నిఘా నీడలో... భారత్‌–పాకిస్తాన్‌ టి20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ | Tight security for India Pakistan T20 World Cup match | Sakshi
Sakshi News home page

నిఘా నీడలో... భారత్‌–పాకిస్తాన్‌ టి20 ప్రపంచకప్‌ మ్యాచ్‌

Published Fri, May 31 2024 4:35 AM | Last Updated on Fri, May 31 2024 5:54 AM

Tight security for India Pakistan T20 World Cup match

భారత్‌–పాకిస్తాన్‌ టి20 ప్రపంచకప్‌ మ్యాచ్‌కు కట్టుదిట్టమైన భద్రత

తీవ్రవాదుల నుంచి పొంచి ఉన్న ముప్పు 

పోలీసుల ఆధీనంలో మైదానం

న్యూయార్క్‌: అమెరికా గడ్డపై తొలిసారి జరగనున్న టి20 ప్రపంచకప్‌లో మ్యాచ్‌ల కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యంగా జూన్‌ 9న భారత్, పాకిస్తాన్‌ మధ్య ఇక్కడి ‘నాసా కౌంటీ క్రికెట్‌ స్టేడియం’లో జరిగే మ్యాచ్‌ భద్రతకు సంబంధించి అదనపు దృష్టి పెట్టారు. ఈ మ్యాచ్‌కు తీవ్రవాద ముప్పు ఉన్నట్లు సమాచారం ఉంది. దాంతో  అన్ని వైపుల నుంచి పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

‘గతంలో ఎన్నడూ చూడని భద్రతా ఏర్పాట్లు ఇక్కడ కనిపించబోతున్నాయి’ అని ఒక పోలీస్‌ ఉన్నతాధికారి చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో జనాలను లక్ష్యంగా చేస్తూ ఏకవ్యక్తి చేసే ‘వుల్ఫ్‌ అటాక్‌’ తరహా దాడులకు ఆస్కారం ఉందని భావిస్తుండటంతో వాటిని నివారించేందుకు అడుగడుగునా పోలీసులను మోహరిస్తున్నారు. మ్యాచ్‌ జరిగే రోజు ఐసన్‌ హోవర్‌ పార్క్‌ పరిసరాలన్నీ పోలీసుల ఆ«దీనంలో ఉంటాయి. 

ఈ వివరాలను నాసా కౌంటీ ఎగ్జిక్యూటివ్‌ బ్రూస్‌ బ్లేక్‌మన్, పోలీస్‌ కమిషనర్‌ ప్యాట్రిక్‌ రైడర్‌ వెల్లడించారు. తాము ఏ విషయంలో కూడా ఉదాసీనత ప్రదర్శించబోమని వారు స్పష్టం చేశారు. ‘ప్రతీ రోజూ నాసా కౌంటీ సహా ఇతర నగరాలకు కూడా బెదిరింపు కాల్స్‌ వస్తుంటాయి. మేం ఏ ఒక్కదాన్ని తేలిగ్గా తీసుకోం. అన్నింటినీ సీరియస్‌గా పరిశీలిస్తాం. అందుకే భారత్, పాక్‌ మ్యాచ్‌ జరిగే రోజు అదనంగా పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాం. 

ఆ రోజు స్టేడియంలో కనీవినీ ఎరుగని భద్రతతో అభిమానులంతా సురక్షితంగా ఉంటారని హామీ ఇస్తున్నా’ అని రైడర్‌ చెప్పారు. మరోవైపు ఐసీసీ కూడా ప్రేక్షకుల భద్రతే తమకు ముఖ్యమని, ఈ విషయంలో స్థానిక పోలీసులతో కలిసి పని చేస్తున్నామని పేర్కొంది.  

సుదీర్ఘ సాధన... 
తొలి రోజు ఫిట్‌నెస్‌ ట్రెయినింగ్‌పైనే దృష్టి పెట్టిన భారత క్రికెట్‌ జట్టు రెండో రోజు పూర్తి స్థాయి నెట్‌ ప్రాక్టీస్‌కు హాజరైంది. ఆటగాళ్లంతా దాదాపు మూడు గంటల పాటు సాధన చేశారు. నాసా కౌంటీ గ్రౌండ్‌కు దాదాపు ఐదు మైళ్ల దూరంలో ఉన్న కాంటియాగ్‌ పార్క్‌లో ఈ ప్రాక్టీస్‌ సాగింది. ఇక్కడ ఆరు డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లు ఉండగా భారత్‌ మూడు పిచ్‌లను వినియోగించుకుంది. 

రెండు పిచ్‌లపై బ్యాటర్లు సాధిన చేయగా, మరో పిచ్‌ను బౌలింగ్‌ కోసమే టీమిండియా కేటాయించింది. రోహిత్, గిల్, సూర్యకుమార్, పాండ్యా, దూబే, పంత్, జడేజా బ్యాటింగ్‌లో శ్రమించారు. కోహ్లి ఇంకా జట్టుతో చేరకపోగా... ఆలస్యంగా అమెరికాకు వచ్చిన యశస్వి జైస్వాల్, సంజూ సామ్సన్, రింకూ సింగ్, యుజువేంద్ర చహల్‌ మాత్రం సాధనకు దూరంగా ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement