కోహ్లి; బీసీసీఐ కోశాధికారి అరుణ్ సింగ్ చేతుల మీదుగా టి20 సిరీస్ ట్రోఫీ అందుకుంటున్న రోహిత్ శర్మ; సూర్య కుమార్
India Vs Australia T20 Series- 3rd T20- Hyderabad: ఆస్ట్రేలియాకు లభించిన ఆరంభం చూస్తే స్కోరు 200 ఖాయమనిపించింది. కానీ మన బౌలర్లు మిడిలార్డర్‌లో ప్రత్యర్థిని కదలనీయలేదు. చివరకు అంతకంటే తక్కువ స్కోరుకే పరిమితం చేసేశారు. మనకు లభించిన ఆరంభం చూస్తే ఛేదన కష్టమనిపించింది. కానీ సూర్యకుమార్, కోహ్లి దానిని సునాయాసం చేసేశారు.
కీలక సమయాల్లో టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన జట్టుకు మరో గుర్తుంచుకోదగ్గ విజయాన్ని అందించింది. భారీ స్కోర్లతో ఆసక్తికరంగా సాగి ఆఖర్లో కాస్త ఉత్కంఠను పెంచిన పోరులో చివరకు టీమిండియాదే పైచేయి అయింది. రోహిత్ సేన ఖాతాలో మరో సిరీస్ చేరింది. రెండు రోజుల విరామం తర్వాత ఈనెల 28 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే టి20 సిరీస్‌లో భారత్ బరిలోకి దిగనుంది.
సాక్షి, హైదరాబాద్: చివరి ఓవర్లో భారత్ విజయానికి 11 పరుగులు అవసరం కాగా, తొలి బంతికే కోహ్లి సిక్స్ బాదాడు. తర్వాతి 3 బంతుల్లో ఒకే పరుగు రావడంతోపాటు కోహ్లి వెనుదిరిగాడు. దాంతో 2 బంతుల్లో 4 పరుగుల చేయాల్సి రాగా... హార్దిక్ తెలివిగా ఆడిన షాట్ థర్డ్‌మాన్ దిశగా బౌండరీకి దూసుకుపోవడంతో స్టేడియంలో సంబరాలు హోరెత్తాయి. మ్యాచ్‌లో విజయంతో టి20 సిరీస్ 2–1తో భారత్ సొంతం చేసుకుంది. ఆదివారం రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన చివరి టి20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్ (27 బంతుల్లో 54; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), కామెరాన్ గ్రీన్ (21 బంతుల్లో 52; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 187 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (48 బంతుల్లో 63; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 62 బంతుల్లోనే 104 పరుగులు జోడించారు.
మెరుపు ఓపెనింగ్...
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మూడు భిన్నమైన దశల్లో సాగింది. ముందుగా గ్రీన్ విధ్వంసం, ఆపై భారత బౌలర్ల కట్టడితో జోరు తగ్గగా... చివర్లో డేవిడ్ దూకుడు జట్టుకు భారీ స్కోరు అందించింది. కెప్టెన్ ఫించ్ (7) విఫలం కాగా, ఆసీస్ 5 ఓవర్లలో చేసిన తొలి 62 పరుగుల్లో 52 గ్రీన్ సాధించడం విశేషం.
భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో వరుసగా 6,4 కొట్టిన గ్రీన్... బుమ్రా ఓవర్లో ఫోర్, 2 వరుస సిక్స్‌లతో చెలరేగాడు. అక్షర్ ఓవర్లోనూ వరుసగా మూడు ఫోర్లు కొట్టిన అతను 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. అయితే గ్రీన్ అవుటైన తర్వాత ఆసీస్ స్కోరు వేగం ఒక్కసారిగా మందగించింది.
ముఖ్యంగా అక్షర్ పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని నిలువరించాడు. ఒకదశలో 27 బంతుల వ్యవధిలో 22 పరుగులు మాత్రమే చేసి ఆసీస్ 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత అక్షర్ ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టాడు. అయితే డేవిడ్, స్యామ్స్ భాగస్వామ్యం కంగారూలను మళ్లీ నిలబెట్టింది.
వీరిద్దరు ఏడో వికెట్‌కు 34 బంతుల్లోనే 68 పరుగులు జోడించారు. భువనేశ్వర్ ఓవర్లో వరుసగా 6, 6, 4 కొట్టిన అనంతరం హర్షల్ ఓవర్లో మరో భారీ సిక్సర్‌తో 25 బంతుల్లో డేవిడ్ ఆసీస్ తరఫున తన తొలి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు బుమ్రా ఓవర్లో స్యామ్స్ 6, 4 కొట్టడం కూడా హైలైట్‌గా నిలిచింది.
శతక భాగస్వామ్యం...
భారీ ఛేదనలో భారత్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. 4 ఓవర్లు ముగిసేసరికి 34 పరుగులు రాగా, రాహుల్ (1), రోహిత్ (17) వెనుదిరిగారు. అయితే కోహ్లి, సూర్య భాగస్వామ్యం భారత్‌ను గెలుపు దిశగా నడిపించింది. హాజల్‌వుడ్ ఓవర్లో వరుస బంతుల్లో కోహ్లి 6, 4 కొట్టగా, స్యామ్స్ బౌలింగ్‌లో సూర్య బాదిన సిక్సర్ మైదానాన్ని హోరెత్తించింది. ఆపై జంపా ఓవర్లో రెండు వరుస సిక్సర్లు బాది సూర్య 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు.
హాజల్‌వుడ్ ఓవర్లోనూ 4, 6 కొట్టిన అనంతరం మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అతను వెనుదిరిగాడు. అయితే 36 బంతుల్లో 53 పరుగులు చేయాల్సిన ఈ దశలో కోహ్లి తన జోరును కొనసాగించగా, హార్దిక్ (16 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచాడు. 37 బంతుల్లో అర్ధ సెంచరీ చేరుకున్న కోహ్లి జట్టును విజయానికి చేరువగా తెచ్చి చివరి ఓవర్లో నిష్క్రమించినా హార్దిక్ మరో బంతి మిగిలి ఉండగానే పని పూర్తి చేశాడు.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: గ్రీన్ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 52; ఫించ్ (సి) హార్దిక్ (బి) అక్షర్ 7; స్మిత్ (స్టంప్డ్) కార్తీక్ (బి) చహల్ 9; మ్యాక్స్‌వెల్ (రనౌట్) 6; ఇన్‌గ్లిస్ (సి) రోహిత్ (బి) అక్షర్ 24; డేవిడ్ (సి) రోహిత్ (బి) హర్షల్ 54; వేడ్ (సి అండ్ బి) అక్షర్ 1; స్యామ్స్ (నాటౌట్) 28; కమిన్స్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 186.
వికెట్ల పతనం: 1–44, 2–62, 3–75, 4–84, 5–115, 6–117, 7–185.
బౌలింగ్: భువనేశ్వర్ 3–0–39–1, అక్షర్ 4–0–33–3, బుమ్రా 4–0–50–0, హార్దిక్ 3–0–23–0, చహల్ 4–0–22–1, హర్షల్ 2–0–18–1.
భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) వేడ్ (బి) స్యామ్స్ 1; రోహిత్ (సి) స్యామ్స్ (బి) కమిన్స్ 17; కోహ్లి (సి) ఫించ్ (బి) స్యామ్స్ 63; సూర్యకుమార్ (సి) ఫించ్ (బి) హాజల్‌వుడ్ 69; హార్దిక్ (నాటౌట్) 25; కార్తీక్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.5 ఓవర్లలో 4 వికెట్లకు) 187.
వికెట్ల పతనం: 1–5, 2–30, 3–134, 4–182.
బౌలింగ్: స్యామ్స్ 3.5–0–33–2, హాజల్‌వుడ్ 4–0–40–1, జంపా 4–0–44–0, కమిన్స్ 4–0–40–1, గ్రీన్ 3–0–14–0, మ్యాక్స్‌వెల్ 1–0–11–0.
M. O. O. D as #TeamIndia beat Australia in the third #INDvAUS T20I & seal the series win. 👍 👍
— BCCI (@BCCI) September 25, 2022
Scorecard ▶️ https://t.co/xVrzo737YV pic.twitter.com/uYBXd5GhXm
Comments
Please login to add a commentAdd a comment