాత నోర్జే వేసిన 9వ ఓవర్లో భారత్ పండగ చేసుకుంది. రాహుల్ వరుసగా 4, 6 బాదగా, రోహిత్ మరో రెండు ఫోర్లు కొట్టడంతో ఆ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. తొలి వికెట్‌కు 59 బంతుల్లో 96 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ వెనుదిరగ్గా... 24 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత రాహుల్ అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత సూర్య విధ్వంసం దక్షిణాఫ్రికాను అచేతనంగా మార్చేసింది. తొలి నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు కొట్టిన అతను రబడ ఓవర్లో చెలరేగిపోయాడు. అతను 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 22 పరుగులు వచ్చాయి. పార్నెల్ వేసిన బంతిని మరో భారీ సిక్సర్‌గా మలచిన సూర్య 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. మరోవైపు తన తొలి 14 బంతుల్లో 18 పరుగులు చేసిన కోహ్లి, తర్వాతి 14 బంతుల్లో 31 పరుగులు సాధించాడు. ఎట్టకేలకు సూర్య రనౌటైనా... చివరి ఓవర్లో దినేశ్ కార్తీక్ (7 బంతుల్లో 17 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మరిన్ని పరుగులు జోడించాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (ఎల్బీ) (బి) మహరాజ్ 57; రోహిత్ (సి) స్టబ్స్ (బి) మహరాజ్ 43; కోహ్లి (నాటౌట్) 49; సూర్యకుమార్ (రనౌట్) 61; కార్తీక్ (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 237. వికెట్ల పతనం: 1–96, 2–107, 3–209. బౌలింగ్: రబడ 4–0–57–0, పార్నెల్ 4–0–54–0, ఇన్‌గిడి 4–0–49–0, మహరాజ్ 4–0–23–2, నోర్జే 3–0–41–0, మార్క్రమ్ 1–0–9–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: బవుమా (సి) కోహ్లి (బి) అర్‡్షదీప్ 0; డికాక్ (నాటౌట్) 69; రోసో (సి) కార్తీక్ (బి) అర్‡్షదీప్ 0; మార్క్రమ్ (బి) అక్షర్ 33; మిల్లర్ (నాటౌట్) 106; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–47. బౌలింగ్: చహర్ 4–1–24–0, అర్‡్షదీప్ 4–0–62–2, అశ్విన్ 4–0–37–0, అక్షర్ 4–0–53–1, హర్షల్ 4–0–45–0. -
India vs South Africa 1st T20: ఆరంభం అదిరింది
తిరువనంతపురం: ప్రపంచకప్‌నకు ముందు చివరి టి20 సిరీస్ ఆడుతున్న భారత్ సులువైన శుభారంభం చేసింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ బృందం ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత సీమర్లు దీపక్ చహర్ (2/24), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అర్ష్‌దీప్ సింగ్ (3/32), హర్షల్ పటేల్ (2/26) నిప్పులు చెరిగారు. అనంతరం బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్ (33 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 51 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) బాధ్యతగా ఆడారు. దాంతో ఆసక్తికరంగా జరుగుతుందనుకున్న తొలిపోరు ఏకపక్షంగా ముగిసింది. మొదట దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులే చేసింది. కేశవ్ మహరాజ్ (35 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. తర్వాత భారత్ 16.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసి గెలిచింది. సూర్య, రాహుల్ మూడో వికెట్‌కు 93 పరుగులు జోడించారు. సిరీస్ లో రెండో టి20 అక్టోబర్ 2న గువాహటిలో జరుగుతుంది. చహర్, అర్ష్‌దీప్ దడదడ 1 పరుగుకే వికెట్! బవుమా (0) క్లీన్‌బౌల్డ్. రెండో ఓవర్లో అదే పరుగు వద్ద రెండో వికెట్... డికాక్ (1)కూడా బౌల్డే! దీన్నుంచి తేరుకోకముందే ఆ ఓవర్లోనే రోసో (0), మిల్లర్ (0) ఇద్దరు వరుస బంతుల్లోనే డకౌట్. మూడో ఓవర్లో స్టబ్స్ (0) కూడా ఖాతా తెరువలేదు. 1, 3వ ఓవర్లు వేసిన దీపక్ చహర్ (2/2), ఒక్క రెండో ఓవర్ వేసిన అర్ష్‌దీప్ (3/7) పేస్‌కు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కకావికలమైంది. జట్టు స్కోరు 9/5. ఇలా పది పరుగులైనా చేయకముందే సగం వికెట్లను కోల్పోయింది. మార్క్రమ్ (25; 3 ఫోర్లు, 1 సిక్స్), పార్నెల్ (24; 1 ఫోర్, 1 సిక్స్) ఇద్దరూ కాసేపు నిలబడటంతో కష్టంగా జట్టు స్కోరు 50 దాటింది. అనంతరం కేశవ్ మహరాజ్ కొట్టిన కాసిన్ని మెరుపులతో మొత్తానికి వంద పైచిలుకు స్కోరైతే చేయగలిగింది. ఇంత తక్కువ స్కోరులోనూ 19వ ఓవర్ పరుగందుకోవడం భారత శిబిరానికి మింగుడుపడని అంశం. అర్ష్‌దీప్ ఓవర్లో కేశవ్ మహరాజ్ 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17 పరుగులు వచ్చాయి. సూర్య, రాహుల్ ఫిఫ్టీ–ఫిఫ్టీ లక్ష్యం ఛేదించే క్రమంలో భారత టాపార్డర్కూ కఠిన సవాళ్లు ఎదురయ్యాయి. సీనియర్లు రోహిత్ శర్మ (0), కోహ్లి (3) దక్షిణాఫ్రికా పేసర్లు రబడ, నోర్జేలకు తలవంచారు. దీంతో భారత్ పవర్‌ప్లేలో 17 పరుగులే చేయగలిగింది. పిచ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకున్న మరో ఓపెనర్ రాహుల్, హిట్టర్ సూర్యకుమార్ జాగ్రత్త పడ్డారు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడకుండా ఆచితూచి ఆడారు. సగం ఓవర్లు ముగిసినా భారత్ స్కోరు 50ని చేరుకోలేదు. 10 ఓవర్లలో 47/2 స్కోరే చేసింది. తర్వాత సూర్య బ్యాట్ ఝుళిపించాడు. రాహుల్ కూడా పరుగుల వేగం పెంచాడు. కుదిరిన బంతిని 4గా, చెత్త బంతిని 6గా దంచేశారు. దీంతో మరో 6.4 ఓవర్లలోనే మిగతా 63 పరుగుల్ని చకచకా చేసేసింది. లక్ష్యం చేరుకున్న 17వ ఓవర్లోనే సూర్య 33 బంతుల్లో, రాహుల్ 56 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (బి) అర్ష్‌దీప్ 1; బవుమా (బి) దీపక్ చహర్ 0; రోసో (సి) పంత్ (బి) అర్ష్‌దీప్ సింగ్ 0; మార్క్రమ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్షల్ పటేల్ 25; డేవిడ్ మిల్లర్ (బి) అర్ష్‌దీప్ 0; స్టబ్స్ (సి) అర్ష్‌దీప్ (బి) చహర్ 0; పార్నెల్ (సి) సూర్యకుమార్ (బి) అక్షర్ 24; కేశవ్ (బి) హర్షల్ 41; రబడ (నాటౌట్) 7; నోర్జే (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 106. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–8, 4–8, 5–9, 6–42, 7–68, 8–101. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–24–2, అర్ష్‌దీప్ సింగ్ 4–0–32–3, అశ్విన్ 4–1–8–0, హర్షల్ పటేల్ 4–0– 26–2, అక్షర్ పటేల్ 4–0–16–1. భారత్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (నాటౌట్) 51; రోహిత్ శర్మ (సి) డికాక్ (బి) రబడ 0; విరాట్ కోహ్లి (సి) డికాక్ (బి) నోర్జే 3; సూర్యకుమార్ యాదవ్ (నాటౌట్) 50; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (16.4 ఓవర్లలో 2 వికెట్లకు) 110. వికెట్ల పతనం: 1–9, 2–17. బౌలింగ్: రబడ 4–1–16–1, పార్నెల్ 4–0–14–0, నోర్జే 3–0–32–1, షమ్సీ 2.4–0–27–0, కేశవ్ మహరాజ్ 3–0–21–0. 56: అంతర్జాతీయ టి20ల్లో ఎక్కువ బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో రాహుల్ 56 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. గతంలో ఈ రికార్డు గంభీర్ (54 బంతుల్లో ఆస్ట్రేలియాపై 2012లో) ఉంది. 732: ఒకే ఏడాది అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్ గుర్తింపు పొందాడు. ఈ ఏడాది సూర్యకుమార్ 21 మ్యాచ్‌లు ఆడి 732 పరుగులు చేశాడు. గతంలో ఈ రికార్డు శిఖర్ ధావన్ (689 పరుగులు; 2018లో) పేరిట ఉంది. 16: ఒకే ఏడాది అంతర్జాతీయ టి20ల్లో భారత్‌కు ఎక్కువ విజయాలు (16) అందించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు. ధోని (2016లో 15 విజయాలు) పేరిట ఉన్న రికార్డును రోహిత్ సవరించాడు. -
World Cadets Chess Championship: శుభి, చార్వీలకు స్వర్ణాలు
బాతూమి (జార్జియా): ప్రపంచ క్యాడెట్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో అండర్–12 బాలికల విభాగంలో శుభి గుప్తా... అండర్–8 బాలికల విభాగంలో చార్వీ విజేతలుగా నిలిచారు. ఘాజియాబాద్‌కు చెందిన శుభి గుప్తా నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 8.5 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించింది. బెంగళూరుకు చెందిన చార్వీ నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 9.5 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. సంహిత పుంగవనం 7.5 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. అండర్–8 ఓపెన్ కేటగిరీలో సఫిన్ సఫరుల్లాఖాన్ కాంస్య పతకం గెలిచాడు. కేరళకు చెందిన సఫిన్ తొమ్మిది పాయింట్లు స్కోరు చేశాడు. -
IND vs AUS 3rd T20: మెరిసిన కోహ్లి, సూర్య కుమార్.. భారత్ భలే గెలుపు
India Vs Australia T20 Series- 3rd T20- Hyderabad: ఆస్ట్రేలియాకు లభించిన ఆరంభం చూస్తే స్కోరు 200 ఖాయమనిపించింది. కానీ మన బౌలర్లు మిడిలార్డర్లో ప్రత్యర్థిని కదలనీయలేదు. చివరకు అంతకంటే తక్కువ స్కోరుకే పరిమితం చేసేశారు. మనకు లభించిన ఆరంభం చూస్తే ఛేదన కష్టమనిపించింది. కానీ సూర్యకుమార్, కోహ్లి దానిని సునాయాసం చేసేశారు. కీలక సమయాల్లో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన జట్టుకు మరో గుర్తుంచుకోదగ్గ విజయాన్ని అందించింది. భారీ స్కోర్లతో ఆసక్తికరంగా సాగి ఆఖర్లో కాస్త ఉత్కంఠను పెంచిన పోరులో చివరకు టీమిండియాదే పైచేయి అయింది. రోహిత్ సేన ఖాతాలో మరో సిరీస్ చేరింది. రెండు రోజుల విరామం తర్వాత ఈనెల 28 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే టి20 సిరీస్‌లో భారత్ బరిలోకి దిగనుంది. సాక్షి, హైదరాబాద్: చివరి ఓవర్లో భారత్ విజయానికి 11 పరుగులు అవసరం కాగా, తొలి బంతికే కోహ్లి సిక్స్ బాదాడు. తర్వాతి 3 బంతుల్లో ఒకే పరుగు రావడంతోపాటు కోహ్లి వెనుదిరిగాడు. దాంతో 2 బంతుల్లో 4 పరుగుల చేయాల్సి రాగా... హార్దిక్ తెలివిగా ఆడిన షాట్ థర్డ్‌మాన్ దిశగా బౌండరీకి దూసుకుపోవడంతో స్టేడియంలో సంబరాలు హోరెత్తాయి. మ్యాచ్‌లో విజయంతో టి20 సిరీస్ 2–1తో భారత్ సొంతం చేసుకుంది. ఆదివారం రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన చివరి టి20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (27 బంతుల్లో 54; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), కామెరాన్ గ్రీన్ (21 బంతుల్లో 52; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 187 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (48 బంతుల్లో 63; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 62 బంతుల్లోనే 104 పరుగులు జోడించారు. మెరుపు ఓపెనింగ్... ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మూడు భిన్నమైన దశల్లో సాగింది. ముందుగా గ్రీన్ విధ్వంసం, ఆపై భారత బౌలర్ల కట్టడితో జోరు తగ్గగా... చివర్లో డేవిడ్ దూకుడు జట్టుకు భారీ స్కోరు అందించింది. కెప్టెన్ ఫించ్ (7) విఫలం కాగా, ఆసీస్ 5 ఓవర్లలో చేసిన తొలి 62 పరుగుల్లో 52 గ్రీన్ సాధించడం విశేషం. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో వరుసగా 6,4 కొట్టిన గ్రీన్... బుమ్రా ఓవర్లో ఫోర్, 2 వరుస సిక్స్‌లతో చెలరేగాడు. అక్షర్ ఓవర్లోనూ వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. అయితే గ్రీన్ అవుటైన తర్వాత ఆసీస్ స్కోరు వేగం ఒక్కసారిగా మందగించింది. ముఖ్యంగా అక్షర్ పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని నిలువరించాడు. ఒకదశలో 27 బంతుల వ్యవధిలో 22 పరుగులు మాత్రమే చేసి ఆసీస్ 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అక్షర్ ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టాడు. అయితే డేవిడ్, స్యామ్స్ భాగస్వామ్యం కంగారూలను మళ్లీ నిలబెట్టింది. వీరిద్దరు ఏడో వికెట్‌కు 34 బంతుల్లోనే 68 పరుగులు జోడించారు. భువనేశ్వర్ ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టిన అనంతరం హర్షల్ ఓవర్లో మరో భారీ సిక్సర్‌తో 25 బంతుల్లో డేవిడ్ ఆసీస్ తరఫున తన తొలి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు బుమ్రా ఓవర్లో స్యామ్స్ 6, 4 కొట్టడం కూడా హైలైట్‌గా నిలిచింది. శతక భాగస్వామ్యం... భారీ ఛేదనలో భారత్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. 4 ఓవర్లు ముగిసేసరికి 34 పరుగులు రాగా, రాహుల్ (1), రోహిత్ (17) వెనుదిరిగారు. అయితే కోహ్లి, సూర్య భాగస్వామ్యం భారత్‌ను గెలుపు దిశగా నడిపించింది. హాజల్‌వుడ్ ఓవర్లో వరుస బంతుల్లో కోహ్లి 6, 4 కొట్టగా, స్యామ్స్ బౌలింగ్‌లో సూర్య బాదిన సిక్సర్ మైదానాన్ని హోరెత్తించింది. ఆపై జంపా ఓవర్లో రెండు వరుస సిక్సర్లు బాది సూర్య 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. హాజల్‌వుడ్ ఓవర్లోనూ 4, 6 కొట్టిన అనంతరం మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అతను వెనుదిరిగాడు. అయితే 36 బంతుల్లో 53 పరుగులు చేయాల్సిన ఈ దశలో కోహ్లి తన జోరును కొనసాగించగా, హార్దిక్ (16 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. 37 బంతుల్లో అర్ధ సెంచరీ చేరుకున్న కోహ్లి జట్టును విజయానికి చేరువగా తెచ్చి చివరి ఓవర్లో నిష్క్రమించినా హార్దిక్ మరో బంతి మిగిలి ఉండగానే పని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: గ్రీన్ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 52; ఫించ్ (సి) హార్దిక్ (బి) అక్షర్ 7; స్మిత్ (స్టంప్డ్) కార్తీక్ (బి) చహల్ 9; మ్యాక్స్‌వెల్ (రనౌట్) 6; ఇన్‌గ్లిస్ (సి) రోహిత్ (బి) అక్షర్ 24; డేవిడ్ (సి) రోహిత్ (బి) హర్షల్ 54; వేడ్ (సి అండ్ బి) అక్షర్ 1; స్యామ్స్ (నాటౌట్) 28; కమిన్స్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–44, 2–62, 3–75, 4–84, 5–115, 6–117, 7–185. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–39–1, అక్షర్ 4–0–33–3, బుమ్రా 4–0–50–0, హార్దిక్ 3–0–23–0, చహల్ 4–0–22–1, హర్షల్ 2–0–18–1. భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) వేడ్ (బి) స్యామ్స్ 1; రోహిత్ (సి) స్యామ్స్ (బి) కమిన్స్ 17; కోహ్లి (సి) ఫించ్ (బి) స్యామ్స్ 63; సూర్యకుమార్ (సి) ఫించ్ (బి) హాజల్‌వుడ్ 69; హార్దిక్ (నాటౌట్) 25; కార్తీక్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–5, 2–30, 3–134, 4–182. బౌలింగ్: స్యామ్స్ 3.5–0–33–2, హాజల్‌వుడ్ 4–0–40–1, జంపా 4–0–44–0, కమిన్స్ 4–0–40–1, గ్రీన్ 3–0–14–0, మ్యాక్స్‌వెల్ 1–0–11–0. M. O. O. D as #TeamIndia beat Australia in the third #INDvAUS T20I & seal the series win. 👍 👍 Scorecard ▶️ https://t.co/xVrzo737YV pic.twitter.com/uYBXd5GhXm — BCCI (@BCCI) September 25, 2022 -
IND vs AUS 2nd T20: భారత్ గెలుపు మెరుపులు
నాగ్‌పూర్: తడిసిన మైదానంలో ఆలస్యమైన ఆటలో భారత్ 6 వికెట్లతో ఘన విజయం సాధించింది. రెండో టి20లో ఆస్ట్రేలియాపై నెగ్గిన టీమిండియా 1–1తో సమం చేసి... సిరీస్ వేటలో నిలిచింది. వర్షం వల్ల 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్ (20 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగాడు. ఓపెనర్, కెప్టెన్ ఫించ్ (15 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. అనంతరం భారత్ 7.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (20 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసకర ఆటతో గెలిపించాడు. జంపాకు 3 వికెట్లు దక్కాయి. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి టి20 ఆదివారం హైదరాబాద్‌లో జరుగుతుంది. వేడ్ దూకుడు తక్కువ ఓవర్లు కావడంతో టాస్ నెగ్గగానే భారత కెప్టెన్ రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో కోహ్లి అద్భుత ఫీల్డింగ్‌కు గ్రీన్ (5) రనౌట్ కాగా... అదే ఓవర్లో మ్యాక్స్‌వెల్ (0)ను అక్షర్ బౌల్డ్ చేశాడు. టి20 స్పెషలిస్ట్ హిట్టర్ టిమ్ డేవిడ్ (2)ను కూడా అక్షరే తన తదుపరి ఓవర్లో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ప్రమాదకరమైన బ్యాటర్లిద్దరిని తేలిగ్గా అవుట్ చేసినప్పటికీ కెప్టెన్ ఫించ్, మాథ్యూ వేడ్ ధాటిగా ఆడి స్కోరు పెంచారు. హర్షల్ పటేల్ బౌలింగ్‌నైతే వేడ్ ఉతికి ఆరేశాడు. అతను వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో 2 బౌండరీలతో 12 పరుగులు రాగా... ఆఖరి ఓవర్ (8)లో అయితే చుక్కలే చూపించాడు. డీప్ మిడ్ వికెట్, కవర్స్, డీప్ స్క్వేర్ లెగ్ దిశగా కొట్టిన మూడు సిక్సర్లు ప్రేక్షకుల చేతుల్లో పడ్డాయి. దీంతో ఆ ఒక్క ఓవర్లోనే 19 పరుగులు ఇవ్వడంతో ఆస్ట్రేలియా 91 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. బ్యాటింగ్ జోరు... హాజల్‌వుడ్ తొలి ఓవర్లోనే రోహిత్ 2, రాహుల్ ఒక సిక్సర్ బాదేయడంతో 20 పరుగుల వచ్చాయి. ఇద్దరు పుల్, హెలికాప్టర్ షాట్లతో దంచేశారు. కమిన్స్ వేసిన రెండో ఓవర్లో ‘హిట్‌మ్యాన్’ హుక్ షాట్‌తో మరో సిక్స్ కొట్టాడు. మూడో ఓవర్లో స్పిన్నర్ జంపాను దింపగా అతనికి సిక్సర్ ధాటిని చూపాడు. ఈ ఓవర్లో రాహుల్ (10)ను అవుట్ చేసిన జంపా తన మరుసటి ఓవర్లో కోహ్లి (11)ని, సూర్యకుమార్ (0)ను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. మరోవైపు రోహిత్ తన పనిని బౌండరీలతో యథేచ్చగా కానిచ్చేయడంతో జట్టు లక్ష్యం వైపు సాగింది. హార్దిక్ పాండ్యా (9) అవుటైనా... ఆఖరి ఓవర్లో 10 పరుగులు అవసరమైన దశలో దినేశ్ కార్తీక్ రెండు బంతుల్లోనే సిక్స్, ఫోర్ల తో ముగించాడు. దీంతో 4 బంతులు మిగిలుండగానే భారత్ లక్ష్యాన్ని చేరుకుంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఫించ్ (బి) బుమ్రా 31; గ్రీన్ రనౌట్ 5; మ్యాక్స్‌వెల్ (బి) అక్షర్ 0; డేవిడ్ (బి) అక్షర్ 2; వేడ్ నాటౌట్ 43; స్మిత్ రనౌట్ 8; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (8 ఓవర్లలో 5 వికెట్లకు) 90. వికెట్ల పతనం: 1–14, 2–19, 3–31, 4–46, 5–90. బౌలింగ్: పాండ్యా 1–0–10–0, అక్షర్ 2–0–13–2, చహల్ 1–0–12–0, బుమ్రా 2–0–23–1, హర్షల్ 2–0–32–0. భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (బి) జంపా 10; రోహిత్ నాటౌట్ 46; కోహ్లి (బి) జంపా 11; సూర్యకుమార్ (ఎల్బీ) (బి) జంపా 0; పాండ్యా (సి) ఫించ్ (బి) కమిన్స్ 9; దినేశ్ కార్తీక్ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (7.2 ఓవర్లలో 4 వికెట్లకు) 92. వికెట్ల పతనం: 1–39, 2–55, 3–55, 4–77. బౌలింగ్: హాజల్‌వుడ్ 1–0–20–0, కమిన్స్ 2–0–23–1, జంపా 2–0–16–3, సామ్స్ 1.2–0–20–0, అబాట్ 1–0–11–0. -
India vs Zimbabwe 1st ODI: శుభారంభం ఓపెనర్లతోనే...
వరుస పర్యటనలో, వరుస సిరీస్ వేటలో భారత్ శుభారంభం చేసింది. చాలా కాలం తర్వాత పునరాగమనం చేసిన దీపక్ చహర్ (3/27) బౌలింగ్‌లో జింబాబ్వే బ్యాటింగ్ ఆర్డర్‌ను బెంబేలెత్తిస్తే... విజయవంతమైన గిల్–ధావన్ ఓపెనింగ్ జోడి మరొకరికి చాన్స్ ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించింది. హరారే: ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, శిఖర్ ధావన్ అజేయ అర్ధసెంచరీల కంటే కూడా దీపక్ చహర్ స్పెల్ (7–0–27–3) ఈ మ్యాచ్‌లో హైలైట్. ఆరు నెలల తర్వాత బరిలోకి దిగిన చహర్ పిచ్ పరిస్థితుల్ని అనుకూలంగా మలచుకొని వైవిధ్యమైన బంతులతో టాపార్డర్‌లో ఏ ఒక్కరిని పట్టుమని 10 పరుగులైనా చేయనివ్వలేదు. ఛేదన సులువయ్యేందుకు అతని స్పెల్ కారణమైంది. ఇదే పిచ్‌పై రెండు వారాల క్రితం వరుస మ్యాచ్‌ల్లో 290, 303 పరుగులు నమోదయ్యాయి. సులువుగా ఛేదించడం కూడా జరిగింది. అలాంటి పిచ్‌పై చహర్ బౌలింగ్ అసాధారణమనే చెప్పాలి. దీంతో గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ రెగిస్ చకాబ్వా (51 బంతుల్లో 35; 4 ఫోర్లు), రిచర్డ్ ఎన్గరవా (42 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), ఇవాన్స్ (29 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) మన బౌలింగ్‌కు కాస్త ఎదురు నిలిచారు. స్పిన్నర్ అక్షర్ పటేల్, సీమర్లు దీపక్ చహర్, ప్రసిధ్ కృష్ణ తలా 3 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 30.5 ఓవర్లలో అసలు వికెట్టే కోల్పోకుండా 192 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్ (72 బంతుల్లో 82 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్), ధావన్ (113 బంతుల్లో 81 నాటౌట్; 9 ఫోర్లు) ఇద్దరే లక్ష్యాన్ని ఛేదించేశారు. చహర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభించింది. రేపు ఇదే వేదికపై రెండో వన్డే జరుగుతుంది. చహర్ దెబ్బకు ‘టాప్’టపా వికెట్లు కొత్త బంతితో దీపక్ చహర్ చెలరేగాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో ఇన్నోసెంట్ కైయా (4)ను కీపర్ క్యాచ్‌తో పంపాడు. తన మరుసటి ఓవర్ తొలి బంతికి మరుమని (8)ని కూడా కీపర్ క్యాచ్‌తోనే పెవిలియన్ చేర్చాడు. వెస్లీ మదెవెర్ (5)ను ఎల్బీగా ఔట్ చేశాడు. అంతకుముందు ఓవర్లో సిరాజ్... సియాన్ విలియమ్స్ (1) వికెట్ తీశాడు. జింబాబ్వే 31 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది. మిడిలార్డర్ సంగతి ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్ చూసుకోవడంతో ఒక దశలో జింబాబ్వే 110/8 స్కోరుతో ఆలౌట్‌కు దగ్గరైంది. బ్రాడ్ ఇవాన్స్, రిచర్డ్ తొమ్మిదో వికెట్‌కు 70 పరుగులు జోడించడంతో ఆమాత్రం స్కోరు చేయగలిగింది. ఇద్దరే పూర్తి చేశారు టాపార్డర్‌లో ఓపెనింగ్‌ను ఇష్టపడే కెప్టెన్ రాహుల్ తను కాదని విజయవంతమైన ధావన్–గిల్ జోడితోనే ఓపెన్ చేయించాడు. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా శిఖర్–శుబ్‌మన్ జోడీ ఈ రెండు నెలల్లో మూడో శతక భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. విండీస్ గడ్డపై కనబరిచిన జోరునే జింబాబ్వేపై కూడా కొనసాగించారు. మైదానంలో బౌండరీలు, భారత్‌కు పరుగులు వస్తున్నాయి కానీ పాపం ఆతిథ్య బౌలర్లకే వికెట్ గగనమైంది. ఏకంగా ఎనిమిది మంది బౌలర్లతో వేయించిన ప్రయత్నం కూడా ఫలితాన్నివ్వలేదు. ముందుగా ధావన్ (76 బంతుల్లో 5ఫోర్లతో) ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... జట్టు స్కోరు 20వ ఓవర్లో 100 పరుగులు దాటింది. శుబ్‌మన్ కూడా (51 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. దీంతో భారత్ లక్ష్యాన్ని చేరేందుకు 30.5 ఓవర్లే సరిపోయాయి. దాదాపు 20 ఓవర్ల ముందే ఇద్దరే బ్యాటర్లు జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు జింబాబ్వే ఇన్నింగ్స్: కైయా (సి) సామ్సన్ (బి) చహర్ 4; మరుమని (సి) సామ్సన్ (బి) చహర్ 8; వెస్లీ (ఎల్బీ) (బి) చహర్ 5; సియాన్ విలియమ్స్ (సి) ధావన్ (బి) సిరాజ్ 1; సికందర్ రజా (సి) ధావన్ (బి) ప్రసిధ్ 12; చకాబ్వా (బి) అక్షర్ 35; రియాన్ బర్ల్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 11; ల్యూక్ జాంగ్వే (ఎల్బీ) (బి) అక్షర్ 13; ఇవాన్స్ నాటౌట్ 33; రిచర్డ్ (బి) ప్రసిధ్ 34; విక్టర్ (సి) గిల్ (బి) అక్షర్ 8; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (40.3 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–25, 2–26, 3–31, 4–31, 5–66, 6–83, 7–107, 8–110, 9–180, 10–189. బౌలింగ్: దీపక్ చహర్ 7–0–27–3, సిరాజ్ 8–2–36–1, కుల్దీప్ 10–1–36–0, ప్రసిధ్ 8–0–50–3, అక్షర్ 7.3–2–24–3. భారత్ ఇన్నింగ్స్: ధావన్ నాటౌట్ 81; శుబ్‌మన్ గిల్ నాటౌట్ 82; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం (30.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 192. బౌలింగ్: రిచర్డ్ ఎన్గరవా 7–0–40–0, విక్టర్ 4–0–17–0, ఇవాన్స్ 3.5–0–28–0, సియాన్ 5–0–28–0, సికందర్ రజా 6–0–32–0, ల్యూక్ జాంగ్వే 2–0–11–0, వెస్లీ 2–0–16–0, రియాన్ బర్ల్ 1–0–12–0. -
స్పిన్నర్ల మాయాజాలం.. ఆఖరి టీ20లోనూ టీమిండియాదే విజయం
ఫ్లొరిడా: ఆఖరి టి20లోనూ భారతే విజయం సాధించింది. ఐదో మ్యాచ్‌లో టీమిండియా 88 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. కరీబియన్ గడ్డపై ఒక మ్యాచ్ అయినా నెగ్గిన విండీస్‌కు అమెరికాలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం ఎదురైంది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (40 బంతుల్లో 64; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీపక్ హుడా (25 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. తర్వాత వెస్టిండీస్ 15.4 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలింది. బిష్ణోయ్ (4/16), కుల్దీప్ (3/12), అక్షర్ పటేల్ (3/15)ల స్పిన్ ఉచ్చులో పడిన కరీబియన్‌ను హెట్‌మైర్ (35 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. కానీ మిగతా బ్యాటర్స్ చేతులెత్తేయడంతో వెస్టిండీస్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా పయనించలేదు. భారత్ 4–1తో పొట్టి సిరీస్‌ను కైవసం చేసుకుంది. -
India vs Sri Lanka Womens 2nd T20: భారత్‌దే సిరీస్
దంబుల్లా: సమష్టి ఆటతీరుతో రాణించిన భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో ఐదు వికెట్లతో గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు సాధించింది. ఓపెనర్లు విష్మి గుణరత్నే (45; 6 ఫోర్లు), చమరి ఆటపట్టు (43; 7 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 13.5 ఓవర్లలో 87 పరుగులు జోడించారు. పూజా వస్త్రకర్ బౌలింగ్‌లో ఆటపట్టు అవుటయ్యాక లంక పతనం మొదలైంది. చివరి ఆరు ఓవర్లలో లంక 38 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రేణుక సింగ్, రాధా యాదవ్, పూజా వస్త్రకర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి గెలిచింది. స్మృతి మంధాన (34 బంతుల్లో 39; 8 ఫోర్లు), షఫాలీ వర్మ (10 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్), సబ్బినేని మేఘన (10 బంతుల్లో 17; 4 ఫోర్లు) దూకుడుగా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్మన్‌ప్రీత్ కౌర్ (32 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు) చివరిదాకా నిలిచి భారత్‌ను విజయతీరానికి చేర్చింది. చివరిదైన మూడో టి20 సోమవారం జరుగుతుంది. -
‘షూటౌట్’లో భారత్ గెలుపు
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్‌లో భారత్ ఆరో విజయం నమోదు చేసింది. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ‘షూటౌట్’లో 3–2తో నెగ్గింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 3–3తో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు షూటౌట్‌ను నిర్వహించారు. ముందుగా తొలి ఐదు షాట్లు ముగిశాక రెండు జట్లూ 2–2తో సమంగా నిలిచాయి. అనంతరం ఆరో షాట్లో ఇరు జట్ల ఆటగాళ్లు విఫలమయ్యారు. ఏడో షాట్లో భారత్ తరఫున అభిషేక్ గోల్ చేయగా... ఇంగ్లండ్ తరఫున లియామ్ విఫలం కావడంతో టీమిండియా విజయం ఖాయమైంది. ఈ గెలుపుతో తొమ్మిది జట్లు బరిలో ఉన్న ప్రొ లీగ్‌లో భారత్ 18 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోకి వచ్చింది. నేడు ఇంగ్లండ్‌తో ఇదే వేదికపై రెండో మ్యాచ్ ఉంది.