రెండో టి20లో భారత్ పరాజయం
3 వికెట్ల తేడాతో నెగ్గిన దక్షిణాఫ్రికా
వరుణ్ మాయాజాలం వృథా
సఫారీ జట్టును గెలిపించిన స్టబ్స్
13న మూడో టి20 మ్యాచ్
పోర్ట్ ఎలిజబెత్: భారత్ చేసింది 124/6. తక్కువ స్కోరే! దక్షిణాఫ్రికా ముందున్న లక్ష్యం 125. సులువైందే! కానీ భారత ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (4–0–17–5) బిగించిన ఉచ్చు సఫారీని ఓటమి కోరల్లో పడేసింది. ఈ దశలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రిస్టన్ స్టబ్స్ (41 బంతుల్లో 47 నాటౌట్; 7 ఫోర్లు) చేసిన పోరాటం ఆతిథ్య జట్టును గెలిపించింది.
ఆదివారం జరిగిన రెండో టి20లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో భారత్‌పై గెలిచింది. దాంతో నాలుగు టి20ల సిరీస్‌లో రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. 13న సెంచూరియన్‌లో మూడో టి20 జరుగనుంది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులు చేసింది.
హార్దిక్ పాండ్యా (45 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడంతే! అనంతరం లక్ష్యఛేదనకు దిగిన సఫారీ జట్టు 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసి గెలిచింది. కొయెట్జీ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) చేసిన కీలక పరుగులు, స్టబ్స్ పోరాటంతో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది.
కష్టాలతో మొదలై...
ఇన్నింగ్స్ మొదలైన తొలి ఓవర్లోనే జాన్సెన్ మూడో బంతికి సంజూ సామ్సన్ (0) క్లీన్‌బౌల్డయ్యాడు. తర్వాతి కొయెట్జీ ఓవర్ మూడో బంతికి అభిషేక్ శర్మ (4) కీపర్ క్యాచ్ నుంచి రివ్యూకెళ్లి బతికిపోయినా... మరో రెండు బంతులకే భారీ షాట్‌కు ప్రయతి్నంచి జాన్సెన్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో 5 పరుగులకే భారత్ ఓపెనర్లను కోల్పోయింది. ఈ కష్టాలు చాలవన్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ (4) సిమ్‌లేన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.
15 పరుగులకే టాపార్డర్ కూలిపోగా... పవర్‌ప్లేలో భారత్ 34/3 స్కోరు చేసింది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ జోడీ ఠాకూర్ తిలక్ వర్మ (20 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్), అక్షర్ పటేల్ (21 బంతుల్లో 27; 4 ఫోర్లు) నిలదొక్కుకోకుండా మార్క్‌రమ్ చేశాడు. అతని బౌలింగ్‌లో తిలక్ షాట్ ఆడగా బుల్లెట్‌లా దూసుకొచ్చిన బంతిని మిల్లర్ గాల్లో ఎగిరి ఒంటిచేత్తో అందుకున్నాడు. అక్షర్ పటేల్ (21 బంతుల్లో 27; 4 ఫోర్లు) దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు.
పీటర్ వేసిన 12వ ఓవర్లో హార్దిక్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడగా... అది నేరుగా వెళ్లి నాన్–స్ట్రయిక్ ఎండ్‌లోని వికెట్లకు తగిలింది. ఈ లోపే బంతిని అడ్డుకోబోయిన పీటర్ చేతికి టచ్ అయ్యింది. అక్షర్ రీప్లే వచ్చేవరకు వేచిచూడకుండా పెవిలియన్ వైపు నడిచాడు. దీంతో 70 పరుగులకే టీమిండియా సగం వికెట్లను కోల్పోయింది. తర్వాత వచ్చిన రింకూ (9)ను పీటరే అవుట్ చేశాడు. రింకూ ఆడిన షాట్‌ను షార్ట్‌ఫైన్ లెగ్‌లో కొయెట్జీ అందుకున్నాడు.
ఎట్టకేలకు 17వ ఓవర్లో పాండ్యా బౌండరీతో జట్టు స్కోరు వందకు చేరింది. జాన్సెన్ వేసిన 18వ ఓవర్లో పాండ్యా 2 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. చివరి రెండు డెత్ ఓవర్లను కొయెట్జీ, జాన్సెన్ చక్కగా నియంత్రించారు. పాండ్యా ఆఖరిదాకా క్రీజులో ఉన్నప్పటికీ కొయెట్జీ 19వ ఓవర్లో 3 పరుగులే ఇవ్వగా, జాన్సన్ ఆఖరి ఓవర్లో 6 పరుగులు వచ్చాయి.
వరుణ్ తిప్పేసినా...
సొంతగడ్డపై ప్రత్యర్థి స్వల్ప లక్ష్యమే నిర్దేశించినా... దక్షిణాఫ్రికా ఆపసోపాలు పడి గెలిచింది. హెండ్రిక్స్, కెపె్టన్ మార్క్‌రమ్ (3), జాన్సెన్ (7), క్లాసెన్ (2), మిల్లర్ (0)లను అవుట్ చేసిన వరుణ్ చక్రవర్తి ఆశలు రేపాడు. ఒక దశలో 64/3 వద్ద పటిష్టంగా కనిపించిన సఫారీ అంతలోనే వరుణ్ స్పిన్ ఉచ్చులో పడి 66 పరుగులకే 6 వికెట్లను కోల్పోయి ఓటమి ప్రమాదాన్ని తెచ్చుకుంది. కాసేపటికే సిమ్‌లేన్ (7)ను రవి బిష్ణోయ్ బౌల్డ్ చేయడంతో భారత్ శిబిరం ఆనందంలో మునిగితేలింది.
24 బంతుల్లో 37 పరుగులు చేయాల్సి ఉండగా, అర్ష్ దీప్ 17వ ఓవర్లో కొయెట్జీ 6, స్టబ్స్ 4 బాదారు. దీంతోనే సఫారీ జట్టు స్కోరు 100కు చేరింది. ఇక 18 బంతుల్లో 24 పరుగుల సమీకరణం వద్ద అవేశ్ బౌలింగ్‌కు దిగడంతో మ్యాచ్ స్వరూపమే మారింది. చెత్త బంతులేసిన అవేశ్ ఖాన్ రెండు ఫోర్లు సహా 12 పరుగులు సమర్పించుకున్నాడు. తర్వాతి ఓవర్ అర్ష్ దీప్ వేయగా స్టబ్స్ 4, 4, 0, 0, 4, 4లతో ఇంకో ఓవర్ మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించాడు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (బి) జాన్సెన్ 0; అభిషేక్ (సి) జాన్సెన్ (బి) కొయెట్జీ 4; సూర్యకుమార్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిమ్‌లేన్ 4; తిలక్ (సి) మిల్లర్ (బి) మార్క్‌రమ్ 20; అక్షర్ (రనౌట్) 27; పాండ్యా (నాటౌట్) 39; రింకూ (సి) కొయెట్జీ (బి) పీటర్ 9; అర్ష్ దీప్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 124. వికెట్ల పతనం: 1–0, 2–5, 3–15, 4–45, 5–70, 6–87. బౌలింగ్: జాన్సెన్ 4–1–25–1, కొయెట్జీ 4–0–25–1, సిమ్‌లేన్ 3–0–20–1, కేశవ్ 4–0– 24–0, మార్క్‌రమ్ 1–0–4–1, పీటర్ 4–0–20–1.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) రింకూ (బి) అర్ష్ దీప్ 13; హెండ్రిక్స్ (బి) వరుణ్ 24; మార్క్‌రమ్ (బి) వరుణ్ 3; స్టబ్స్ (నాటౌట్) 47; జాన్సెన్ (బి) వరుణ్ 7; క్లాసెన్ (సి) రింకూ (బి) వరుణ్ 2; మిల్లర్ (బి) వరుణ్ 0; సిమ్‌లేన్ (బి) బిష్ణోయ్ 7; కొయెట్జీ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో 7 వికెట్లకు) 128. వికెట్ల పతనం: 1–22, 2–33, 3–44, 4–64, 5–66, 6–66, 7–86.
బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–41–1, అవేశ్ 3–0–23–0, హార్దిక్ 3–0–22–0, వరుణ్ 4–0–17–5,
రవి బిష్ణోయ్ 4–0–21–1, అక్షర్ 1–0–2–0.
Comments
Please login to add a commentAdd a comment