
ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ విభాగం విధ్వంసకర డైనమైట్లతో నిండుకుని ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ జట్టు బ్యాటింగ్ విభాగం అత్యంత పటిష్టంగా, ప్రమాదకరంగా కనిపిస్తుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదలు మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, శశాంక్ సింగ్, జోస్ ఇంగ్లిస్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, ఆరోన్ హార్డీ, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, మార్కో జన్సెన్.. ఇలా జట్టు మొత్తం విధ్వంసకర వీరులే ఉన్నారు.
బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తున్నా.. బ్యాటింగ్ బలగం చూసి పంజాబ్‌ను టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా చెప్పవచ్చు. జట్టులో చాలామంది మిడిలార్డర్ బ్యాటర్లు ఉండటంతో తుది జట్టు కూర్పు సమస్యగా మారవచ్చు. ఓపెనర్లుగా జోస్ ఇంగ్లిస్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ రావచ్చని అంచనా. వన్‌డౌన్‌లో శ్రేయస్ అయ్యర్, నాలుగో స్థానంలో నేహల్ వధేరా, ఐదో ప్లేస్‌లో శశాంక్ సింగ్ బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది.
ఆరో స్థానంలో మ్యాక్స్‌వెల్, ఏడో ప్లేస్‌లో అజ్మతుల్లా ఒమర్‌జాయ్/మార్కో జన్సెన్, బౌలర్లుగా అర్షదీప్ సింగ్, లోకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చహల్, జేవియర్ బార్ట్‌లెట్ తుది జట్టులో ఉండవచ్చు.కాగా, ఈ నెల 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుండగా... పంజాబ్ కింగ్స్ మార్చి 25న గుజరాత్ టైటాన్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
లీగ్ ఆరంభం నుంచి ఒక్కసారి కూడా ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన పంజాబ్ కింగ్స్... ఈసారి తమ చిరకాల స్వప్నం నెరవేర్చుకోవాలనే లక్ష్యంతో ఉంది. గతేడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ ఈసారి పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ హెడ్‌కోచ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో పంజాబ్ తమ టైటిల్ కల నేరవేర్చుకుంటుందేమో చూడాలి.
ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు..
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నేహల్ వధేరా, ప్రియాన్ష్ ఆర్య, హర్నూర్ సింగ్, పైలా అవినాశ్, ముషీర్ ఖాన్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, శశాంక్ సింగ్, ఆరోన్ హార్డీ, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, మార్కో జన్సెన్, సూర్యాంశ్ షేడ్గే, ప్రవీణ్ దూబే, జోస్ ఇంగ్లిస్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, విష్ణు వినోద్, హర్ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్, లోకీ ఫెర్గూసన్, విజయ్‌కుమార్ వైశాక్, కుల్దీప్ సేన్, యశ్ ఠాకూర్, జేవియర్ బార్ట్‌లెట్
Comments
Please login to add a commentAdd a comment