
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), ర్యాన్ రికెల్టన్ (41), సూర్యకుమార్ యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
అనంతరం ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే జేక్ ఫ్రేజర్ (0) వికెట్ కోల్పోయినా.. అభిషేక్ పోరెల్ (33), కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతంగా ఆడి జట్టు గెలుపుకు పటిష్ట పునాది వేశారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
ముంబై బౌలర్లు పుంజుకున్నారు. కొత్త బంతితో కర్ణ్ శర్మ (4-0-36-3), మిచెల్ సాంట్నర్ (4-0-43-2) మాయ చేశారు. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. 19వ ఓవర్ చివరి మూడు బంతులకు ముగ్గురు ఢిల్లీ బ్యాటర్లు రనౌట్ కావడంతో ఢిల్లీ ఓటమి ఖరారైంది. కీలకమైన మూడు వికెట్లు తీసిన కర్ణ్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకగా.. సీజన్‌లో తొలి ఓటమి చవిచూసిన ఢిల్లీ టాప్ ప్లేస్ నుండి రెండో స్థానానికి పడిపోయింది. మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ ఇలా అన్నాడు. గెలవడం ఎప్పుడూ ప్రత్యేకమే. ముఖ్యంగా ఇలాంటి విజయాలు. కరుణ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఓ దశలో మ్యాచ్ చేయి దాటిపోతున్నట్లు అనిపించింది. అయినా మేము గెలుపుపై ఆశలు వదులు కోలేదు. పోటీలో ఉండేందుకు ఒకరినొకరం ఉత్తేజపరచుకున్నాము. ఒకర్రెండు వికెట్లు ఆటను మాకు అనుకూలంగా మారుస్తాయని తెలుసు. గతంలో నాకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయి.
కర్ణ్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బౌండరీల పరిధి 60 మీటర్లలోపు ఉన్నప్పుడు బంతిని టాస్ వేయాలంటే చాలా సాహసం కావాలి. కర్ణ్ శర్మ అలా చేసి సక్సెస్ సాధించాడు. అందరం తలో చేయి వేసి మా అవకాశాలను నిలుపుకోగలిగాము.
బ్యాటింగ్ ఆర్డర్‌పై స్పందిస్తూ.. ఆటగాళ్లు ఫామ్‌లోకి రావాల్సి ఉంది. వీలైనన్ని బంతులు ఎదుర్కొంటేనే అది జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో మంచు తీవ్ర ప్రభావం చూపింది. కొత్త బంతితో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇలాంటి విజయాలు జట్టు గతిని మారుస్తాయి. పరిస్థితులు అనుకూలంగా మారుతాయి.