
Photo Courtesy: BCCI/IPL
గతేడాది చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్ (MI).. ఐపీఎల్-2025 (IPL 2025)ని కూడా పేలవంగానే ఆరంభించింది. తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తై ఓటమితో ఈ ఎడిషన్‌ను మొదలుపెట్టింది.
రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం పాలైన హార్దిక్ సేన.. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించి తొలి గెలుపు అందుకుంది. అయితే, ఆ తర్వాత మళ్లీ పాత కథే. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ముంబై ఇండియన్స్ ఆట తీరుపై విమర్శలు రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపుతో మళ్లీ విజయాల బాట పట్టింది.
వరుసగా ఐదు విజయాలు
ఆ తర్వాత హార్దిక్ సేన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను రెండుసార్లు, చెన్నై సూపర్ కింగ్స్.. తాజాగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌పై గెలిచి వరుసగా ఐదు విజయాలు అందుకుంది. ఏదేమైనా సీజన్‌ను చెత్తగా మొదలుపెట్టి.. ఇలా మళ్లీ గాడిలో పడటంతో ముంబై ఇండియన్స్ శిబిరం ఆనందంలో తేలిపోతోంది.
సెంటిమెంట్ ప్రకారం ఈసారి
మరోవైపు.. వరుస విజయాల నేపథ్యంలో ముంబై జట్టు అభిమానులు సైతం ఖుషీ అవుతున్నారు. ఇప్పటికి ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఈ మేటి జట్టు.. సెంటిమెంట్ ప్రకారం ఈసారి కూడా ట్రోఫీని ముద్దాడుతుందని, టైటిల్ మాదే అని సంబరపడిపోతున్నారు.
ఏకంగా నాలుగుసార్లు చాంపియన్‌గా
కాగా గతంలో వరుసగా ఇలా ఐదుసార్లు (అంతకంటే ఎక్కువ) మ్యాచ్‌లు గెలిచిన ముంబై ఇండియన్స్.. ఏకంగా నాలుగుసార్లు చాంపియన్‌గా అవతరించింది. అంతేకాదు మరోసారి రన్నరప్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా వరుసగా ఐదు గెలిచాం అంటూ ఈసారి తమకు తిరుగులేదన్నట్లుగా ట్వీట్ చేశాడు.
ఇక ముంబైకి ఐదుసార్లు టైటిల్ అందించిన దిగ్గజ కెప్టెన్ రోహిత్ శర్మను కాదని.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాను యాజమాన్యం సారథిగా నియమించింది. అయితే, సొంత జట్టు అభిమానులకే ఇది ఏమాత్రం నచ్చలేదు. రోహిత్‌పై ప్రేమ.. హార్దిక్‌పై కోపానికి దారితీసింది. మైదానం వెలుపలా, బయటా అతడిపై పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి.
అందుకు అనుగుణంగానే ఐపీఎల్-2024లో హార్దిక్ కెప్టెన్సీ చెత్తగా సాగింది. పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచిన ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంతో సీజన్‌ను ముగించింది. అయితే, ఐపీఎల్-2025లో మాత్రం ముంబై మళ్లీ విజయపరంపరను పునరావృతం చేస్తోంది. తద్వారా ఆరో టైటిల్ దిశగా దూసుకుపోతోంది.
ఐపీఎల్-2025: ముంబై వర్సెస్ లక్నో
👉వేదిక: వాంఖడే, ముంబై
👉టాస్: లక్నో తొలుత బౌలింగ్
👉ముంబై స్కోరు: 215/7 (20)
👉లక్నో స్కోరు: 161 (20)
👉ఫలితం: లక్నోపై 54 పరుగుల తేడాతో ముంబై విజయం
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ వరుసగా ఐదు లేదంటే అంతకంటే ఎక్కువగా విజయాలు సాధించిన సందర్భాలు ఇవే..
👉2008లో ఆరుసార్లు వరుసగా
👉2010లో ఐదుసార్లు వరుసగా- రన్నరప్‌గా
👉2013లో ఐదుసార్లు వరుసగా- చాంపియన్స్‌గా
👉2015లో ఐదుసార్లు వరుసగా- చాంపియన్స్‌గా
👉2017లో ఆరుసార్లు వరుసగా- చాంపియన్స్‌గా
👉2020లో ఐదుసార్లు వరుసగా- చాంపియన్స్‌గా
👉2025లో ఐదుసార్లు వరుసగా..*.
చదవండి: కేఎల్ రాహుల్‌తో కోహ్లి వాగ్వాదం.. గట్టిగానే బదులిచ్చిన వికెట్ కీపర్! వీడియో
𝙂𝙖𝙢𝙚. 𝙎𝙚𝙩. 𝘿𝙤𝙣𝙚 ✅@mipaltan make it 5⃣ in 5⃣ and are marching upwards and onwards in the season 📈
Scorecard ▶ https://t.co/R9Pol9Id6m #TATAIPL | #MIvLSG pic.twitter.com/zW7EuWhU7j— IndianPremierLeague (@IPL) April 27, 2025