నేడు దక్షిణాఫ్రికాతో భారత్ రెండో టి20
సమరోత్సాహంతో సూర్యకుమార్ బృందం
ఒత్తిడిలో సఫారీ జట్టు
రా. గం. 7.30 నుంచి స్పోర్ట్స్18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
జిఖెబెర్హా (పోర్ట్ ఎలిజబెత్): టి20 క్రికెట్‌లో జోరు కొనసాగించాలని పట్టుదలగా ఉన్న భారత జట్టు మరో పోరుకు సన్నద్ధమైంది. నేడు దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టి20లో భారత్ తలపడుతుంది. తొలి మ్యాచ్‌లో నెగ్గిన టీమిండియా ఇక్కడా విజయం సాధిస్తే 2–0తో ముందంజ వేస్తుంది. నాలుగు మ్యాచ్‌ల ఈ సమరంలో ఆపై సిరీస్ కోల్పోయే అవకాశం మాత్రం ఉండదు.
మరో వైపు స్వదేశంలో కూడా ప్రభావం చూపలేక సమష్టి వైఫల్యంతో చిత్తయిన దక్షిణాఫ్రికాపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తమ అవకాశాలు కాపాడుకోవాలని ఆ జట్టు భావిస్తోంది. ఇక్కడి పిచ్‌పై చక్కటి బౌన్స్ ఉండటంతో అటు బ్యాటింగ్‌కు, ఇటు పేస్ బౌలింగ్‌కు అనుకూలం కాబట్టి ఆసక్తికర పోరు జరగవచ్చు. మ్యాచ్ రోజున వర్షం పడే అవకాశం తక్కువ. అంతర్జాతీయ టి20ల్లో వరుసగా 11 మ్యాచ్‌లు గెలిచిన భారత్ ఈ సారి కూడా విజయం సాధిస్తే తమ రికార్డు (12 మ్యాచ్‌లు)నే సమం చేస్తుంది.
అందరూ చెలరేగితే...
తొలి టి20లో భారత్ బ్యాటింగ్ పదునేమిటో కనిపించింది. ఇన్నింగ్స్ చివర్లో కాస్త తడబాటుకు గురైనా స్కోరు 200 దాటడం విశేషం. సంజు సామ్సన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతుండటం సానుకూలాశం కాగా మరో ఓపెనర్ అభిషేక్ శర్మ అంచనాలను అందుకోవాల్సి ఉంది. వరుసగా విఫలమవుతున్న అతనికి ఇది చివరి అవకాశం కావచ్చు. సూర్యకుమార్ ఎప్పటిలాగే తనదైన శైలిలో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించడం ఖాయం.
తిలక్ వర్మ కూడా తొలి పోరులో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. చివరి ఓవర్లలో వేగంగా ఆడే క్రమంలో పాండ్యా, రింకూ సింగ్ తొందరగానే అవుటైనా వారు తమ స్థాయికి తగినట్లు ఆడితే భారత్‌కు తిరుగుండదు. ఏడో స్థానంలో అక్షర్ పటేల్ లాంటి ఆల్‌రౌండర్ అందుబాటులో ఉండటం జట్టు బ్యాటింగ్ లోతును చూపిస్తోంది. బౌలింగ్‌లో కూడా వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ స్పిన్‌ను అర్థం చేసుకోవడంతో సఫారీలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పేసర్ అర్‡్షదీప్ కూడా సత్తా చాటుతుండగా...పునరాగమనంలో అవేశ్ ఆకట్టుకున్నాడు. ఇలాంటి లైనప్ ఉన్న జట్టు మరోసారి చెలరేగితే వరుసగా రెండో విజయం జట్టు ఖాతాలో చేరడం ఖాయం.
గెలిపించేది ఎవరు...
సొంతగడ్డపై ఇటీవలే విండీస్ చేతిలో 0–3తో టి20 సిరీస్‌ను చేజార్చుకున్న దక్షిణాఫ్రికా ఈ ఫార్మాట్‌లో ఇంకా తడబడుతూనే ఉంది. తొలి పోరులో బౌలర్ల వైఫల్యంతో ముందుగా భారీగా పరుగులిచ్చుకున్న జట్టు...ఆ తర్వాత బ్యాటింగ్‌లో సాధారణ ప్రదర్శన కూడా చూపించలేదు. మార్క్‌రమ్ మళ్లీ విఫలం కాగా...రికెల్‌టన్, స్టబ్స్ కూడా నిలబడలేకపోయారు. క్లాసెన్, మిల్లర్ జోడీపై జట్టు అతిగా ఆధారపడుతున్నట్లు అనిపిస్తోంది.
వీరిద్దరు వెనుదిరిగితే చాలు ప్రత్యర్థి చేతికి మ్యాచ్ అప్పగించినట్లే కనిపిస్తోంది. పేరుకే ఆల్‌రౌండర్ అయినా మార్కో జాన్సెన్ ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. కొయెట్జీతో పాటు ఇతర బౌలర్లు కూడా రాణిస్తేనే భారత్‌ను సఫారీలు నిలువరించగలరు. పీటర్, సిమ్‌లేన్ గత మ్యాచ్‌లో విఫలమైనా... మరో మ్యాచ్‌లో అవకాశం దక్కవచ్చు. స్పిన్నర్‌గా కేశవ్ మహరాజ్ కూడా రాణించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment