నేటి నుంచి మహిళల అండర్ –19 టి20 ప్రపంచకప్
మలేసియా వేదికగా రెండో వరల్డ్‌కప్
డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో భారత్
తొలి పోరులో రేపు వెస్టిండీస్‌తో ‘ఢీ’
స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
రెండేళ్ల క్రితం నిర్వహించిన ఐసీసీ మహిళల అండర్–19 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన యువ భారత్... ట్రోఫీ నిలబెట్టుకునేందుకు సిద్ధమైంది. మహిళల క్రికెట్‌కు మరింత తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీకి నేటి నుంచి తెరలేవనుండగా... రేపు జరగనున్న తొలి పోరులో వెస్టిండీస్‌తో యువ భారత్ తలపడనుంది.
షఫాలీ వర్మ, రిచా ఘోష్ వంటి సీనియర్ స్థాయిలో ఆడిన ప్లేయర్లతో బరిలోకి దిగి తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన భారత్... ఈసారి కూడా ఆధిపత్యం కొనసాగించాలని చూస్తుంటే... తొలిసారి ట్రోఫీ చేజిక్కించుకోవాలని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా తహతహలాడుతున్నాయి. 2023 వరల్డ్‌కప్ జట్టులోనూ ఆడిన తెలుగు ప్లేయర్లు గొంగడి త్రిష, షబ్నమ్‌లపై ఈసారీ భారీ అంచనాలు ఉన్నాయి.
మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా ఈరోజు జరిగే ఆరు మ్యాచ్‌ల్లో స్కాటాండ్‌తో ఆస్ట్రేలియా (ఉదయం గం. 8 నుంచి); ఐర్లాండ్‌తో ఇంగ్లండ్ (ఉదయం గం. 8 నుంచి); సమోవాతో నైజీరియా (ఉదయం గం. 8 నుంచి); నేపాల్‌తో బంగ్లాదేశ్ (ఉదయం గం. 8 నుంచి); అమెరికాతో పాకిస్తాన్ (మధ్యాహ్నం గం. 12 నుంచి); దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ (మధ్యాహ్నం గం. 12 నుంచి) తలపడతాయి.
కౌలాలంపూర్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్ రెండో ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. మొత్తం 16 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌కు శనివారం తెరలేవనుంది.
2023లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి వరల్డ్‌కప్‌లో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన భారత జట్టు ట్రోఫీ కైవసం చేసుకోగా... ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న యంగ్ ఇండియా టైటిల్ నిలబెట్టుకుంటుందా చూడాలి.
ఫార్మాట్ ఎలా ఉందంటే...
మొత్తం 16 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు. వెస్టిండీస్, శ్రీలంక, ఆతిథ్య మలేసియాతో కలిసి భారత జట్టు గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనుంది. ఒక్కో గ్రూప్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు (12) ‘సూపర్ సిక్స్’ దశకు చేరుకుంటాయి.
ఈ 12 జట్లను ‘సూపర్ సిక్స్’లో రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. గ్రూప్–1లో ఆరు జట్లు... గ్రూప్–2లో మరో ఆరు జట్లు ఉంటాయి. ‘సూపర్ సిక్స్’ మ్యాచ్‌లు ముగిశాక గ్రూప్–1, గ్రూప్–2లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
సీనియర్ జట్టులోకి దారి...
సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న ప్లేయర్లు ఈ టోర్నీలో రాణించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నారు. గత ఎడిషన్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై గెలిచిన షఫాలీ వర్మ సారథ్యంలోని టీమిండియా... ఈసారి కూడా అదే ఆధిపత్యం కనబర్చాలని చూస్తోంది.
2023 అండర్–19 ప్రపంచకప్‌లో రాణించడం ద్వారా టిటాస్ సాధు, శ్వేత సెహ్రావత్... ఆ తర్వాతి కాలంలో భారత మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు అదే బాటలో పయనించి మెరుగైన ప్రదర్శనతో ఈ ఏడాది భారత్‌లో జరగనున్న మహిళల టి20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవాలని యంగ్ ప్లేయర్లు కసరత్తులు చేస్తున్నారు.
త్రిష రెండోసారి... గత ప్రపంచకప్ ఫైనల్లో భారత్ తరఫున అత్యధిక స్కోరర్‌గా నిలిచిన హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిష వరుసగా రెండోసారి ఈ మెగా టోర్నీలో ఆడనుంది. గత నెల మహిళల అండర్–19 ఆసియాకప్‌లో భారత జట్టు విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన త్రిష... ఈసారి కూడా మెరుగైన ప్రదర్శన చేసి సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా సాగుతోంది.
శనివారం స్కాట్లాండ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుండగా... ఆదివారం జరగనున్న తమ తొలి పోరులో వెస్టిండీస్‌తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. సమోవా, నైజీరియా, నేపాల్, మలేసియా జట్లు తొలిసారి ఐసీసీ టోర్నీలో ఆడనున్నాయి.
ఈ టోర్నీలో ప్రధానంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల నుంచి యంగ్ ఇండియాకు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఇటీవల ఆసియాకప్ నెగ్గి మంచి జోరుమీదున్న అమ్మాయిలు కలసి కట్టుగా కదంతొక్కితే టైటిల్ నిలబెట్టుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు.
భారత మహిళల అండర్–19 టి20 క్రికెట్ జట్టు:
నికీ ప్రసాద్ (కెప్టెన్), సానిక చల్కె, త్రిష, కమలిని, భవిక అహిరె, ఐశ్వరి అవసారె, మిథిలా, జోషిత, సోనమ్, పరుణిక, కేసరి ధ్రుతి, ఆయుషి శుక్లా, అనందిత, షబ్నమ్, వైష్ణవి.
Comments
Please login to add a commentAdd a comment