
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ నాలుగు వరుస విజయాల తర్వాత తొలి ఓటమి చవిచూసింది. ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 13) రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో 12 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లోనూ ఢిల్లీ గెలవాల్సి ఉండింది.
అయితే 19వ ఓవర్ చివరి మూడు బంతులకు మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయి ఓటమిని కొని తెచ్చుకుంది. సింగిల్స్ తీసినా గెలిచే మ్యాచ్‌లో ఢిల్లీ చివరి వరుస బ్యాటర్లు డబుల్స్ కోసం ప్రయత్నించి రనౌటయ్యారు.
19వ ఓవర్‌లో హై డ్రామా నడిచింది. నాలుగో బంతికి రనౌట్ కాకముందు అశుతోష్ శర్మ వరుసగా రెండు బౌండరీలు బాది మంచి టచ్‌లో కనిపించాడు. అయితే అతను లేని రెండో పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఆతర్వాతి బంతికి కుల్దీప్ కూడా అనవసరమైన రెండో పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. చివరి బంతికి మోహిత్ సింగిల్ తీసే ప్రయత్నం చేయగా.. సాంట్నర్ డైరెక్ట్ హిట్‌తో అతన్ని కూడా రనౌట్ చేశాడు. దీంతో ఢిల్లీ మరో ఓవర్ మిగిలుండగానే పరాజయంపాలైంది.
ముంబై నిర్దేశించిన 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ విజయానికి పటిష్ట పునాది వేశాడు. ఓ దశలో (11.3 ఓవర్లలో 135/2) ఢిల్లీ సునాయాసంగా గెలిచేలా కనిపించింది.
అయితే కరుణ్ ఔట్ కావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముంబై బౌలర్లు పుంజుకున్నారు. కొత్త బంతితో కర్ణ్ శర్మ (4-0-36-3), మిచెల్ సాంట్నర్ (4-0-43-2) మాయ చేశారు. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది.
ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే జేక్ ఫ్రేజర్ (0) వికెట్ కోల్పోయినా.. అభిషేక్ పోరెల్ (33), కరుణ్ నాయర్ రెండో వికెట్‌కు 10.1 ఓవర్లలో 119 పరుగులు జోడించారు. 119 పరుగుల వద్ద పోరెల్, 135 పరుగుల వద్ద (11.4వ ఓవర్) కరుణ్ నాయర్ వికెట్ వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ పతనం మొదలైంది.
కేఎల్ రాహుల్‌ను (15) కర్ణ్ శర్మ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు (క్యాచ్ అండ్ బౌల్డ్). ఆ తర్వాత అక్షర్ పటేల్‌ను (9) బుమ్రా, ట్రిస్టన్ స్టబ్స్‌ను (1) కర్ణ్ శర్మ ఔట్ చేశారు. తొలి మ్యాచ్‌లో (ఈ సీజన్‌లో) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్ శర్మ (17), కుల్దీప్ (1), మోహిత్ శర్మ (0) రనౌట్ కాగా.. మరో హిట్టర్ విప్రాజ్ నిగమ్‌ను (14) సాంట్నర్ స్టంపౌట్ చేశాడు.
అంతకుముందు ముంబై టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), రికెల్టన్ (41), సూర్యకుమార్‌యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు.
ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకగా.. సీజన్‌లో తొలి ఓటమి చవిచూసిన ఢిల్లీ టాప్ ప్లేస్ నుండి రెండో స్థానానికి పడిపోయింది.
మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఓటమి పట్ల విచారం వ్యక్తం చేశాడు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయామని బాధ పడ్డాడు. మిడిలార్డర్‌లో కొన్ని చెత్త షాట్లు కొంపముంచాయని అన్నాడు. మంచు కూడా కీలకపాత్ర పోషించిందని తెలిపాడు. కుల్దీప్, కరుణ్ నాయర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.