నువ్వా నేనా అంటూ సాగిన టి20 సమరంలో చివరకు భారత్‌దే పైచేయి అయింది. నిర్ణాయక పోరులో మన బ్యాటింగ్ బ్రహ్మాండంగా పేలగా... ఇంగ్లండ్ బ్యాటింగ్ తడబడి ఓటమిని ఆహ్వానించింది. కోహ్లి, రోహిత్‌ల అర్ధ సెంచరీలు... సూర్య, హార్దిక్ జోరు కలగలిసి 224 పరుగులతో టీమిండియా సవాల్ విసరగా... లక్ష్యానికి ప్రత్యర్థి చాలా దూరంలో ఆగిపోయింది. మలాన్, బట్లర్ జోరు ఆ జట్టు విజయంపై ఆశలు రేపినా... భువనేశ్వర్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను నిలువరించాడు. ముందుగా టెస్టు, ఆపై టి20 సిరీస్ గెలుచుకున్న కోహ్లి సేన ఇక వన్డే సిరీస్‌కు సన్నద్ధమైంది.
అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3–2తో గెలుచుకుంది. శనివారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (52 బంతుల్లో 80 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (34 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించగా... హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్‌గా దిగిన కోహ్లి ముగ్గురు సహచరులతో వరుసగా 94, 49, 81 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పడం విశేషం. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్ (46 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), జోస్ బట్లర్ (34 బంతుల్లో 52; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 82 బంతుల్లోనే 130 పరుగులు జోడించినా జట్టును గెలిపించడంలో విఫలమయ్యారు. భారీ స్కోర్ల మ్యాచ్‌లో పొదుపైన బౌలింగ్‌తో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ భువనేశ్వర్ (2/15) జట్టును గెలిపించాడు. భారత కెప్టెన్ కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది.
రోహిత్, సూర్య సూపర్...
సిరీస్ నిర్ణాయక మ్యాచ్‌లో భారత జట్టుకు అద్భుతమైన ఆరంభం లభించింది. అంతర్జాతీయ టి20ల్లో తొలిసారి జంటగా ఓపెనింగ్‌కు దిగిన రోహిత్, కోహ్లి ఓవర్‌కు 10.44 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టారు. ముందుగా రోహిత్ బాధ్యత తీసుకొని తనదైన శైలిలో చెలరేగాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టిన తర్వాత సుమారు 150 కిలోమీటర్ల వేగంతో వుడ్ వేసిన రెండు బంతులను స్ట్రయిట్ డ్రైవ్ ద్వారా బౌండరీకి తరలించిన తీరు అమితంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆరు బంతుల వ్యవధిలో మరో మూడు సిక్సర్లు బాదిన రోహిత్ 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే స్టోక్స్ వేసిన బంతిని వికెట్లపైకి ఆడుకోవడంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది. మూడో స్థానంలో వచ్చిన సూర్యకుమార్ కూడా అదే జోరు కొనసాగించడంతో భారత్ స్కోరు వేగం తగ్గలేదు. రషీద్ ఓవర్లో వరుసగా రెండు బంతులను సూర్య భారీ సిక్సర్లుగా మలచడం విశేషం. ఆ తర్వాత జోర్డాన్ బౌలింగ్‌లో అతను వరుసగా మూడు బంతుల్లో కొట్టిన మూడు ఫోర్లు హైలైట్‌గా నిలిచాయి. వేగంగా కోహ్లి స్కోరును దాటేసిన అనంతరం జోర్డాన్ అద్భుత ఫీల్డింగ్ ప్రదర్శనతో సూర్య ఇన్నింగ్స్ ముగిసింది.
కోహ్లి, పాండ్యా దూకుడు...
ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన కోహ్లి ఆ తర్వాత పుంజుకున్నాడు. రోహిత్ అవుటయ్యే సమయానికి 20 బంతుల్లో 22 పరుగులు చేసిన కెప్టెన్ తర్వాతి 32 బంతుల్లో 58 పరుగులు సాధించాడు. వుడ్, స్టోక్స్ బౌలింగ్‌లో ఒక్కో సిక్స్ కొట్టిన అతను వుడ్ మరో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. 36 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ భారీ స్కోరులో మరో ఎండ్ నుంచి హార్దిక్ కూడా కీలకపాత్ర పోషించాడు. జోర్డాన్ ఓవర్లో వరుస బంతుల్లో పాండ్యా కొట్టిన రెండు సిక్సర్లు టీమిండియా స్కోరును 200 పరుగులు దాటించాయి.
శతక భాగస్వామ్యం...
భారీ ఛేదనలో ఇంగ్లండ్ రెండో బంతికే రాయ్ (0) వికెట్‌ను కోల్పోయింది. అయితే మలాన్, బట్లర్ కలిసి భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరు పరస్పరం పోటీ పడుతూ ధాటిగా పరుగులు రాబట్టారు. పాండ్యా వేసిన రెండో ఓవర్లో మలాన్ వరుసగా 4, 6, 4 బాదగా, సుందర్ ఓవర్లో బట్లర్ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. శార్దుల్ ఓవర్లో కూడా వీరిద్దరు 14 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 62 పరుగులకు చేరింది. ఆ తర్వాత జోరు కొనసాగిస్తూ రాహుల్ చహర్ ఓవర్లో బట్లర్ రెండు సిక్సర్లు కొట్టాడు. నటరాజన్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టి మలాన్ 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... తర్వాతి ఓవర్లో 30 బంతుల్లో బట్లర్ హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. ఓవర్‌కు దాదాపు 11 పరుగుల రన్‌రేట్‌ను కొనసాగిస్తూ వీరిద్దరు చేస్తున్న బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ గెలుపు దిశగా సాగుతున్నట్లు అనిపించింది. అయితే చహర్ వేసిన 12వ ఓవర్లో 7 పరుగులే రాగా, భువనేశ్వర్ 4 బంతుల్లో 3 పరుగులే ఇవ్వడంతో ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెరిగింది. భువీ తర్వాతి బంతికి బట్లర్ వెనుదిరగడంతో జట్టు పతనం మొదలైంది. 12 పరుగుల వ్యవధిలో 4 ప్రధాన వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. 231 ఈ సిరీస్‌లో కోహ్లి చేసిన పరుగులు. కేఎల్ రాహుల్ (224 పరుగులు–2020లో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో)ను అధిగమిస్తూ ద్వైపాక్షిక టి20 సిరీస్‌లలో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) స్టోక్స్ 64; కోహ్లి (నాటౌట్) 80; సూర్యకుమార్ యాదవ్ (సి) రాయ్ (బి) రషీద్ 32; హార్దిక్ పాండ్యా (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 224.
వికెట్ల పతనం: 1–94, 2–143.
బౌలింగ్: రషీద్ 4–0–31–1; ఆర్చర్ 4–0–43–0; వుడ్ 4–0–53–0; జోర్డాన్ 4–0–57–0; స్యామ్ కరన్ 1–0–11–0; స్టోక్స్ 3–0–26–1.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (బి) భువనేశ్వర్ 0; బట్లర్ (సి) హార్దిక్ (బి) భువనేశ్వర్ 52; మలాన్ (బి) శార్దుల్ 68; బెయిర్‌స్టో (సి) సూర్యకుమార్ (బి) శార్దుల్ 7; మోర్గాన్ (సి) (సబ్) కేఎల్ రాహుల్ (బి) హార్దిక్ 1; స్టోక్స్ (సి) పంత్ (బి) నటరాజన్ 14; జోర్డాన్ (సి) సూర్య (బి) శార్దుల్ 11; ఆర్చర్ (రనౌట్) 1; స్యామ్ కరన్ (నాటౌట్) 14; రషీద్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 20, మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 188.
వికెట్ల పతనం: 1–0, 2–130, 3–140, 4–142, 5–142, 6–165, 7–168, 8–174.
బౌలింగ్: భువనేశ్వర్ 4–0–15–2; హార్దిక్ 4–0–34–1; సుందర్ 1–0–13–0; శార్దుల్ 4–0–45–3; నటరాజన్ 4–0–39–1; రాహుల్ చహర్ 3–0–33–0.
Comments
Please login to add a commentAdd a comment