ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్‌తో జరిగిన ఐదో టీ20లో 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పరాజయం పాలైంది. 248 పరుగుల భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం 97 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి పాలైనప్పటికి ఆ జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ మాత్రం తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
ఈ సిరీస్‌లో మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైన సాల్ట్.. ఐదో టీ20తో తన రిథమ్‌ను అందుకున్నాడు. భారీ లక్ష్య చేధనలో సాల్ట్ దూకుడుగా ఆడాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన మహ్మద్ షమీ బౌలింగ్‌లో సాల్ట్ ఏకంగా 17 పరుగులు రాబట్టి తన జట్టుకు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.
కానీ సహచరుల నుంచి సపోర్ట్ లభించకపోవడంతో ఇంగ్లండ్ స్కోర్ బోర్డు మూడెంకెల మార్క్ దాటలేకపోయింది. సాల్ట్ మినహా వచ్చినవారు వచ్చినట్లగానే పెవిలియన్‌కు క్యూ కట్టారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, దూబే, అభిషేక్ శర్మ తలా రెండు వికెట్లు సాధించారు. ఈ మ్యాచ్‌లో కేవలం 23 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సాల్ట్.. 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో సాల్ట్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
సాల్ట్ అరుదైన ఘనత..
అంతర్జాతీయ టీ20ల్లో ఒక ఇన్నింగ్స్‌లోని మొదటి బంతికే అత్యధిక సార్లు ఫోర్ కొట్టిన తొలి ఆటగాడిగా సాల్ట్ నిలిచాడు. ఇప్పటివరకు సాల్ట్ 37 సార్లు ఇన్నింగ్స్‌లోని తొలి బంతినే ఫోర్‌గా మలిచాడు. ప్రపంచంలోనే ఏ బ్యాటరూ ఈ ఫీట్ సాధించలేదు. ఓవరాల్‌గా సాల్ట్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 43 టీ20లు ఆడి 1193 పరుగులు చేశాడు. ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున సాల్ట్ ఆడనున్నాడు.
అభిషేక్ శర్మ విధ్వంసం..
ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 37 బంతుల్లోనే తన రెండో టీ20 సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. వాంఖడేను అభిషేక్ తన బ్యాట్‌తో షేక్ చేశాడు. మార్క్ వుడ్, అర్చర్ వంటి ఫాస్ట్ బౌలర్లను సైతం ఈ పంజాబీ బ్యాటర్ ఓ ఆట ఆడేసికున్నాడు. ఓవరాల్‌గా 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్స్ లతో 135 పరుగులు చేసి ఔటయ్యాడు. అటు బౌలింగ్‌లోనూ రెండు వికెట్లతో అభిషేక్ సత్తాచాటాడు.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
Comments
Please login to add a commentAdd a comment