'ఇక ధోనికి గుడ్ బై చెప్పండి'
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓటమి పాలైన టీమిండియా జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ లో కూడా భారత జట్టు గెలవకపోవడంతో పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని తప్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా ధోని నాయకత్వంపై భారత మాజీ లెజెండ్ స్పిన్నర్ ఎర్రపల్లి ప్రసన్నవిమర్శనాస్త్రాలు సంధించాడు. తన దృష్టిలో ఇక ధోని సారథ్య బాధ్యతలకు వీడ్కోలు చెబితే మంచిదన్నాడు. ధోనిని బ్యాట్స్ మెన్ గా, కీపర్ గా పరిమితం చేసి వన్డే కెప్టెన్గా కోహ్లిని నియమిస్తే జట్టు ప్రయోజనాలకు మంచి జరుగుతుందన్నాడు. త్వరలో భారత్ లో జరిగే ట్వంటీ 20 వరల్డ్ కప్ వరకూ ధోనినే కెప్టెన్ గా నియమించిన సెలక్టర్లు తమ నిర్ణయాన్ని మరోసారి పునఃసమీక్షించుకోవాలని ప్రసన్న ఈ సందర్భంగా తెలిపాడు.
కోహ్లిని వన్డే కెప్టెన్ గా చేసే సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం 33 సంవత్సరాలపైగా ఉన్న ధోనిని మరికొంత కాలం కెప్టెన్ ఎందుకు కొనసాగించాలి. ఇప్పుడే అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగిస్తే జట్టు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఒకవేళ ధోని ఒక ఆటగాడిగా ఉండాలనుకుంటే అంతవరకూ మాత్రమే పరిమితం చేయండి' అని ప్రసన్న స్పష్టం చేశాడు. ఈ విషయంలో తనను అడిగితే మాత్రం కచ్చితంగా ధోనిని తప్పించి కోహ్లికి బాధ్యతలు అప్పగించాలని చెబుతానన్నాడు. గత మూడు వన్డే సిరీస్ లను ధోని నేతృత్వంలోనే కోల్పోయిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.