
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (ఏప్రిల్ 13) రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ పటిష్ట స్థితిలో ఉండినప్పటికీ.. ఆతర్వాత ఒత్తిడికి లోనై ఓటమిని కొని తెచ్చుకుంది. 19వ ఓవర్‌లో చివరి మూడు బంతులకు ఢిల్లీ వరుసగా మూడు వికెట్లు రనౌట్ల రూపంలో కోల్పోయి పరాజయంపాలైంది.
ఓ దశలో ఢిల్లీ 11.3 ఓవర్లలో 135 పరుగులు (రెండు వికెట్ల నష్టానికి) చేసి సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) ఔట్ కావడంతో పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైంది. 58 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి 8 వికెట్లు కోల్పోయింది. తద్వారా కరుణ్ నాయర్ అద్భుత ఇన్నింగ్స్ వృధా అయ్యింది.
రెండేళ్ల గ్యాప్ తర్వాత ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఈ మ్యాచ్‌లో దుమ్మురేపాడు. బుమ్రా లాంటి బౌలర్‌ను కూడా ఉతికి ఆరేశాడు. ముంబై విజయంలో వెటరన్ కర్ణ్ శర్మ (4-0-36-3), మిచెల్ సాంట్నర్ (4-0-43-2) కీలకపాత్ర పోషించారు. సాంట్నర్ అద్భుతమైన టచ్‌లో ఉన్న కరుణ్ నాయర్‌ను క్లీన్ బౌల్డ్ చేయగా.. కర్ణ్ శర్మ.. అభిషేక్ పోరెల్ (33), కేఎల్ రాహుల్ (15), ట్రిస్టన్ స్టబ్స్ (1) వికెట్లు తీశాడు.
ఛేదనలో ఢిల్లీ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. జేక్ ఫ్రేజర్ డకౌటై మరోసారి నిరాశపరిచాడు. తమ తొలి మ్యాచ్‌లో (ఈ సీజన్‌లో) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్ శర్మ (17) ఈ మ్యాచ్‌లో రనౌటయ్యాడు. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్, బుమ్రా కూడా తలో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‌లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తిలక్ వర్మ (59), రికెల్టన్ (41), సూర్యకుమార్‌యాదవ్ (40), నమన్ ధీర్ (38) రాణించగా.. రోహిత్ శర్మ (18) మరోసారి విఫలమయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ తలో రెండు వికెట్లు తీయగా.. ముకేశ్ కుమార్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ముంబై తొమ్మిదో స్థానం నుంచి ఏడో స్థానానికి ఎగబాకింది. ఢిల్లీ ఈ సీజన్‌లో తొలి ఓటమిని చవిచూసి, రెండో స్థానానికి పడిపోయింది.
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్
ఢిల్లీపై గెలుపుతో ముంబై ఇండియన్స్ ఓ అరుదైన రికార్డు సృష్టించింది. తొలి ఇన్నింగ్స్‌లో 200 ప్లస్ స్కోర్లు చేసిన ప్రతిసారి గెలిచిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ముంబై 15 మ్యాచ్‌ల్లో ఇలా గెలిచింది. ముంబై తర్వాత ఢిల్లీ అత్యధిక మ్యాచ్‌ల్లో ఇలా గెలిచింది.

ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు 13 సార్లు తొలి ఇన్నింగ్స్‌లో 200 ప్లస్ స్కోర్లు చేసి గెలిచింది. ముంబై, ఢిల్లీ కంటే సీఎస్‌కే అత్యధిక సార్లు (21) 200 ప్లస్ స్కోర్లకు డిఫెండ్ చేసుకున్నప్పటికీ.. ఐదు సార్లు ఓడిపోయింది. ఆర్సీబీ కూడా 19 సార్లు తొలి ఇన్నింగ్స్‌లో 200 ప్లస్ స్కోర్లు చేసి డిఫెండ్ చేసుకోగా.. 5 సార్లు ఓటమిపాలైంది. ఎస్‌ఆర్‌హెచ్ 15 సార్లు 200 ప్లస్ స్కోర్లు చేసి డిఫెండ్ చేసుకోగా.. 2 సార్లు ఓటమిపాలైంది.