విరాట్ కోహ్లికి చిన్నస్వామి స్టేడియం అంటే తన ఇంటి పెరడు లాంటిది! పన్నెండు ఐపీఎల్ సీజన్లలో పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడిన అతనికంటే ఆ మైదానం గురించి మరెవరికీ తెలీదు. ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేయడం కంటే లక్ష్య ఛేదన సులువైన విషయం. కానీ టాస్ గెలిచిన కోహ్లి ‘సాహసం’ పేరుతో ముందుగా బ్యాటింగ్‌కు సిద్ధపడ్డాడు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కావాలంటూ టి20 జట్టుతో ప్రయోగాలకు ప్రయత్నిస్తున్నాడు. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో అనూహ్య ఓటమి టీమిండియా వ్యూహాలపై కొత్త చర్చకు దారి తీసింది. కొత్త ప్రయోగం విఫలమైనట్లా... ఇది ఇలాగే కొనసాగుతుందా!
సాక్షి క్రీడా విభాగం
బెంగళూరులో ఇప్పటి వరకు 7 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఆదివారం మ్యాచ్‌కు ముందు ఆరు సార్లు కూడా టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగే ఎంచుకుంది. మొదటిసారి కోహ్లి దీనికి భిన్నంగా వెళ్లాడు. చిన్న బౌండరీలతో పాటు సాయంత్రం మంచు ప్రభావం వల్ల స్పిన్నర్లకు పట్టు చిక్కదనే విషయం కూడా కోహ్లికి బాగా తెలుసు. కానీ టాస్ సమయంలోనే దీని గురించి మాట్లాడిన కోహ్లి మ్యాచ్ తర్వాత కూడా తన మాటకు కట్టుబడ్డాడు.
‘వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌కు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలయ్యాయి కాబట్టి ఈ వ్యూహం కూడా అందులో భాగమే. మేం అన్ని రంగాల్లో బలంగా ఉండాలనుకుంటున్నాం. ఛేదనలో అంతా బాగుంటోంది కాబట్టి ముందుగా బ్యాటింగ్ చేస్తే ఎలాంటి ఒత్తిడి ఉంటుందో ఆటగాళ్లకు తెలియాలి. మ్యాచ్ ఫలితం ముఖ్యమే అయినా కొంత సాహసం కూడా చేయాల్సిందే. లేదంటే అనుకున్నది సాధించలేం. ప్రపంచ కప్‌కు ముందు అన్ని రకాల పరిస్థితులకు అలవాటు పడాలనేదే మా ప్రయత్నం’ అని కోహ్లి ముందుగా బ్యాటింగ్ చేయడంపై వివరణ ఇచ్చాడు.
సుదీర్ఘ లైనప్ ఉన్నా..
అయితే కెప్టెన్ ఆలోచనను అమలు పర్చడంలో మన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఒక్క ధావన్ మినహా అంతా తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. 9, 10వ స్థానాల్లో ఆడుతున్న సుందర్, దీపక్ చహర్‌లకు కూడా బ్యాటింగ్ చేయగల నైపుణ్యం ఉన్నా... కోహ్లి ఆశించినట్లు వారేమీ పరుగులు చేయలేకపోయారు. నిజానికి రెండేళ్ల పాటు వరుసగా భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్, చహల్‌లను బ్యాటింగ్ చేయలేరనే కారణంతోనే జట్టు పక్కన పెట్టింది.
కాబట్టి పేరుకు పదో స్థానం వరకు బ్యాట్స్‌మెన్ ఉన్నారని చెప్పుకున్నా అది పనికి రాలేదు. ‘భారీ స్కోరు చేయాలనే ఉద్దేశంతోనే బ్యాటింగ్ తీసుకున్నాం. గతంలో టి20ల్లో 20–30 పరుగులు తక్కువ చేసి ఓడిపోయాం. దాంతో కనీసం 9వ నంబర్ ఆటగాడి వరకు బ్యాటింగ్ చేసే వారు ఉంటే భారీ స్కోరు చేయవచ్చని ఆశించి ఈ ప్రయత్నం చేశాం. అయితే ఈ పిచ్‌పై అది సాధ్యం కాలేదు’ అని విరాట్ విశ్లేషించాడు. 134 పరుగులే చేశాక ఎలాంటి బౌలర్లయినా మ్యాచ్‌ను కాపాడలేరంటూ తన బౌలర్లకు మద్దతు పలికాడు. నిజాయితీగా ఆలోచిస్తే ఒక 20 ఓవర్ల మ్యాచ్‌లో టాప్–6 బ్యాట్స్‌మెన్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించలేకపోతే తర్వాతి వారి నుంచి ఆశించడంలో అర్థం లేదన్నాడు.
పంత్, అయ్యర్ నువ్వా నేనా..!
వన్డేల్లో సుదీర్ఘ కాలంగా భారత నంబర్–4 ఆటగాడిపై అనిశ్చితి కనిపిస్తోంది. నాలుగో స్థానంలో ఎవరు ఆడతారో చెప్పలేని స్థితి. కానీ ఆదివారం మ్యాచ్‌లో ఇది మరీ పరిధి దాటినట్లు అనిపించింది! నేను ముందు వెళ్తానంటే లేదు లేదు నేను వెళతాను అన్నట్లుగా ఇద్దరు బ్యాట్స్‌మెన్ ముందుకు రావడం ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. ఎనిమిదో ఓవర్లో ధావన్ అవుటయ్యాక పంత్, అయ్యర్ ఇద్దరూ ఒకేసారి మైదానంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. అంటే ఎవరు ఆ స్థానంలో వెళ్లాలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో కూడా టీమ్ మేనేజ్‌మెంట్ స్పష్టత ఇవ్వలేదంటే దీనిని చిన్న తప్పుగా చూడలేం. సమాచారం లోపం అంటూ కోహ్లి సర్ది చెప్పుకున్నా అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది ఎప్పుడూ చూడని వైనం.
కోహ్లి క్రీజ్‌లో ఉన్నాడని అనుకున్నా... అటు కోచ్, బ్యాటింగ్ కోచ్‌లకు కూడా ఇది తెలియకపోవడం విశేషం. ‘చిన్న సమాచార లోపంతో తప్పు జరిగింది. పది ఓవర్ల తర్వాత వికెట్ పడితే పంత్, పది ఓవర్ల లోపయితే అయ్యర్ రావాలనేది వ్యూహం. దీని గురించి విక్రమ్ రాథోడ్ వారిద్దరితో మాట్లాడారు. అయితే దానిని అర్థం చేసుకోవడంలో ఇద్దరూ పొరపడ్డారు. ఇంకా వారిద్దరు క్రీజ్‌కు చేరుకొని ఉంటే ఆ దృశ్యం ఎలా ఉండేదో’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. ప్రయోగాలు ఏ రూపంలో చేసినా ఫలితం సానుకూలంగా ఉండటమే ముఖ్యం. టి20 వరల్డ్ కప్‌కు చేరువవుతున్న కొద్దీ కోహ్లి బృందం ఇంకా ఎలాంటి కొత్త ఆలోచనలతో బరిలోకి దిగుతుందో చూడాలి.
పంత్ స్థానం మార్చాలి: వీవీఎస్ లక్ష్మణ్
రిషభ్ పంత్‌ను నాలుగో స్థానంలో ఆడించే ప్రయత్నం చేయడం వల్ల లాభం లేదని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. అతని ఆట శైలికి ఆ స్థానం సరైంది కాదని అతను విశ్లేషించాడు. ‘పంత్ సాధారణంగా దూకుడుగా ఆడతాడు. అతని స్వభావానికి నాలుగో స్థానంలో సఫలం కాలేకపోతున్నాడు. అక్కడ ఎలా పరుగులు చేయాలో అతనికి తెలియడం లేదు. ధోని స్థానాన్ని భర్తీ చేయాలనే ఒత్తిడి కూడా అతనిపై ఉంది. కాస్త దిగువకు 5 లేదా 6 స్థానాల్లో ఆడించే స్వేచ్ఛనిస్తే పంత్ చెలరేగిపోగలడు’ అని వీవీఎస్ సూచించాడు.
కోహ్లికి ఐసీసీ శిక్ష
ప్రత్యర్థి ఆటగాడిని దురుద్దేశపూర్వకంగా ఢీకొట్టినందుకు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఐసీసీ హెచ్చరికకు గురయ్యాడు. దీంతో పాటు అతనికి ఒక డీ మెరిట్ పాయింట్ శిక్షగా విధించారు. చివరి టి20 మ్యాచ్ ఐదో ఓవర్లో హెన్‌డ్రిక్స్ బౌలింగ్‌లో షాట్ ఆడి పరుగు తీసే సమయంలో ఎదురుగా వస్తున్న బౌలర్ భుజానికి కోహ్లి భుజం బలంగా తగిలింది. దీంతో కలిపి ప్రస్తుతం కోహ్లి ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి.
‘ప్రయోగాలు’ ఫలించలేదు!
Published Tue, Sep 24 2019 3:43 AM | Last Updated on Tue, Sep 24 2019 10:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment