టి20 ప్రపంచకప్ విజేత భారత్
రసవత్తర ఫైనల్లో అద్భుత విజయం
7 పరుగులతో ఓడిన దక్షిణాఫ్రికా
కోహ్లి అర్ధ సెంచరీ
గెలిపించిన పాండ్యా, బుమ్రా
17 ఏళ్ల తర్వాత మళ్లీ టి20ల్లో విశ్వ విజేత
ఎన్నో మలుపులు, మరెన్నో ఉత్కంఠభరిత క్షణాలు... టైటిల్ వేటలో దక్షిణాఫ్రికా వేగంగా దూసుకుపోతోంది... 30 బంతుల్లో 30 పరుగులు, చేతిలో 6 వికెట్లతో సునాయాసంగా గెలిచే స్థితిలో నిలిచింది. తర్వాత ఓవర్లో బుమ్రా 4 పరుగులే ఇవ్వగా సమీకరణం 24 బంతుల్లో 26 పరుగులుగా మారింది.
క్లాసెన్, మిల్లర్‌లాంటి హిట్టర్లు ఉండటంతో భారత్ ఆశలు కోల్పోయింది. కానీ పాండ్యా వేసిన తర్వాతి ఓవర్లో మ్యాజిక్ మొదలైంది. తొలి బంతికే క్లాసెన్ వెనుదిరగ్గా... 18 బంతుల్లో 10 పరుగులే వచ్చాయి. కథ క్లైమాక్స్‌కు చేరింది. 6 బంతుల్లో 16 పరుగులు కావాలి.
మిల్లర్ ఉండటంతో ఆందోళన పూర్తిగా తొలగిపోలేదు. కానీ పాండ్యా వేసిన తొలి బంతికే బౌండరీ వద్ద సూర్యకుమార్ అత్యద్భుతమైన క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అంతే... తర్వాతి ఐదు బంతులు లాంఛనమే అయ్యాయి... భారత్‌ప్రపంచ విజేతగా హోరెత్తే సంబరాల్లో మునిగిపోయింది.
ఎన్నాళ్లయింది భారత క్రికెటర్లలో ఈ ఆనందాన్ని చూసి... ఎన్నేళ్లయింది భారత క్రికెట్ అభిమానులు ఇలాంటి గెలుపు సంబరాలు చేసుకొని... అందినట్లే అంది చేజారిపోతున్న ఐసీసీ ట్రోఫీ విజయాలు... ఆఖరి మెట్టుపై తడబడిన ప్రపంచ కప్ సమరాలు... అన్నీ దాటి ఇప్పుడు ఆహా అనిపించే ప్రదర్శనతో భారత జట్టు సగర్వంగా నిలిచింది.
ఏడు నెలల క్రితం రాల్చిన కన్నీటి చుక్కల స్థానే ఇప్పుడు ఆనంద బాష్పాలు... నియంత్రించలేని భావోద్వేగాలు... ఎన్నోసార్లు చేరువగా వచ్చిన ట్రోఫీని దూరమైన బాధను పూర్తిగా మరిచేలా ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌గా చేతిలో వాలిన కప్... సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ చేజారిన తర్వాత ఈ సారైనా టి20 ప్రపంచకప్ ఒడిసి పట్టుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగిన టీమిండియా అజేయంగా అద్భుతాన్ని చేసి చూపించింది.
రెండోసారి విశ్వ విజేతగా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. 2007లో తొలి టైటిల్ నెగ్గిన తర్వాత ఆరు ప్రయత్నాల్లో విఫలమైన టీమిండియా ఇప్పుడు మళ్లీ ట్రోఫీని అందుకుంది.
అప్పుడెప్పుడో కపిల్ వన్డే కప్ (1983) తెచ్చినపుడు మనలో చాలామందికి తెలీదు. అదొక వార్తగానే తెలుసుకున్నాం. కానీ ధోని తొలి టి20 ప్రపంచకప్‌ను టీవీల్లో చూశాం. తెగ సంబరపడ్డాం. సొంతగడ్డపై మళ్లీ అదే అదే ధోని (2011) వన్డే విశ్వవిజేతను చేస్తే పెద్ద పండగ చేసుకున్నాం. మళ్లీ... మళ్లీ మళ్లీ ఎంత ప్రయత్నించినా సెమీస్ లేదంటే ఫైనల్స్‌తోనే సరిపెట్టుకున్నాం.
కానీ ఇప్పుడు 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ధోని బృందం సాధించిన తొలి టి20 ప్రపంచకప్ జట్టులోని సభ్యుడు రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా కరీబియన్ గడ్డపై సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. రెండోసారి టి20 ప్రపంచకప్‌ను అందుకుంది. రోహిత్ బృందం జగజ్జేతగా అవతరించడంతో యావత్ భారతం సంబరాల్లో మునిగిపోయింది.
బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): భారత జట్టు టి20 వరల్డ్ కప్‌ను రెండోసారి సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లి (59 బంతుల్లో 76; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... అక్షర్ పటేల్ (31 బంతుల్లో 47; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులే చేయగలిగింది. హెన్రిచ్ క్లాసెన్ (27 బంతుల్లో 52; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా... డికాక్ (31 బంతుల్లో 39; 4 ఫోర్లు, 1 సిక్స్), స్టబ్స్ (21 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
హార్దిక్ పాండ్యా (3/20) మూడు కీలక వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా... బుమ్రా, అర్ష్ దీప్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు లభించగా... బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం దక్కింది. తదుపరి టి20 ప్రపంచకప్‌కు 2026లో భారత్–శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తాయి.
కీలక భాగస్వామ్యాలు...
టోర్నీలో వరుసగా విఫలమైన కోహ్లి తుది పోరులో మాత్రం తన స్థాయి ఆటను ప్రదర్శించాడు. జాన్సెన్ వేసిన తొలి ఓవర్‌ను కోహ్లి జోరుగా మొదలు పెట్టాడు. అతను 3 ఫోర్లు బాదడంతో మొత్తం 15 పరుగులు వచ్చాయి. అయితే రెండో ఓవర్లో అనూహ్యంగా దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. కేశవ్ మహరాజ్ వేసిన ఈ ఓవర్లో తొలి రెండు బంతులను ఫోర్లుగా మలచినా... నాలుగో బంతికి రోహిత్ శర్మ (9) వెనుదిరిగాడు.
చివరి బంతికి రిషభ్ పంత్ (0) కూడా అవుట్ కాగా, సూర్యకుమార్ (3) కూడా విఫలం కావడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే ఐదో స్థానంలో వచ్చిన అక్షర్ చక్కటి బ్యాటింగ్‌తో నిలిచాడు. మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో కోహ్లి మరో ఎండ్‌లో నెమ్మదించాల్సి వచ్చింది. పవర్‌ప్లేలో జట్టు 45 పరుగులు చేసింది.
నలుగురు వేర్వేరు బౌలర్లు మార్క్‌రమ్, మహరాజ్, షమ్సీ, రబాడ ఓవర్లలో ఒక్కో సిక్సర్ కొట్టిన అక్షర్ పటేల్ ధాటిగా ఆడి తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాడు. 13.1 ఓవర్లలో స్కోరు 100 పరుగులకు చేరింది. అయితే అదే ఓవర్లో అక్షర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. కోహ్లి, అక్షర్ నాలుగో వికెట్‌కు 54 బంతుల్లో 72 పరుగులు జోడించారు.
ఆ తర్వాత కోహ్లి, శివమ్ దూబే (16 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) మధ్య 57 పరుగుల భాగస్వామ్యం (33 బంతుల్లో) స్కోరు వేగాన్ని తగ్గకుండా చేసింది. కోహ్లి 48 బంతుల్లో తన అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. 17 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 134/4. చివరి 3 ఓవర్లలో భారత్ 42 పరుగులు (వరుసగా 16, 17, 9) పరుగులు రాబట్టింది.
తొలి 13 బంతుల్లో 4 ఫోర్లతో 21 పరుగులు చేసి కోహ్లి తర్వాతి 35 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా లేకుండా 29 పరుగులే చేశాడు. అయితే తన ఆఖరి 11 బంతుల్లో 26 పరుగులు సాధించి మెరుగైన స్ట్రయిక్ రేట్‌తో ముగించాడు. చివరి 8 బంతుల్లో భారత్ 3 వికెట్లు కోల్పోయింది.
క్లాసెన్ మెరిసినా...
ఛేదనలో దక్షిణాఫ్రికా 12 పరుగులకే హెన్‌డ్రిక్స్ (4), మార్క్‌రమ్ (4) వికెట్లు కోల్పోయింది. అయితే డికాక్, స్టబ్స్ ధాటిగా ఆడుతూ స్కోరును నడిపించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 38 బంతుల్లోనే 58 పరుగులు జోడించారు. 10 ఓవర్లలో స్కోరు 81 పరుగులకు చేరింది. ఒకవైపు డికాక్ చక్కటి బ్యాటింగ్‌తో నిలబడగా... మరోవైపు క్లాసెన్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.
తర్వాతి 6 ఓవర్లలో దక్షిణాఫ్రికా 51 పరుగులు చేసింది. ఇందులో క్లాసెన్ ఒక్కడే 44 పరుగులు సాధించాడు. మధ్యలో డికాక్ వెనుదిరిగినా క్లాసెన్ తగ్గలేదు. ముఖ్యంగా అర్షద్ వేసిన 15వ ఓవర్లో క్లాసెన్ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదడంతో 24 పరుగులు వచ్చాయి. ఈ దశలో భారత్ ఓటమి ఖాయమనిపించింది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) క్లాసెన్ (బి) మహరాజ్ 9; కోహ్లి (సి) రబడ (బి) జాన్సెన్ 76; పంత్ (సి) డికాక్ (బి) మహరాజ్ 0; సూర్యకుమార్ (సి) క్లాసెన్ (బి) రబడ 3; అక్షర్ పటేల్ (రనౌట్) 47; శివమ్ దూబే (సి) మిల్లర్ (బి) నోర్జే 27; హార్దిక్ పాండ్యా (నాటౌట్) 5; జడేజా (సి) మహరాజ్ (బి) నోర్జే 2; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–23, 2–23, 3–34, 4–106, 5–163, 6–174, 7–176.
బౌలింగ్: జాన్సెన్ 4–0–49–1, మహరాజ్ 3–0–23–2, రబడ 4–0–36–1, మార్క్‌రమ్ 2–0–16–0, నోర్జే 4–0–26–2, షమ్సీ 3–0–26–0.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: హెన్‌డ్రిక్స్ (బి) బుమ్రా 4; డికాక్ (సి) కుల్దీప్ (బి) అర్ష్ దీప్ 39; మార్క్‌రమ్ (సి) పంత్ (బి) అర్ష్ దీప్ 4; స్టబ్స్ (బి) అక్షర్ 31; క్లాసెన్ (సి) పంత్ (బి) పాండ్యా 52; మిల్లర్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 21; జాన్సెన్ (బి) బుమ్రా 2; కేశవ్ మహరాజ్ (నాటౌట్) 2; రబడ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 4; నోర్జే (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 169. వికెట్ల పతనం: 1–7, 2–12, 3–70, 4–106, 5–151, 6–156, 7–161, 8–168. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–20–2, బుమ్రా 4–0–18–2, అక్షర్ 4–0–49–1, కుల్దీప్ 4–0–45–0, పాండ్యా 3–0–20–3, జడేజా 1–0–12–0.
ఆటగాడిగా... కెప్టెన్‌గా...
ఐపీఎల్‌లో నాయకుడిగా ఐదు సార్లు ముంబై ఇండియన్స్‌ను గెలిపించిన ఘనత ఉన్నా అంతర్జాతీయ క్రికెట్‌లో భారత జట్టు నాయకత్వం అంత సులువు కాదని రోహిత్‌పై చాలా సందర్భాల్లో విమర్శలు వచ్చాయి. వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్, టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లలో ఓడిన తర్వాత అతని కెపె్టన్సీపై సందేహాలు కూడా వచ్చాయి. కానీ బీసీసీఐ మరోసారి రోహిత్‌నే నమ్మింది. వరల్డ్ కప్‌లో జట్టును గెలిపించగలిగిన సామర్థ్యం ఉందంటూ అప్పజెప్పింది.
ఈ అవకాశాన్ని అతను సమర్థంగా వాడుకున్నాడు. 2007లో తొలి టి20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన రోహిత్ 17 ఏళ్ల తర్వాత సారథిగా మరో వరల్డ్ కప్ గెలిపించాడు. 2007 నుంచి 2024 వరకు వరుసగా 9 వరల్డ్ కప్‌లలోనూ ఆడిన రోహిత్ రెండు సార్లు విజేతగా నిలిచాడు. అధికారికంగా ప్రకటించకపోయినా రోహిత్‌కు కూడా ఇదే ఆఖరి అంతర్జాతీయ టి20 మ్యాచ్ కావచ్చు.
మరో వైపు 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌లో ఉన్న కోహ్లి టి20 వరల్డ్ కప్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూశాడు. అద్భుత ప్రదర్శనలతో రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచినా...ట్రోఫీ మాత్రం దక్కలేదు. ఇప్పుడు ఈ గెలుపుతో ఆ ఆనందం దక్కింది. పైగా మూడు పరిమిత ఓవర్ల ఐసీసీ ట్రోఫీలు గెలిచినవాడిగా కెరీర్‌ను సంపూర్ణం చేసుకున్న అతను అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ పలికాడు.
వీరిద్దరు మినహా 15 మంది సభ్యుల జట్టులో మిగతా 13 మందికి ఇదే తొలి వరల్డ్ కప్ కావడం విశేషం. హైదరాబాద్ పేసర్ సిరాజ్ కూడా అరుదైన జాబితాలో భాగమయ్యాడు. గతంలో అజహర్ సహా హైదరాబాద్ నుంచి భారత్‌కు వరల్డ్ కప్ ఆడినవారెవరూ విజేత జట్టులో లేరు. ఇప్పుడు సిరాజ్ ఆ అదృష్టాన్ని దక్కించుకున్నాడు.
కల నిజమాయెగా...
ఫైనల్లో తీవ్ర ఒత్తిడి మధ్య బౌండరీ సూర్యకుమార్ పట్టిన క్యాచ్‌కు వెలకట్టగలమా? అతడిని ఏ అవార్డుతో సన్మానించినా తక్కువే? బుమ్రా తన చివరి 2 ఓవర్లలో చేసిన అద్భుత బౌలింగ్‌కు సలామ్ చేయకుండా ఉండగలమా? టోరీ్నలో కేవలం 4.17 ఎకానమీతో 15 వికెట్లు తీసిన బుమ్రా తన స్థాయి ఏమిటో క్రికెట్ ప్రపంచానికి చూపించాడు. క్లాసెన్‌ను అవుట్ చేసి ఆటను భారత్ వైపు తిప్పిన హార్దిక్ పాండ్యా మ్యాచ్ తర్వాత కన్నీళ్లపర్యంతం కావడం మరచిపోగలమా?
ఐపీఎల్ సమయంలో ఎంతో వేదన అనుభవించిన తర్వాత భారత్ తరఫున తన విలువేంటో చూపించిన పాండ్యాను రోహిత్ ముద్దాడిన దృశ్యం ఎప్పటికీ హైలైట్స్‌గా ఉండిపోదా! బ్యాటింగ్‌లోనూ తన సత్తా ఏమిటో చూపించిన గుజరాతీ ‘బాపు’ అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ విలువ అమూల్యం కాదా...! చావును దగ్గరగా చూసి ఇక ఆడలేనేమో అనుకున్న క్షణం నుంచి కప్‌ను ఎత్తుకోవడం వరకు రిషభ్ పంత్ సాగిన ప్రస్థానం అసాధారణం కాదా...!
అనుభవం లేకపోయినా అర్ష్ దీప్ పదునైన బంతులతో గెలిపించి చూపించిన భాంగ్రాకు బల్లే బల్లే అనకుండా ఉండగలమా? కుల్దీప్, శివమ్ దూబే కీలక దశలో జట్టు విజయాల్లో ఇరుసుగా నిలిచినవారే... ఇక కోహ్లి గురించి చెప్పడం అంటే కొత్త పుస్తకం రాయడమే. ఫైనల్‌కు ముందు మొత్తం 75 పరుగులు మాత్రమే చేసిన అతను అసలు పోరు కోసం తన ఆటను దాచి ఉంచాడు.
76 పరుగుల ఇన్నింగ్స్‌తో భారీ స్కోరుకు బాటలు వేసి విజయగర్వంతో అంతర్జాతీయ టి20 కెరీర్‌ను ముగించాడు. బ్యాటింగ్‌లో రోహిత్ దూకుడు మంత్రం భారత్ విజయాలకు పునాది వేసింది. తనదైన శైలిలో నాయకుడిగా జట్టును నడిపించిన అతను భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్నాడు. కపిల్, ధోనిల తర్వాత వరల్డ్ కప్ గెలిపించిన సారథిగా శిఖరాన నిలిచాడు.
కొన్నాళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓటమి పాలైంది... అందరిలోనూ వేదన, తీవ్రమైన బాధ... గెలుపు కోసం ఇంకా ఏం చేయాలనే నైరాశ్యం... కెప్టెన్ రోహిత్ సహా ఇతర సభ్యులందరికీ కూడా ఆ బాధనుంచి కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. కాలం గిర్రున తిరిగింది... చూస్తుండగానే టి20 వరల్డ్ కప్ వచ్చేసింది. ఒక ఫార్మాట్‌లో చేజారినా... మరో ఫార్మాట్‌లోనైనా తమ స్థాయిని ప్రదర్శించే విజేతగా నిలిచే అవకాశం వచ్చింది. ఎలాగైనా ఈ సారి పట్టు వదలరాదని గట్టిగా నిశ్చయించుకొని మరో సారి తమ వేటను మొదలు పెట్టింది.
లీగ్ దశలో వరుసగా మూడు విజయాలు, ఆ తర్వాత సూపర్–8లో కూడా మూడు విజయాలు. ఆస్ట్రేలియాలాంటి గట్టి ప్రత్యర్థి ని కుప్పకూల్చిన ఉత్సాహంతో సెమీస్‌లో ఇంగ్లండ్‌పై కూడా ఘన విజయం. తుది పోరుకు ముందు అజేయంగా నిలిచింది. వన్డే వరల్డ్ కప్‌లో కూడా ఇలాగే వరుసగా పది విజయాల తర్వాత అజేయంగా ఫైనల్ చేరిన టీమ్ నిరాశచెందాల్సి వచ్చింది. అద్భుతంగా సాగిపోతున్న ఆటలో ఎక్కడైనా ఒక బ్రేక్ వస్తే... అదీ ఫైనల్లో అయితే ఎంతటి బాధ ఉంటుందో అందరికీ తెలుసు.
ఈ సారీ అలాంటిదే జరిగితే అనే ఆందోళన అందరిలోనూ ఉంది. కానీ భారత్ అలాంటి స్థితిని అధిగమించింది...ఆత్మవిశ్వాసంతో అవరోధాలను అధగమించింది. కెపె్టన్‌గా 2007 వన్డే వరల్డ్‌కప్‌నాటి బాధను కోచ్‌గా రూపంలో మర్చిపోయే ప్రయత్నం చేసిన దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఎట్టకేలకు తన కల నెరవేర్చుకున్నాడు. గెలుపు ఖాయమైన క్షణాన గాల్లో ఎగురుతూ అతను విసిరిన పంచ్ ఈ విజయం విలువేమిటో చూపించింది. –సాక్షి క్రీడా విభాగం
గడిచిన మూడు, నాలుగేళ్లు ఎంతో కష్టపడ్డాం. కానీ ఆఖరి ఫలితాలే అందుకోలేకపోయాం. ఈసారి మాత్రం ఏ అవకాశాన్ని వదులుకోవద్దనుకున్నాం. జట్టుగా సమష్టిగా రాణించి ప్రపంచకప్‌ను అందుకున్నాం. నాకే కాదు విరాట్ కోహ్లి ఫామ్‌పై మాలో ఎవరిరికి ఏ సందేహం లేదు. అతను ఆడాల్సిన సమయం వస్తే కచ్చితంగా నిలబడతాడు. జట్టును నిలబెడతాడు. వికెట్ అంత సులువుగాలేని చోట కోహ్తి చేసిన 76 పరుగులు, అక్షర్ మెరుపులు చాలా కీలకమయ్యాయి. బుమ్రా గురించి చెప్పాల్సిన పనిలేదు. హార్దిక్ పాండ్యా తీసిన వికెట్లు, సూర్య క్యాచ్ అన్ని కుదిరాయి కాబట్టే విజేతలమయ్యాం. - రోహిత్ శర్మ, భారత్ కెప్టెన్
భారత జట్టుకు రూ. 20 కోట్ల 42 లక్షల ప్రైజ్‌మనీ
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తొమ్మిదో టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీకి ఒక కోటీ 12 లక్షల 50 వేల డాలర్ల (రూ. 93 కోట్ల 78 లక్షలు) ప్రైజ్‌మనీని కేటాయించింది. విజేతగా నిలిచిన భారత జట్టుకు 24 లక్షల 50 వేల డాలర్లు (రూ. 20 కోట్ల 42 లక్షలు) లభించాయి. రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు 12 లక్షల 80 వేల డాలర్లు (రూ. 10 కోట్ల 67 లక్షలు) దక్కాయి.
సెమీఫైనల్లో ఓడిన ఇంగ్లండ్, అఫ్గానిస్తాన్ ఖాతాలో 7,87,000 డాలర్ల చొప్పున (రూ. 6 కోట్ల 56 లక్షల చొప్పున) చేరాయి. ‘సూపర్–8’ నుంచి సెమీఫైనల్ చేరుకోలేకపోయిన నాలుగు జట్లకు 3,82,500 డాలర్ల చొప్పున (రూ. 3 కోట్ల 18 లక్షల చొప్పున) లభించాయి. 9 నుంచి 12 స్థానాల్లోపు నిలిచిన నాలుగు జట్లకు 2,47,500 డాలర్ల చొప్పున (రూ. 2 కోట్ల 6 లక్షల చొప్పున) దక్కాయి.
13 నుంచి 20వ స్థానాల్లోపు నిలిచిన ఎనిమిది జట్లకు 2,25,000 డాలర్ల చొప్పున (రూ. 1 కోటీ 87 లక్షల చొప్పున) అందజేశారు. సెమీఫైనల్స్, ఫైనల్ మినహా సాధించిన ఒక్కో విజయానికి ఆయా జట్లకు 31,154 డాలర్ల చొప్పున (రూ. 25 లక్షల 97 వేలు) లభించాయి. 2022 టి20 ప్రపంచకప్‌ను 56 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీతో నిర్వహించగా, విజేతగా నిలిచిన ఇంగ్లండ్ జట్టుకు 16 లక్షల డాలర్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment