నేడు టి20 వరల్డ్ కప్ ఫైనల్
దక్షిణాఫ్రికాతో భారత్ ‘ఢీ’
రెండో టైటిల్ వేటలో టీమిండియా
తొలి వరల్డ్ కప్ కోసం సఫారీలు
రాత్రి 8 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
2013లో చాంపియన్స్ ట్రోఫీ విజేత... ఆ తర్వాత ఐదుసార్లు ఐసీసీ ఫైనల్ మ్యాచ్‌లు... అన్నింటా నిరాశే... 2014 టి20 వరల్డ్ కప్, 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2021 టెస్టు చాంపియన్‌షిప్, 2023 టెస్టు చాంపియన్‌షిప్, 2023 వన్డే వరల్డ్ కప్... ఈ ఐదు సందర్భాల్లో బరిలో నిలిచిన భారత జట్టు సభ్యులకే కాదు... గెలుపును ఆశించిన అభిమానులకు కూడా తెలుసు ఆ వేదన ఎలాంటిదో! ముఖ్యంగా గత ఏడాది నవంబర్ 19న లక్ష మంది సొంత అభిమానుల సమక్షంలో ఆస్ట్రేలియా చేతిలో మన జట్టు ఓడిన క్షణాలు ఇంకా కళ్ల ముందే నిలిచాయి.
వరుసగా 10 మ్యాచ్‌లలో విజయాల తర్వాత తుది మెట్టుపై రోహిత్ బృందం తడబడింది. ఇప్పుడు ఆ బాధను మరచి కాస్తంత ఉపశమనం పొందే అవకాశం వచ్చింది. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్‌ను అందుకునే అరుదైన సందర్భం మళ్లీ టీమిండియా ముందు నిలిచింది. ఈసారి కూడా టోర్నీలో అజేయంగా భారత్ ఫైనల్ పోరుకు సిద్ధమైంది.
ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ గా వన్డే వరల్డ్ కప్‌లో చేజారిన ట్రోఫీని టి20ల్లో అందుకొని రోహిత్ శర్మ సగర్వంగా నిలుస్తాడా? తన అద్భుత కెరీర్‌లో లోటుగా ఉన్న టి20 ప్రపంచ కప్‌తో విరాట్ కోహ్లి సంబరాలు చేసుకుంటాడా ఈరోజు రాత్రికల్లా తేలిపోతుంది..!
మరోవైపు దక్షిణాఫ్రికా అన్ని అస్త్రాలతో సిద్ధంగా ఉంది. సఫారీ బృందం కూడా విజయం కోసం కసిగా, ఆకలిగా ఉంది... ఆ జట్టుకు కూడా వరల్డ్ కప్ టైటిల్ అనేది 32 ఏళ్ల కల... ఎప్పుడో 1998లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచినా ఆ లెక్క వేరు... మొత్తంగా ఐదుసార్లు వన్డే వరల్డ్ కప్‌లలో, రెండుసార్లు టి20 వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్ వరకు రాగలిగినా ఆ గండం దాటి ముందుకు వెళ్లలేకపోయింది.
ఇప్పుడు మొదటిసారి ఫైనల్ వరకు వచ్చిన టీమ్ ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోరాదని పట్టుదలగా ఉంది. కీలక సమయాల్లో తడబడే ‘చోకర్స్’ ముద్రను చెరిపేసుకునే విధంగా సౌతాఫ్రికా టీమ్ చెలరేగింది. టోర్నీలో అక్కడక్కడా కాస్త ఇబ్బంది పడ్డా చివరకు ఫలితాన్ని తమవైపు మార్చుకొని వరుసగా ఎనిమిది విజయాలతో ఓటమి లేకుండా తుది పోరుకు అర్హత సాధించింది.
అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా సమష్టి ప్రదర్శనతో టీమ్ దూసుకుపోతోంది. దశాబ్దం క్రితం అండర్–19 కెప్టెన్‌గా దక్షిణాఫ్రికాకు ఇప్పటి వరకు ఏకైక ప్రపంచకప్ ట్రోఫీని అందించిన మార్క్‌రమ్ గతంలో తమ దేశపు దిగ్గజాలకు సాధ్యం కాని ఘనతను నాయకుడిగా అందుకుంటాడా ఈరోజు రాత్రికల్లా తేలిపోతుంది...!
బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్): టి20 క్రికెట్‌లో ప్రపంచ చాంపియన్‌ను తేల్చే సమయం ఆసన్నమైంది. 27 రోజులు, 54 మ్యాచ్‌ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొమ్మిదో టి20 వరల్డ్ కప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో నేడు జరిగే తుది పోరులో భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి.
గతంలో భారత్ ఒకసారి ఈ టోర్నీని గెలుచుకోగా, దక్షిణాఫ్రికా ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఆఖరి సమరానికి ముందు ఇరు జట్లు టోర్నీలో ఓటమి లేకుండా అజేయంగా ఉన్నాయి. భారత్ తాము ఆడిన ఏడు మ్యాచ్‌లు, దక్షిణాఫ్రికా తాము ఆడిన ఎనిమిది మ్యాచ్‌లు గెలిచి సమరోత్సాహంతో ఫైనల్‌కు ‘సై’ అంటున్నాయి.
ఎవరు విజయం సాధించినా... ఓటమి లేకుండా టైటిల్ అందుకున్న తొలి జట్టుగా నిలుస్తుంది. గతంలో జరిగిన డే అండ్ నైట్ ఫైనల్ మ్యాచ్‌లకు భిన్నంగా తొలిసారి టైటిల్ పోరు డే మ్యాచ్‌గా జరగనుండటం విశేషం.
మార్పుల్లేకుండా...
టీమిండియా ఈ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్‌లలో 12 మంది బరిలోకి దిగారు. న్యూయార్క్ వేదికగా జరిగిన తొలి మూడు మ్యాచ్‌లలో పేసర్ సిరాజ్ ఆడగా, వెస్టిండీస్‌లో జరిగిన మ్యాచ్‌లలో అతని స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడాడు. ఇది మినహా మిగతా 10 మంది విషయంలో ఎలాంటి మార్పూ జరగలేదు. ఇప్పుడు కూడా సెమీఫైనల్ ఆడిన టీమ్‌తోనే భారత్ తుది పోరుకు వెళ్లే అవకాశముంది. ఒక్క శివమ్ దూబే బ్యాటింగ్ విషయంలోనే కాస్త ఆందోళన కనిపించినా... మిడిలార్డర్‌లో అతనికి బదులు సంజూ సామ్సన్‌ను నేరుగా ఫైనల్లో ఆడించే సాహసం చేయకపోవచ్చు.
రోహిత్ శర్మ బ్యాటింగ్ పదును ఏమిటో గత రెండు మ్యాచ్‌లలో కనిపించింది. అతను ఇదే జోరు సాగిస్తే ఆరంభంలోనే మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేస్తుంది. కోహ్లి వరుసగా విఫలమైనా... రోహిత్ ఆశించినట్లుగా ఫైనల్లో అతని స్థాయి ప్రదర్శన కనబరిస్తే చాలు. సూర్యకుమార్ మెరుపు ఇన్నింగ్స్‌తో పాటు పంత్, పాండ్యాలు ధాటిగా ఆడితే జట్టుకు తిరుగుండదు. బౌలింగ్‌లో టీమిండియా మరింత బలంగా కనిపిస్తోంది.
పేసర్లు బుమ్రా, అర్ష్ దీప్‌లను సమర్థంగా ఎదుర్కోవడంలో ప్రత్యర్థి ఆటగాళ్లు విఫలమవుతుండగా... స్పిన్ త్రయం కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా చెలరేగితే సఫారీలు కుప్పకూలడం ఖాయం. ముఖ్యంగా కుల్దీప్ బౌలింగ్‌లో బ్యాటర్లు బాగా ఇబ్బంది పడగా, బుమ్రా ముందు అంతా తలవంచారు.
సమష్టితత్వంతో...
దక్షిణాఫ్రికా ఇద్దరు ప్రధాన పేసర్లు రబాడ, నోర్జే ఆరుకంటే తక్కువ ఎకానమీతో ప్రత్యర్థి వికెట్లను పడగొట్టారు. వీరు ఇన్నింగ్స్ ఆరంభంలో బ్యాటర్లను కట్టడి చేయగల సమర్థులు. జాన్సెన్ రూపంలో లెఫ్టార్మ్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆ జట్టులో ఉండటం అదనపు ప్రయోజనం. ఇద్దరు స్పిన్నర్లు కేశవ్ మహరాజ్, షమ్సీ కూడా అన్ని పిచ్‌లపై చెలరేగారు.
అయితే పిచ్ పేస్‌కు అనుకూలంగా కనిపిస్తే ఒక స్పిన్నర్ స్థానంలో బార్టన్‌ను తీసుకునే అవకాశం ఉంది. ఓపెనర్ డికాక్ బ్యాటింగ్‌కు మూల స్థంభంలా ఉండగా, మరో ఓపెనర్ హెన్‌డ్రిక్స్ చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేదు. టోరీ్నలో ఆకట్టుకోని కెపె్టన్ మార్క్‌రమ్ నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ ఫైనల్లో రావాలని జట్టు ఆశిస్తోంది.
మిడిలార్డర్‌లో క్లాసెన్, మిల్లర్‌లపైనే జట్టు ఆధారపడుతోంది. ఇప్పటి వరకు అంచనాలకు తగినట్లుగా ఆడకపోయినా స్టబ్స్ దూకుడుగా ఆడగలడు. విడిగా చూస్తే ఒక్కొక్కరి ప్రదర్శన గొప్పగా లేకపోయినా... జట్టుగా తాము ప్రభావం చూపగలమని టీమ్ విశ్వాసంతో ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కోహ్లి, పంత్, సూర్యకుమార్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, అర్ష్ దీప్.
దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్ (కెప్టెన్), డికాక్, హెన్‌డ్రిక్స్, స్టబ్స్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్, జాన్సెన్, కేశవ్ మహరాజ్, షమ్సీ, రబాడ, నోర్జే.
పిచ్, వాతావరణం
కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో తాజా ప్రపంచకప్‌లో 8 మ్యాచ్‌లు జరిగాయి. ఒక మ్యాచ్ రద్దు కాగా, మరో మ్యాచ్ స్కోర్లు సమమై ‘సూపర్ ఓవర్’ వరకు వెళ్లింది. మిగిలిన వాటిలో 3 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు, 3 సార్లు ముందుగా బౌలింగ్ చేసిన జట్టు గెలిచాయి. కాబట్టి పిచ్ పెద్ద విషయం కాకపోవచ్చు. డే మ్యాచ్ కాబట్టి మంచు ప్రభావం ఉండదు. తీవ్ర ఒత్తిడి ఉండే మ్యాచ్ కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు.
భారత్ ఇప్పటికే ఈ పిచ్‌పై అఫ్గానిస్తాన్‌తో ఆడగా, దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు ఆడలేదు. మ్యాచ్ రోజున వర్ష సూచన ఉంది. అయితే సెమీస్ తరహాలోనే అక్కడక్కడా అంతరాయాలు కలగవచ్చు కానీ పూర్తిగా మ్యాచ్‌కు ఇబ్బంది ఉండదు. మ్యాచ్‌ను శనివారమే పూర్తి చేసేందుకు నిర్ణీత సమయంకంటే అదనంగా మరో 190 నిమిషాల సమయం కేటాయించారు.
ఫైనల్‌కు రిజర్వ్ డే కూడా ఉంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు పూర్తయితే శనివారమే ఫలితం తేల్చేస్తారు. అది కూడా సాధ్యం కాకపోతేనే ఎక్కడ ఆట ఆగిందో అక్కడి నుంచి రిజర్వ్ డే రోజు ఆట కొనసాగుతుంది. అదీ సాధ్యం కాకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.
2 వన్డే, టి20 ఫార్మాట్‌లలో కేవలం రెండుసార్లు మాత్రమే రెండు జట్లు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా ఫైనల్‌కు చేరాయి. 1979 వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు... 2024 టి20 ప్రపంచకప్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఈ ఘనత సాధించాయి.
2 కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) తర్వాత మూడు ఫార్మాట్‌లలో (టెస్టు, వన్డే, టి20) ప్రపంచ చాంపియన్íÙప్‌లలో జాతీయ జట్టుకు సారథ్యం వహించిన రెండో కెపె్టన్‌గా రోహిత్ శర్మ గుర్తింపు పొందనున్నాడు.
1 నేటి ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టు అరుదైన ఘనత సాధిస్తుంది. ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా టి20 ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పుతుంది. వన్డే వరల్డ్‌కప్‌లో మాత్రం వెస్టిండీస్ (1975, 1979), ఆస్ట్రేలియా (2003, 2007) జట్లు రెండుసార్లు చొప్పున ఈ ఘనత సాధించాయి.
26 అంతర్జాతీయ టి20ల్లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇప్పటి వరకు 26 మ్యాచ్‌లు జరిగాయి. 14 మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా... 11 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఒక మ్యాచ్ రద్దయింది. టి20 ప్రపంచకప్‌లలో ఈ రెండు జట్ల మధ్య 6 మ్యాచ్‌లు జరిగాయి. 4 మ్యాచ్‌ల్లో భారత్, 2 మ్యాచ్‌ల్లో
దక్షిణాఫ్రికా గెలుపొందాయి.
ఫలానావారి కోసం కప్ గెలవాలనే నినాదాలకు నేను వ్యతిరేకం. బాగా ఆడి మ్యాచ్ గెలవడం ముఖ్యం తప్ప ఇతర విషయాలు పట్టించుకోను. 12 నెలల వ్యవధిలో మూడు ఐసీసీ ఫైనల్స్‌కు చేరడం అదీ మూడు వేర్వేరు ఫార్మాట్‌లు కావడం మా జట్టు నిలకడను చూపించింది. ఫైనల్‌కు ముందు ప్రాక్టీస్ కోసం సమయం లేకపోయినా ఆటగాళ్లంతా సిద్ధమయ్యే ఉన్నారు. మానసికంగా కూడా ఎలాంటి గందరగోళం లేకుండా ప్రశాంతంగా తుది పోరుకు రెడీ అయ్యాం.
ఇక్కడ ఇప్పటికే ఒక మ్యాచ్ ఆడటం మాకు సానుకూలాంశమే. వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌నుంచి పాఠాలు నేర్చుకోవడం వంటిదేమీ లేదు. దాని కోసం కూడా బాగా సిద్ధమయ్యాం కానీ ఆ రోజు ప్రత్యర్థి మాకంటే మెరుగ్గా ఆడింది. అయినా పరాజయాలు మరచి ముందుకు సాగిపోవడం ఆటగాళ్ల లక్షణం. రెండు అత్యుత్తమ జట్ల మధ్య జరగబోతున్న ఈ ఫైనల్ మాకు అనుకూలంగా సాగాలని కోరుకుంటున్నా. –రాహుల్ ద్రవిడ్, భారత హెడ్ కోచ్
వ్యూహాలు... ప్రతివ్యూహాలు...
ఆరంభంలో లెఫ్టార్మ్ పేసర్లను ఎదుర్కోవడంలో రోహిత్ ఇబ్బంది పడే బలహీనతను సొమ్ము చేసుకునేందుకు జాన్సెన్‌ను దక్షిణాఫ్రికా ఉపయోగించవచ్చు. ఫామ్‌లో లేని కోహ్లిపై రబాడ పైచేయి సాధించే ప్రయత్నం చేస్తాడు. డికాక్‌ను బుమ్రా నిలువరించగలిగితే భారత్‌కు ఆధిపత్యం ఖాయం. పంత్ జోరును ఆపేందుకు లెఫ్టార్మ్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను వాడే అవకాశం ఉంది. మిడిలార్డర్‌లో అక్షర్, కుల్దీప్, జడేజాల స్పిన్‌ను క్లాసెన్, మిల్లర్‌లు ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే మ్యాచ్ గమనం ఆధారపడి ఉంది.
ఇద్దరికీ చివరి మ్యాచా?
భారత్ క్రికెట్‌కు సంబంధించి ఆల్‌టైమ్ గ్రేట్‌లుగా రోహిత్, కోహ్లిలది ప్రత్యేక స్థానం. గత 11 ఏళ్లుగా భారత్ ఓడిన ఐసీసీ ఫైనల్స్‌లో వీరిద్దరూ సభ్యులుగా ఉన్నారు. వన్డే వరల్డ్ కప్ చేజారాక టి20 వరల్డ్ కప్ విజయంతోనైనా ముగించాలనే పట్టుదలతోఈ టోర్నీకి సిద్ధమయ్యారు. టెస్టు, వన్డేలను పక్కన పెడితే ఈ ఫార్మాట్‌లో కొత్త కుర్రాళ్లు దూసుకొచ్చేశారు.సత్తా చాటి తమదైన అవకాశం కోసం సిద్ధంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఇంకా కొనసాగడం అనేది ఇద్దరికీ మేలు చేయకపోవచ్చు. కాబట్టి గెలిచినా, ఓడినా వీరికి ఇదే చివరి అంతర్జాతీయ టి20 మ్యాచ్ అయ్యే చాన్స్ ఉంది. రోహిత్ 2007 టి20 వరల్డ్ కప్ నెగ్గిన జట్టులో సభ్యుడు కాగా, కోహ్లి 2011 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ మెంబర్.
Comments
Please login to add a commentAdd a comment