హార్దిక్ పాండ్యాపై ధోని ప్రశంసలు
అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ట్వంటీ 20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేసిన టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియా ఎదురుదాడికి దిగినప్పుడు పాండ్యా యార్కర్లతో వారిని కట్టడి చేసిన విధానం నిజంగా అద్భుతమన్నాడు. ఇదే తరహా నిలకడను కొనసాగిస్తే మాత్రం పాండ్యాకు కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని ధోని పేర్కొన్నాడు. మూడు ఓవర్లలో 37 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసిన పాండ్యా మొదటి మ్యాచ్ లోనే రాణించడం టీమిండియాకు శుభపరిణామన్నాడు.
ఓవరాల్ గా ఆసీస్ పై చక్కటి బౌలింగ్ వేయడం వల్లే విజయం సాధ్యమైందన్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన తమకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సురేష్ రైనాలు బాధ్యతాయుతంగా ఆడి భారీ స్కోరు సాధించడంలో సహకరించారన్నాడు. ఇదిలా ఉండగా తమ జట్టు ఓటమి ఫీల్డింగ్ ప్రధాన కారణమని ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తెలిపాడు. ఆసీస్ బౌలింగ్ లో రాణించినా, ఫీల్డింగ్ లో మాత్రం దారుణంగా వైఫల్యం చెందామన్నాడు. ప్రత్యేకంగా విరాట్ ఆడిన ఆట తీరు తమ ఫీల్డింగ్ ను చెల్లా చెదురు చేసిందని ఫించ్ పేర్కొన్నాడు.