1/2, 2/2, 3/2... 2 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు... ఆ్రస్టేలియాపై 200 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు లభించిన ఆరంభమిది... చేపాక్ మైదానంలో అంతా నిశ్శబ్దం... ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ప్రమాద ఘంటిక వినిపించింది. అయితే ఎప్పటిలాగే కోహ్లి బాధ్యతను తనపై వేసుకోగా కేఎల్ రాహుల్ కూడా తగిన విధంగా సహకరించాడు.
ఆసీస్ బౌలర్లకు ఆపై అవకాశం ఇవ్వకుండా సాగిపోయిన ఈ జోడీ చివరకు భారత్‌ను విజయతీరం చేర్చింది. అంతకుముందు పటిష్ట ఆసీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి భారత బౌలర్లు పైచేయి సాధించారు. నెమ్మదైన చెన్నై పిచ్‌పై మన స్పిన్నర్లను ఆడలేక ప్రత్యర్థి చేతులెత్తేయడంతో టీమిండియా గెలిచేందుకు పునాది పడింది.
చెన్నై: సొంతగడ్డపై వన్డే ప్రపంచ కప్ వేటలో భారత్ శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (71 బంతుల్లో 46; 5 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (52 బంతుల్లో 41; 6 ఫోర్లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు.
అనంతరం భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కేఎల్ రాహుల్ (115 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (116 బంతుల్లో 85; 6 ఫోర్లు) విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 35.4 ఓవర్లలో 165 పరుగులు జోడించారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను బుధవారం ఢిల్లీలో అఫ్గానిస్తాన్‌తో ఆడుతుంది.
సమష్టి వైఫల్యం...
ఓపెనర్ మిచెల్ మార్ష్ (0)ను తన రెండో ఓవర్లోనే వెనక్కి పంపి బుమ్రా భారత్‌కు శుభారంభం అందించగా... వార్నర్, స్మిత్ కలిసి ఆసీస్‌ను ఆదుకున్నారు. 10 ఓవర్లలో స్కోరు 43 పరుగులకు చేరింది. రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం తర్వాత భారత స్పిన్నర్ల జోరు మొదలైంది. వికెట్లు తీయడంతో పాటు పరుగులు కూడా ఇవ్వకుండా ఆసీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. కుల్దీప్ చక్కటి బంతితో వార్నర్‌ను అవుట్ చేసి ఈ జోడీని విడదీయగా, తర్వాతి 3 వికెట్లు జడేజా ఖాతాలో చేరాయి.
స్మిత్‌ను బౌల్డ్ చేసిన జడేజా... ఒకే ఓవర్లో లబుషేన్ (27), క్యారీ (0)లను వెనక్కి పంపాడు. ఒకదశలో 73 బంతుల పాటు ఆసీస్ బౌండరీ కొట్టలేకపోయింది! కీలక బ్యాటర్ మ్యాక్స్‌వెల్ (15)ను కుల్దీప్ బౌల్డ్ చేయగా, అదే స్కోరు వద్ద గ్రీన్ (8) వికెట్ అశ్విన్ ఖాతాలో చేరింది. అయితే మిచెల్ స్టార్క్ (35 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్ ఆసీస్‌ను 200 పరుగులకు చేరువగా తీసుకొచ్చింది. కమిన్స్ (15), జంపా (6), హాజల్‌వుడ్ (1 నాటౌట్)లతో చివరి మూడు వికెట్లకు కలిపి స్టార్క్ 59 పరుగులు జోడించడం విశేషం.
భారీ భాగస్వామ్యం...
ఛేదనలో భారత జట్టు అనూహ్య రీతిలో తడబడింది. ‘డెంగీ’తో శుబ్‌మన్ గిల్ మ్యాచ్‌కు దూరం కావడంతో ఓపెనర్‌గా అవకాశం దక్కించుకున్న ఇషాన్ కిషన్ (0) దూరంగా వెళుతున్న బంతిని వెంటాడి అవుట్ కాగా, హాజల్‌వుడ్ వేసిన చక్కటి బంతికి రోహిత్ శర్మ (0) వికెట్ల ముందు దొరికిపోయాడు. రోహిత్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. ఆ వెంటనే శ్రేయస్ అయ్యర్ (0) నిర్లక్ష్యపు షాట్‌తో పెవిలియన్ చేరాడు.
19 ఏళ్ల తర్వాత వన్డేల్లో భారత ఓపెనర్లిద్దరు డకౌట్ కాగా, టాప్–4లో ముగ్గురు డకౌట్ కావడం వన్డేల్లో భారత్‌కు ఇదే మొదటిసారి. వీరిద్దరి భాగస్వామ్యంలో జట్టు కోలుకుంది. 10 ఓవర్లలో భారత్ స్కోరు 27/3. లక్ష్యం మరీ పెద్దది కాకపోవడంతో కోహ్లి, రాహుల్ ఎలాంటి సాహసాలకు పోకుండా చక్కటి సమన్వయంతో నెమ్మదిగా పరుగులు రాబడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. 75 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, భారత్ స్కోరు కూడా 25.3 ఓవర్లలో సరిగ్గా వంద పరుగులకు చేరింది.
ఆ తర్వాత 72 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ఈ జోడీని విడదీయడంలో ఆసీస్ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. సెంచరీ దిశగా వెళుతున్న కోహ్లి చివరకు విజయానికి 33 పరుగుల దూరంలో వెనుదిరిగాడు. అయితే హార్దిక్ పాండ్యా (11 నాటౌట్)తో కలిసి రాహుల్ ఆట ముగించాడు. గెలిచేందుకు ఐదు పరుగులు అవసరం కాగా, సిక్సర్ కొట్టిన రాహుల్‌కు కూడా సెంచరీ చేసే అవకాశం చేజారింది.
ఆ క్యాచ్ పట్టి ఉంటే...
భారత్ స్కోరు 20/3... ఆసీస్ బౌలర్లు చెలరేగిపోతున్నారు. హాజల్‌వుడ్ వేసిన బంతిని కోహ్లి పుల్ చేయబోగా బంతి లెగ్ సైడ్ గాల్లోకి లేచింది. కీపర్ క్యారీ, మిడ్ వికెట్ నుంచి మార్ష్ ముందుకు దూసుకొచ్చారు. క్యారీ వెనక్కి తగ్గగా, క్యాచ్‌ను అందుకోగలిగే స్థితిలో ఉండి కూడా మార్ష్ చేతుల్లో పడిన బంతిని వదిలేశాడు. ఆ సమయంలో కోహ్లి స్కోరు 12. ఆ క్యాచ్ మార్ష్ పట్టి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో!
స్కోరు వివరాలు
ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి అండ్ బి) కుల్దీప్ 41; మార్ష్ (సి) కోహ్లి (బి) బుమ్రా 0; స్మిత్ (బి) జడేజా 46; లబుషేన్ (సి) రాహుల్ (బి) జడేజా 27; మ్యాక్స్‌వెల్ (బి) కుల్దీప్ 15; క్యారీ (ఎల్బీ) (బి) జడేజా 0; గ్రీన్ (సి)
పాండ్యా (బి) అశ్విన్ 8; కమిన్స్ (సి) అయ్యర్ (బి) బుమ్రా 15; స్టార్క్ (సి) అయ్యర్ (బి) సిరాజ్ 28; జంపా (సి) కోహ్లి (బి)
పాండ్యా 6; హాజల్‌వుడ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 199. వికెట్ల పతనం: 1–5, 2–74, 3–110, 4–119, 5–119, 6–140, 7–140, 8–165, 9–189, 10–199. బౌలింగ్: బుమ్రా 10–0–35–2, సిరాజ్ 6.3–1–26–1,
పాండ్యా 3–0–28–1, అశ్విన్ 10–1–34–1, కుల్దీప్ 10–0–42–2, జడేజా 10–2–28–3.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) హాజల్‌వుడ్ 0; ఇషాన్ కిషన్ (సి) గ్రీన్ (బి) స్టార్క్ 0; కోహ్లి (సి) లబుషేన్ (బి) హాజల్‌వుడ్ 85; అయ్యర్ (సి) వార్నర్ (బి) హాజల్‌వుడ్ 0; రాహుల్ (నాటౌట్) 97; పాండ్యా (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (41.2 ఓవర్లలో 4 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–2, 2–2, 3–2, 4–167. బౌలింగ్: స్టార్క్ 8–0–31–1, హాజల్‌వుడ్ 9–1–38–3, కమిన్స్ 6.2–0–33–0, మ్యాక్స్‌వెల్ 8–0–33–0, గ్రీన్ 2–0–11–0, జంపా 8–0–53–0.
ప్రపంచకప్‌లో నేడు
న్యూజిలాండ్ X నెదర్లాండ్స్
వేదిక: హైదరాబాద్
మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment