t20 seris
-
India Vs South Africa 1st T20: సఫారీతో ‘సై’
తిరువనంతపురం: ఆస్ట్రేలియా గడ్డపై వచ్చే నెలలో జరిగే టి20 ప్రపంచకప్ కోసం గట్టి ప్రత్యర్థులతో ఏర్పాటు చేసిన సిరీస్‌లలో ఒకటి ఆస్ట్రేలియాపై భారత్ గెలిచింది. ఇప్పుడు రెండు రోజుల వ్యవధిలోనే సఫారీతో రెండో వేటకు సిద్ధమైంది. మేటి జట్టయిన దక్షిణాఫ్రికాతో మూడు టి20ల సిరీస్‌లో రోహిత్ బృందం తలపడనుంది. బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో శుభారంభమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీ హోరాహోరీ పోటీ కోసమే కాదు... తుది కసరత్తుకు ఆఖరి సమరంగా టీమ్ మేనేజ్మెంట్కు ఉపయోగపడనుంది. ఇప్పటికే 11 మంది ఎవరనే ప్రాథమిక అంచనాకు వచ్చిన జట్టు మేనేజ్మెంట్కు డెత్ ఓవర్ల బెంగ పట్టి పీడిస్తోంది. బుమ్రా వచ్చాక కూడా ఆఖరి ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం బౌలింగ్ దళంపై కంగారు పెట్టిస్తోంది. ఈ సమస్యను అధిగమిస్తేనే కసరత్తు పూర్తి అవుతుంది. బ్యాటింగ్ భళా భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. మరీ ముఖ్యంగా అనుభవజ్ఞులైన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఫామ్‌లో ఉండటం కాదు... సూపర్ ఫామ్‌లోకి వచ్చేశారు. ఇన్నేళ్లయినా ఇద్దరి షాట్లు కుర్రాళ్లను మించి చుక్కలు చూపిస్తున్నాయి. సూర్యకుమార్ ఇప్పుడు మెరుపుల్లో తురుపుముక్కలా మారాడు. ఆసీస్‌తో ఆఖరి మ్యాచ్ గెలుపునకు అతని ఇన్నింగ్సే అసలైన కారణం. రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ ఇలా బ్యాటింగ్‌లో అంతా మెరుగ్గానే ఉంది. నిలకడగా మెరిపిస్తోంది. ఈ సిరీస్ నుంచి హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్‌లకు విశ్రాంతి ఇచ్చారు. బౌలర్లే కీలకమైన దశలో డీలాపడటం, యథేచ్ఛగా పరుగులు కాదు వరుసబెట్టి బౌండరీలు, సిక్సర్లు ఇచ్చుకోవడం జట్టు భారీ స్కోర్లను కూడా సులువుగా కరిగిస్తున్నాయి. సవాల్‌కు సిద్ధం జోరు మీదున్న భారత్‌కు దీటైన సవాల్ విసిరేందుకు పర్యాటక దక్షిణాఫ్రికా జట్టు సిద్ధమైంది. ఓపెనింగ్‌లో డికాక్, కెప్టెన్ బవుమాలతో పాటు మిడిలార్డర్లో హార్డ్ హిట్టర్లు మార్క్రమ్, మిల్లర్లతో బ్యాటింగ్ లైనప్ ఆతిథ్య జట్టులాగే పటిష్టంగా ఉంది. ఇందులో ఏ ఇద్దరు భారత్ బౌలింగ్‌పై మెరిపించినా కష్టాలు తప్పవు. ఇక సఫారీ బౌలింగ్ ఒకింత మనకంటే మెరుగనే చెప్పాలి. ప్రిటోరియస్, రబడ, నోర్జేలు అద్భుతంగా రాణిస్తున్నారు. టి20 సమరానికి సరైన సరంజామాతోనే దక్షిణాఫ్రికా భారత్‌కు వచ్చింది. ఆసీస్‌పై గెలిచిన ధీమాతో ఏమాత్రం ఆదమరిచినా టీమిండియాకు కోలుకోలేని దెబ్బ తప్పదు. భారత క్రికెటర్లపై పూల వాన కేరళ అభిమానులు భారత క్రికెటర్లకు అడుగడుగునా జేజేలు పలికారు. విమానం దిగగానే మొదలైన హంగామా బస చేసే హోటల్ వద్దకు చేరేదాకా సాగింది. అక్కడ ఆటగాళ్లపై పూల వాన కురిసింది. కేరళ కళాకారుల నుంచి సంప్రదాయ స్వాగతం లభించింది. -
17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో ఇంగ్లండ్
కరాచీ: ప్రపంచకప్ దృష్ట్యా అన్నీ జట్లు టి20లు ఆడేందుకు తెగ సిద్ధమవుతున్నాయి. ఎన్నాళ్ల నుంచో అసలు పాక్ గడపే తొక్కని ఇంగ్లండ్ కూడా పొట్టి ఫార్మాట్లో పెద్ద ముఖాముఖీ టోర్నీ ఆడేందుకు వచ్చింది. చివరిసారిగా 2005లో పాక్‌లో పర్యటించిన ఇంగ్లండ్ 17 ఏళ్ల తర్వాత ఏడు మ్యాచ్‌ల టి20ల సిరీస్ ఆడేందుకు ఇక్కడ అడుగుపెట్టింది. మంగళవారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. రెగ్యులర్ సారథి జోస్ బట్లర్ కండరాల గాయంతో ఇబ్బంది పడుతుండగా, మొయిన్ అలీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. 20, 22, 23, 25 తేదీల్లో కరాచీలో నాలుగు మ్యాచ్‌లు... 28, 30, అక్టోబర్ 2 తేదీల్లో లాహోర్ వేదికగా మూడు టి20లు జరుగనున్నాయి. బట్లర్ ఆఖరి దశ మ్యాచ్‌ల్లో ఒకట్రెండు ఆడే అవకాశముందని జట్టు వర్గాలు తెలిపాయి. -
India vs Australia T20: సమరానికి సై
గత టి20 ప్రపంచకప్‌కు భారత జట్టు చాలా పటిష్టంగా కనిపించింది. వరుసగా రెండు సీజన్లు ఐపీఎల్ ఆడిన వేదికపై సత్తా చాటడం ఖాయమనిపించింది. అయితే అనూహ్యంగా కనీసం సెమీస్ కూడా చేరలేకపోయింది. నాటి వైఫల్యానికి కారణమైన లోపాలను సరిదిద్దుకుంటూ టీమిండియా ఆ తర్వాతి నుంచి ఆటతీరును మార్చుకుంది. ఇప్పుడు సంవత్సరం తిరిగేలోగా మరో టి20 ప్రపంచకప్‌పై దృష్టి పెట్టింది. ఆ మెగా ఈవెంట్‌కు ముందు సరిగ్గా ఆరు మ్యాచ్‌లతో రోహిత్ సేన సన్నద్ధం కానుంది. పిచ్‌లు, పరిస్థితులు భిన్నంగా ఉండబోతున్నా ఆత్మవిశ్వాసంతో ఆసీస్ విమానమెక్కేందుకు మిగిలిన మ్యాచ్‌లలోనే కూర్పు ను పరీక్షించేందుకు లభించిన అవకాశమిది. మొహాలి: ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చే జట్టుతో సొంతగడ్డపై భారత్ సమరానికి సై అంటోంది. ఆస్ట్రేలియాతో జరిగే మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే దక్షిణాఫ్రికాతో కూడా భారత్ మూడు టి20లు ఆడనుంది. వరల్డ్‌కప్‌కు టీమ్‌ను ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆటగాళ్లందరినీ ఈ ఆరు మ్యాచ్‌ల్లోనూ ఆడించి టీమ్ మేనేజ్మెంట్ ఒక అంచనాకు రానుంది. ముఖ్యంగా ఆసియా కప్‌లో టీమ్‌ను ఇబ్బంది పెట్టిన మిడిలార్డర్‌ను సరిదిద్దుకోవడం భారత్‌కు కీలకంగా మారింది. అటు ఆస్ట్రేలియా కూడా ఎక్కువ మంది యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తుండటంతో సిరీస్ ఆసక్తికరంగా సాగనుంది. మూడో పేసర్‌ను ఆడిస్తారా... ఆసియా కప్‌తో పోలిస్తే భారత జట్టులో రెండు కీలక మార్పులు ఖాయం. టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తుది జట్టులోకి రానుండగా, కొంత కాలంగా ఆటకు దూరమైన హర్షల్ పటేల్‌ను కూడా పరీక్షించడం అవసరం. అలాంటప్పుడు మరో రెగ్యులర్ బౌలర్ భువనేశ్వర్‌ను ఆడిస్తారా లేదా అనేది చూడాలి. భువీకి ఎలాగూ అనుభవం ఉంది కాబట్టి వైవిధ్యం కోసం అర్‡్షదీప్‌ను కూడా ప్రయత్నించవచ్చు. హార్దిక్ పాండ్యా మూడో పేసర్ పాత్రకు సరిపోడనేది ఆసియా కప్ నేర్పిన పాఠాల్లో ఒకటి. కాబట్టి అతడి బౌలింగ్‌ను కాకుండా రెగ్యులర్ బౌలర్‌ను నమ్ముకోక తప్పదు. ప్రధాన స్పిన్నర్‌గా చహల్‌కు చోటు ఖాయం. రెండో స్పిన్నర్‌గా అక్షర్, అశ్విన్‌లలో ఒకరికే అవకాశం దక్కుతుంది. ఈ సిరీస్‌తో పాటు వరల్డ్‌కప్ టీమ్‌లో ఉన్నా, దీపక్ హుడాకు తుది జట్టులో చోటు దక్కుతుందా చెప్పలేని పరిస్థితి. టాప్–3గా రోహిత్, రాహుల్, కోహ్లి ఖాయం కాబట్టి తర్వాతి ముగ్గురు బ్యాటర్లు మరింత బాధ్యతగా ఆడటం అవసరం. సూర్యకుమార్, పంత్, హార్దిక్ సమష్టిగా విఫలం కావడంతోనే ఆసియా కప్‌లో భారత్ ఫైనల్ చేరలేకపోయింది. హార్దిక్‌ను పూర్తి స్థాయి బ్యాటర్‌గానే చూస్తూ ఐదుగురు బౌలర్లతో ఆడితే దినేశ్ కార్తీక్‌కు స్థానం లభించడం కష్టం. ఫించ్‌పై తీవ్ర ఒత్తిడి... స్వదేశంలో వరల్డ్‌కప్‌కు ముందు మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్‌కు వచ్చి మ్యాచ్‌లు ఆడటంపై ఆస్ట్రేలియా కూడా అంత ఆసక్తిగా ఉన్నట్లు లేదు. సిరీస్‌కు ముందే విశ్రాంతి అంటూ డేవిడ్ వార్నర్ తప్పుకోగా, మరో ముగ్గురు కీలక ఆటగాళ్లు స్టార్క్, స్టొయినిస్, మిచెల్ మార్‡్ష కూడా దూరమయ్యారు. ఇలాంటి స్థితిలో కెప్టెన్ ఆరోన్ ఫించ్ కచ్చితంగా రాణించాలి. పేలవ ఫామ్‌తో వన్డేల నుంచి రిటైర్ అయిన అతను టి20ల్లోనైనా సత్తా చాటితే జట్టుకు మేలు జరుగుతుంది. ఫించ్‌తో కలిసి వేడ్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. స్మిత్ మూడో స్థానంలో ఆడతాడని ఇప్పటికే ఆసీస్ ప్రకటించగా, మ్యాక్స్‌వెల్ తనదైన దూకుడును జోడించగలడు. ఈ సిరీస్ ఒక యువ ఆటగాడికి ఎంతో కీలకం కానుంది. అతనే టిమ్ డేవిడ్. ఇంత కాలం సింగపూర్‌కు ప్రాతినిధ్యం వహించి తొలిసారి ఆసీస్ జట్టులోకి ఎంపికైన అతను ఐపీఎల్ అనుభవంతో ఎంత దూకుడుగా ఆడతాడో చూడాలి. కమిన్స్, హాజల్‌వుడ్, కేన్ రిచర్డ్సన్ పేస్ భారం మోయనుండగా, లెగ్‌స్పిన్నర్ జంపాకు మంచి రికార్డే ఉంది. 23: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు 23 టి20 మ్యాచ్‌లు జరిగాయి. 13 మ్యాచ్‌ల్లో భారత్, 9 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా గెలిచాయి. మరో మ్యాచ్ వర్షంవల్ల రద్దయింది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఏడు మ్యాచ్‌లు ఆడిన భారత్ నాలుగింటిలో గెలిచి, మూడింటిలో ఓడిపోయింది. -
India vs West Indies: మరో సిరీస్ సాధించేందుకు...
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఐదుగురు స్టార్ ఆటగాళ్లు లేకపోయినా... మరో వన్డే సిరీస్ విజయానికి భారత జట్టు బాటలు వేసుకుంది. తొలి మ్యాచ్‌లో విండీస్‌పై స్వల్ప తేడాతో నెగ్గిన టీమిండియా కరీబియన్ పర్యటనలో వరుసగా రెండో సిరీస్ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో నేడు క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరిగే రెండో వన్డేలో భారత్, విండీస్ తలపడనున్నాయి. సొంతగడ్డపై కొద్ది రోజుల క్రితమే బంగ్లాదేశ్‌కు సిరీస్ అప్పగించిన వెస్టిండీస్ మరో సిరీస్ కోల్పోరాదంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అంతా ఫామ్‌లోకి... శిఖర్ ధావన్ చాలా రోజుల తర్వాత చెప్పుకోదగ్గ బ్యాటింగ్‌తో అర్ధసెంచరీ నమోదు చేశాడు. రుతురాజ్, ఇషాన్ కిషన్‌లను కాదని ఓపెనర్‌గా అవకాశం దక్కించుకున్న శుబ్‌మన్ గిల్ తన క్లాసిక్ బ్యాటింగ్‌కు చూపించగా... రాణిస్తే తప్ప జట్టులో చోటు దక్కే అవకాశం లేని స్థితిలో బరిలోకి దిగిన శ్రేయస్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అటు బౌలింగ్‌లో సిరాజ్ చక్కగా రాణించి వన్డేలకూ తాను తగినవాడినన్ని నిరూపించుకున్నాడు. ముఖ్యంగా అతను తీసిన పూరన్ వికెట్ కీలక దశలో వరుస ఓవర్లలో శార్దుల్ తీసిన రెండు వికెట్లు ఆల్‌రౌండర్‌గా అతని బలాన్ని ప్రదర్శించాయి. ఈ నేపథ్యంలో మార్పులు లేకుండానే భారత జట్టు రెండో మ్యాచ్‌లోనూ బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ టాప్–4 బ్యాటర్లలో ముగ్గురు రాణించారు. అయితే జట్టును గెలిపించడానికి అది సరిపోలేదు. కీలక దశలో ఆ జట్టు వికెట్లు కోల్పోయింది. కొన్ని చక్కటి షాట్లు ఆడి వెనుదిరుగుతూ టి20 శైలి బ్యాటింగ్ చేస్తున్న పూరన్.. కెప్టెన్‌గా జట్టుకు విజయం అందించే ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. మేయర్స్, కింగ్స్‌లకు తోడు బ్రూక్స్ కూడా మెరుగ్గా ఆడితే విండీస్ గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. గత ఆరు మ్యాచ్‌లలో షై హోప్స్ విఫలం కావడంతో టీమ్‌కు శుభారంభం లభించడం లేదు. దీనికి ఆ జట్టు సరిదిద్దుకోవాల్సి ఉంది. బౌలింగ్‌లో మాత్రం విండీస్‌లో తడబాటు స్పష్టంగా కనిపించింది. ఉత్కంఠభరిత ముగింపు తొలి వన్డే చివరి ఓవర్లో విండీస్ విజయానికి 15 పరుగులు కావాలి. సిరాజ్ వేసిన తొలి 4 బంతుల్లో ఒక ఫోర్ సహా 7 పరుగులు వచ్చాయి. 2 బంతుల్లో 8 పరుగులు అవసరం. ఆ తర్వాత సిరాజ్ వేసిన బంతి లెగ్‌స్టంప్‌కు చాలా దూరంగా ‘వైడ్’గా వెళ్లింది. అది వేగంగా వెళ్లి బౌండరీని తాకి ఉంటే సమీకరణం వేరేలా ఉండేది. కానీ కీపర్ సంజు సామ్సన్ అద్భుతంగా ఎడమ వైపు డైవ్ చేస్తూ దానిని ఆపడంలో సఫలమయ్యాడు. దాంతో ఒక పరుగే వచ్చింది. అనంతరం చివరి 2 బంతుల్లో సిరాజ్ 3 పరుగులే ఇవ్వడంతో 3 పరుగుల తేడాతో విజయం భారత్ సొంతమైంది. భారత్ చేసిన 308 పరుగులకు బదులుగా వెస్టిండీస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 305 పరుగులే చేయగలిగింది. కైల్ మేయర్స్ (68 బంతుల్లో 75; 10 ఫోర్లు, 1 సిక్స్), బ్రాండన్ కింగ్ (66 బంతుల్లో 54; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), బ్రూక్స్ (61 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా... శార్దుల్, సిరాజ్, చహల్ తలా 2 వికెట్లు తీశారు. శిఖర్ ధావన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
పాక్ క్లీన్‌స్వీప్.. 3-0 సిరీస్ సొంతం
కరాచీ: వెస్టిండీస్‌తో జరిగిన మూడు టి20ల సిరీస్‌ను పాకిస్తాన్ 3–0తో సొంతం చేసుకుంది. గురువారం జరిగిన చివరి మ్యాచ్‌లో పాక్ 7 వికెట్లతో విండీస్‌ను చిత్తు చేసింది. విండీస్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 207 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (64), బ్రూక్స్ (49), బ్రెండన్ కింగ్ (43) చెలరేగారు. అనంతరం పాక్ 18.5 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగులు సాధించింది. రిజ్వాన్ (87), బాబర్ ఆజమ్ (79) జట్టును గెలిపించారు. మరో ముగ్గురికి కోవిడ్ వచ్చినా... గురువారం ఉదయం ముగ్గురు విండీస్ ఆటగాళ్లు షై హోప్, అకీల్ హొసీన్, జస్టిన్ గ్రీవ్స్ కరోనా పాజిటివ్‌గా తేలారు. టి20 సిరీస్ ప్రారంభానికి ముందే ముగ్గురు క్రికెటర్లు కాట్రెల్, ఛేజ్, మేయర్స్ కరోనా బారిన పడ్డారు. టీమ్‌లోని ఆరుగురు ఆటగాళ్లు కోవిడ్‌తో బాధపడుతుండటంతో విండీస్ పూర్తి జట్టును బరిలోకి దింపగలదా అనే అనుమానం కనిపించింది. అయితే ఏదో రకంగా చివరి టి20 ఆడే విధంగా విండీస్‌ను పాక్ బోర్డు ఒప్పించగలిగింది. అయితే శనివారంనుంచి జరగాల్సిన వన్డే సిరీస్‌ను ప్రస్తుతానికి రద్దు చేసి జూన్ 2022లో మళ్లీ జరిపేందుకు ఇరు బోర్డులు అంగీకరించాయి. -
ఆఖరి పోరులో అదరగొట్టారు
నువ్వా నేనా అంటూ సాగిన టి20 సమరంలో చివరకు భారత్‌దే పైచేయి అయింది. నిర్ణాయక పోరులో మన బ్యాటింగ్ బ్రహ్మాండంగా పేలగా... ఇంగ్లండ్ బ్యాటింగ్ తడబడి ఓటమిని ఆహ్వానించింది. కోహ్లి, రోహిత్‌ల అర్ధ సెంచరీలు... సూర్య, హార్దిక్ జోరు కలగలిసి 224 పరుగులతో టీమిండియా సవాల్ విసరగా... లక్ష్యానికి ప్రత్యర్థి చాలా దూరంలో ఆగిపోయింది. మలాన్, బట్లర్ జోరు ఆ జట్టు విజయంపై ఆశలు రేపినా... భువనేశ్వర్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను నిలువరించాడు. ముందుగా టెస్టు, ఆపై టి20 సిరీస్ గెలుచుకున్న కోహ్లి సేన ఇక వన్డే సిరీస్‌కు సన్నద్ధమైంది. అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3–2తో గెలుచుకుంది. శనివారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (52 బంతుల్లో 80 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (34 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ సెంచరీలు సాధించగా... హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఓపెనర్‌గా దిగిన కోహ్లి ముగ్గురు సహచరులతో వరుసగా 94, 49, 81 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పడం విశేషం. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్ (46 బంతుల్లో 68; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), జోస్ బట్లర్ (34 బంతుల్లో 52; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 82 బంతుల్లోనే 130 పరుగులు జోడించినా జట్టును గెలిపించడంలో విఫలమయ్యారు. భారీ స్కోర్ల మ్యాచ్‌లో పొదుపైన బౌలింగ్‌తో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ భువనేశ్వర్ (2/15) జట్టును గెలిపించాడు. భారత కెప్టెన్ కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. రోహిత్, సూర్య సూపర్... సిరీస్ నిర్ణాయక మ్యాచ్‌లో భారత జట్టుకు అద్భుతమైన ఆరంభం లభించింది. అంతర్జాతీయ టి20ల్లో తొలిసారి జంటగా ఓపెనింగ్‌కు దిగిన రోహిత్, కోహ్లి ఓవర్‌కు 10.44 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టారు. ముందుగా రోహిత్ బాధ్యత తీసుకొని తనదైన శైలిలో చెలరేగాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టిన తర్వాత సుమారు 150 కిలోమీటర్ల వేగంతో వుడ్ వేసిన రెండు బంతులను స్ట్రయిట్ డ్రైవ్ ద్వారా బౌండరీకి తరలించిన తీరు అమితంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆరు బంతుల వ్యవధిలో మరో మూడు సిక్సర్లు బాదిన రోహిత్ 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే స్టోక్స్ వేసిన బంతిని వికెట్లపైకి ఆడుకోవడంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది. మూడో స్థానంలో వచ్చిన సూర్యకుమార్ కూడా అదే జోరు కొనసాగించడంతో భారత్ స్కోరు వేగం తగ్గలేదు. రషీద్ ఓవర్లో వరుసగా రెండు బంతులను సూర్య భారీ సిక్సర్లుగా మలచడం విశేషం. ఆ తర్వాత జోర్డాన్ బౌలింగ్‌లో అతను వరుసగా మూడు బంతుల్లో కొట్టిన మూడు ఫోర్లు హైలైట్‌గా నిలిచాయి. వేగంగా కోహ్లి స్కోరును దాటేసిన అనంతరం జోర్డాన్ అద్భుత ఫీల్డింగ్ ప్రదర్శనతో సూర్య ఇన్నింగ్స్ ముగిసింది. కోహ్లి, పాండ్యా దూకుడు... ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన కోహ్లి ఆ తర్వాత పుంజుకున్నాడు. రోహిత్ అవుటయ్యే సమయానికి 20 బంతుల్లో 22 పరుగులు చేసిన కెప్టెన్ తర్వాతి 32 బంతుల్లో 58 పరుగులు సాధించాడు. వుడ్, స్టోక్స్ బౌలింగ్‌లో ఒక్కో సిక్స్ కొట్టిన అతను వుడ్ మరో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. 36 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ భారీ స్కోరులో మరో ఎండ్ నుంచి హార్దిక్ కూడా కీలకపాత్ర పోషించాడు. జోర్డాన్ ఓవర్లో వరుస బంతుల్లో పాండ్యా కొట్టిన రెండు సిక్సర్లు టీమిండియా స్కోరును 200 పరుగులు దాటించాయి. శతక భాగస్వామ్యం... భారీ ఛేదనలో ఇంగ్లండ్ రెండో బంతికే రాయ్ (0) వికెట్‌ను కోల్పోయింది. అయితే మలాన్, బట్లర్ కలిసి భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరు పరస్పరం పోటీ పడుతూ ధాటిగా పరుగులు రాబట్టారు. పాండ్యా వేసిన రెండో ఓవర్లో మలాన్ వరుసగా 4, 6, 4 బాదగా, సుందర్ ఓవర్లో బట్లర్ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. శార్దుల్ ఓవర్లో కూడా వీరిద్దరు 14 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 62 పరుగులకు చేరింది. ఆ తర్వాత జోరు కొనసాగిస్తూ రాహుల్ చహర్ ఓవర్లో బట్లర్ రెండు సిక్సర్లు కొట్టాడు. నటరాజన్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టి మలాన్ 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... తర్వాతి ఓవర్లో 30 బంతుల్లో బట్లర్ హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. ఓవర్‌కు దాదాపు 11 పరుగుల రన్‌రేట్‌ను కొనసాగిస్తూ వీరిద్దరు చేస్తున్న బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ గెలుపు దిశగా సాగుతున్నట్లు అనిపించింది. అయితే చహర్ వేసిన 12వ ఓవర్లో 7 పరుగులే రాగా, భువనేశ్వర్ 4 బంతుల్లో 3 పరుగులే ఇవ్వడంతో ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెరిగింది. భువీ తర్వాతి బంతికి బట్లర్ వెనుదిరగడంతో జట్టు పతనం మొదలైంది. 12 పరుగుల వ్యవధిలో 4 ప్రధాన వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ కోలుకోలేకపోయింది. 231 ఈ సిరీస్‌లో కోహ్లి చేసిన పరుగులు. కేఎల్ రాహుల్ (224 పరుగులు–2020లో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో)ను అధిగమిస్తూ ద్వైపాక్షిక టి20 సిరీస్‌లలో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) స్టోక్స్ 64; కోహ్లి (నాటౌట్) 80; సూర్యకుమార్ యాదవ్ (సి) రాయ్ (బి) రషీద్ 32; హార్దిక్ పాండ్యా (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–94, 2–143. బౌలింగ్: రషీద్ 4–0–31–1; ఆర్చర్ 4–0–43–0; వుడ్ 4–0–53–0; జోర్డాన్ 4–0–57–0; స్యామ్ కరన్ 1–0–11–0; స్టోక్స్ 3–0–26–1. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (బి) భువనేశ్వర్ 0; బట్లర్ (సి) హార్దిక్ (బి) భువనేశ్వర్ 52; మలాన్ (బి) శార్దుల్ 68; బెయిర్‌స్టో (సి) సూర్యకుమార్ (బి) శార్దుల్ 7; మోర్గాన్ (సి) (సబ్) కేఎల్ రాహుల్ (బి) హార్దిక్ 1; స్టోక్స్ (సి) పంత్ (బి) నటరాజన్ 14; జోర్డాన్ (సి) సూర్య (బి) శార్దుల్ 11; ఆర్చర్ (రనౌట్) 1; స్యామ్ కరన్ (నాటౌట్) 14; రషీద్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 20, మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–0, 2–130, 3–140, 4–142, 5–142, 6–165, 7–168, 8–174. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–15–2; హార్దిక్ 4–0–34–1; సుందర్ 1–0–13–0; శార్దుల్ 4–0–45–3; నటరాజన్ 4–0–39–1; రాహుల్ చహర్ 3–0–33–0. -
సూర్య ప్రతాపం.. భారత్ విజయం
అహ్మదాబాద్: పొట్టి ఫార్మాట్లో నంబర్‌వన్ ఇంగ్లండ్ గెలిచిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఛేదించే ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లోనూ 16 ఓవర్లు ముగిసే సరికి 140/4 స్కోరుతో పోరాటంలో నిలిచింది. 24 బంతుల్లో మరో 46 పరుగులు కావాలి. స్టోక్స్ ధనాధన్‌గా సాగుతుండగా... మోర్గాన్ అండగా ఉన్నాడు. ఈ దశలో 17వ ఓవర్ వేసిన శార్దుల్ వాళ్లిద్దరిని వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. కోహ్లి సేన 8 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. కెరీర్లో ఆడిన తొలి ఇన్నింగ్స్‌లోనే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (31 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టాడు. శ్రేయస్ అయ్యర్ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. ఆర్చర్‌కు 4 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (23 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), జేసన్ రాయ్ (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. టాప్ మళ్లీ ఫ్లాప్ ఆట మొదలైన తొలి బంతినే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ సిక్సర్‌గా బాదేశాడు. కానీ నాలుగో ఓవర్ వేసిన ఆర్చర్ బౌలింగ్‌లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి రోహిత్ (12; 1 ఫోర్, 1 సిక్స్) ఔటయ్యాడు. రాహుల్ (14) స్టోక్స్ బౌలింగ్‌లో ఆర్చర్ చేతికి చిక్కగా, కోహ్లి (1) రషీద్ గూగ్లీకి స్టంపౌటయ్యాడు. సిక్సర్‌తో అంతర్జాతీయ క్రికెట్లో పరుగులు మొదలుపెట్టిన సూర్యకుమార్ బంతుల్ని పదే పదే బౌండరీలకు, సిక్సర్లకు తరలించాడు. ఈ క్రమంలో కేవలం 28 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో మెరుపు ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. రాణించిన రాయ్, స్టోక్స్ లక్ష్యఛేదనలో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఇంగ్లండ్ జట్టును ఎప్పట్లాగే జేసన్ రాయ్ ధాటిగా నడిపించాడు. కానీ బట్లర్ (9), మలాన్ (14) నిష్క్రమణతో ఇన్నింగ్స్ తడబడింది. ఈ దశలో బెయిర్ స్టో (19 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్), స్టోక్స్ నాలుగో వికెట్‌కు చకచకా 65 పరుగులు జోడించడం భారత శిబిరాన్ని ఒత్తిడిలోకి నెట్టింది. అయితే 17వ ఓవర్లో వరుస బంతుల్లో స్టోక్స్, మోర్గాన్ (4)లు ఔటయ్యారు. ఆఖరి ఓవర్లో 23 పరుగులు చేయాల్సివుండగా శార్దుల్ 14 పరుగులు ఇవ్వడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. స్కోరు వివరాలు : భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) అండ్ (బి) ఆర్చర్ 12; రాహుల్ (సి) ఆర్చర్ (బి) స్టోక్స్ 14; సూర్య (సి) మలాన్ (బి) కరన్ 57; కోహ్లి (స్టంప్డ్) బట్లర్ (బి) రషీద్ 1; పంత్ (బి) ఆర్చర్ 30; శ్రేయస్ (సి) మలాన్ (బి) ఆర్చర్ 37; పాండ్యా (సి) స్టోక్స్ (బి) వుడ్ 11; శార్దుల్ నాటౌట్ 10; సుందర్ (సి) రషీద్ (బి) ఆర్చర్ 4; భువీ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 185. వికెట్ల పతనం: 1–21, 2–63, 3–70, 4–110, 5–144, 6–170, 7–174, 8–179. బౌలింగ్: రషీద్ 4–1–39–1, ఆర్చర్ 4–0–33–4, వుడ్ 4–1–25–1, జోర్డాన్ 4–0–41–0, స్టోక్స్ 3–0–26–1, కరన్ 1–0–16–1. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) సూర్య(బి) పాండ్యా 40; బట్లర్ (సి) రాహుల్ (బి) భువనేశ్వర్ 9; మలాన్ (బి) చహర్ 14; బెయిర్‌స్టో (సి) సుందర్ (బి) చహర్ 25; స్టోక్స్ (సి) సూర్య (బి) శార్దుల్ 46; మోర్గాన్ (సి) సుందర్ (బి) శార్దుల్ 4; కరన్ (బి) పాండ్యా 3; జోర్డాన్ (సి) పాండ్యా (బి) శార్దుల్ 12; ఆర్చర్ నాటౌట్ 18; రషీద్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 6, మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–15, 2–60, 3–66, 4–131, 5–140, 6–140, 7–153, 8–177. బౌలింగ్: భువనేశ్వర్ 4–1–30–1, పాండ్యా 4–0–16–2, శార్దుల్ 4–0–42–3, సుందర్ 4–0–52–0, చహర్ 4–0–35–2. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రవీంద్ర-చహల్ విజయం
వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ గెలిచిన ఉత్సాహంతో భారత జట్టు అదే వేదికపై టి20 సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. బ్యాటింగ్‌లో సాధారణ స్కోరే సాధించినా... యజువేంద్ర చహల్, నటరాజన్ బౌలింగ్‌తో విజయం దిశగా సాగింది. అంతకుముందు కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీకి తోడు రవీంద్ర జడేజా మెరుపులు జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టగా, ఆతిథ్య జట్టు మాత్రం అతి సాధారణ ప్రదర్శనతో తేలిపోయింది. అయితే విజయంలోనూ జడేజా–చహల్ ‘కన్కషన్’ వివాదం మ్యాచ్ ఫలితంకంటే ఎక్కువ చర్చ రేపింది. కాన్బెర్రా: ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 11 పరుగుల తేడాతో ఆస్టేలియాను ఓడించింది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా, రవీంద్ర జడేజా (23 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడాడు. అనంతరం ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 150 పరుగులకే పరిమితమైంది. ఫించ్ (26 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్), డార్సీ షార్ట్ (38 బంతుల్లో 34; 3 ఫోర్లు), హెన్రిక్స్ (20 బంతుల్లో 30; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. గాయపడ్డ జడేజా స్థానంలో ‘కన్కషన్ సబ్‌స్టిట్యూట్’గా తుది జట్టులోకి వచ్చిన స్పిన్నర్ యజువేంద్ర చహల్ (3/25) మూడు కీలక వికెట్లు పడగొట్టి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడిన నటరాజన్ (3/30) కూడా ఆకట్టుకున్నాడు. జడేజా మెరుపులు... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. ధావన్ (1)ను స్టార్క్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అయితే ఐపీఎల్లో టాప్ స్కోరర్‌గా నిలిచిన రాహుల్ తన ఫామ్‌ను కొనసాగించాడు. అబాట్ బౌలింగ్‌లో రాహుల్ వరుసగా 4, 6 కొట్టగా పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 42 పరుగులకు చేరింది. అయితే తర్వాతి ఓవర్లోనే కోహ్లి (9)ని అవుట్ చేసి స్వెప్సన్ దెబ్బ తీశాడు. 37 బంతుల్లో రాహుల్ అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, సామ్సన్ (15 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. అయితే ఆరు పరుగుల వ్యవధిలో భారత్ సామ్సన్, మనీశ్ పాండే (2), రాహుల్ వికెట్లు కోల్పోయింది. హార్దిక్ (16) కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ దశలో జడేజా ఇన్నింగ్స్ జట్టుకు చెప్పుకో దగ్గ స్కోరును అందించింది. హాజల్‌వుడ్ వేసిన 19వ ఓవర్లో తొలి బంతిని ఫోర్‌గా మలచిన జడేజా... చివరి మూడు బంతుల్లో వరుసగా 6, 4, 4 బాదాడు. చివరి ఓవర్లో కూడా అతను మరో రెండు ఫోర్లు కొట్టాడు. ఆకట్టుకున్న నటరాజన్... సాధారణ లక్ష్య ఛేదనను ఆసీస్ ఓపెనర్లు డార్సీ షార్ట్, ఫించ్ మెరుగ్గానే ప్రారంభించారు. దీపక్ చహర్ వేసిన తొలి ఓవర్లోనే మూడు ఫోర్లతో 14 పరుగులు వచ్చాయి. షమీ ఓవర్లోనూ 12 పరుగులు రాబట్టిన ఆసీస్ పవర్‌ప్లేలో 53 పరుగులు నమోదు చేసింది. తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో పాండే, కోహ్లి క్యాచ్‌లు వదిలేసినా... స్పిన్నర్ చహల్ రాకతో మ్యాచ్ మలుపు తిరిగింది. తొలి వికెట్‌కు 46 బంతుల్లో 56 పరుగులు జోడించిన అనంతరం హార్దిక్ పాండ్యా పట్టిన అద్భుత క్యాచ్‌తో ఫించ్ వెనుదిరిగాడు. చహల్ తన తర్వాతి ఓవర్లోనే స్మిత్ (12)ను కూడా అవుట్ చేశాడు. ఈసారి సామ్సన్ సూపర్ క్యాచ్ అందుకోగా, మ్యాక్స్‌వెల్ (2)ను ఎల్బీగా అవుట్ చేసిన నటరాజన్ తన కెరీర్లో తొలి వికెట్ సాధించాడు. ఆ తర్వాత హెన్రిక్స్ కొంత ప్రయత్నించడం మినహా ఆసీస్ గెలుపునకు చేరువగా రాలేకపోయింది. చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 27 పరుగులు కావాల్సి ఉండగా ఆ జట్టు 15 పరుగులే చేసింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) అబాట్ (బి) హెన్రిక్స్ 51; ధావన్ (బి) స్టార్క్ 1; కోహ్లి (సి అండ్ బి) స్వెప్సన్ 9; సామ్సన్ (సి) స్వెప్సన్ (బి) హెన్రిక్స్ 23; మనీశ్ పాండే (సి) హాజల్‌వుడ్ (బి) జంపా 2; హార్దిక్ (సి) స్మిత్ (బి) హెన్రిక్స్ 16; జడేజా (నాటౌట్) 44; సుందర్ (సి) అబాట్ (బి) స్టార్క్ 7; దీపక్ చహర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–11; 2–48; 3–86; 4–90; 5–92; 6–114; 7–152. బౌలింగ్: స్టార్క్ 4–0–34–2; హాజల్‌వుడ్ 4–0–39–0; జంపా 4–0–20–1; అబాట్ 2–0–23–0; స్వెప్సన్ 2–0–21–1; హెన్రిక్స్ 4–0–22–3. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: డార్సీ షార్ట్ (సి) హార్దిక్ (బి) నటరాజన్ 34; ఫించ్ (సి) హార్దిక్ (బి) చహల్ 35; స్మిత్ (సి) సామ్సన్ (బి) చహల్ 12; మ్యాక్స్‌వెల్ (ఎల్బీ) (బి) నటరాజన్ 2; హెన్రిక్స్ (ఎల్బీ) (బి) చహర్ 30; వేడ్ (సి) కోహ్లి (బి) చహల్ 7; అబాట్ (నాటౌట్) 12; స్టార్క్ (బి) నటరాజన్ 1; స్వెప్సన్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1–56; 2–72; 3–75; 4–113; 5–122; 6–126; 7–127. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–29–1; సుందర్ 4–0–16–0; షమీ 4–0–46–0; నటరాజన్ 4–0–30–3; చహల్ 4–0–25–3. హార్దిక్ పాండ్యా అద్భుత క్యాచ్ కండరాల నొప్పితో కూలబడ్డ జడేజా -
టెస్టు జట్టులో సిరాజ్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్య పరిస్థితుల్లో... ఊహించినట్టుగానే ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జంబో బృందాన్ని ఎంపిక చేసింది. నవంబర్ 27న టి20 సిరీస్‌తో మొదలయ్యే ఈ పర్యటనలో భారత్ మూడు టి20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీతో ఈ పర్యటన ముగియనుంది. చీఫ్ సెలెక్టర్ సునీల్ జోషి నేతృత్వంలోని భారత సెలక్టర్ల బృందం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై మొత్తం 32 మందిని ఈ పర్యటన కోసం ఎంపిక చేసింది మూడు ఫార్మాట్ (టి20, వన్డే, టెస్టు)లలో కలిపి అధికారికంగా 28 మందిని ఎంపిక చేశారు. అయితే నెట్ ప్రాక్టీస్ సెషన్స్ కోసం మరో నలుగురు పేసర్లు కమలేశ్ నాగర్కోటి, కార్తీక్ త్యాగి, ఇషాన్ పోరెల్, నటరాజన్ కూడా ఈ 28 మందితో కలిసి ఆస్ట్రేలియాకు వెళతారు. బయో బబుల్ వాతావరణంలో జరిగే ఈ సిరీస్ కోసం మూడు జట్లు ఒకేసారి ఆస్ట్రేలియాకు వెళతాయి. గాయాలతో బాధపడుతున్న స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, బౌలర్లు ఇషాంత్ శర్మ, భువనేశ్వర్‌లను ఈ పర్యటనకు ఎంపిక చేయలేదు. తొడ కండరాలతో బాధపడుతున్న రోహిత్ పూర్తిస్థాయిలో కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలు పడుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. సిరాజ్ శ్రమకు ఫలితం... ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో భారత టి20, వన్డే జట్లకు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ తొలిసారి టెస్టు జట్టులోకి ఎంపికయ్యాడు. 26 ఏళ్ల సిరాజ్ కొన్నాళ్లుగా భారత ‘ఎ’ జట్టు తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 36 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ మొత్తం 147 వికెట్లు పడగొట్టాడు. అతను ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు 13 సార్లు, ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు నాలుగుసార్లు తీశాడు. వన్డే, టి20 జట్ల నుంచి పంత్ అవుట్... ఏడాది తర్వాత కేఎల్ రాహుల్ టెస్టు జట్టులో పునరాగమనం చేయగా... నిలకడగా ఆడలేకపోతున్న వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను వన్డే, టి20 జట్ల నుంచి తప్పించి కేవలం టెస్టు జట్టుకే పరిమితం చేశారు. తమిళనాడు ‘మిస్టరీ స్పిన్నర్’ వరుణ్ చక్రవర్తి తొలిసారి టి20 జట్టులో స్థానం పొందాడు. ప్రస్తుత ఐపీఎల్లో 11 మ్యాచ్‌లు ఆడిన 29 ఏళ్ల వరుణ్ 13 వికెట్లు తీశాడు. ఏడు రకాల బంతులను వేయగల వైవిధ్యం వరుణ్ సొంతం. ఈ ఐపీఎల్లో వరుణ్ స్పిన్‌కు వార్నర్, ధోని, పంత్, శ్రేయస్ అయ్యర్ తదితర అంతర్జాతీయ క్రికెటర్లు బోల్తా పడ్డారు. భారత జట్ల వివరాలు టెస్టు జట్టు: కోహ్లి (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), మయాంక్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, పుజారా, విహారి, శుబ్‌మన్ గిల్, సాహా (వికెట్ కీపర్), పంత్ (వికెట్ కీపర్), బుమ్రా, షమీ, ఉమేశ్, సెనీ, కుల్దీప్, జడేజా, అశ్విన్, సిరాజ్. వన్డే జట్టు: కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), ధావన్, శుబ్‌మన్ గిల్, అయ్యర్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, మయాంక్, జడేజా, చహల్, కుల్దీప్, బుమ్రా, షమీ, సైనీ, శార్దుల్ ఠాకూర్. టి20 జట్టు: కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), ధావన్, మయాంక్, అయ్యర్, పాండే, హార్దిక్ పాండ్యా, సామ్సన్ (వికెట్ కీపర్), జడేజా, వాషింగ్టన్ సుందర్, చహల్, బుమ్రా, షమీ, సైనీ, దీపక్ చహర్, వరుణ్ చక్రవర్తి. అదనపు పేస్ బౌలర్లు: కమలేశ్ నాగర్కోటి, కార్తీక్ త్యాగి, ఇషాన్ పోరెల్, నటరాజన్. -
ధావన్ దూరం; శాంసన్‌కు పిలుపు
న్యూఢిల్లీ : స్వదేశంలో విండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ దూరమయ్యాడు. ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్ సందర్భంగా మహారాష్ట్రతో మ్యాచ్‌లో జరిగిన మ్యాచ్‌లో ధవన్ ఎడమ మోకాలికి గాయమైంది. కాగా అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ధావన్ కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం పట్టే అవకాశం ఉందని బీసీసీఐ తెలిపింది. కాగా అతని స్థానంలో కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ పేర్కొంది. 2015లో జింబాబ్వేపై ఒక టీ20 ఆడిన సంజా శామ్సన్ ఆ మ్యాచ్‌లో 19 పరుగులు చేశాడు. అప్పటి నుంచి మళ్లీ ఒక్క మ్యాచ్‌లో ఆడలేదు. బంగ్లాతో జరిగిన టీ20 సిరీస్‌కు ఎంపికైనా అదనపు ఆటగాడిగా ఉన్నాడు తప్ప తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కాగా ఇటు దేశవాలి టోర్నమెంట్లు , అటు ఐపీఎల్లో మాత్రం సంజు శాంసన్ మంచి ప్రదర్శనను నమోదు చేశాడు. డిసెంబరు 6 నుంచి విండీస్‌తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరగనుంది. -
‘ప్రయోగాలు’ ఫలించలేదు!
విరాట్ కోహ్లికి చిన్నస్వామి స్టేడియం అంటే తన ఇంటి పెరడు లాంటిది! పన్నెండు ఐపీఎల్ సీజన్లలో పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడిన అతనికంటే ఆ మైదానం గురించి మరెవరికీ తెలీదు. ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేయడం కంటే లక్ష్య ఛేదన సులువైన విషయం. కానీ టాస్ గెలిచిన కోహ్లి ‘సాహసం’ పేరుతో ముందుగా బ్యాటింగ్‌కు సిద్ధపడ్డాడు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కావాలంటూ టి20 జట్టుతో ప్రయోగాలకు ప్రయత్నిస్తున్నాడు. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో అనూహ్య ఓటమి టీమిండియా వ్యూహాలపై కొత్త చర్చకు దారి తీసింది. కొత్త ప్రయోగం విఫలమైనట్లా... ఇది ఇలాగే కొనసాగుతుందా! సాక్షి క్రీడా విభాగం బెంగళూరులో ఇప్పటి వరకు 7 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఆదివారం మ్యాచ్‌కు ముందు ఆరు సార్లు కూడా టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగే ఎంచుకుంది. మొదటిసారి కోహ్లి దీనికి భిన్నంగా వెళ్లాడు. చిన్న బౌండరీలతో పాటు సాయంత్రం మంచు ప్రభావం వల్ల స్పిన్నర్లకు పట్టు చిక్కదనే విషయం కూడా కోహ్లికి బాగా తెలుసు. కానీ టాస్ సమయంలోనే దీని గురించి మాట్లాడిన కోహ్లి మ్యాచ్ తర్వాత కూడా తన మాటకు కట్టుబడ్డాడు. ‘వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌కు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలయ్యాయి కాబట్టి ఈ వ్యూహం కూడా అందులో భాగమే. మేం అన్ని రంగాల్లో బలంగా ఉండాలనుకుంటున్నాం. ఛేదనలో అంతా బాగుంటోంది కాబట్టి ముందుగా బ్యాటింగ్ చేస్తే ఎలాంటి ఒత్తిడి ఉంటుందో ఆటగాళ్లకు తెలియాలి. మ్యాచ్ ఫలితం ముఖ్యమే అయినా కొంత సాహసం కూడా చేయాల్సిందే. లేదంటే అనుకున్నది సాధించలేం. ప్రపంచ కప్‌కు ముందు అన్ని రకాల పరిస్థితులకు అలవాటు పడాలనేదే మా ప్రయత్నం’ అని కోహ్లి ముందుగా బ్యాటింగ్ చేయడంపై వివరణ ఇచ్చాడు. సుదీర్ఘ లైనప్ ఉన్నా.. అయితే కెప్టెన్ ఆలోచనను అమలు పర్చడంలో మన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఒక్క ధావన్ మినహా అంతా తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. 9, 10వ స్థానాల్లో ఆడుతున్న సుందర్, దీపక్ చహర్‌లకు కూడా బ్యాటింగ్ చేయగల నైపుణ్యం ఉన్నా... కోహ్లి ఆశించినట్లు వారేమీ పరుగులు చేయలేకపోయారు. నిజానికి రెండేళ్ల పాటు వరుసగా భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్, చహల్‌లను బ్యాటింగ్ చేయలేరనే కారణంతోనే జట్టు పక్కన పెట్టింది. కాబట్టి పేరుకు పదో స్థానం వరకు బ్యాట్స్‌మెన్ ఉన్నారని చెప్పుకున్నా అది పనికి రాలేదు. ‘భారీ స్కోరు చేయాలనే ఉద్దేశంతోనే బ్యాటింగ్ తీసుకున్నాం. గతంలో టి20ల్లో 20–30 పరుగులు తక్కువ చేసి ఓడిపోయాం. దాంతో కనీసం 9వ నంబర్ ఆటగాడి వరకు బ్యాటింగ్ చేసే వారు ఉంటే భారీ స్కోరు చేయవచ్చని ఆశించి ఈ ప్రయత్నం చేశాం. అయితే ఈ పిచ్‌పై అది సాధ్యం కాలేదు’ అని విరాట్ విశ్లేషించాడు. 134 పరుగులే చేశాక ఎలాంటి బౌలర్లయినా మ్యాచ్‌ను కాపాడలేరంటూ తన బౌలర్లకు మద్దతు పలికాడు. నిజాయితీగా ఆలోచిస్తే ఒక 20 ఓవర్ల మ్యాచ్‌లో టాప్–6 బ్యాట్స్‌మెన్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించలేకపోతే తర్వాతి వారి నుంచి ఆశించడంలో అర్థం లేదన్నాడు. పంత్, అయ్యర్ నువ్వా నేనా..! వన్డేల్లో సుదీర్ఘ కాలంగా భారత నంబర్–4 ఆటగాడిపై అనిశ్చితి కనిపిస్తోంది. నాలుగో స్థానంలో ఎవరు ఆడతారో చెప్పలేని స్థితి. కానీ ఆదివారం మ్యాచ్‌లో ఇది మరీ పరిధి దాటినట్లు అనిపించింది! నేను ముందు వెళ్తానంటే లేదు లేదు నేను వెళతాను అన్నట్లుగా ఇద్దరు బ్యాట్స్‌మెన్ ముందుకు రావడం ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. ఎనిమిదో ఓవర్లో ధావన్ అవుటయ్యాక పంత్, అయ్యర్ ఇద్దరూ ఒకేసారి మైదానంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. అంటే ఎవరు ఆ స్థానంలో వెళ్లాలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో కూడా టీమ్ మేనేజ్మెంట్ స్పష్టత ఇవ్వలేదంటే దీనిని చిన్న తప్పుగా చూడలేం. సమాచారం లోపం అంటూ కోహ్లి సర్ది చెప్పుకున్నా అంతర్జాతీయ క్రికెట్లో ఇది ఎప్పుడూ చూడని వైనం. కోహ్లి క్రీజ్‌లో ఉన్నాడని అనుకున్నా... అటు కోచ్, బ్యాటింగ్ కోచ్‌లకు కూడా ఇది తెలియకపోవడం విశేషం. ‘చిన్న సమాచార లోపంతో తప్పు జరిగింది. పది ఓవర్ల తర్వాత వికెట్ పడితే పంత్, పది ఓవర్ల లోపయితే అయ్యర్ రావాలనేది వ్యూహం. దీని గురించి విక్రమ్ రాథోడ్ వారిద్దరితో మాట్లాడారు. అయితే దానిని అర్థం చేసుకోవడంలో ఇద్దరూ పొరపడ్డారు. ఇంకా వారిద్దరు క్రీజ్‌కు చేరుకొని ఉంటే ఆ దృశ్యం ఎలా ఉండేదో’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. ప్రయోగాలు ఏ రూపంలో చేసినా ఫలితం సానుకూలంగా ఉండటమే ముఖ్యం. టి20 వరల్డ్ కప్‌కు చేరువవుతున్న కొద్దీ కోహ్లి బృందం ఇంకా ఎలాంటి కొత్త ఆలోచనలతో బరిలోకి దిగుతుందో చూడాలి. పంత్ స్థానం మార్చాలి: వీవీఎస్ లక్ష్మణ్ రిషభ్ పంత్‌ను నాలుగో స్థానంలో ఆడించే ప్రయత్నం చేయడం వల్ల లాభం లేదని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. అతని ఆట శైలికి ఆ స్థానం సరైంది కాదని అతను విశ్లేషించాడు. ‘పంత్ సాధారణంగా దూకుడుగా ఆడతాడు. అతని స్వభావానికి నాలుగో స్థానంలో సఫలం కాలేకపోతున్నాడు. అక్కడ ఎలా పరుగులు చేయాలో అతనికి తెలియడం లేదు. ధోని స్థానాన్ని భర్తీ చేయాలనే ఒత్తిడి కూడా అతనిపై ఉంది. కాస్త దిగువకు 5 లేదా 6 స్థానాల్లో ఆడించే స్వేచ్ఛనిస్తే పంత్ చెలరేగిపోగలడు’ అని వీవీఎస్ సూచించాడు. కోహ్లికి ఐసీసీ శిక్ష ప్రత్యర్థి ఆటగాడిని దురుద్దేశపూర్వకంగా ఢీకొట్టినందుకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఐసీసీ హెచ్చరికకు గురయ్యాడు. దీంతో పాటు అతనికి ఒక డీ మెరిట్ పాయింట్ శిక్షగా విధించారు. చివరి టి20 మ్యాచ్ ఐదో ఓవర్లో హెన్డ్రిక్స్ బౌలింగ్‌లో షాట్ ఆడి పరుగు తీసే సమయంలో ఎదురుగా వస్తున్న బౌలర్ భుజానికి కోహ్లి భుజం బలంగా తగిలింది. దీంతో కలిపి ప్రస్తుతం కోహ్లి ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి. -
అందరికళ్లూ అతని పైనే.....
మహేంద్ర సింగ్ ధోని తన స్వస్థలం రాంచీ మైదానంలో మూడు వన్డేలు ఆడాడు. ఒక మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోగా... మరో రెండు సార్లు 10 (నాటౌట్), 11 పరుగులు చేశాడు. రెండు టి20ల్లో ఒకదాంట్లో 9(నాటౌట్) పరుగులు చేయగా, మరో మ్యాచ్‌లో బ్యాటింగ్ రాలేదు. రాంచీకి టెస్టు హోదా వచ్చే సమయానికి అతను టెస్టులకు గుడ్‌బై చెప్పేశాడు. ఐదు మ్యాచ్‌లలో కూడా అతని అసలు సిసలు ఆట, మెరుపులను ప్రత్యక్షంగా చూసే అవకాశం సొంత అభిమానులకు కలగలేదు. వరల్డ్ కప్ తర్వాత రిటైరయ్యే అవకాశం ఉన్న ధోని రాంచీ మైదానంలో తన పేరుతో ఉన్న పెవిలియన్‌ను సగర్వంగా చూస్తూ చివరి మ్యాచ్ ఆడనున్నాడు. ఈనేపథ్యంలో నేడు ఆస్ట్రేలియాతో జరిగే మూడో వన్డేలో అందరి దృష్టి మహేంద్రుడిపైనే ఉంది. అతను చెలరేగి ఫ్యాన్స్‌ను అలరించగలడా... భారత్ మరో విజయంతో సిరీస్‌ను గెలుచుకోగలదా ఆసక్తికరం. రాంచీ: ఆస్ట్రేలియా చేతిలో టి20 సిరీస్‌ను కోల్పోయిన తర్వాత భారత్ వెంటనే కోలుకుంది. కొంత పోటాపోటీగా సాగినా తొలి రెండు వన్డేల్లో విజయం మన ఖాతాలోకే చేరింది. రెండు స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో ఆసీస్‌పై మన ఆధిక్యం బలంగా కనిపించింది. ఇప్పుడు మరో మ్యాచ్ గెలిస్తే సిరీస్ సొంతం చేసుకొని చివరి రెండు మ్యాచ్‌ల కోసం ప్రయోగాలు చేసేందుకు భారత్‌కు అవకాశం కలుగుతుంది. ఇలాంటి స్థితిలో నేడు (శుక్రవారం) భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇక్కడి జేఎస్సీఏ స్టేడియంలో మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. సిరీస్ సొంతం చేసుకునే లక్ష్యంతో కోహ్లి సేన బరిలోకి దిగుతుండగా, గత రెండు వన్డేల్లో చేజారిన విజయాన్ని ఈ సారైనా అందుకోవాలని కంగారూలు భావిస్తున్నారు. భువనేశ్వర్ వచ్చాడు... రెండు విజయాల తర్వాత భారత తుది జట్టులో మార్పుల గురించి ఆలోచించాల్సిన అవసరం కనిపించడం లేదు. కోహ్లి అద్భుత ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేకపోయినా...అతని డిప్యూటీ రోహిత్ శర్మ ఇంకా తన స్థాయికి తగినట్లుగా చెలరేగలేదు. గత మ్యాచ్‌లో డకౌటైన రోహిత్ నుంచి మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. అయితే బ్యాటింగ్‌కు సంబంధించి అతి పెద్ద సమస్య శిఖర్ ధావన్‌దే. గత 15 ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 376 పరుగులే చేసిన ధావన్ రెండు అర్ధసెంచరీలే నమోదు చేశాడు. కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్లో అందరికంటే ధావన్‌కే ఈ మ్యాచ్ కీలకం కానుంది. నాలుగో స్థానంలో నిలదొక్కుకున్నట్లు కనిపించిన రాయుడు మళ్లీ తన ఆటతో సందేహాలు రేకెత్తిస్తున్నాడు. అతను కూడా తన సత్తా చాటాల్సి ఉంది. లేదంటే మిడిలార్డర్లో లోకేశ్ రాహుల్నుంచి పోటీ తప్పదు. విజయ్ శంకర్ తాజా ఆట నేపథ్యంలో అతడిని ఆర్డర్లో మరింత ముందుగా పంపే అవకాశం కూడా కనిపిస్తోంది. తర్వాతి స్థానాల్లో జాదవ్, ధోనిలతో లైనప్ పటిష్టంగా ఉంది. సొంత ప్రేక్షకుల సమక్షంలో తన స్థాయికి తగినట్లుగా ఆడితే ఈ మ్యాచ్ ధోనికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జడేజా తన పొదుపైన బౌలింగ్, ఫీల్డింగ్‌తో వరల్డ్ కప్ రేసులో తానూ ఉన్నానంటూ దూసుకొచ్చాడు. బౌలింగ్ విభాగంలో విశ్రాంతి తర్వాత భువనేశ్వర్ తిరిగి రావడం కీలక మార్పు. నిజానికి ఇద్దరు పేసర్లు బుమ్రా, షమీ కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. అయితే షమీ స్థానంలో భువీ ఆడే అవకాశం కనిపిస్తోంది. కుల్దీప్ మరో సారి ఆసీస్‌ను కట్టిపడేసేందుకు సిద్ధంగా ఉండగా, చహల్ మళ్లీ పెవిలియన్‌కే పరిమితం కానున్నాడు. గెలిపించేదెవరు... తొలి మ్యాచ్‌లో 99 పరుగులకే 4 కీలక వికెట్లు తీసినా...రెండో వన్డేలో విజయానికి అతి సమీపంగా వచ్చినా ఆసీస్‌కు గెలుపు ఆనందం మాత్రం దక్కలేదు. జట్టులో అందరూ అంతంత మాత్రంగానే ఆడుతుండటంతో మ్యాచ్ గెలిపించేదెవరు అన్నట్లుగా దిక్కులు చూడాల్సిన పరిస్థితి జట్టులో కనిపిస్తోంది. వరుస వైఫల్యాల తర్వాత ఫించ్ గత మ్యాచ్‌లో కాస్త మెరుగనిపించినా 70 స్ట్రైక్‌రేట్ అతని స్థాయికి తగిన ఆట కాదు. ఇప్పుడు జట్టులో అందరికంటే ఎక్కువగా అతనిపైనే ఒత్తిడి ఉంది. మరో ఓపెనర్ ఖాజా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. గత ఏడాది కాలంగా ఆసీస్ వన్డే జట్టులో నిలకడగా ఆడుతున్న షాన్ మార్, హ్యాండ్స్కోంబ్ రాణిస్తేనే ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలుగుతుంది. టి20 మెరుపుల తర్వాత మ్యాక్స్‌వెల్ రెండు వన్డేల్లోనూ విఫలమయ్యాడు. అతను ఫామ్‌లోకి రావడం కూడా కీలకం. గత మ్యాచ్‌లో జట్టును విజయానికి చేరువగా తెచ్చిన స్టొయినిస్ గెలుపు గీత మాత్రం దాటించలేకపోతున్నాడు. స్టొయినిస్ 7 అర్ధ సెంచరీలు చేయగా, ఆసీస్ ఒక్క సారి కూడా మ్యాచ్ గెలవలేదు! స్పిన్‌ను ఆడలేకపోతుండటం ఆ జట్టును దెబ్బ తీస్తోంది. మరో సారి ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉండగా పేసర్ కూల్టర్ నీల్ స్థానంలో రిచర్డ్సన్ లేదా బెహ్రన్‌డార్ఫ్‌ను ఎంపిక చేయవచ్చు. అందుబాటులో ఉన్న అన్ని అస్త్ర శస్త్రాలతో ఏదోలా ఈ మ్యాచ్ గెలిస్తేనే ఆసీస్ సిరీస్‌లో నిలుస్తుంది. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాయుడు, విజయ్ శంకర్, జాదవ్, ధోని, జడేజా, కుల్దీప్, బుమ్రా, భువనేశ్వర్ ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), ఖాజా, మార్ష, హ్యాండ్స్కోంబ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, కారీ, కమిన్స్, లయన్, జంపా, కూల్టర్ నీల్/ బెహ్రన్‌డార్ఫ్ పిచ్, వాతావరణం తొలి రెండు వన్డేల్లాగే ఇది కూడా కొంత నెమ్మదైన పిచ్. సాధారణ స్కోర్లకు అవకాశం ఉంది. మంచు ప్రభావం ఉంటోంది కాబట్టి టాస్ గెలిస్తే ఫీల్డింగ్‌కు మొగ్గుచూపవచ్చు. మ్యాచ్‌కు వాతావరణ సమస్య లేదు. -
రేపు భారత్, న్యూజిలాండ్ మూడో టీ20
-
స్పిన్‌తో ‘సిడ్నీ’ వశం
ఆస్ట్రేలియా గడ్డపై తొలి అంకాన్ని భారత్ విజయవంతంగా ముగించింది. దురదృష్టవశాత్తూ తొలి మ్యాచ్‌లో చేజారిన విజయం, రెండో మ్యాచ్ రద్దు తర్వాత తమ అసలు సత్తాను ప్రదర్శించి సిరీస్‌ను సమం చేసింది. ఆసీస్ గడ్డపై దాదాపు సొంత మైదానంలాంటి సిడ్నీలో 37,339 మంది ప్రేక్షకుల్లో సగానికంటే ఎక్కువ మంది టీమిండియాకు మద్దతు పలుకుతుండగా భారత్ గెలుపు తీరం చేరింది. ముందుగా కుల్దీప్ స్పిన్‌ను ఎదుర్కోలేక ఒత్తిడికి లోనైన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మరో స్పిన్నర్ కృనాల్ పాండ్యాపై ఎదురుదాడి చేయబోయి నాలుగు వికెట్లు సమర్పించుకోవడంతో భారీ స్కోరుకు దూరమైంది. అనంతరం ఓపెనర్ల దూకుడుకు తోడు విరాట్ కోహ్లి తనదైన శైలిలో చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. కంగారూలు ఒక్క సిక్స్ కూడా కొట్టలేక పేలవంగా ఆడితే... భారత్ ఏకంగా ఎనిమిది సిక్సర్లు బాది ఇరు జట్ల మధ్య తేడా ఏమిటో చూపించింది. సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్ 1–1తో సమంగా ముగిసింది. ఆదివారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. డార్సీ షార్ట్ (29 బంతుల్లో 33; 5 ఫోర్లు), ఆరోన్ ఫించ్ (23 బంతుల్లో 28; 4 ఫోర్లు) రాణించారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కృనాల్ పాండ్యా (4/36), కుల్దీప్ యాదవ్ (1/19) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (41 బంతుల్లో 61 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, శిఖర్ ధావన్ (22 బంతుల్లో 41; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిని ప్రదర్శించాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 117 పరుగులు చేసిన ధావన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఈ పర్యటనలో టెస్టు సిరీస్‌కు ముందు భారత్ ఈ నెల 29 నుంచి ఇదే మైదానంలో జరిగే నాలుగు రోజుల మ్యాచ్‌లో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవన్‌తో తలపడుతుంది. కుల్దీప్ కట్టడి... ఆస్ట్రేలియాకు ఓపెనర్లు షార్ట్, ఫించ్ శుభారంభం అందించారు. ప్రతీ ఓవర్లో వీరిద్దరు కనీసం ఒక ఫోర్ కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 49 పరుగులకు చేరింది. అనంతరం పాండ్యా వేసిన తొలి బంతికి ఫించ్ (22 వద్ద) ఇచ్చిన క్యాచ్‌ను లాంగాన్‌లో రోహిత్ వదిలేశాడు. ఆ ఓవర్లో ఆసీస్‌కు 12 పరుగులు లభించాయి. తొలి వికెట్‌కు 51 బంతుల్లో 68 పరుగులు జోడించిన తర్వాత కుల్దీప్ ఈ జోడీని విడదీశాడు. స్వీప్ షాట్ ఆడబోయి పాండ్యాకు ఫించ్ క్యాచ్ ఇచ్చాడు. అదే ఓవర్లో మ్యాక్స్‌వెల్‌ను అంపైర్ ఔట్‌గా ప్రకటించినా... రివ్యూలో అతను బతికి పోయాడు. అయితే తర్వాతి ఓవర్లో ఆసీస్‌ను పాండ్యా దెబ్బ తీశాడు. స్వీప్ షాట్లు ఆడబోయి వరుస బంతుల్లో షార్ట్, మెక్‌డెర్మట్ (0) వెనుదిరిగారు. పాండ్యా తన తర్వాతి ఓవర్లో మ్యాక్స్‌వెల్ (13)ను కూడా ఔట్ చేశాడు. అతని చివరి ఓవర్లో వరుస బంతుల్లో రెండు ఫోర్లు కొట్టిన అలెక్స్ కారీ (19 బంతుల్లో 27; 4 ఫోర్లు) తర్వాతి బంతికి డీప్‌లో క్యాచ్ ఇచ్చాడు. బుమ్రా చక్కటి ఫీల్డింగ్‌కు లిన్ (13) రనౌట్ కావడం ఆసీస్ పరిస్థితిని దిగజార్చింది. ఈ దశలో స్టొయినిస్ (15 బంతుల్లో 25 నాటౌట్; 3 ఫోర్లు), కూల్టర్‌నీల్ (7 బంతుల్లో 13 నాటౌట్; 2 ఫోర్లు) దూకుడుగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. వీరిద్దరు చివరి 16 బంతుల్లో 33 పరుగులు రాబట్టారు. ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్ కూడా లేకుండా ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఆసీస్‌దే కావడం గమనార్హం. ఓపెనర్ల జోరు... లక్ష్య ఛేదనలో భారత్ రెండుసార్లు ఒకే స్కోరు వద్ద రెండేసి వికెట్లు కోల్పోయినా... మొత్తంగా టాప్–3 ఆటగాళ్ల బ్యాటింగ్ ప్రదర్శనే మళ్లీ జట్టును గెలిపించింది. మరోసారి ఓపెనర్లు ధావన్, రోహిత్ (16 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆటను మొదలు పెట్టారు. అయితే రెండేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడుతున్న స్టార్క్ ఆరంభంలో కొంత ఇబ్బంది పెట్టాడు. అతని తొలి 11 బంతుల్లో భారత్ 7 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే స్టార్క్ వేసిన మూడో ఓవర్ చివరి బంతికి ధావన్ అద్భుతమైన ఆఫ్డ్రైవ్తో ఫోర్ కొట్టడంతో జోరు మొదలైంది. తర్వాతి రెండు ఓవర్లలో జట్టు 4 సిక్సర్లు, 3 ఫోర్లతో ఏకంగా 42 పరుగులు రాబట్టడం విశేషం. కూల్టర్‌నీల్ ఓవర్లో రోహిత్ సిక్స్ బాదగా, ధావన్ వరుసగా 6, 4 కొట్టాడు. తొలి టి20 చివరి ఓవర్లో భారత్‌ను నిలువరించి హీరోగా మారిన స్టొయినిస్‌ను ఈసారి మన బ్యాట్స్‌మన్ చితక్కొట్టారు. అతను వేసిన ఏకైక ఓవర్లో రోహిత్ సిక్సర్, ధావన్ వరుసగా 6, 4, 4 కొట్టడంతో 22 పరుగులు లభించాయి. అయితే స్టార్క్ చక్కటి బంతితో ధావన్‌ను ఎల్బీగా ఔట్ చేయడంతో 67 పరుగుల (33 బంతుల్లో) తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. జంపా వేసిన తర్వాత ఓవర్లో వరుసగా నాలుగు డాట్ బంతులు ఆడిన రోహిత్ ఐదో బంతిని వికెట్లపైకి ఆడుకున్నాడు. భారీ సిక్సర్‌తో ఖాతా తెరిచిన రాహుల్ (20 బంతుల్లో 14; 1 సిక్స్) ఎక్కువసేపు నిలబడలేకపోగా, తొలి బంతికే రిషభ్ పంత్ (0) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో భారత్ 41 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉండటంతో కొంత ఉత్కంఠ నెలకొంది. తర్వాతి 12 బంతుల్లో 6 పరుగులు మాత్రమే రావడంతో లక్ష్యం 29 బంతుల్లో 51 పరుగులుగా మారింది. అయితే ఛేజింగ్ మాస్టర్ కోహ్లి ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వలేదు. టై ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన కోహ్లి తర్వాతి ఓవర్లో మరో సిక్సర్ బాదాడు. కార్తీక్ కూడా ఐదు బంతుల వ్యవధిలో సిక్స్, ఫోర్ కొట్టడంతో భారత్ పని సులువైంది. చివరి ఓవర్లో గెలిచేందుకు 6 పరుగులు కావాల్సి ఉండగా కోహ్లి వరుసగా రెండు ఫోర్లు కొట్టి రెండు బంతుల ముందే ఆట ముగించాడు. చివరి వరకు అండగా నిలిచిన దినేశ్ కార్తీక్ (18 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)తో ఐదో వికెట్‌కు కోహ్లి 39 బంతుల్లోనే అభేద్యంగా 60 పరుగులు జత చేశాడు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: షార్ట్ (ఎల్బీ) (బి) కృనాల్ 33; ఫించ్ (సి) కృనాల్ (బి) కుల్దీప్ 28; మ్యాక్స్‌వెల్ (సి) రోహిత్ (బి) కృనాల్ 13; మెక్‌డెర్మట్ (ఎల్బీ) (బి) కృనాల్ 0; కారీ (సి) కోహ్లి (బి) కృనాల్ 27; లిన్ (రనౌట్) 13; స్టొయినిస్ (నాటౌట్) 25; కూల్టర్‌నీల్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–68; 2–73; 3–73; 4–90; 5–119; 6–131. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–0; ఖలీల్ 4–0–35–0; బుమ్రా 4–0–38–0; కుల్దీప్ 4–0–19–1; కృనాల్ 4–0–36–4. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) జంపా 23; ధావన్ (ఎల్బీ) (బి) స్టార్క్ 41; కోహ్లి (నాటౌట్) 61; రాహుల్ (సి) కూల్టర్ నీల్ (బి) మ్యాక్స్‌వెల్ 14; పంత్ (సి) కారీ (బి) టై 0; కార్తీక్ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.4 ఓవర్లలో 4 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–67; 2–67; 3–108; 4–108. బౌలింగ్: స్టార్క్ 4–0–26–1; కూల్టర్‌నీల్ 3–0–40–0; స్టొయినిస్ 1–0–22–0; జంపా 4–1–22–1; మ్యాక్స్‌వెల్ 4–0–25–1; టై 3.4–0–32–1. సిరీస్ 1–1తో సమం చేయడాన్ని బట్టి చూస్తే ఇరు జట్లు ఎలా ఆడాయో అంచనా వేయవచ్చు. ఇది మా ప్రదర్శనను ప్రతిబింబిస్తోంది. మొత్తంగా ఈ రోజు మేం ఆస్ట్రేలియాపై అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించాం. కనీసం 180 పరుగులు చేయాల్సిన ఈ పిచ్‌పై మిగిలిన ఆ 15 పరుగులను నిరోధించడంలోనే గెలుపు దాగి ఉంది. ఓపెనర్లు చెలరేగితే మా పని మరింత సులువు అవుతుంది. దినేశ్ కార్తీక్ కూడా చివర్లో చాలా బాగా ఆడాడు. –విరాట్ కోహ్లి 14: భారత్ తరఫున ఛేదనలో 14 సార్లు కోహ్లి నాటౌట్‌గా నిలవగా... అన్ని మ్యాచ్‌లలోనూ జట్టు నెగ్గింది. 1:ఆసీస్ గడ్డపై టి20ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు (4/36) నమోదు చేసిన స్పిన్నర్‌గా కృనాల్ పాండ్యా గుర్తింపు పొందాడు. -
భారత్ అదరహో...
ఇంగ్లండ్ గడ్డపై ఇండియా అదరగొట్టింది. లక్ష్యం ఎంతటిదైనా తమ ముందు దిగదుడుపే అని మరోసారి నిరూపించింది. బలమైన ఇంగ్లండ్ అంటూ వినిపించిన మాటలను తేలిగ్గా తీసిపారేసినట్లుగా చివరి టి20లో సునాయాస విజయంతో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న రోహిత్ శర్మ, అంతర్జాతీయ టి20ల్లో మూడో సెంచరీతో మెరిసిన వేళ టీమిండియా 199 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కోహ్లి సమయోచిత బ్యాటింగ్, పాండ్యా మెరుపులు భారత్ పనిని సులువుగా మార్చేశాయి. ఇక గురువారం నుంచి ఇరు జట్ల మధ్య వన్డే సమరానికి తెర లేవనుంది. బ్రిస్టల్: భారీ అంచనాలతో ఇంగ్లండ్‌లో దిగిన భారత్ తొలి దశలో దానిని నిలబెట్టుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ను 2–1తో గెలుచుకొని సత్తా చాటింది. ఆదివారం ఇక్కడ జరిగిన చివరి టి20లో భారత్ 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. ముందుగా ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (31 బంతుల్లో 67; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), బట్లర్ (21 బంతుల్లో 34; 7 ఫోర్లు) ధాటిగా ఆడారు. పాండ్యాకు 4 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 201 పరుగులు సాధించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (56 బంతుల్లో 100 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. కోహ్లి (29 బంతుల్లో 43; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (14 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అండగా నిలిచారు. రోహిత్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు కూడా దక్కింది. ఓపెనర్ల విధ్వంసం... ఎప్పటిలాగే ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. రాయ్, బట్లర్ తమదైన శైలిలో దూకుడుగా ఆడటంతో భారత బౌలర్లు లయ తప్పారు. తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న దీపక్ చహర్ వేసిన తొలి ఓవర్లో బట్లర్ మూడు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత ఉమేశ్ ఓవర్లో రాయ్ 2 ఫోర్లు, సిక్సర్‌తో చెలరేగాడు. పాండ్యా వేసిన ఆరో ఓవర్లో రాయ్ వరుసగా 4, 4, 6, 6 కొట్టడంతో 22 పరుగులు వచ్చాయి. ఫలితంగా పవర్‌ప్లే ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 73 పరుగులకు చేరింది. అయితే ఎట్టకేలకు బట్లర్‌ను బౌల్ట్ చేసి కౌల్ ఈ జోడీని విడగొట్టాడు. వీరిద్దరు 47 బంతుల్లోనే 94 పరుగులు జత చేయడం విశేషం. ఆ తర్వాత రాయ్‌ను అవుట్ చేసి చహర్ తన తొలి వికెట్ అందుకున్నాడు. అనంతరం హేల్స్ (24 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. 13 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 132 పరుగులకు చేరింది. ఈ దశలో పాండ్యా వేసిన ఓవర్‌తో మ్యాచ్ మలుపు తిరిగింది. తొలి బంతికి మోర్గాన్ (6)ను ఔట్ చేసిన పాండ్యా, చివరి బంతికి హేల్స్ ఆట ముగించాడు. ఆ తర్వాత స్టోక్స్ (14), బెయిర్ స్టో (14 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అడపాదడపా కొన్ని మెరుపు షాట్లు ఆడినా... ఆరంభంలో కనబర్చిన దూకుడును ఇంగ్లండ్ చూపలేకపోయింది. వీరిద్దరు కూడా పాండ్యా బౌలింగ్‌లోనే వెనుదిరిగారు. చివరి ఓవర్లో కూడా ఇంగ్లండ్ మరో రెండు వికెట్లు కోల్పోయింది. ఒక దశలో కనీసం 230 పరుగులు చేసేలా కనిపించిన జట్టు... భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చివరకు 200 పరుగుల మార్క్‌ను కూడా అందుకోలేకపోయింది. తన తొలి ఓవర్లో 22 పరుగులిచ్చిన పాండ్యా, తర్వాతి 3 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీయడం విశేషం. రోహిత్ ఒంటిచేత్తో... లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలోనే శిఖర్ ధావన్ (5) వికెట్ కోల్పోయింది. వేగంగా ఆడబోయిన రాహుల్ (10 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా జోర్డాన్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. అయితే మరోవైపు రోహిత్ దూకుడైన బ్యాటింగ్‌తో భారత్ దూసుకుపోయింది. తాను ఎదుర్కొన్న మూడో బంతిని సిక్సర్‌గా మలిచి ఖాతా తెరిచిన రోహిత్ ఇన్నింగ్స్ ఆసాంతం స్వేచ్ఛగా ఆడాడు. ఎక్కడా అతని షాట్లలో తడబాటు కనిపించలేదు. ప్రతీ ఇంగ్లండ్ బౌలర్‌ను అతను అలవోకగా ఎదుర్కొన్నాడు. జోర్డాన్ ఓవర్లో ఫోర్, 2 సిక్సర్లతో ధాటిని పెంచిన అతను 28 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు కోహ్లి కూడా తనదైన శైలిలో చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 57 బంతుల్లోనే 89 పరుగులు జోడించారు. జోర్డాన్ రిటర్న్ క్యాచ్‌కు కోహ్లి వెనుదిరిగినా, అప్పటికే భారత్ విజయం దిశగా సాగుతోంది. రోహిత్‌కు పాండ్యా జత కలిసిన తర్వాత గెలుపు సునాయాసమైపోయింది. 24 బంతుల్లో 44 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్ తర్వాతి 16 బంతుల్లోనే ఆట ముగించేసింది. బాల్ వేసిన 17వ ఓవర్లో 3 ఫోర్లతో 15 పరుగులు రాగా, విల్లీ వేసిన 18వ ఓవర్లో పాండ్యా ఒక సిక్స్, 2 ఫోర్లు కొట్టాడు. రోహిత్ కూడా మరో ఫోర్ బాదడంతో 20 పరుగులు లభించాయి. జోర్డాన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి రోహిత్ 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా... భారీ సిక్స్‌తో పాండ్యా గెలిపించాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) ధోని (బి) చహల్ 67; బట్లర్ (బి) కౌల్ 34; హేల్స్ (సి) ధోని (బి) పాండ్యా 30; మోర్గాన్ (సి) ధోని (బి) పాండ్యా 6; స్టోక్స్ (సి) కోహ్లి (బి) పాండ్యా 14; బెయిర్ స్టో (సి) ధోని (బి) పాండ్యా 25; విల్లీ (బి) ఉమేశ్ 1; జోర్డాన్ (రనౌట్) 3; ప్లంకెట్ (సి) ధోని (బి) కౌల్ 9; రషీద్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–94; 2–103; 3–134; 4–140; 5–177; 6–181; 7–183; 8–194; 9–198. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–43–1; ఉమేశ్ 4–0–48–1; కౌల్ 4–0–35–2; పాండ్యా 4–0–38–4; చహల్ 4–0–30–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (నాటౌట్) 100; ధావన్ (సి) బాల్ (బి) విల్లీ 5; రాహుల్ (సి) జోర్డాన్ (బి) బాల్ 19; కోహ్లి (సి అండ్ బి) జోర్డాన్ 43; పాండ్యా (నాటౌట్) 33; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.4 ఓవర్లలో 3 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–21; 2–62; 3–151. బౌలింగ్: విల్లీ 3–0–37–1; బాల్ 3–0–39–1; జోర్డాన్ 3.4–0–40–1; ప్లంకెట్ 3–0–42–0; స్టోక్స్ 2–0–11–0; రషీద్ 4–0–32–0. ► 3 అంతర్జాతీయ టి20ల్లో రోహిత్ సెంచరీల సంఖ్య. కొలిన్ మున్రో (న్యూజిలాండ్) మాత్రమే 3 సెంచరీలు సాధించాడు. ► 5 ఒకే ఇన్నింగ్స్‌లో 5 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్ కీపర్ ధోని. అయితే ఐదుగురిని ఔట్ చేసిన కీపర్లలో షహజాద్ (అఫ్గానిస్తాన్) కూడా ఉన్నాడు. అతను 3 క్యాచ్‌లు పట్టి, 2 స్టంపింగ్‌లు చేశాడు. ► 76 భారత్ తరఫున టి20లు ఆడిన 76వ ఆటగాడు దీపక్ చహర్ ► 8 భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లు. అన్నింటిలోనూ విజేతగా నిలిచింది. -
లంకదే టి20 సిరీస్
ఢాకా: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో శ్రీలంక 75 పరుగుల తేడాతో నెగ్గి సిరీస్‌ను 2–0తో దక్కించుకుంది. మొదట శ్రీలంక 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు చేసింది. కుశాల్ మెండిస్ (70; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), గుణతిలక (42; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిసారా పెరీరా ( 31; 3 ఫోర్లు 1 సిక్స్), షనక (30; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం బంగ్లా 18.4 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌటైంది. తమీమ్ ఇక్బాల్ (29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మహ్మదుల్లా (41; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతావారంతా విఫలమయ్యారు. గుణతిలక, మధుశంక రెండేసి వికెట్లు తీశారు. -
దేవుడా.. ఆ పరిస్థితి రానీయకు అనుకున్నా
తిరువనంతపురం: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ-20 మ్యాచ్‌లో చివరి ఓవర్ వేసిన హార్థిక్ పాండ్యాకు గాయం అవ్వడం.. కెప్టెన్ విరాట్ కోహ్లిని తీవ్రంగా టెన్షన్ పెట్టిందట. సిరీస్‌ను నిర్ణయించే కీలకమైన ఈ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‌పై థ్రిల్లింగ్ విక్టరీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వర్షంతో ఎనిమిది ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్లో విజయానికి కివీస్ జట్టుకు 19 పరుగులు కావాలి. ఈ దశలో విరాట్ బంతిని పాండ్యాకు అప్పగించాడు. స్లో బంతితో పాండ్యా చివరి ఓవర్‌ను ప్రారంభించాడు. మొదటి బాల్‌కు బై రూపంలో మిచెల్ సాంటర్న్ పరుగు తీశాడు. ఇక, రెండో బంతికి అసలు డ్రామా చోటుచేసుకుంది. పాండ్యా విసిరిన ఈ బంతిని కివీస్ బ్యాట్స్‌మన్ కలిన్ డీ గ్రాండ్‌హామ్ స్ట్రయిట్ షాట్ బాదాడు. తనైవైపు దూసుకొచ్చిన బాల్‌ను క్యాచ్ చేసేందుకు ప్రయత్నించిన పాండ్యా చేతివేలికి గాయమైంది. దీంతో టీమిండియాలో ఆందోళన.. వెంటనే జట్టు ఫిజియో నిపుణుడు ప్యాట్రిక్ ఫర్హర్ట్ మైదానంలోకి వచ్చి పాండ్యాకు సపర్యలు చేశాడు. దీంతో ఫిట్ అయిన పాండ్యా చివరి ఓవర్‌ను విజయవంతంగా పూర్తిచేశాడు. మూడో బంతిని గ్రాండ్‌హోమ్ భారీ సిక్సర్ కొట్టినా.. తర్వాతి బంతులను పాండ్యా కట్టుదిట్టంగా విసరడంతో టీమిండియా ఆరుపరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, చివరి ఓవర్లో పాండ్యా గాయపడటం తనను త్రీవంగా టెన్షన్ పెట్టిందని మ్యాచ్ అనంతరం కెప్టెన్ కోహ్లి తెలిపాడు. ’హార్థిక్ చివరి ఓవర్ బాగా వేశాడు. హార్థిక్ గాయపడినప్పుడు.. దేవుడా.. చివరి నాలుగు బంతులు నేను వేసే పరిస్థితి రానీయకు అన్నట్టు నేనుండిపోయాను’ అంటూ కోహ్లి నవ్వుతూ చెప్పాడు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఏడో ఓవర్ బుమ్రాకు ఇవ్వాల్సిందిగా తనకు రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ సూచించారని, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడని కోహ్లి కొనియాడాడు. పాండ్యా కూడా చివరి ఓవర్‌ను బాగా వేశాడని కితాబిచ్చాడు. మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తోపాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు బుమ్రాకు లభించాయి. CHAMPIONS #TeamIndia pic.twitter.com/eE3rsVQDjO — BCCI (@BCCI) November 7, 2017 -
ధావన్ ఇన్.. సీనియర్ బౌలర్‌కు అనూహ్య చాన్స్!
సాక్షి, న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల ట్వంట్వీ-20 ఇంటర్నేషనల్ సిరీస్ కోసం సీనియర్ బౌలర్ ఆశిష్ నెహ్రాకు పిలుపు అందింది. 38 ఏళ్ల నెహ్రా చివరిసారిగా గత ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో టీ-20 మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత ఈ వెటరన్ బౌలర్‌కు జట్టులో చోటు దక్కడం ఇదే. శనివారం నుంచి జరిగే ఈ టీ-20 సిరీస్ కోసం సెలెక్టర్లు 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను 4-1 తేడాతో భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐదో వన్డే ముగిసిన వెంటనే ప్రకటించిన టీ-20 జట్టులో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఆశిష్ నెహ్రాతోపాటు.. ఓపెనర్ శిఖర్ ధావన్‌కు చోటు దక్కింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను దగ్గరుండి చూసుకునేందుకు ధావన్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ధావన్ లేకపోవడంతో అతని స్థానంలో అజింక్యా రహానే.. రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ బాధ్యతలు నిర్వహించాడు. ఇప్పుడు ధావన్ రావడంతో రహానేపై వేటు పడింది. వికెట్ కీపర్‌గా మహేంద్రసింగ్ ధోనీని ఎంపికచేయడంతోపాటు అదనంగా దినేశ్ కార్తీక్‌ను కూడా తీసుకోవడం గమనార్హం. టీమిండియా జట్టు ఇదే విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, కేదార్ జాధవ్, దినేష్ కార్తీక్, ఎంఎస్ ధోనీ, హార్థిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఆశిష్ నెహ్రా, అక్సర్ పటేల్. -
టి20 సిరీస్ నూ క్లీన్ స్వీప్ చేశారు
రాంచీ: శ్రీలంక మహిళలతో జరిగిన టి20 క్రికెట్ సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. శుక్రవారం జరిగిన మూడో మ్యాచ్ లో లంకను మిథాలీ సేన 9 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌటైంది. కౌశల్య(25), జయాంగిని(21) టాప్ స్కోరర్లుగా నిలిచారు. బిష్త్ 3, పాటిల్ 2 వికెట్లు పడగొట్టారు. 90 పరుగుల టార్గెట్ ను 37 బంతులు మిగిలుండగానే వికెట్ నష్టపోయి భారత్ చేరుకుంది. 13.5 ఓవర్లలో 91 పరుగులు చేసింది. మంధన 43, వనిత 34, వేద కృష్ణమూర్తి 13 పరుగులు చేశారు. అంతకుముందు శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను మిథాలీ సేన క్లీన్ స్వీప్ చేసింది.