న్యూయార్క్‌లో నమో భారత్‌ Another win for Team India against Pakistan | Sakshi
Sakshi News home page

న్యూయార్క్‌లో నమో భారత్‌

Published Mon, Jun 10 2024 4:16 AM | Last Updated on Mon, Jun 10 2024 4:17 AM

Another win for Team India against Pakistan

పాకిస్తాన్‌పై టీమిండియా మరో విజయం

6 పరుగులతో నెగ్గిన రోహిత్‌ సేన 

రాణించిన పంత్, బుమ్రా   

పాకిస్తాన్‌తో ప్రపంచకప్‌ పోరు... భారత్‌ చేసింది 119 పరుగులే... బ్యాటింగ్‌కు అనుకూలించని పిచ్‌ అయినా సరే ఈ మాత్రం స్కోరును కాపాడుకోవడం కష్టంగానే అనిపించింది... లక్ష్యం ఎదురుగా కనిపిస్తుండగా... పాక్‌ నెమ్మదిగా అడుగులు వేసింది. 12 ఓవర్లు ముగిసేసరికి బంతికో పరుగు చొప్పున 72 పరుగులు వచ్చేశాయి.మిగిలిన 48 బంతుల్లో చేయాల్సింది 48 పరుగులే... చేతిలో 8 వికెట్లున్నాయి. 

కానీ అప్పుడు ఒక్కసారిగా మ్యాచ్‌ మలుపు తిరిగింది. పాండ్యా, బుమ్రా బౌలింగ్‌ దెబ్బకు పాక్‌ పరుగు తీయడమే గగనంగా మారిపోయింది. ఒక్కో పరుగు కోసం శ్రమించి ఆ జట్టు వరుసగా వికెట్లూ కోల్పోయింది. అద్భుతమైన ఆటతో ఒత్తిడి పెంచిన భారత్‌ చివరి వరకు దానిని కొనసాగించింది. ఫలితంగా వరల్డ్‌ కప్‌లో మరో విజయం మన ఖాతాలో చేరింది. పాక్‌పై మనదే పైచేయి అని నిరూపితమైంది. 

బ్యాటింగ్‌లో కఠిన పరిస్థితుల్లో కీలక పరుగులు చేసిన పంత్, కీపింగ్‌లో చక్కటి క్యాచ్‌లతో గెలిపించాడు. మ్యాచ్‌ ఏకపక్షంగా సాగకపోయినా... ఉత్కంఠకు లోటు లేకపోయింది. వరల్డ్‌ కప్‌ మెల్‌బోర్న్‌ నుంచి న్యూయార్క్‌కు చేరినా... అక్కడా మన గెలుపు పిలుపు వినిపించింది.   

న్యూయార్క్‌: టి20 ప్రపంచకప్‌లో ఆసక్తి రేపిన మ్యాచ్‌లో భారత్‌ 6 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. రిషభ్‌ పంత్‌ (31 బంతుల్లో 42; 6 ఫోర్లు) కీలక పరుగులు సాధించాడు. 

అనంతరం పాక్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులే చేయగలిగింది. రిజ్వాన్‌ (44 బంతుల్లో 31; 1 ఫోర్, 1 సిక్స్‌) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బుమ్రా (3/14), హార్దిక్‌ పాండ్యా (2/24) ప్రత్యర్థిని పడగొట్టారు.  

పంత్‌ మినహా... 
అనూహ్యంగా దూసుకొస్తున్న బంతులు, బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని పిచ్, నెమ్మదైన అవుట్‌ఫీల్డ్‌... అన్నీ వెరసి భారత ఆటగాళ్లు ప్రతీ పరుగు కోసం ఇబ్బంది పడ్డారు. పాక్‌ బౌలర్లంతా కట్టుదిట్టమైన బంతులతో బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. ఓపెనర్లు కోహ్లి (4), రోహిత్‌ శర్మ (13) ఏడు పరుగుల వ్యవధిలో వెనుదిరగ్గా... నాలుగో స్థానంలో వచ్చిన అక్షర్‌ (18 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. 

ఈ దశలో పంత్‌ బాధ్యత తీసుకున్నాడు. సాధారణ షాట్లకు పరుగులు రాలేని స్థితిలో తనదైన శైలిలో భిన్నమైన షాట్లతో స్కోరును నడిపించాడు. ఈ క్రమంలో అతనికి అదృష్టం కూడా కలిసొచ్చింది. తన తొలి 14 బంతుల్లో 4 సార్లు పంత్‌ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 

పాక్‌ వదిలిన క్యాచ్‌లు సుయాయాసమైనవి కాకపోయినా అసాధ్యమైనవి కూడా కాదు! రవూఫ్‌ ఓవర్లో అతను వరుసగా 3 ఫోర్లతో ధాటిని ప్రదర్శించగా, 89/3 వద్ద భారత్‌ కాస్త మెరుగైన స్థితిలో కనిపించింది. అయితే ఇక్కడి నుంచి జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. సూర్యకుమార్‌ (7) ప్రభావం చూపలేకపోగా, దూబే (3) విఫలమయ్యాడు. 

పంత్, జడేజా (0) వరుస బంతుల్లో వెనుదిరగ్గా... పాండ్యా (7), బుమ్రా (0) కూడా వరుస బంతుల్లో అవుటయ్యారు. అర్‌‡్షదీప్‌ (9) రనౌట్‌తో మరో ఓవర్‌ మిగిలి ఉండగానే జట్టు ఇన్నింగ్స్‌ ముగిసింది.  

టపటపా... 
స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌ కూడా స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయలేకపోయింది. తడబడుతూనే ఆడిన బాబర్‌ ఆజమ్‌ (13) ఆరంభంలోనే వెనుదిరగ్గా... ఉస్మాన్‌ ఖాన్‌ (13), ఫఖర్‌ జమాన్‌ (13) కూడా విఫలమయ్యారు. 

కొన్ని చక్కటి షాట్లు ఆడిన రిజ్వాన్‌ను కీలక సమయంలో బుమ్రా బౌల్డ్‌ చేయడంలో మ్యాచ్‌ భారత్‌ వైపు మొగ్గింది. షాదాబ్‌ (4), ఇఫ్తికార్‌ (5) ప్రభావం చూపలేకపోగా, ఇమాద్‌ వసీమ్‌ (23 బంతుల్లో 15; 1 ఫోర్‌) బంతులు వృథా చేసి జట్టు ఓటమిని ఆహ్వానించాడు.  

వర్షంతో అంతరాయం 
మ్యాచ్‌కు అనూహ్యంగా వర్షం దెబ్బ పడింది. చిరు జల్లులు కురవడంతో టాస్‌ ఆలస్యం కాగా, నిర్ణీత సమయంకంటే 50 నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్‌ మొదలైంది. అయితే భారత్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క ఓవర్‌ పూర్తి కాగానే మళ్లీ వాన రావడంతో ఆటను నిలిపివేశారు. మరో 35 నిమిషాల తర్వాత ఇన్నింగ్స్‌ కొనసాగింది. విరామం తర్వాత నసీమ్‌ వేసిన తొలి ఓవర్లోనే కోహ్లి వెనుదిరగడంతో భారత్‌కు నిరాశాజనక ఆరంభం లభించింది.  

12 భారత్, పాకిస్తాన్‌ జట్ల మధ్య అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన 12వ దేశంగా అమెరికా గుర్తింపు పొందింది. 1952లో భారత్‌లో తొలిసారి పాక్‌ జట్టు ఆడగా... 1955లో పాకిస్తాన్‌లో భారత జట్టు ఆడింది. ఆ తర్వాత ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లకు యూఏఈ (1984లో), ఆ్రస్టేలియా (1985లో), బంగ్లాదేశ్‌ (1988లో), సింగపూర్‌ (1996లో), కెనడా (1996లో), శ్రీలంక (1997లో), ఇంగ్లండ్‌ (1999లో), దక్షిణాఫ్రికా (2003లో), నెదర్లాండ్స్‌ (2004లో), అమెరికా (2024లో) ఆతిథ్యమిచ్చాయి.

1 విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేశాక భారత్, పాకిస్తాన్‌ జట్ల మధ్య జరిగిన టి20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో టాప్‌ స్కోరర్‌గా నిలవకపోవడం ఇదే తొలిసారి. గతంలో భారత్, పాక్‌ జట్ల మధ్య జరిగిన టి20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో కోహ్లి (2012లో; 78 నాటౌట్‌), (2014లో 36 నాటౌట్‌), (2016లో 55 నాటౌట్‌), (2021లో 57), (2022లో 82 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  

1 టి20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌లో ఇద్దరు ప్లేయర్లు ‘గోల్డెన్‌ డక్‌’ (ఆడిన తొలి బంతికే అవుటవ్వడం) కావడం ఇదే తొలిసారి.  

1 టి20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగాక ఆలౌట్‌ కావడం భారత జట్టుకిదే తొలిసారి.   

స్కోరు వివరాలు  
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) రవూఫ్‌ (బి) అఫ్రిది 13; కోహ్లి (సి) ఉస్మాన్‌ (బి) నసీమ్‌ 4; పంత్‌ (సి) బాబర్‌ (బి) ఆమిర్‌ 42; అక్షర్‌ (బి) నసీమ్‌ 20; సూర్యకుమార్‌ (సి) ఆమిర్‌ (బి) రవూఫ్‌ 7; దూబే (సి అండ్‌ బి) నసీమ్‌ 3; పాండ్యా (సి) ఇఫ్తికార్‌ (బి) రవూఫ్‌ 7; జడేజా (సి) ఇమాద్‌ (బి) ఆమిర్‌ 0; అర్ష్ దీప్‌ (రనౌట్‌) 9; బుమ్రా (సి) ఇమాద్‌ (బి) రవూఫ్‌ 0; సిరాజ్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్‌) 119. వికెట్ల పతనం: 1–12, 2–19, 3–58, 4–89, 5–95, 6–96, 7–96, 8–112, 9–112, 10–119. బౌలింగ్‌: షాహిన్‌ అఫ్రిది 4–0–29–1, నసీమ్‌ షా 4–0–21–3, ఆమిర్‌ 4–0–23–2, ఇఫ్తికార్‌ 1–0–7–0, ఇమాద్‌ 3–0–17–0, రవూఫ్‌ 3–0–21–3.  

పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: రిజ్వాన్‌ (బి) బుమ్రా 31; బాబర్‌ (సి) సూర్యకుమార్‌ (బి) బుమ్రా 13; ఉస్మాన్‌ (ఎల్బీ) (బి) అక్షర్‌ 13; ఫఖర్‌ (సి) పంత్‌ (బి) పాండ్యా 13; ఇమాద్‌ (సి) పంత్‌ (బి) అర్ష్ దీప్‌ 15; షాదాబ్‌ (సి) పంత్‌ (బి) పాండ్యా 4; ఇఫ్తికార్‌ (సి) అర్ష్ దీప్‌ (బి) బుమ్రా 5; అఫ్రిది (నాటౌట్‌) 0; నసీమ్‌ షా (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 113. వికెట్ల పతనం: 1–26, 2–57, 3–73, 4–80, 5–88, 6–102, 7–102. బౌలింగ్‌: అర్ష్ దీప్‌ 4–0–31–1, సిరాజ్‌ 4–0–19–0, బుమ్రా 4–0–14–3, పాండ్యా 4–0–24–2 జడేజా 2–0–10–0, అక్షర్‌ పటేల్‌ 2–0–11–1.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement