నేడు ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్
జోరు మీదున్న టీమిండియా
ఒత్తిడిలో పాక్ బృందం
రా.గం.8.00 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
అక్టోబర్ 23, 2022...మెల్‌బోర్న్ మైదానంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్...రవూఫ్ బౌలింగ్‌లో కోహ్లి రెండు అద్భుత సిక్సర్లతో టీమిండియాను గెలిపించిన తీరును మన అభిమానులెవరూ మరచిపోలేరు.
‘గ్రేటెస్ట్ మూమెంట్ ఇన్ టి20 వరల్డ్ కప్ హిస్టరీ’ అంటూ తొలి సిక్స్‌కు కితాబిచ్చింది. ఇప్పుడు మళ్లీ టి20 వరల్డ్ కప్‌లో అలాంటి అద్భుత క్షణాల కోసం ఇరు జట్ల మధ్య మరో మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. నాటి పోరు తర్వాత టి20 ఫార్మాట్‌లో ఇరు జట్లు తలపడనుండటం ఇదే తొలిసారి.
న్యూయార్క్: టి20 వరల్డ్ కప్‌లో మాజీ చాంపియన్లు, దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా నాసా కౌంటీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే మ్యాచ్‌లో పాక్‌ను టీమిండియా ఎదుర్కొంటుంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై సునాయాసంగా నెగ్గిన భారత్ ఉత్సాహంగా కనిపిస్తుండగా... చిన్న జట్టు అమెరికా చేతిలో ఓడిన పాక్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది.
అమెరికాలో క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా ఐసీసీ ఈ మ్యాచ్‌కు భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించింది. న్యూయార్క్ అభిమానుల కోసం తక్కువ సమయంలో 34 వేల సామర్థ్యం గల స్టేడియాన్ని నిరి్మంచింది. పిచ్‌పై ఇప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి.
అక్షర్ స్థానంలో కుల్దీప్!
ఐర్లాండ్‌పై సునాయాసంగా గెలిచిన భారత జట్టులో ఎలాంటి ఆందోళన లేదు. టాపార్డర్‌లో రోహిత్, కోహ్లి, పంత్ ఖాయం కాగా...సూర్యకుమార్, దూబే, పాండ్యాలతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. గత మ్యాచ్‌లో విఫలమైనా...అసలు సమయంలో ఎలా చెలరేగాలో కోహ్లికి బాగా తెలుసు. పాండ్యా, జడేజా బ్యాటింగ్ అవసరం లేకుండా టీమ్ విజయాన్ని పూర్తి చేసుకుంది.
టాప్–7 వరకు బ్యాటింగ్ సామర్థ్యం ఉంది కాబట్టి జట్టు ఒక మార్పు చేయవచ్చు. అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. గత కొంత కాలంగా కుల్దీప్ మంచి ఫామ్‌లో ఉండటంతో పాటు పాక్‌పై మంచి రికార్డు కూడా ఉంది. పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉంటే మాత్రం ముగ్గురు పేసర్లు బుమ్రా, సిరాజ్, అర్‡్షదీప్‌లలో ఒకరిని తప్పించి కుల్దీప్‌ను ఎంపిక చేస్తారు.
గందరగోళంలో...
మరో వైపు పాకిస్తాన్ పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగా ఉంది. యూఎస్ చేతిలో అనూహ్యంగా ఓడిపోవడంతో అన్ని వైపులనుంచి విమర్శలు వస్తున్నాయి. ఓటమికంటే ఆ మ్యాచ్‌లో పేలవ ఆటతీరు చూస్తే జట్టులో సమస్య ఏమిటో అర్థమవుతుంది. ఓపెనర్లుగా రిజ్వాన్, బాబర్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. అటు కెప్టెన్సీ లో కూడా లోపాలతో బాబర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు.
మిడిలార్డర్ కూడా బలహీనంగా కనిపిస్తోంది. యూఎస్‌తో కేవలం 159 పరుగులకే పరిమితమైంది. సుదీర్ఘకాలంగా ఈ ఫార్మాట్‌లో ఆడుతున్నా బౌలర్లు షాహిన్ అఫ్రిది, రవూఫ్, నసీమ్ కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వడం లేదు. 2021 వరల్డ్ కప్ మ్యాచ్‌లో మినహాయిస్తే ప్రతీ సారి భారత్ చేతిలో భంగపడిన టీమ్ ఈ సారి ఏం చేస్తుందనేది చూడాలి.
టి20 ప్రపంచకప్‌లో నేడు
వెస్టిండీస్ X ఉగాండా
వేదిక: ప్రొవిడెన్స్; ఉదయం గం. 6 నుంచి
ఒమన్ X స్కాట్లాండ్
వేదిక: నార్త్ సౌండ్; రాత్రి గం. 10:30 నుంచి
స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment