DC VS RCB: 3267 రోజుల తర్వాత చేసిన అర్ద సెంచరీ.. క్రెడిట్‌ విరాట్‌కే: కృనాల్‌ పాండ్యా | IPL 2025, DC VS RCB: Krunal Pandya Score IPL Fifty After 3267 Days | Sakshi
Sakshi News home page

DC VS RCB: 3267 రోజుల తర్వాత చేసిన అర్ద సెంచరీ.. క్రెడిట్‌ విరాట్‌కే: కృనాల్‌ పాండ్యా

Published Mon, Apr 28 2025 11:18 AM | Last Updated on Mon, Apr 28 2025 11:39 AM

IPL 2025, DC VS RCB: Krunal Pandya Score IPL Fifty After 3267 Days

Photo Courtesy: BCCI

ఆర్సీబీ ఆటగాడు కృనాల్‌ పాండ్యా ఆల్‌రౌండరే అయినప్పటికీ.. ఐపీఎల్‌లో అతను బ్యాట్‌కు ఎక్కువగా పని చెప్పలేదు. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కృనాల్‌ చాలాకాలం తర్వాత బ్యాట్‌తో రాణించాడు. ఈ మ్యాచ్‌లో 47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు (నాటౌట్‌) చేసిన కృనాల్‌ ఆర్సీబీని గెలిపించాడు. 

ఈ గెలుపులో కృనాల్‌ది ప్రధానపాత్ర. తొలుత బౌలింగ్‌లో రాణించిన (4-0-28-1) అతను.. ఆతర్వాత బ్యాట్‌తో చెలరేగిపోయాడు. 3267 రోజుల తర్వాత కృనాల్‌ ఐపీఎల్‌లో చేసిన తొలి అర్ద శతకం ఇదే. 137 మ్యాచ్‌ల ఐపీఎల్‌ కెరీర్‌లో కృనాల్‌కు ఇది కేవలం​ రెండో అర్ద శతకం మాత్రమే. 

అతని తొలి అర్ద శతకం కూడా ఢిల్లీపైనే చేశాడు. 2016 సీజన్‌లో ఇది జరిగింది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే కృనాల్‌ పెద్దగా భారీ స్కోర్లు చేయనప్పటికీ.. మ్యాచ్‌ను ప్రభావితం చేసే స్వీట్‌ అండ్‌ షార్ట్‌ ఇన్నింగ్స్‌లు ఆడతాడు.

నిన్నటి మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (26/3, 4 ఓవర్లు) బరిలోకి దిగిన కృనాల్‌ అద్భుతమైన హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో తొలుత నిదానంగా ఆడిన కృనాల్‌.. ఆతర్వాత గేర్‌ మార్చి విధ్వంసం​ సృష్టించాడు. తొలి 28 బంతుల్లో కేవలం 25 పరుగులు మాత్రమే చేసిన కృనాల్‌.. ఆతర్వాత ఎదుర్కొన్న 19 బంతుల్లో ఏకంగా 48 పరుగులు పిండుకున్నాడు. 

ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో రెచ్చిపోయిన కృనాల్‌ ముకేశ్‌ కుమార్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. ఆతర్వాత కుల్దీప్‌ బౌలింగ్‌లో ఓ సిక్సర్‌.. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో బౌండరీ బాది హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తో పాటు బంతితో కూడా సత్తా చాటినందుకు కృనాల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

మ్యాచ్‌ అనంతరం కృనాల్‌ మాట్లాడుతూ ఇలా ఆన్నాడు. నా పాత్రకు న్యాయం చేసినందుకు ఆనందంగా ఉంది. విరాట్‌తో కలిసి బ్యాటింగ్‌ చేయడం చాలా సులువగా ఉంటుంది. అతను ప్రతి బంతికి ప్రోత్సహిస్తుంటాడు. ఈ మ్యాచ్‌లో కూడా అదే జరిగింది. విరాట్‌ గైడెన్స్‌లో నేనే మంచి ఇన్నింగ్స్‌ ఆడాను. తొలి 20 బంతులు పరుగుల కోసం ఇబ్బంది పడ్డాను. అయితే విరాట్‌ నింపిన స్పూర్తితో లయను అందుకుని భారీ షాట్లు ఆడగలిగాను. క్రెడిట్‌ విరాట్‌కి దక్కుతుంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని ఆర్సీబీ బౌలర్లు 162 పరుగులకే పరిమితం చేశారు. భువీ 3, హాజిల్‌వుడ్‌ 2, యశ్‌ దయాల్‌, కృనాల్‌ తలో వికెట్‌ తీసి ఢిల్లీని స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌ (41), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

అనంతరం ఛేదనకు దిగిన ఆర్సీబీ పవర్‌ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయినా ఆతర్వాత కోలుకుంది. విరాట్‌ (47 బంతుల్లో 51; 4 ఫోరు​), కృనాల్‌ (47 బంతుల్లో 73 నాటౌట్‌; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టైమ్‌ తీసుకుని ఇన్నింగ్స్‌ను నిర్మించి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. టిమ్‌ డేవిడ్‌ (5 బంతుల్లో 19 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు. ‌

ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్‌లో (మే 3) సీఎస్‌కేతో (బెంగళూరులో) తలపడనుంది. మే 9న ఎల్‌ఎస్‌జీని లక్నోను ఢీకొంటుంది. ఆతర్వాత సన్‌రైజర్స్‌, కేకేఆర్‌లను బెంగళూరులో ఎదుర్కొంటుంది. ప్రస్తుతం 14 పాయింట్లతో టేబుల్‌ టాపర్‌గా ఉన్న ఆర్సీబీ ఇంకో మ్యాచ్‌ గెలిచినా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంటుంది.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement