త్వరలో భారత్ లో జరుగనున్న వరల్డ్ ట్వంటీ 20 చాంపియన్షిప్లో స్పైడర్ కేమ్ ల వినియోగానికి రంగం సిద్ధమవుతోంది.
ముంబై: త్వరలో భారత్ లో జరుగనున్న వరల్డ్ ట్వంటీ 20 చాంపియన్షిప్లో స్పైడర్ కేమ్ ల వినియోగానికి రంగం సిద్ధమవుతోంది. పొట్టి ఫార్మెట్ వరల్డ్ కప్ లో స్పైడర్ కేమ్ లను వాడనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్ సన్ తాజాగా స్పష్టం చేశారు. అయితే స్పైడర్ కేమ్ల వల్ల ఆటకు ఎటువంటి ఇబ్బంది ఉండదని రిచర్స్ సన్ ప్రత్యేకంగా పేర్కొన్నారు.
ఇటీవల ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన చివరి వన్డేలో స్పైడర్ కేమ్ పై టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆ మ్యాచ్ లో విరాట్ కొట్టిన షాట్ స్పైడర్ కేమ్ తగిలి గ్రౌండ్ లోనే పడిపోవడంతో దాన్ని అంపైర్లు డెడ్ బాల్ గా ప్రకటించారు. దీంతో టీమిండియాకు ఎటువంటి పరుగులు రాలేదు. ఈ తరహా ఘటనలు మ్యాచ్ ఫలితంపై తీవ్ర ప్రభావం చేస్తాయంటూ మ్యాచ్ ముగిసిన అనంతరం ధోని వ్యాఖ్యానించాడు.