సాక్షి, ఇండోర్ : తమ సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఆరంభ ఓవర్లలో పేసర్ భువనేశ్వర్ బంతితో నిప్పులు చెరిగితే.. ఆపై యువ స్పిన్నర్లు యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ లు మిగిలిన పని కానిస్తున్నారు. ఇక్కడి హోల్కర్ క్రికెట్ స్టేడియంలో మూడో వన్డే జరగనున్న నేపథ్యంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని శనివారం సరదాగా బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. భారత స్పిన్ బౌలింగ్ అటాకింగ్‌లో ఎవరు చేరారో చూడంటం బీసీసీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మూడో వన్డే నేటి మధ్యాహ్నం ప్రారంభం కానుంది.
2011లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా లార్డ్స్ టెస్టులో ఈ ఝార్ఖండ్ డైనమెట్ బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే. ఆ టెస్టులో స్టార్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్‌ను దాదాపు ఔట్ చేసినంత పనిచేశారు మహీ. తాజాగా శనివారం చహల్, కుల్దీప్, అక్షర్ పటేల్‌లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుంటే.. నేను సైతం అంటూ ధోని కూడా బౌలింగ్‌లో శ్రమించారు. ఆప్ బ్రేక్స్, లెగ్ బ్రేక్స్ అలవోకగా వేస్తున్న ఆ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. ధోని.. బ్యాటింగ్, కీపింగ్, కెప్టెన్సీ, ఫినిషింగ్, స్పిన్, పేస్ బౌలింగ్, మహీ ఏదైనా చేయగలడంటూ ట్విట్లర్‌లో కామెంట్ చేస్తున్నారు. మూడో వన్డేలో ధోని బౌలింగ్ చేస్తే చూడాలని ఉందంటూ మరికొందరు నెటిజన్లు ఆశిస్తున్నారు.
Look who has joined India’s Spin Attack - @msdhoni pic.twitter.com/JFMatmP0WP
— BCCI (@BCCI) 23 September 2017