సూర్యకుమార్, డేవిడ్ మిల్లర్
గువహటి: మ్యాచ్ ఆరంభానికి కొద్దిసేపు ముందు వరకు కూడా వాన ఆటకు అంతరాయం కలిగించేలా కనిపించింది. అయితే ఆపై అసలు వర్షమైతే రాలేదు కానీ ‘బర్సపారా’ మైదానంలో పరుగుల వర్షం కురిసింది. ముందుగా భారత్ మెరుపు బ్యాటింగ్‌తో భారీ స్కోరు నమోదు చేయగా... అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా చివరి వరకు పోరాడింది. చివరకు 16 పరుగుల తేడాతో గెలిచిన భారత్ స్వదేశంలో దక్షిణాఫ్రికాపై 2–0తో తొలిసారి ద్వైపాక్షిక సిరీస్ సొంతం చేసుకుంది. సిరీస్‌లో చివరిదైన మూడో టి20 మంగళవారం ఇండోర్‌లో జరుగుతుంది.
ఆదివారం జరిగిన రెండో టి20లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. టి20ల్లో ఇది భారత్‌కు నాలుగో అత్యధిక స్కోరు. సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 61; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేఎల్ రాహుల్ (28 బంతుల్లో 57; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీలు సాధించగా, కోహ్లి (28 బంతుల్లో 49 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ శర్మ (37 బంతుల్లో 43; 7 ఫోర్లు, 1 సిక్స్) అదే స్థాయిలో చెలరేగారు. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్లకు 221 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ (47 బంతుల్లో 106 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు), డి కాక్ (48 బంతుల్లో 69 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) నాలుగో వికెట్‌కు 84 బంతుల్లోనే అభేద్యంగా 174 పరుగులు జోడించినా జట్టును గెలిపించలేకపోయారు.
ఒకరితో పోటీ పడి మరొకరు...
గత మ్యాచ్‌లో డకౌటైన రోహిత్ ఈసారి కొన్ని చక్కటి షాట్లతో శుభారంభం చేయగా, మరో ఎండ్ లో రాహుల్ మొదటినుంచే దూకుడు ప్రదర్శించాడు. పార్నెల్ ఓవర్లో అతను వరుసగా 6, 4 కొట్టగా రోహిత్ మరో ఫోర్ సాధించాడు. పవర్‌ప్లేలో భారత్ 57 పరుగులు చేసింది. ఆ తర్వాత నోర్జే వేసిన 9వ ఓవర్లో భారత్ పండగ చేసుకుంది. రాహుల్ వరుసగా 4, 6 బాదగా, రోహిత్ మరో రెండు ఫోర్లు కొట్టడంతో ఆ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. తొలి వికెట్‌కు 59 బంతుల్లో 96 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ వెనుదిరగ్గా... 24 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత రాహుల్ అవుటయ్యాడు.
అయితే ఆ తర్వాత సూర్య విధ్వంసం దక్షిణాఫ్రికాను అచేతనంగా మార్చేసింది. తొలి నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు కొట్టిన అతను రబడ ఓవర్లో చెలరేగిపోయాడు. అతను 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 22 పరుగులు వచ్చాయి. పార్నెల్ వేసిన బంతిని మరో భారీ సిక్సర్‌గా మలచిన సూర్య 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. మరోవైపు తన తొలి 14 బంతుల్లో 18 పరుగులు చేసిన కోహ్లి, తర్వాతి 14 బంతుల్లో 31 పరుగులు సాధించాడు. ఎట్టకేలకు సూర్య రనౌటైనా... చివరి ఓవర్లో దినేశ్ కార్తీక్ (7 బంతుల్లో 17 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మరిన్ని పరుగులు జోడించాడు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (ఎల్బీ) (బి) మహరాజ్ 57; రోహిత్ (సి) స్టబ్స్ (బి) మహరాజ్ 43; కోహ్లి (నాటౌట్) 49; సూర్యకుమార్ (రనౌట్) 61; కార్తీక్ (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 237.
వికెట్ల పతనం: 1–96, 2–107, 3–209.
బౌలింగ్: రబడ 4–0–57–0, పార్నెల్ 4–0–54–0, ఇన్‌గిడి 4–0–49–0, మహరాజ్ 4–0–23–2, నోర్జే 3–0–41–0, మార్క్‌రమ్ 1–0–9–0.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: బవుమా (సి) కోహ్లి (బి) అర్‡్షదీప్ 0; డికాక్ (నాటౌట్) 69; రోసో (సి) కార్తీక్ (బి) అర్‡్షదీప్ 0; మార్క్‌రమ్ (బి) అక్షర్ 33; మిల్లర్ (నాటౌట్) 106; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 221.
వికెట్ల పతనం: 1–1, 2–1, 3–47.
బౌలింగ్: చహర్ 4–1–24–0, అర్‡్షదీప్ 4–0–62–2, అశ్విన్ 4–0–37–0, అక్షర్ 4–0–53–1, హర్షల్ 4–0–45–0.
Comments
Please login to add a commentAdd a comment