మహేంద్ర సింగ్ ధోని తన స్వస్థలం రాంచీ మైదానంలో మూడు వన్డేలు ఆడాడు. ఒక మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోగా... మరో రెండు సార్లు 10 (నాటౌట్), 11 పరుగులు చేశాడు. రెండు టి20ల్లో ఒకదాంట్లో 9(నాటౌట్) పరుగులు చేయగా, మరో మ్యాచ్‌లో బ్యాటింగ్ రాలేదు. రాంచీకి టెస్టు హోదా వచ్చే సమయానికి అతను టెస్టులకు గుడ్‌బై చెప్పేశాడు. ఐదు మ్యాచ్‌లలో కూడా అతని అసలు సిసలు ఆట, మెరుపులను ప్రత్యక్షంగా చూసే అవకాశం సొంత అభిమానులకు కలగలేదు.
వరల్డ్ కప్ తర్వాత రిటైరయ్యే అవకాశం ఉన్న ధోని రాంచీ మైదానంలో తన పేరుతో ఉన్న పెవిలియన్‌ను సగర్వంగా చూస్తూ చివరి మ్యాచ్ ఆడనున్నాడు. ఈనేపథ్యంలో నేడు ఆస్ట్రేలియాతో జరిగే మూడో వన్డేలో అందరి దృష్టి మహేంద్రుడిపైనే ఉంది. అతను చెలరేగి ఫ్యాన్స్‌ను అలరించగలడా... భారత్ మరో విజయంతో సిరీస్‌ను గెలుచుకోగలదా ఆసక్తికరం.
రాంచీ: ఆస్ట్రేలియా చేతిలో టి20 సిరీస్‌ను కోల్పోయిన తర్వాత భారత్ వెంటనే కోలుకుంది. కొంత పోటాపోటీగా సాగినా తొలి రెండు వన్డేల్లో విజయం మన ఖాతాలోకే చేరింది. రెండు స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో ఆసీస్‌పై మన ఆధిక్యం బలంగా కనిపించింది. ఇప్పుడు మరో మ్యాచ్ గెలిస్తే సిరీస్ సొంతం చేసుకొని చివరి రెండు మ్యాచ్‌ల కోసం ప్రయోగాలు చేసేందుకు భారత్‌కు అవకాశం కలుగుతుంది. ఇలాంటి స్థితిలో నేడు (శుక్రవారం) భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇక్కడి జేఎస్‌సీఏ స్టేడియంలో మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. సిరీస్ సొంతం చేసుకునే లక్ష్యంతో కోహ్లి సేన బరిలోకి దిగుతుండగా, గత రెండు వన్డేల్లో చేజారిన విజయాన్ని ఈ సారైనా అందుకోవాలని కంగారూలు భావిస్తున్నారు.
భువనేశ్వర్ వచ్చాడు...
రెండు విజయాల తర్వాత భారత తుది జట్టులో మార్పుల గురించి ఆలోచించాల్సిన అవసరం కనిపించడం లేదు. కోహ్లి అద్భుత ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేకపోయినా...అతని డిప్యూటీ రోహిత్ శర్మ ఇంకా తన స్థాయికి తగినట్లుగా చెలరేగలేదు. గత మ్యాచ్‌లో డకౌటైన రోహిత్ నుంచి మేనేజ్‌మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. అయితే బ్యాటింగ్‌కు సంబంధించి అతి పెద్ద సమస్య శిఖర్ ధావన్‌దే. గత 15 ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 376 పరుగులే చేసిన ధావన్ రెండు అర్ధసెంచరీలే నమోదు చేశాడు. కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్‌లో అందరికంటే ధావన్‌కే ఈ మ్యాచ్ కీలకం కానుంది. నాలుగో స్థానంలో నిలదొక్కుకున్నట్లు కనిపించిన రాయుడు మళ్లీ తన ఆటతో సందేహాలు రేకెత్తిస్తున్నాడు. అతను కూడా తన సత్తా చాటాల్సి ఉంది. లేదంటే మిడిలార్డర్‌లో లోకేశ్ రాహుల్‌నుంచి పోటీ తప్పదు.
విజయ్ శంకర్ తాజా ఆట నేపథ్యంలో అతడిని ఆర్డర్‌లో మరింత ముందుగా పంపే అవకాశం కూడా కనిపిస్తోంది. తర్వాతి స్థానాల్లో జాదవ్, ధోనిలతో లైనప్ పటిష్టంగా ఉంది. సొంత ప్రేక్షకుల సమక్షంలో తన స్థాయికి తగినట్లుగా ఆడితే ఈ మ్యాచ్ ధోనికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జడేజా తన పొదుపైన బౌలింగ్, ఫీల్డింగ్‌తో వరల్డ్ కప్ రేసులో తానూ ఉన్నానంటూ దూసుకొచ్చాడు. బౌలింగ్ విభాగంలో విశ్రాంతి తర్వాత భువనేశ్వర్ తిరిగి రావడం కీలక మార్పు. నిజానికి ఇద్దరు పేసర్లు బుమ్రా, షమీ కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. అయితే షమీ స్థానంలో భువీ ఆడే అవకాశం కనిపిస్తోంది. కుల్దీప్ మరో సారి ఆసీస్‌ను కట్టిపడేసేందుకు సిద్ధంగా ఉండగా, చహల్ మళ్లీ పెవిలియన్‌కే పరిమితం కానున్నాడు.
గెలిపించేదెవరు...
తొలి మ్యాచ్‌లో 99 పరుగులకే 4 కీలక వికెట్లు తీసినా...రెండో వన్డేలో విజయానికి అతి సమీపంగా వచ్చినా ఆసీస్‌కు గెలుపు ఆనందం మాత్రం దక్కలేదు. జట్టులో అందరూ అంతంత మాత్రంగానే ఆడుతుండటంతో మ్యాచ్ గెలిపించేదెవరు అన్నట్లుగా దిక్కులు చూడాల్సిన పరిస్థితి జట్టులో కనిపిస్తోంది. వరుస వైఫల్యాల తర్వాత ఫించ్ గత మ్యాచ్‌లో కాస్త మెరుగనిపించినా 70 స్ట్రైక్‌రేట్ అతని స్థాయికి తగిన ఆట కాదు. ఇప్పుడు జట్టులో అందరికంటే ఎక్కువగా అతనిపైనే ఒత్తిడి ఉంది. మరో ఓపెనర్ ఖాజా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. గత ఏడాది కాలంగా ఆసీస్ వన్డే జట్టులో నిలకడగా ఆడుతున్న షాన్ మార్, హ్యాండ్స్‌కోంబ్ రాణిస్తేనే ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలుగుతుంది.
టి20 మెరుపుల తర్వాత మ్యాక్స్‌వెల్ రెండు వన్డేల్లోనూ విఫలమయ్యాడు. అతను ఫామ్‌లోకి రావడం కూడా కీలకం. గత మ్యాచ్‌లో జట్టును విజయానికి చేరువగా తెచ్చిన స్టొయినిస్ గెలుపు గీత మాత్రం దాటించలేకపోతున్నాడు. స్టొయినిస్ 7 అర్ధ సెంచరీలు చేయగా, ఆసీస్ ఒక్క సారి కూడా మ్యాచ్ గెలవలేదు! స్పిన్‌ను ఆడలేకపోతుండటం ఆ జట్టును దెబ్బ తీస్తోంది. మరో సారి ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉండగా పేసర్ కూల్టర్ నీల్ స్థానంలో రిచర్డ్సన్ లేదా బెహ్రన్‌డార్ఫ్‌ను ఎంపిక చేయవచ్చు. అందుబాటులో ఉన్న అన్ని అస్త్ర శస్త్రాలతో ఏదోలా ఈ మ్యాచ్ గెలిస్తేనే ఆసీస్ సిరీస్‌లో నిలుస్తుంది.
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాయుడు, విజయ్ శంకర్, జాదవ్, ధోని, జడేజా, కుల్దీప్, బుమ్రా, భువనేశ్వర్
ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), ఖాజా, మార్‌ష, హ్యాండ్స్‌కోంబ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, కారీ, కమిన్స్, లయన్, జంపా, కూల్టర్ నీల్/ బెహ్రన్‌డార్ఫ్
పిచ్, వాతావరణం
తొలి రెండు వన్డేల్లాగే ఇది కూడా కొంత నెమ్మదైన పిచ్. సాధారణ స్కోర్లకు అవకాశం ఉంది. మంచు ప్రభావం ఉంటోంది కాబట్టి టాస్ గెలిస్తే ఫీల్డింగ్‌కు మొగ్గుచూపవచ్చు. మ్యాచ్‌కు వాతావరణ సమస్య లేదు.
Comments
Please login to add a commentAdd a comment