
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి చిన్ననాటి స్నేహితుడు తన్మయ్ శ్రీవాత్సవ ఐపీఎల్ 2025 సీజన్ కోసం అంపైర్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఉత్తర్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (శ్రీవాత్సవ సొంత రాష్ట్రం) అధికారికంగా ప్రకటించింది. నిజమైన ఆటగాడు ఎప్పుడూ మైదానాన్ని వడిచి వెళ్ళడు. మైదానంలో అతని పాత్ర మాత్రమే మారుతుంది. కొత్త ప్రయాణంలో శ్రీవాస్తవకు శుభాకాంక్షలు అంటూ ఉత్తర్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తమ ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చింది.
35 ఏళ్ల తన్మయ్ శ్రీవాత్సవ్ కోహ్లి కెప్టెన్సీలో అండర్-19 వరల్డ్‌కప్ (2008) గెలిచిన భారత జట్టులో కీలక సభ్యుడు. సౌతాఫ్రికాతో జరిగిన ఆ టోర్నీ ఫైనల్లో శ్రీవాత్సవ్ టాప్ రన్ స్కోరర్‌గా (ఇరు జట్ల తరఫున) నిలిచి భారత్ టైటిల్ సాధించడంలో ప్రధానపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రీవాత్సవ్ 46 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత 12 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి (డక్ వర్త్ లూయిస్ పద్దతిలో) ఛాంపియన్‌గా నిలిచింది.
ఐదేళ్ల క్రితం ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీవత్సవ.. అప్పటి నుంచి దేశవాలీ క్రికెట్‌లో అంపైర్‌గా వ్యవహరిస్తున్నాడు. శ్రీవాత్సవ 2008-2012 వరకు ఐపీఎల్ ఆడాడు. ఐపీఎల్‌లో ఆటగాడిగా శ్రీవాత్సవ కెరీర్ అంత ఆశాజనకంగా సాగలేదు. ఐదేళ్లలో అతను 7 మ్యాచ్‌లు ఆడి కేవలం 8 పరుగులే చేశాడు. శ్రీవాత్సవ దేశవాలీ కెరీర్ మాత్రం పర్వాలేదన్నట్లుగా ఉంది. ఉత్తర్‌ప్రదేశ్ తరఫున అతను 90 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 44 లిస్ట్-ఏ, 34 టీ20 ఆడి 7000 పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 81 అర్ద సెంచరీలు ఉన్నాయి.
ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే.. శ్రీవాత్సవతో పాటు 2008 అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో మరో సభ్యుడు కూడా బీసీసీఐ అంపైర్‌గా ఉన్నాడు. ఆ జట్టులోని అజితేశ్ అర్గాల్ ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో అంపైరింగ్ చేస్తున్నాడు. ఇద్దరు సహచరులు అంపైర్లుగా మారినా కోహ్లి మాత్రం ఇంకా ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. కోహ్లి కెరీర్ ప్రస్తుతం ఉన్నత దశలో ఉంది. సహచరుడు అంపైరింగ్ చేస్తుండగా కోహ్లి ఆటగాడిగా ఆడటం వింత ఆసక్తికరం.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. ఆర్సీబీతో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment