
టీమిండియా స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal)- సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ధనశ్రీ వర్మ (Dhanashree Verma)ల వైవాహిక బంధం ముగిసిపోయింది. పరస్పర అంగీకారంతో వీరిద్దరు విడిపోయేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే, చట్ట ప్రకారం ఆరు నెలల పాటు కలిసి ఉండాలన్న నిబంధనను తమ కేసులో పరిగణనలోకి తీసుకోవద్దని చహల్- ధనశ్రీ కోరగా.. ఫిబ్రవరి 20న ఫ్యామిలీ కోర్టు వీరి అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో వీరు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలో చహల్- ధనశ్రీ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఆరు నెలల కూలింగ్ పీరియడ్ విషయంలో వీరికి ఉపశమనం కలిగించింది. విడాకుల అంశాన్ని గురువారం తేల్చాల్సిందిగా బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టును ఆదేశించింది.
వేరుగా ఉంటున్నారు
జస్టిస్ మాధవ్ జామ్‌దార్‌తో కూడిన ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. మార్చి 22 నుంచి చహల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో కానున్న నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
‘‘పిటిషనర్ 1 (చహల్) ఐపీఎల్‌లో పాల్గొనాల్సి ఉందని.. కాబట్టి మార్చి 21 తర్వాత అతడు అందుబాటులో ఉండకపోవచ్చని అతడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాబట్టి మార్చి 20న ఈ విషయమై ఫ్యామిలీ కోర్టు నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నాం’’ అని పేర్కొంది.
కాగా హిందూ వివాహ చట్టం ప్రకారం.. విడాకులు జారీ చేసే ముందు తమ సమస్యను పరిష్కరించుకుని కలిసిపోయేందుకు కనీసం ఆరు నెలల పాటు కోర్టు సమయం ఇస్తుంది. అయితే, చాలా కాలం నుంచే చహల్- ధనశ్రీ విడిగా ఉంటున్నట్లు సమాచారం.
ఇప్పటికే భార్యాభర్తలుగా వారు వేరుపడినందున.. ఆరు నెలల కూలింగ్ పీరియడ్ విషయంలో తమకు మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బాంబే హైకోర్టు ఈ విషయమై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
రూ. 4.75 కోట్ల భరణం!
కాగా ధనశ్రీకి భరణం రూపంలో రూ. 4.75 కోట్లు చెల్లించేందుకు చహల్ సిద్ధపడినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే రూ. 2 కోట్ల 37 లక్షల యాభై ఐదు వేలు చెల్లించినట్లు తెలుస్తోంది. మిగతా మొత్తం చెల్లించేందుకు కూడా చహల్ సిద్ధంగా ఉన్నాడు కాబట్టి.. పిటిషనర్ల మధ్య ఎలాంటి వివాదానికి తావు లేనందున విడాకుల మంజూరు విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా హైకోర్టు ఫ్యామిలీ కోర్టును ఆదేశించినట్లు సమాచారం.
ప్రేమ వివాహం..
కాగా 2016లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన చహల్.. ఇప్పటి వరకు 72 వన్డేలు, 80 టీ20లు ఆడాడు. ఈ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ ఆయా ఫార్మాట్లలో 121, 96 వికెట్లు తీశాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా చివరిగా జాతీయ జట్టుకు ఎంపికైన చహల్ ఆ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ తర్వాత మళ్లీ టీమిండియాకు ఎంపిక కాలేదు.
అయితే, ఐపీఎల్‌లో మాత్రం చహల్‌కు ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు 160 మ్యాచ్‌లు ఆడిన ఏకంగా 205 వికెట్లు తీశాడు. తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ అతడిని ఏకంగా రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇక చహల్ వ్యక్తిగత విషయానికొస్తే.. 2020, డిసెంబరులో కొరియాగ్రాఫర్ ధనశ్రీ వర్మను పెళ్లాడాడు. లాక్‌డౌన్‌లో సోషల్ మీడియా ద్వారా ధనశ్రీతో పరిచయం ప్రేమగా మారింది. అయితే, వీరి బంధం మూణ్ణాళ్ల ముచ్చటే అయింది.
చదవండి: IPL 2025: కెప్టెన్ల మార్పు.. ఎవరి జీతం ఎంత?.. అతి చవగ్గా దొరికిన సారథి అతడే!
Comments
Please login to add a commentAdd a comment