
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మార్చి 23న జరుగనుంది. ఆ రోజు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనుండగా.. ఎంఐ, సీఎస్‌కే మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తమ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సేవలు కోల్పోనుంది. గత సీజన్‌లో చేసిన తప్పుల కారణంగా హార్దిక్ సీఎస్‌కేతో మ్యాచ్‌కు దూరం కానున్నాడు. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్‌ల్లో స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసింది.
దీంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ముంబై కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాకు రూ.30 లక్షల జరిమానాతో పాటు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించింది. గత సీజన్‌లో ముంబై గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో హార్దిక్‌పై నిషేధం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే అతను నిషేధం ఎదుర్కొంటున్నాడు.
హార్దిక్ గైర్హాజరీలో ముంబై ఇండియన్స్ తాత్కాలిక సారధిగా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇవాళ (మార్చి 19) స్వయంగా ప్రకటించాడు. సూర్యకుమార్‌కు భారత టీ20 జట్టు కెప్టెన్‌గా అనుభవం ఉండటంతో ఎంఐ మేనేజ్‌మెంట్ అతనికే సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది.
కాగా, ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన రోహిత్ శర్మ కెప్టెన్సీపై అయిష్టతతో 2023 సీజన్ తర్వాత తప్పుకున్న విషయం తెలిసిందే. మరో సీనియర్ ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా ఈ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సీనియర్లలో ఒకరైన సూర్యకుమార్‌కే సీఎస్‌కేతో మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం వచ్చింది.
టీ20ల్లో సూర్య కుమార్ యాదవ్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. స్కై సారథ్యంలో భారత్ 18 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింట మాత్రమే ఓడింది. ఓవరాల్‌గా స్కై 39 టీ20 మ్యాచ్‌ల్లో సారథ్యం వహించి 28 మ్యాచ్‌ల్లో తన జట్టును గెలిపించుకున్నాడు. స్కై.. గతంలోనూ ఓ సందర్భంలో (2023 సీజన్‌లో) ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. స్కై తన కెప్టెన్సీలో బ్యాటర్‌గానూ విశేషంగా రాణించాడు. 37 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, 8 హాఫ్ సెంచరీల సాయంతో 164.56 స్ట్రయిక్‌రేట్‌తో 1068 పరుగులు చేశాడు.
కాగా, ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ దేశీయ స్టార్లపై ఆధారపడి ఉంది. మెగా వేలానికి ముందు ఆ జట్టు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాను రీటైన్ చేసుకుంది. మెగా వేలంలోనూ ఆ జట్టు పెద్దగా విదేశీ స్టార్ల కోసం పాకులాడలేదు.
విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, కార్బిన్ బాష్, ర్యాన్ రికెల్టన్ లాంటి ఆటగాళ్లు కొత్తగా జట్టులోకి చేర్చుకుంది. ఈసారి జట్టులోకి వచ్చిన ట్రెంట్ బౌల్ట్‌కు గతంలో ముంబై ఇండియన్స్‌తో అనుబంధం ఉంది. మెగా వేలంలో దక్కించుకున్న రీస్ టాప్లే గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యాడు. దేశీయ పేసర్ దీపక్ చాహర్‌ను ముంబై సీఎస్‌కేతో పోటీపడి దక్కించుకుంది.
ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్..
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, తిలక్ వర్మ, నమన్ ధిర్, సూర్యకుమార్ యాదవ్, బెవాన్ జాకబ్స్, రాజ్ భవా, విల్ జాక్స్, విజ్ఞేశ్ పుథుర్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, సత్యనారాయణ రాజు, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, రాబిన్ మింజ్, కృష్ణణ్ శ్రీజిత్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, రీస్ టాప్లే, కర్ణ్ శర్మ, దీపర్ చాహర్, ముజీబ్ రెహ్మాన్
Comments
Please login to add a commentAdd a comment