స్పిన్‌తో ‘సిడ్నీ’ వశం | India win by 6 wickets, level T20 series 1-1 | Sakshi
Sakshi News home page

స్పిన్‌తో ‘సిడ్నీ’ వశం

Published Mon, Nov 26 2018 3:56 AM | Last Updated on Mon, Nov 26 2018 5:28 AM

India win by 6 wickets, level T20 series 1-1 - Sakshi

కృనాల్‌ పాండ్యా, కోహ్లి

ఆస్ట్రేలియా గడ్డపై తొలి అంకాన్ని భారత్‌ విజయవంతంగా ముగించింది. దురదృష్టవశాత్తూ తొలి మ్యాచ్‌లో చేజారిన విజయం, రెండో మ్యాచ్‌ రద్దు తర్వాత తమ అసలు సత్తాను ప్రదర్శించి సిరీస్‌ను సమం చేసింది. ఆసీస్‌ గడ్డపై దాదాపు సొంత మైదానంలాంటి సిడ్నీలో 37,339 మంది ప్రేక్షకుల్లో సగానికంటే ఎక్కువ మంది టీమిండియాకు మద్దతు పలుకుతుండగా భారత్‌ గెలుపు తీరం చేరింది. ముందుగా కుల్దీప్‌ స్పిన్‌ను ఎదుర్కోలేక ఒత్తిడికి లోనైన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ మరో స్పిన్నర్‌ కృనాల్‌ పాండ్యాపై ఎదురుదాడి చేయబోయి నాలుగు వికెట్లు సమర్పించుకోవడంతో భారీ స్కోరుకు దూరమైంది. అనంతరం ఓపెనర్ల దూకుడుకు తోడు విరాట్‌ కోహ్లి తనదైన శైలిలో చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. కంగారూలు ఒక్క సిక్స్‌ కూడా కొట్టలేక పేలవంగా ఆడితే... భారత్‌ ఏకంగా ఎనిమిది సిక్సర్లు బాది ఇరు జట్ల మధ్య తేడా ఏమిటో చూపించింది.   

సిడ్నీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ 1–1తో సమంగా ముగిసింది. ఆదివారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. డార్సీ షార్ట్‌ (29 బంతుల్లో 33; 5 ఫోర్లు), ఆరోన్‌ ఫించ్‌ (23 బంతుల్లో 28; 4 ఫోర్లు) రాణించారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కృనాల్‌ పాండ్యా (4/36), కుల్దీప్‌ యాదవ్‌ (1/19) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు.

అనంతరం భారత్‌ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 168 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి (41 బంతుల్లో 61 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, శిఖర్‌ ధావన్‌ (22 బంతుల్లో 41; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిని ప్రదర్శించాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 117 పరుగులు చేసిన ధావన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది. ఈ పర్యటనలో టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌ ఈ నెల 29 నుంచి ఇదే మైదానంలో జరిగే నాలుగు రోజుల మ్యాచ్‌లో క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవన్‌తో తలపడుతుంది.  

కుల్దీప్‌ కట్టడి...
ఆస్ట్రేలియాకు ఓపెనర్లు షార్ట్, ఫించ్‌ శుభారంభం అందించారు. ప్రతీ ఓవర్లో వీరిద్దరు కనీసం ఒక ఫోర్‌ కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 49 పరుగులకు చేరింది. అనంతరం పాండ్యా వేసిన తొలి బంతికి ఫించ్‌ (22 వద్ద) ఇచ్చిన క్యాచ్‌ను లాంగాన్‌లో రోహిత్‌ వదిలేశాడు. ఆ ఓవర్లో ఆసీస్‌కు 12 పరుగులు లభించాయి. తొలి వికెట్‌కు 51 బంతుల్లో 68 పరుగులు జోడించిన తర్వాత కుల్దీప్‌ ఈ జోడీని విడదీశాడు. స్వీప్‌ షాట్‌ ఆడబోయి పాండ్యాకు ఫించ్‌ క్యాచ్‌ ఇచ్చాడు. అదే ఓవర్లో మ్యాక్స్‌వెల్‌ను అంపైర్‌ ఔట్‌గా ప్రకటించినా... రివ్యూలో అతను బతికి పోయాడు. అయితే తర్వాతి ఓవర్లో ఆసీస్‌ను పాండ్యా దెబ్బ తీశాడు. స్వీప్‌ షాట్‌లు ఆడబోయి వరుస బంతుల్లో షార్ట్, మెక్‌డెర్మట్‌ (0) వెనుదిరిగారు.

పాండ్యా తన తర్వాతి ఓవర్లో మ్యాక్స్‌వెల్‌ (13)ను కూడా ఔట్‌ చేశాడు. అతని చివరి ఓవర్లో వరుస బంతుల్లో రెండు ఫోర్లు కొట్టిన అలెక్స్‌ కారీ (19 బంతుల్లో 27; 4 ఫోర్లు) తర్వాతి బంతికి డీప్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. బుమ్రా చక్కటి ఫీల్డింగ్‌కు లిన్‌ (13) రనౌట్‌ కావడం ఆసీస్‌ పరిస్థితిని దిగజార్చింది. ఈ దశలో స్టొయినిస్‌ (15 బంతుల్లో 25 నాటౌట్‌; 3 ఫోర్లు), కూల్టర్‌నీల్‌ (7 బంతుల్లో 13 నాటౌట్‌; 2 ఫోర్లు) దూకుడుగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. వీరిద్దరు చివరి 16 బంతుల్లో 33 పరుగులు రాబట్టారు. ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్‌ కూడా       లేకుండా ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఆసీస్‌దే    కావడం గమనార్హం.  

ఓపెనర్ల జోరు...
లక్ష్య ఛేదనలో భారత్‌ రెండుసార్లు ఒకే స్కోరు వద్ద రెండేసి వికెట్లు కోల్పోయినా... మొత్తంగా టాప్‌–3 ఆటగాళ్ల బ్యాటింగ్‌ ప్రదర్శనే మళ్లీ జట్టును గెలిపించింది. మరోసారి ఓపెనర్లు ధావన్, రోహిత్‌ (16 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆటను మొదలు పెట్టారు. అయితే రెండేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ ఆడుతున్న స్టార్క్‌ ఆరంభంలో కొంత ఇబ్బంది పెట్టాడు. అతని తొలి 11 బంతుల్లో భారత్‌ 7 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే స్టార్క్‌ వేసిన మూడో ఓవర్‌ చివరి బంతికి ధావన్‌ అద్భుతమైన ఆఫ్‌డ్రైవ్‌తో ఫోర్‌ కొట్టడంతో జోరు మొదలైంది.

తర్వాతి రెండు ఓవర్లలో జట్టు 4 సిక్సర్లు, 3 ఫోర్లతో ఏకంగా 42 పరుగులు రాబట్టడం విశేషం. కూల్టర్‌నీల్‌ ఓవర్లో రోహిత్‌ సిక్స్‌ బాదగా, ధావన్‌ వరుసగా 6, 4 కొట్టాడు. తొలి టి20 చివరి ఓవర్‌లో భారత్‌ను నిలువరించి హీరోగా మారిన స్టొయినిస్‌ను ఈసారి మన బ్యాట్స్‌మన్‌ చితక్కొట్టారు. అతను వేసిన ఏకైక ఓవర్లో రోహిత్‌ సిక్సర్, ధావన్‌ వరుసగా 6, 4, 4 కొట్టడంతో 22 పరుగులు లభించాయి. అయితే స్టార్క్‌ చక్కటి బంతితో ధావన్‌ను ఎల్బీగా ఔట్‌ చేయడంతో 67 పరుగుల (33 బంతుల్లో) తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది. జంపా వేసిన తర్వాత ఓవర్లో వరుసగా నాలుగు డాట్‌ బంతులు ఆడిన రోహిత్‌ ఐదో బంతిని వికెట్లపైకి ఆడుకున్నాడు.

భారీ సిక్సర్‌తో ఖాతా తెరిచిన రాహుల్‌ (20 బంతుల్లో 14; 1 సిక్స్‌) ఎక్కువసేపు నిలబడలేకపోగా, తొలి బంతికే రిషభ్‌ పంత్‌ (0) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో భారత్‌ 41 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉండటంతో కొంత ఉత్కంఠ నెలకొంది. తర్వాతి 12 బంతుల్లో 6 పరుగులు మాత్రమే రావడంతో లక్ష్యం 29 బంతుల్లో 51 పరుగులుగా మారింది. అయితే ఛేజింగ్‌ మాస్టర్‌ కోహ్లి ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వలేదు. టై ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన కోహ్లి తర్వాతి ఓవర్లో మరో సిక్సర్‌ బాదాడు. కార్తీక్‌ కూడా ఐదు బంతుల వ్యవధిలో సిక్స్, ఫోర్‌ కొట్టడంతో భారత్‌ పని సులువైంది. చివరి ఓవర్లో గెలిచేందుకు 6 పరుగులు కావాల్సి ఉండగా కోహ్లి వరుసగా రెండు ఫోర్లు కొట్టి రెండు బంతుల ముందే ఆట ముగించాడు. చివరి వరకు అండగా నిలిచిన దినేశ్‌ కార్తీక్‌ (18 బంతుల్లో 22 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌)తో ఐదో వికెట్‌కు కోహ్లి 39 బంతుల్లోనే అభేద్యంగా 60 పరుగులు జత చేశాడు.  

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: షార్ట్‌ (ఎల్బీ) (బి) కృనాల్‌ 33; ఫించ్‌ (సి) కృనాల్‌ (బి) కుల్దీప్‌ 28; మ్యాక్స్‌వెల్‌ (సి) రోహిత్‌ (బి) కృనాల్‌ 13; మెక్‌డెర్మట్‌ (ఎల్బీ) (బి) కృనాల్‌  0; కారీ (సి) కోహ్లి (బి) కృనాల్‌ 27; లిన్‌ (రనౌట్‌) 13; స్టొయినిస్‌ (నాటౌట్‌) 25; కూల్టర్‌నీల్‌ (నాటౌట్‌) 13; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–68; 2–73; 3–73; 4–90; 5–119; 6–131.

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–33–0; ఖలీల్‌ 4–0–35–0; బుమ్రా 4–0–38–0; కుల్దీప్‌ 4–0–19–1; కృనాల్‌  4–0–36–4.  

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బి) జంపా 23; ధావన్‌ (ఎల్బీ) (బి) స్టార్క్‌ 41; కోహ్లి (నాటౌట్‌) 61; రాహుల్‌ (సి)    కూల్టర్‌ నీల్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 14; పంత్‌ (సి) కారీ (బి)       టై 0; కార్తీక్‌ (నాటౌట్‌) 22; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.4 ఓవర్లలో 4 వికెట్లకు) 168.  వికెట్ల పతనం: 1–67; 2–67; 3–108; 4–108.  

బౌలింగ్‌: స్టార్క్‌ 4–0–26–1; కూల్టర్‌నీల్‌ 3–0–40–0; స్టొయినిస్‌ 1–0–22–0; జంపా 4–1–22–1; మ్యాక్స్‌వెల్‌ 4–0–25–1; టై 3.4–0–32–1.  

సిరీస్‌ 1–1తో సమం చేయడాన్ని బట్టి చూస్తే ఇరు జట్లు ఎలా ఆడాయో అంచనా వేయవచ్చు. ఇది మా ప్రదర్శనను ప్రతిబింబిస్తోంది. మొత్తంగా ఈ రోజు మేం ఆస్ట్రేలియాపై అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించాం. కనీసం 180 పరుగులు చేయాల్సిన ఈ పిచ్‌పై మిగిలిన ఆ 15 పరుగులను నిరోధించడంలోనే గెలుపు దాగి ఉంది. ఓపెనర్లు చెలరేగితే మా పని మరింత సులువు అవుతుంది. దినేశ్‌ కార్తీక్‌ కూడా చివర్లో చాలా బాగా ఆడాడు.
–విరాట్‌ కోహ్లి   

14: భారత్‌ తరఫున ఛేదనలో 14 సార్లు కోహ్లి నాటౌట్‌గా నిలవగా... అన్ని మ్యాచ్‌లలోనూ జట్టు నెగ్గింది.
1:ఆసీస్‌ గడ్డపై టి20ల్లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు (4/36) నమోదు చేసిన స్పిన్నర్‌గా కృనాల్‌ పాండ్యా గుర్తింపు పొందాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement